తెలంగాణా ప్రభుత్వ మైండ్ సెట్ మారదా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఉభయ రాష్ట్రాలలో ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలకు ప్రస్తుతం అమలులో ఉన్న విధివిధానాలనే మరో పదేళ్ళ వరకు యదాతధంగా కొనసాగించాలని విస్పష్టంగా పేర్కొనబడింది. కానీ తెలంగాణా ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తూ ఎంసెట్, లాసెట్, ఐ సెట్, ఈ సెట్ వంటి వివిధ కోర్సులలో ప్రవేశాలకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణాలో ఉన్నత విద్యలు చదవదలచుకొన్న విద్యార్ధులు తప్పనిసరిగా తెలంగాణా ఉన్నత విద్యా మండలి నిర్వహించే ప్రవేశ పరీక్షలు వ్రాయవలసి ఉంటుందని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లయితే ఆ రాష్ట్రంలో కూడా తామే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.   తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజ్ రీఇంబర్స్ మెంట్ చేస్తామంటూ తెలంగాణా ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పధకాన్ని హైకోర్టు తప్పు పట్టడమే, తెలంగాణా ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని బేఖాతరు చేస్తూ వేరేగా ప్రవేశపరీక్షలు పెట్టుకోదలిస్తే మళ్ళీ అందుకు కోర్టులో మొట్టికాయలు తినక తప్పదు. తెలంగాణా ప్రభుత్వం కలిసి రావడం లేదు కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే కోర్టుకయినా వెళ్ళాలి లేదా తను కూడా వేరేగా ప్రవేశపరీక్షలయినా నిర్వహించుకోవలసి ఉంటుంది. కానీ వేరేగా పరీక్షలు నిర్వహించుకోవడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకే వెళ్ళవలసి ఉంటుంది.   ఇప్పటికే ఈ వివాదం గురించి ఆంద్ర తెలంగాణా మంత్రులు గంటాశ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డి గవర్నర్ నరసింహన్ వద్ద పిర్యాదులు చేసుకొన్నారు. వారిరువురికీ ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు ఆమోదయోగ్యం కాకపోవడంతో ఈ అంశంపై ప్రతిష్టంభన నెలకొని ఉంది. కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో తలదూర్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా కోర్టును ఆశ్రయించక తప్పక పోవచ్చును.   కానీ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఈ పంతాలు, పట్టింపులు కారణంగా మధ్యలో విద్యార్ధులు నలిగిపోతున్నారు. కనీసం వారి సమస్యలను, ఆందోళనను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విధివిధానాలనే అనుసరించి, వచ్చే విద్యా సంవత్సరం నుండి రెండు రాష్ట్రాలు విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరిస్తే అందుకు విద్యార్ధులు కూడా మానసికంగా తయారవగలరు. ఒకవేళ ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే, కేంద్ర ప్రభుత్వమే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేప్పట్టడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చును.

డిల్లీలో మళ్ళీ హంగ్ అసెంబ్లీ?

  వచ్చే నెల ఏడున డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అవకాశం దక్కితే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ఏకంగా దేశాన్నే ఏలేద్దామనుకొన్న రాహుల్ గాంధీ, కనీసం ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ని కూడా సమర్ధంగా డ్డీకొనలేకపోవడంతో డిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం బొత్తిగా కనబడటంలేదు. కనుక ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ-ఆమాద్మీ పార్టీల మధ్యనే సాగబోతున్నట్లు స్పష్టమయింది.   మొన్న డిశంబర్ నెలలో వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పేర్కొంటే, క్రిందటి వారం నిర్వహించిన తాజా సర్వేలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రాబోదని, మళ్ళీ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నట్లు తేలింది. డిల్లీ అసెంబ్లీకున్న 70 సీట్లలో బీజేపీకి-34 ,ఆమాద్మీ-28, కాంగ్రెస్-8 సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. ఈసారి ఎన్నికలలో బీజేపీ-ఆమాద్మీ పార్టీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నందున, స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ గెలిచే అవకాశం లేదని సర్వేలో తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36 సీట్లు తప్పనిసరి. అందువల్ల బీజేపీకి మరో రెండు సీట్లు అవసరం పడుతాయి. కానీ ఈసారి స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ గెలిచే అవకాశం లేదని తేలింది కనుక బీజేపీకి ఒక్క సీటు తగ్గినా కూడా అధికారంలోకి రాలేదు.   ఈ సమస్య నుండి గట్టెక్కెందుకే బీజేపీ ఎవరూ ఊహించని విధంగా మాజీ ఐ.పి.యస్.అధికారిణి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకొంది. రేపు డిల్లీలో జరుగబోయే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమెను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది. మంచి క్రమశిక్షణ, నీతి నిజాయితీ గల సమర్దురాలయిన పోలీస్ ఆఫీసర్ గా పేరొందిన కిరణ్ బేడీని ఏవిధంగా కూడా ఆమాద్మీ పార్టీ విమర్శించలేదు. ఆమెను విమర్శిస్తే ఆమాద్మీ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండాపోయే ప్రమాదం ఉంది. అలాగని ఆమెను విమర్శించకుండా ఊరుకొంటే ఆమె తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అప్రయోజకత్వాన్ని ప్రజలలో ఎండగడుతుంటే పార్టీకి ఇంకా నష్టం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఆమాద్మీ నేతలు చాలా తెలివిగా ఆమెపై ఎదురు దాడి చేస్తున్నారు. అన్నా హజారేతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె ఎడ్యూరప్ప వంటి అవినీతిపరులతో నిండిన బీజేపీలో చేరడాన్ని ఏవిధంగా సమర్ధించుకొంటారు? అని ప్రశ్నిస్తున్నారు.   ఈ ఎన్నికలలో బీజేపీ పట్టణప్రాంతాలలో పూర్తి ఆధిక్యత కనబరుస్తుండటంతో ఆమాద్మీ పార్టీ డిల్లీ శివారు ప్రాంతాలపై తన దృష్టి కేంద్రీకరిస్తోంది. అక్కడ నివసిస్తున్న గుజ్జర్లు, జాట్లు అనే రెండు ప్రధాన వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రెండు వర్గాల జనాబా కలిపి దాదాపు 17 శాతం వరకు ఉంటారు. ఇంతకు ముందు కాంగ్రెస్ వైపున్న వారందరూ తరువాత బీజేపీ వైపు మళ్ళారు. కానీ బీజేపీ కూడా వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారిని తన వైపు త్రిప్పుకొనేందుకు ఆమాద్మీ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఆమాద్మీ పార్టీ వారిని తనవైపు తిప్పుకోవడంలో సఫలమయినట్లయితే ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించకపోవచ్చును. అప్పుడు డిల్లీలో మళ్ళీ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. బహుశః అందుకే ఆ రెండు పార్టీలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకొన్నాయి. డిల్లీ ప్రజలు సుస్థిరమయిన పరిపాలన కోరుకొంటున్నట్లయితే అందరూ తమ పార్టీకే ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గుతారో ఆఖరి నిమిషం వరకు ఎవరూ ఊహించలేరు.

