శాసనసభ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల యుద్ధం
posted on Nov 7, 2014 @ 11:43AM
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా బడ్జెట్ సమావేశాలలో ఊహించినట్లే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అధికార తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. అధికార పార్టీ సభ్యులు కూడా చాలా ధీటుగానే వారికి బదులిస్తున్నారు. ఈ సమావేశాలకు మూడు రోజుల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంతో 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. కనుక తమ ప్రయత్నలోపం ఏమి లేదని తెరాస సభ్యులు వాదిస్తుంటే, అసలు రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం పూర్తిగా కమ్ముకొనే వరకు గత ప్రభుత్వాలను నిందిస్తూ కాలక్షేపం చేసి, ప్రతిపక్షాల విమర్శల నుండి తప్పించుకొనేందుకే హడావుడిగా విద్యుత్ ఒప్పందంపై సంతకాలు చేసినంత మాత్రాన్న ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి విద్యుత్ వస్తుందా? రానప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏవిధంగా తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది? తీర్చలేనప్పుడు ఈ ఒప్పందం ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టడానికి తప్ప వేరే ప్రయోజనం ఏముందని ప్రతిపక్షాలు అధికార తెరాసను సభలో నిలదీస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి కలిగిందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అప్పుడు తెరాస ‘ఇది గత ప్రభుత్వాల నిర్వాకమే’ నని ఎప్పటిలాగే ప్రత్యారోపణలు చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించడం కూడా షరా మామూలే.
అయితే శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వలన తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమిటి? అని ఆలోచిస్తే ఏమీ ఉండబోదనే చెప్పవలసి ఉంటుంది. అధికారపార్టీ తన అసమర్ధతను, తప్పులను కప్పిపుచ్చుకొంటూ తనను తాను ప్రతిపక్షాల దాడి నుండి కాపాడుకొనేందుకు గట్టిగా ఎదురుదాడి చేస్తుంటే, ప్రతిపక్షాలు ఇదే అదునుగా అధికార పార్టీని శాసనసభ సాక్షిగా ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే వాటికి ఆ అవకాశం కల్పించింది మాత్రం తెరాస ప్రభుత్వమేనని చెప్పక తప్పదు. రాష్ట్రంలో నానాటికీ విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతున్నప్పటికీ, రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పటికీ, తక్షణమే స్పందించవలసిన ప్రభుత్వం గత ప్రభుత్వాలను నిందిస్తూ, పొరుగు రాష్ట్రంతో, కేంద్రంతో, చివరికి కృష్ణా బోర్డు యాజమాన్యంతో కూడా గొడవలు పడుతూ కాలక్షేపం చేసింది. అప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పదేపదే గట్టిగా హెచ్చరిస్తూనే ఉన్నాయి కూడా. కానీ ప్రభుత్వం తన ఉదాసీనతను వీడలేదు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వలననే నేడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపెట్టిన సిద్దాంతాన్ని మంత్రులు అందరూ సమర్దించారు తప్ప ఎవరూ కూడా సమస్య పరిష్కారానికి ఆయనకు తగిన సలహా ఇచ్చే దుస్సాహసం చేయలేకపోయారు. ఇదొక పొరపాటు అనుకొంటే, కేసీఆర్ కనిపెట్టిన ఆ సిద్దాంతం ప్రభుత్వాన్ని కాపాడకపోగా అది ప్రతిపక్షాలను ఐక్యపరిచేందుకు బాగా ఉపయోగపడింది. అందుకే నేడు ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా అధికార తెరాసపై దాడి చేస్తున్నాయి. అంటే ఈ రాజకీయ యుద్ధం పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగానే జరుగుతోందని చెప్పవచ్చును.
కనుక ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా, ఓడినా చివరికి ప్రజలకు ఒరిగేదేమీ ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కాకపోతే తను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సభలో ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తాయనే భయం ప్రభుత్వానికి ఏర్పడవచ్చును. కానీ అది శ్మశాన వైరాగ్యం, ప్రసూతీ వైరాగ్యం వంటిదే!