కేంద్రం వైఖరిపై తెదేపాలో అంతర్మధనం?
posted on Nov 4, 2014 8:11AM
ఆంద్ర పట్ల అపారమయిన ప్రేమ కురిపిస్తున్న కేంద్రం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆరోపించారు. బీజేపీ-తెదేపాలు మిత్ర పక్షాలే అయినప్పటికీ, తెదేపా ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంలా చేతులు ముడుచుకొని కూర్చోకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతోంది. కానీ గడిచిన ఈ ఐదు నెలల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమిచ్చిందని చూస్తే కొంచెం బొగ్గు, కొంచెం విద్యుత్, నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే కనబడుతున్నాయి తప్ప వేరేమీ కనబడటం లేదు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వమే కాదు మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. విభజన బిల్లులో పేర్కొన్న ఉన్నత విద్యా వైద్య సంస్థలు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పోలవరం ప్రాజెక్టు వంటి అనేక హామీలు ఎప్పుడు అమలు చేస్తారో ఎవరికీ తెలియదు. కనీసం హుద్ హుద్ తుఫాను కోసం ప్రధాని మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అయినప్పటికీ తెదేపా-బీజేపీలు కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నందున నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవడానికి తెదేపా ప్రభుత్వం ప్రయత్నలోపం చేయకుండా కృషి చేస్తోందే తప్ప ఎన్నడూ బీజేపీని, కేంద్రాన్ని విమర్శించలేదు.
అయితే కేంద్రం తన హామీలను అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంతో అప్పుడే ఐదు నెలలయిపోతున్నా ఇంతవరకు రాష్ట్రంలో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలకు కనీసం శంకుస్థాపన చేయడానికి కూడా వెనకాడవలసిన పరిస్థితి. ఇది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశం ఇస్తోంది.
రాష్ట్రంలో చక్కటి ప్రభుత్వం, చక్కటి పారిశ్రామిక విధానాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటివి అన్నీ ఉన్నప్పటికీ కొత్తగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలేవీ రాకపోవడానికి కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయకపోవడమేనని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, కేంద్రం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరి వల్ల పారిశ్రామిక వేత్తలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఒకవేళ ఇంకా ఆలశ్యం జరిగితే వారు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రానికి కొత్తగా భారీ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే గాని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి త్వరగా మెరుగుపడటం కష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలంగా లేకపోయినట్లయితే తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుంది.
ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా ఇదే పరిస్థితి ఇంకా కొనసాగినట్లయితే తప్పకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అది రాష్ట్రంలో పార్టీపై పెను ప్రభావం చూపవచ్చును కూడా. బహుశః అందుకే తెదేపాలో కూడా అంతర్మధనం మొదలయినట్లు కనబడుతోంది.
మంత్రి రావెళ్ళ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ, “మేము కేవలం రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నాము. కానీ అది సాధ్యం కానప్పుడు పొత్తులపై పునరాలోచించుకోవలసి వస్తుంది,” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల ఒక మంత్రి ఈవిధంగా చెప్పడం కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని కొట్టిపడేయలేము కనుక, కేంద్రం వైఖరిపై తెదేపాలో అంతర్మధనం జరుగుతున్నట్లు అది సూచిస్తోంది. ఒకవిధంగా ఇది కేంద్రానికి ‘సవినయ హెచ్చరిక’ వంటిదేనని భావించ వచ్చును. రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంత అవసరమో, రాష్ట్రంలో బీజేపీకి తెదేపా అండ కూడా అంతే అవసరం. కనుక కేంద్రం ఇప్పటికయినా మేల్కొని తక్షణమే తన హామీలను అమలుచేయడం ఇరు పార్టీలకి కూడా మంచిది.