ఏపీలో కాంగ్రెస్ చీటీ చిరిగిపోయినట్టేనా?

  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నలబై మంది సభ్యులతో ఈరోజు పార్టీకి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసారు. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 26 మంది ప్రధాన కార్యదర్శులు, 13 జిల్లాలకు అధ్యక్షులను, 13 మంది నగర అధ్యక్షులను నియమించారు. త్వరలోనే ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలు, కార్యదర్శులను, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను కూడా నియమిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన బాధ్యత చాలా చక్కగానే నెరవేర్చారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్ ఉందా? అని ఆలోచిస్తే ఇదంతా వృధా ప్రయాసేననిపిస్తుంది.   రాష్ట్ర విభజన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయం వలన హేమాహేమీలనదగ్గ అనేకమంది కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చింది. మిగిలినవారిలో చాలా మంది ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. మరి కొంత మంది మూటాముల్లె సర్దుకొని గోడ మీద కూర్చొని ఉన్నారు.   రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ గురి కాంగ్రెస్ మీదనే ఉందనే సంగతి రఘువీరా రెడ్డికి తెలియకపోదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డిల్లీకి తిరిగి వెళ్లిపోతూ వచ్చే ఎన్నికల నాటికి కనీసం 70 మంది బలమయిన నేతలను సంపాదించుకోవాలని ఒక టార్గెట్ కూడా పెట్టారు. అంటే ఆ డబ్బై మందిలో కనీసం ముప్పావు వంతు మంది కాంగ్రెస్, వైకాపాల నేతలేనని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బహుశః ఆ భయంతోనే రఘువీర రెడ్డి ఈ పదవుల పందేరం పెట్టుకోన్నారేమో కూడా.   కానీ 67 మంది యం.యల్యే.లున్న వైకాపాయే తన భవిష్యత్ ఏమిటో తెలియక తికమక పడుతుంటే కనీసం ఒక్క యం.యల్యే. కానీ యంపీగానీ చివరికి ఒక బలమయిన నేత గానీ లేని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి రఘువీరా రెడ్డి ఆలోచించడాన్ని మెచ్చుకోక తప్పదు. కానీ ఐదేళ్ళ తరువాత కూడా పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా ఒకవేళ బీజేపీ అప్పటికి బలపడి వేరేగా పోటీ చేయదలిస్తే వాటి మధ్యనే ఉండవచ్చు తప్ప కాంగ్రెస్ ఏవిధంగానూ పోటీలో నిలబడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందువలన అంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనప్పుడు రాష్ట్రాలలో కూడా కష్టమే అవుతుంది.   నరేంద్ర మోడీ తమ పార్టీ అధికారంలో లేనప్పుడే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి తన నాయకత్వ లక్షణాలను, సత్తాను చాటుకొన్నారు. అటువంటప్పుడు ఈ ఐదేళ్ళలో ఆయన మరింత బలపడిన తరువాత ఆయనని ఓడించడం రాహుల్ గాంధీవల్ల అయ్యే పని కాదు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం రాష్ట్ర స్థాయి పార్టీ మీద కూడా బలంగా ఉంటుంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మరో పది పదిహేనేళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ బ్రతికిఉంచేందుకయినా ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మంచి ఆలోచనే.

అమిత్ షా హెచ్చరికలు బాగానే పనిచేసినట్లున్నాయే

  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన తన పార్టీ నేతలకు కార్యకర్తలకు చేసిన దిశానిర్దేశం గురించి వారు పట్టించుకొన్నారో లేదో తెలియదు గానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయన చెప్పిన ఆ నాలుగు మంచి ముక్కలు బాగానే చెవికెక్కించుకొన్నట్లున్నారు. తెరాసకు ఒక లక్ష్యం కానీ బలమయిన పునాదులు గానీ లేవని, అది కేవలం ఒకరిద్దరు నాయకుల బలం మీద తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడి మనుగడ సాగిస్తోందని, అటువంటి పార్టీని బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీ ఎన్నికలలో అవలీలగా ఓడించవచ్చని ఆయన చెప్పిన ముక్కలు కేసీఆర్ ని తట్టి లేపినట్లయింది. తమ పార్టీ గురించి అటువంటి మాటలన్నందుకు ఆయన బీజేపీకి శాపనార్ధాలు పెట్టినా అందులో నిజం ఉందని గ్రహించి తక్షణమే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించడం విశేషం.   హైదరాబాద్ లో ఆయన నిన్న ఒక సమావేశం నిర్వహించి పార్టీ పటిష్ట పరిచేందుకు అవసరమయిన చర్యల గురించి పార్టీ నేతలతో చర్చించారు. త్వరలోనే గ్రామ స్థాయి నుండి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణ, ఆ తరువాత ఏప్రిల్ 24న పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఒక భారీ బహిరంగ సభ నిర్వహణ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్లకు జరుగబోయే ఎన్నికలకు పార్టీని సన్నధం చేయడం, ఇతర పార్టీల నుండి యం.యల్యే.లను, యం.యల్సీ.లను తెరాసలో జేర్చుకోవడం, పార్టీలో సీనియర్లకు సముచిత పదవులు ఇవ్వడం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.   తెలంగాణాలో పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాలలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నందున ఆ రెండు ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కేసీఆర్ వేర్వేరు వ్యూహాలు సిద్దం చేసారు. ఆ రెండు ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం, ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించడం, ఖమ్మం జిల్లాలో రేపు ఆదివారంనాడు కేసీఆర్ పర్యటన చేయడం వంటి అనేక నిర్ణయాలు తీసుకొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీలో ప్రతీ ఒక్కరు గట్టిగా కృషి చేయాలని ఆయన హెచ్చరించారు.   ఒకవేళ కేసీఆర్ తన ఈ ప్రణాళికలన్నిటినీ నిఖచ్చిగా అమలుచేసినట్లయితే తెలంగాణాలో తెరాస మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఆయన పార్టీని ఎంతగా బలోపేతం చేసుకొన్నప్పటికీ, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కొన్నిటినయినా నెరవేర్చవలసి ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ మరియు నీటి సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలుచేయవలసి ఉంటుంది. తెలంగాణా ప్రజలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకొని అధికారం అప్పజెప్పిన సంగతి ఆయన సదా గుర్తుంచుకొంటూ వాటిని నెరవేర్చవలసి ఉంటుంది. అప్పుడే వచ్చే ఎన్నికలలో గెలుపు గురించి ఆలోచించవచ్చును. అమిత్ షా హెచ్చరికలకు కేసీఆర్ మేల్కొన్నట్లే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మేల్కొన్నారో లేదో?

ఆమ్ ఆద్మీ డిల్లీలో మళ్ళీ పోటీకి సై!

  డిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి ఏడున మళ్ళీ ఎన్నికలు జరుగనున్నాయి. క్రిందటిసారి అపూర్వమయిన ప్రజాధారణ పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచేసి ఏకంగా దేశాన్నే ఏలేద్ధామనే దురాశతో ముఖ్యమంత్రి పదవి వదులుకొని, ప్రభుత్వాన్ని రద్దు చేసుకొన్నందుకు తగిన ఫలితం అనుభవించారు. కానీ ఆయన చేసిన తప్పు కారణంగానే డిల్లీలో మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లయితే అటువంటి పొరపాటు మళ్ళీ చేయబోనని ఆయన పదేపదే ప్రజల ముందు లెంపలు వేసుకోవలసి వస్తోంది. రాజకీయాలలో అటువంటి తప్పులు చేసినవారికి మళ్ళీ అధికారం దక్కడం చాలా కష్టమేనని భావించవచ్చును.   కానీ ఇటీవల రెండు ప్రముఖ సంస్థలు డిల్లీలో గల 70 నియోజక వర్గాలలో నిర్వహించిన సర్వేలలో 35శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సరయిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికీ దాని 39 శాతం ఓటు బ్యాంకు పదిలంగానే ఉన్నట్లు స్పష్టమయింది. కానీ ఈసారి డిల్లీలో 40 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ- ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే హోరాహోరిగా సాగబోతోందని స్పష్టం అవుతోంది.   ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో డిల్లీ శాసనసభలో ఉన్న మొత్తం 70 సీట్లలో బీజేపీకి-34 నుండి 40 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుండి 31 కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 నుండి 5 సీట్లు మాత్రమే రావచ్చని తేల్చి చెప్పింది. బీజేపీకి మోడీ, ఆయన పరిపాలనే సానుకూలాంశాలు. ఈరోజు బీజేపీలో చేరిన మాజీ ఐ.పి.యస్. అధికారిణి కిరణ్ బేడీని బీజేపీ తమముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే బీజేపీ విజయావకాశాలు ఇంకా మెరుగుపడవచ్చును.   ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాలే ప్రధాన బలమని చెప్పవచ్చును. ఆయన తన 49 రోజుల పాలనలో తీసుకొన్న కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలు కూడా ఆయనక పార్టీకి కలిసి వచ్చే అంశాలుగానే చెప్పుకోవచ్చును. కానీ ప్రజలు ఆయనకి ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెట్టినప్పటికీ, ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ తన సమర్ధతను, తన ప్రభుత్వ సమర్ధతను నిరూపించుకొనే బదులు, రోడ్ల మీద నిరసన దీక్షలు చేపట్టి చివరికి కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై అవినీతి ఆరోపణల కేసులో బెయిలు తీసుకోవడానికి నిరాకరించి వారం రోజులు జైల్లో గడపడం వంటి అంశాలు ఆయనకు తీవ్ర ప్రతికూలాంశాలుగా నిలుస్తాయి.   ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం గమనిస్తే, అరవింద్ కేజ్రీవాల్ ఆనాడు ఆవిధంగా వ్యవహరించి ఎంత పెద్ద తప్పు చేసారో స్పష్టమవుతోంది. కానీ, నేటికీ ఆయన బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతునట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గనుక ఈ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అత్యవసరం కూడా. లేకుంటే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకు యూపీయే ప్రభుత్వానికి ఏవిధంగా పక్కలో బల్లెంలా వ్యవహరించారో ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా వ్యవహరించడం తధ్యం. కానీ మోడీ, అమిత్ షా ఇరువురూ చేతులు కలిపి ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తమ పార్టీని గెలిపించుకొన్నారు కనుక డిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ఖాయమనే భావించవచ్చును.

రాహుల్ భవిష్యత్ భరోసా కోసమే అధ్యక్ష పదవా?

  సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. కానీ పార్టీ భవిష్యత్ కంటే తన కొడుకు భవిష్యత్తే చాలా ముఖ్యమన్నట్లు సోనియాగాంధీ వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ దెబ్బ తింటే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది రాహుల్ గాంధీయే.   ఒకవేళ ఆమె రాహుల్ భవిష్యత్ కి భద్రత కల్పించాలనుకొంటే అందుకోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. అది ఏవిధంగా అన్నది ఆమె ఇష్టం, కానీ అతనికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే నేటికీ అతను తల్లి చాటు బిడ్డగానే ఉండిపోయాడు తప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని తను పార్టీ అధ్యక్ష పదవిని చెప్పట్టడానికి అన్ని విధాల సమర్దుడినని నిరూపించుకోలేకపోయారు.   ఈ దుస్థితి నుండి పార్టీని బయటపడేయవలసిన వ్యక్తి భవిష్యత్ కి భద్రత కల్పించడానికే పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టాలనే ఆలోచన వలన అతని భవిష్యత్ సంగతేమో కానీ ముందు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. తనను తాను నిరూపించుకోలేని వాడు, తన భవిష్యత్ ను తాను తీర్చిదిద్దుకోలేని వ్యక్తి ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని ఏవిధంగా తీర్చిదిద్దగలడు?   అలనాడు మహాభారతంలో దృతరాష్ట్రుడు, గాంధారీ దంపతులు ఇటువంటి పుత్ర వాత్సల్యంతో దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టి తమ నూరు మంది సంతానాన్ని దానితో బాటే తమ సామ్రాజ్య కూడా కోల్పోయారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలనదగ్గ నేతలు అనేక మంది ఉన్నారు. వారు కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మౌనం వహించినట్లు ఇప్పుడు కూడా మౌనం వహిస్తే జరిగేది కాంగ్రెస్ వస్త్రాపహరణమే. కనుక ఇప్పటికయినా వారు నోరు తెరిచి మాట్లాడి తమను తాము కాపాడుకోవడం చాలా అవసరం.   ఈరోజు డిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. రాహుల్‌ గాంధీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించే విషయం చర్చించబోతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం అంటే అర్ధం సోనియాగాంధీ స్థానంలో అతనిని కూర్చోబెట్టడానికి సన్నాహమే తప్ప వేరొకటి కాదు. కనుక కాంగ్రెస్ నేతలు అందరూ తమ ముద్దుల రాకుమారుడి భవిష్యత్ ముఖ్యమో లేక పార్టీ భ్యవిష్యత్ ముఖ్యమో తేల్చుకోవలసిన సమయం ఇది.

రాజకీయ పార్టీకి నిర్దిష్ట లక్ష్యాలు ఉండాలి మరి!

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రెండు రాష్ట్రాలలో తన పార్టీ నేతలకు గట్టిగా చెప్పి వెళ్ళారు. తెలంగాణాలో గ్రామ స్థాయి నుండి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకోవడం ద్వారా, ఆంధ్రాలో పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకొంటూనే కనీసం 70మంది సమర్దులయిన నేతలను ఏర్పాటుచేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకి సిద్దం కావాలని ఆయన మార్గ నిర్దేశనం చేసారు.   ఆ సందర్భంగా తెరాస పార్టీ కేవలం ఒక వ్యక్తి (కేసీఆర్) బలం మీద, తెలంగాణా సెంటిమెంటు మీదనే ఆధారపడి నిలబడి ఉందని, అటువంటి పార్టీని బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పిన మాటలు బీజేపీ రాష్ట్ర నేతలలో ఆత్మవిశ్వాసం నింపగలిగాయో లేదో తెలియదు గానీ ఆ మాటలు సూటిగా కేసీఆర్ గుండెల్లో బాకుల్లా గుచ్చుకొన్నాయి. అందుకే మా పార్టీకి బలం లేదని చెపుతున్న బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండబోవని శాపనార్ధాలు పెట్టారు. అయితే ఉన్న మాట అంటే ఉలుకెక్కువన్నట్లుంది కేసీఆర్ స్పందన.   రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్ట లక్ష్యం, పటిష్టమయిన పునాదులు ఉండాలని అమిత్ షా చెప్పిన మాటలు ఏ పార్టీకయినా ఆచరనీయమే. కానీ తెరాస పార్టీ మొదటి నుండి కూడా కేసీఆర్ బలంపై, తెలంగాణా సెంటిమెంటు, ఆంద్ర విద్వేషంపైనే ప్రధానంగా ఆధారపడి మనుగడ సాగిస్తోంది తప్ప ఆ పార్టీకున్న బలం వల్ల కాదని అందరికీ తెలుసు. అయితే కేసీఆర్ కి ఈవిషయం తెలియదని భావించలేము. కానీ నేటికీ ఆయన తన పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకొనే ప్రయత్నం చేసుకోవడం కంటే ఇతరపార్టీల నేతలను తన పార్టీలోకి ఆకర్షించి రాష్ట్రంలో ఆయా పార్టీలను బలహీనం చేయడం ద్వారా తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.   తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ నేటికీ కూడా తన ఉనికిని కాపాడుగలుగుతోందంటే అందుకు ప్రధాన కారణం ఆ పార్టీకి గ్రామ స్థాయినుండి బలమయిన క్యాడర్ ఉండటమే. ఆంధ్రాలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. రాష్ట్రంలో ఇంకా బలపడేందుకు సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక ఉద్యమంలా నిర్వహించి రెండు రాష్ట్రాలలో కలిపి ఏకంగా అరకోటి మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకోగలిగింది. జాతీయ స్థాయిలో బీజేపీని విజయపధంలో నడిపిస్తున్న అమిత్ షా విజయరహస్యం కూడా అదే! అందుకే 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణాలో గ్రామ స్థాయి ఉండి పార్టీని బలోపేతం చేసుకోమని ఆయన తన నేతలకు చాలా చక్కటి మార్గదర్శనం చేసారు. దానిని వారు గ్రహిస్తారా లేదా? అనేది వేరే విషయం. కానీ ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడయిన కేసీఆర్ కూడా అమిత్ షా చెప్పిన అతిముఖ్యమయిన ‘ఆ పాయింట్’ ని గ్రహించకుండా బీజేపీకి శాపనార్ధాలు పెట్టడం విచిత్రం.   ఒకవేళ తెరాస, బీజేపీ, వైకాపా,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలవాలని గట్టిగా కోరుకొంటున్నట్లయితే ఇప్పటి నుండే అన్ని పార్టీలు గ్రామ స్థాయి నుండి తమ పార్టీలను నిర్మించుకోవలసి ఉంటుంది. అలా కాదని కేవలం అధికార పార్టీ లోపాలను ఎండగడుతూ, ఆత్మవంచన చేసుకొంటూ కాలక్షేపం చేసినట్లయితే వారి అంచనాలు తారుమారవడం తధ్యం.   అమిత్ షా సూచించిన విధంగా 70 మంది నాయకులను తయారు చేసుకొనే ప్రయత్నంలోనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఏకైక చిరపరిచిత మొహంగా కనిపిస్తున్న యంపీ చిరంజీవిని ‘తెలుగు సినీ పరిశ్రమకు మూడో కన్ను వంటివాడు’ అని ఊదరగొట్టారేమో?

హామీలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందేమో?

  ఆంధ్రాపాలకుల చేతిలో తెలంగాణా ప్రజలు దోపిడీకి గురయ్యారని కనుక ‘తెలంగాణా ప్రజల స్వంత పార్టీ’ అయిన తెరాసకు అధికారం కట్టబెడితే తాను వారి జీవితాలు మార్చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో పదేపదే చెప్పేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘అది చేస్తాము, ఇది చేస్తాము’ అంటూ అనేక హామీలను కూడా ఆయన గుప్పించారు. ఆయన వల్లనే తెలంగాణా సాధ్యమయింది కనుక, ఆయనే తమ జీవితాలలో కూడా వెలుగులు నింపుతారనే నమ్మకంతో ప్రజలు తెరాసకు అధికారం కట్టబెట్టారు. కెసిఆర్ అధికారంలోకి రాక ముందు ఎన్ని హామీలు గుప్పించారో తెలంగాణా ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా మరన్ని గుప్పించారు. ఇంకా గుప్పిస్తూనే ఉన్నారు. కానీ వాటన్నిటికీ ఆయన నిధులు ఎక్కడ నుండి తీసుకువస్తారో, వాటిలో ఎన్నిటిని ఎప్పటికి అమలు చేస్తారో? అసలు వాటన్నిటినీ అమలు చేసే ఉద్దేశ్యం ఉందో లేదో? ఉంటే చేయగలరో లేదో?అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. ఎందువలన అంటే వారెవరూ ఆయనని హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలను కట్టమని అడగలేదు...సినిమా సిటీలు, స్పోర్ట్స్ సిటీలు కట్టమని అడుగలేదు. కేవలం తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిస్తే చాలని ఆశించారు. కానీ ఆ ఒక్క పనీ తప్ప కేసీఆర్ ప్రభుత్వం మిగిలిన అన్ని పనులు చేస్తానని హామీ ఇస్తోంది.   మా విద్యార్ధులకు మేమే స్కాలర్ షిప్పులు ఇచ్చుకొంటామంటూ ఆయన చాలా హడావుడిగా ‘ఫాస్ట్’ పధకం ప్రవేశపెట్టారు. కానీ కోర్టులు మొట్టికాయలు వేయడంతో దానిపై ముందుకు వెళ్ళలేక, వెనక్కి తగ్గితే పరువుపోతుందనే భయంతో నిలిచిపోవడంతో విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఫీజు రీ ఇంబర్స్ మెంటు కోసం ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఆంద్ర పాలకులు తెలంగాణా విద్యార్ధులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు గుప్పించిన కేసీఆర్ కూడా ఇప్పుడు అదే పని చేస్తుండటం వారికి విస్మయం కలిగిస్తోంది.   ఇంతకు ముందు ఆంధ్రా ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులకు కేవలం రెండు వందలు మాత్రమే పెన్షన్లు ఇస్తే తమ ప్రభుత్వం ఏకంగా దానికి ఐదు రెట్లు చేసి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తోందని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ప్రభుత్వం, అది చాలా భారంగా మారడంతో అనేక వేలమందిని అనర్హులుగా చూపుతూ కోత విధించడంతో వారందరూ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   అది గమనించిన కేసీఆర్ ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శిస్తూ ఆ నెపాన్ని అధికారుల మీదకు నెట్టి వేసింది. తమ ప్రభుత్వం అర్హులయిన ప్రతీ వ్యక్తికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజల ముందు వారిపై చిందులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అందుకోసం జిల్లాలకు కేటాయించిన బడ్జెట్ ప్రకారమే పెన్షన్లు ఇవ్వవలసివస్తున్నందున ఈ సమస్య తలెత్తుతోందని అధికారుల వాదన. అందువలన ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్నే తప్పుపట్టవలసి ఉంటుంది.   ఇక పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు నివారణకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో తెలియదు, కానీ నేటికీ ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి ప్రాధమిక సమస్యలన్నిటినీ పరిష్కరించకుండా కేసీఆర్ రోజుకో కొత్త ప్రాజెక్టు చొప్పున ప్రకటిస్తూ గాలిలో మేడలు కడుతూ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నారు.   మన దేశంలో అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేనప్పుడు, ప్రజలను మరిపించేందుకు వాటి స్థానంలో సరికొత్త హామీలు ఇవ్వడమనే ఆనవాయితీని చాలా కాలంగా పాటిస్తున్నాయి. బహుశః కేసీఆర్ కూడా ఆ అనవాయితీనే తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుంది. కనుక మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో ఆయన మరిన్ని కొత్త హామీలు గుప్పించవచ్చునేమో?

నాయకుడంటే అలాగుండాలి మరి

  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన పార్టీ, కేంద్రప్రభుత్వం, తెరాస ప్రభుత్వం గురించి నిన్న హైదరాబాద్ లో చెప్పిన విషయాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. గత ఏడూ నెలల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ చేప్పట్టిన అనేక పాలనాపరమయిన సంస్కరణల గురించి వివరించి, నిర్ణయాలు తీసుకోవడంలో తమ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కళ్ళకు కట్టినట్లు వివరించారు.   దేశం సర్వతో ముఖాభివృద్ధి కోసం మూస పద్ధతులకు స్వస్తి చెపుతూ ‘నీతి ఆయోగ్’ (మోడీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రణాళికా సంఘం) ఏర్పాటు చేసి దానిలో దేశంలో అన్ని రాష్ట్రాలను కూడా భాగస్వాములుగా చేయడం ద్వారా రాష్ట్రాలకు సముచిత గౌరవం ఇస్తూ వాటి అవసరాలను తీర్చాలనే తమ ప్రభుత్వం విధానం గురించి చక్కగా వివరించారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలు, చర్యల వలన దేశంలో క్రమంగా ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతూ అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్న విషయాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. దేశంలో కనబడుతున్న ఈ మార్పుల కారణంగా ప్రపంచ దేశాలు కూడా భారత్ పట్ల ఇప్పుడు మరింత గౌరవం ప్రదర్శిస్తున్నాయని ఆయన తెలిపారు.   ఆయన చెప్పిన ఈ విషయాలన్నీ కంటికి ఎదురుగా కనబడుతున్నవే. కానీ ఆంధ్రా, తెలంగాణాకు చెందిన ఆ పార్టీ నేతలు ఈ విషయాలన్నీ చెప్పుకోవాలని తెలియకనో లేక నిర్లక్ష్యం చేతనో చెప్పుకోకుండా ఊరుకొన్నారు. కానీ అమిత్ షా చెపుతున్న ఈ మాటలు విన్న తరువాత మోడీ ఏరికోరి ఆయనకే పార్టీ అధ్యక్షపదవి ఎందుకు కట్టబెట్టారో అర్ధం అవుతోంది. ఆయన అనేక రాష్ట్రాలలో తమ పార్టీకి ఏవిధంగా ఘనవిజయాలు సాధించిపెడుతున్నారో కూడా అర్ధం అవుటోంది. పార్టీని నడిపించే నాయకుడికి ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలో ఆయన తన మాటల ద్వారా చాటిచెప్పారు.   అటువంటి నాయకత్వ లక్షణాలు, విభిన్నంగా ఆలోచించగల శక్తి, వ్యూహా రచన సామర్ధ్యం అందరికీ ఉండకపోవచ్చును. కానీ ఉభయ రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు ఆయన చూపిన ఈ మార్గాన్ని అనుసరిస్తే వారు తమ పార్టీని బలోపేతం చేసుకోవచ్చును. తెలంగాణాలో తమ పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నేతల అసమర్ధత కారణంగా ఒక చక్కటి అవకాశాన్ని పోగొట్టుకొన్నామని ఆయన అభిప్రాయపడ్డారు.   తెలంగాణాలో తెరాసకు బలమయిన పార్టీ పునాదులు లేకపోయినప్పటికీ, తెలివిగా ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని ఒకరిద్దరు వ్యక్తుల స్వీయ బలం కారణంగానే అధికారంలోకి రాగలిగిందని, కానీ తమ పార్టీకి బలమయిన పునాది ఉండి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినప్పటికీ విజయం సాధించలేకపోయిందని ఆయన అన్నారు. అంటే తమ నాయకుల అసమర్ధత కారణంగానే తమ ఓడిపోయిందని చెప్పినట్లే భావించవచ్చును.   తెదేపా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటూ ఐ ప్యాడ్ లు, ట్యాబ్లేట్ పీసీలను ఉపయోగిస్తూ రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసింది. అదంతా బీజేపీ నేతలు కూడా చూసినప్పటికీ, వారు నేటికీ రసీదు పుస్తకాలతో సభ్యత్వ నమోదు చేయడాన్ని కూడా ఆయన కూడా తప్పు పట్టారు. మొబైల్ ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ చేప్పట్టాలని ఆయన సూచించారు. ఈ ఐదేళ్ళలో బీజేపీ గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకొన్నట్లయితే తెరాసను ఓడించడం పెద్ద కష్టమయిన పనికాదని ఆయన అన్నారు.   ఆయన తెరాస-బీజేపీ బలబలాలు, తమ పార్టీ అనుసరించాల్సిన విధానాల గురించి చేసిన సూచనలు, విశ్లేషణ చాలా ఆలోచించదగ్గవే. ఒకవేళ రెండు రాష్ట్రాలలో బీజేపీని బలపరుచుకోవాలనే ఆలోచన, తపన ఆ పార్టీ నేతలకు ఉన్నట్లయితే అమిత్ షాను ఆదర్శంగా తీసుకొని ఆయన సూచిస్తున్న పద్దతులలో ముందుకు సాగడం మంచిది.

తెదేపా-బీజేపీల మధ్య దూరం పెరుగుతోందా?

  తెలుగుదేశం-బీజేపీ పార్టీల మధ్య సంబంధాలు పైకి దృడంగానే కనిపిస్తున్నప్పటికీ వాటి మధ్య క్రమంగా దూరం పెరుగుతున్నట్లు కనబడుతోంది. తెదేపా-బీజేపీల మధ్య దూరం పెరుగుతుండటానికి కారణాలు అందరికీ తెలిసినవే. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తుండటం, రాష్ట్రానికి హామీ ఇచ్చిన అనేక పధకాలు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, నిధులు విడుదల వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత అసహనానికి లోనవడం చాలా సహజమే. అయితే వాటి అమలుకు అనేక సాంకేతిక సమస్యలు అవరోధంగా నిలుస్తున్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు కనుక కేంద్రాన్ని నిందించలేదు.   రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బహుశః తెదేపాను కలవరపరుస్తూ ఉండవచ్చును. కానీ ఒక రాజకీయ పార్టీగా బీజేపీకి ఆ హక్కు ఉంటుంది గనుక ఈ విషయంలో కూడా దానిని తప్పు పట్టలేదు. బహుశః ఈ పరిణామాలతో తెదేపా ఒత్తిడికి గురవుతుండవచ్చును.   అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న బీజేపీ, ప్రజాధారణ పొందాలంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తోందనే విషయం ప్రజలకి నొక్కి చెప్పడం చాలా అవసరం. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు అదే విషయాన్ని పదేపదే నొక్కి చెప్పడానికి కారణం కూడా అదే. కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న, అమలుచేస్తున్న అనేక పధకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలలో మిత్రపక్షమయిన తమకు ఎటువంటి ప్రాధాన్యత ఈయకపోవడం వలన రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారనే విషయం మొన్న పురందేశ్వరి వ్యాఖ్యలతో బహిర్గతం అయింది.   ప్రజలకు మరింత చేరువయ్యి వారి అభిమానం పొందే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని మరిచిన మాట వాస్తవం. అయితే అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో బలపడాలనుకొంటున్న బీజేపీ మిత్రపక్షమయిన తెదేపాను విమర్శిచడం సబబు కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో తమకూ ప్రాధాన్యత కల్పించినపుడే ప్రజాధారణ పొందగలుగుతుంది కనుక ఆ విధంగా విమర్శించి ఉండవచ్చును.   ఎయిమ్స్; ఐ.ఐ.టి.; ఐ.ఐ.యం., కాకినాడ నుండి చెన్నై వరకు అంతర్గత జలరవాణ వ్యవస్థ ఏర్పాటు వంటి వాటికి కేంద్రం చొరవ చూపిన కారణంగానే త్వరలోనే ఆ పనులు మొదలవ్వబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ఈ సహాయ సహకారాల గురించి చెప్పుకొని బీజేపీ ప్రజలకు చేరువవ్వాలని భావిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలెవరూ కూడా ఇంతకాలంగా ఆ విషయాల గురించి గట్టిగా చెప్పుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువలన వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఇటువంటి విషయాలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకొంటే మంచిది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నేతలకి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో తమ పార్టీ బలపడాలని వారు గట్టిగా కోరుకొంటున్నట్లయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి వీలయినంత సహాయ సహకారాలు దక్కేలా చేయగలిగితే ప్రజలు వారిని కూడా ఆదరిస్తారు.   అయినా ఎన్నికలకి ఇంకా నాలుగున్నరేళ్లు మిగిలి ఉండగా ఇప్పటి నుండి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వలన ఇరు పార్టీలకి, రాష్ట్రానికి కూడా నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండబోదు. ఒకవేళ ఆ రెండు పార్టీలు మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేయడంలో ఏ మాత్రం విఫలమయినా వేరెవరో దాని వలన లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుందనే సంగతి గ్రహిస్తే మంచిది.

పొరుగింటికి నిప్పు పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్

  పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మెచ్చి అమెరికా ప్రభుత్వం ఇటీవలే 150కోట్ల డాలర్లు నజరానా ప్రకటించింది. కానీ పాక్ సేనలు, ఉగ్రవాదులు భారత్ కి వ్యతిరేకంగా పన్నుతున్న కుట్రలు, చేస్తున్న గెరిల్లా యుద్ధం చూస్తుంటే అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆ నిధులన్నీ దానికే ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. తమ పిల్లలని కిరాతకంగా చంపిన తాలిబాన్ల మీద యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం, భారత్ తో కూడా ఎందుకు యుద్ధం చేయాలనుకొంటోందో, దాని వలన ఆ దేశానికి, ప్రభుత్వానికి ఏమి ప్రయోజనమో తెలియదు. పాకిస్తాన్ ఈవిధంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ఆ దేశానికి భారీగా నిధులు అందజేయడం అంటే దానిని భారత్ కి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది.   ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వానికి నిధులు అందజేస్తూనే భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని అమెరికా ఆశించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.   పాకిస్తాన్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరుని చూసి ముచ్చటపడి ప్రతీ సంవత్సరం భారీగా నిధులు ముట్టజెప్పుతున్నప్పటికీ, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముఖ్య అతిధిగా వస్తున్నారనే సంగతి తెలిసినప్పటి నుండి పాకిస్తాన్ ఆ వేడుకలను భగ్నం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఆ దాడిని భారత్ పై చేస్తున్న దాడిగా భావించాలా? లేక నేరుగా అమెరికా అధ్యక్షుడిపైనే చేస్తున్న దాడిగా భావించాలా?   అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ కి ఏ ఉద్దేశ్యంతో కప్పం కడుతున్నప్పటికీ అది ఖచ్చితంగా దుర్వినియోగం అవుతోందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఉగ్రవాదులపై పోరాటానికి ఆ నిధులు ఖర్చు చేసినా చేయకున్నా కనీసం ఆ దేశంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించినా నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేదేమో? పాకిస్తాన్ లో బాల, బాలికలకు కనీసం విద్య, వైద్య,పౌష్టికాహారం వంటి సౌకర్యాలు కూడా కల్పించలేని పాక్ ప్రభుత్వం, భారత్ పై ఉగ్రవాదులను ఉసికోల్పేందుకు, సరిహద్దుల వద్ద భారత సైనిక దళాల మీద, భారత గ్రామాలపైనా దాడులు చేసేందుకు మాత్రం ఖర్చుకి వెనకాడకపోవడం విచిత్రం.   భారత్ ఇప్పుడు అభివృద్ధి మంత్రం పటిస్తుంటే, పాక్ మాత్రం తనను కాటేస్తున్నఉగ్రవాదాన్నే నమ్ముకొన్నట్లుంది. తాలిబాన్ ఉగ్రవాదులు స్కూలు పిల్లలను అతి కిరాతకంగా చంపిన తరువాతయినా దానికి జ్ఞానోదయం కలుగుతుందని అందరూ ఆశించారు. కానీ అది అత్యాసేనని పాక్ నిరూపిస్తోంది.   గత వారం పది రోజులుగా భారత సరిహద్దు గ్రామాలపై, సైనికులపై పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ ధాటికి అనేక గ్రామాలను ఖాళీ చేయించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చును. పాకిస్తాన్ ప్రభుత్వానికి దాని సైన్యంపై ఎటువంటి నియంత్రణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చును. లేకుంటే తన సేనలు భారత్ పై దాడులు చేయడాన్ని అది నిలువరించి ఉండేది. ఇది చూస్తుంటే కుక్క తోకని ఊపడం కాక తోకే కుక్కని ఊపుతున్నట్లుంది.   ఉగ్రవాదాన్ని పెంచి పోషిచడం వలన ఇరాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాల పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా మారిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి, దాని సైనికాధికారులకి జ్ఞానోదయం కలుగకపోగా పొరుగింటికి కూడా ఆ నిప్పుని అంటించాలని ప్రయత్నించడం చాలా దారుణం. నేడు కాకపోతే రేపయినా అందుకు తగిన ప్రతిఫలం అది అనుభవించక తప్పదు.

ఆ ధర్నాలకి పరమార్ధం అదేనేమో

  జగన్ కోర్టు కేసుల్లాగే ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేయాలనుకొన్న రెండు రోజుల నిరాహార దీక్ష కూడా వాయిదాలు పడుతోంది. మొదట ఈనెల ఆరు, ఏడు తేదీలలో చేయాలనుకొన్నారు. అంటే ఈరోజు నుండి మొదలవ్వాల్సి ఉందన్న మాట. తెదేపాకు కంచుకోట వంటి పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా బొత్తిగా పట్టు, బలం లేదు. అటువంటి చోట జగన్ స్వయంగా రైతు సమస్యల కోసం అంటూ నిరాహార దీక్ష చేసి తన పార్టీ బలం పెంచుకోవాలని ఆశిస్తున్నారు. అందువల్ల జిల్లాలో వైకాపా  మొట్ట మొదటిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అవడం చాలా అవసరం. అందుకు ప్రజలు, ముఖ్యంగా రైతుల నుండి భారీ స్పందన కూడా చాలా అవసరం.   ఇంతకు ముందు పంట రుణాల మాఫీ అంశంపై ఆ పార్టీ ఆ జిల్లాతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో చేసిన ధర్నా కార్యక్రమాలకి అంతంత మాత్రంగా స్పందన రావడంతో కొంచెం నిరాశ చెంది ఉండవచ్చును. మళ్ళీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అదే అంశంపై తమకు బొత్తిగా పట్టులేని ప్రాంతంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాలనుకోవడంతో దానిని విజయవంతం చేయడం ఆ పార్టీ నేతలకి కత్తి మీద సాము వంటిదేనని చెప్పవచ్చును. పైగా ధర్నా కోసం ఆ పార్టీ ఎంచుకొన్న సమయం కూడా బొత్తిగా సరయిన సమయం కాదు. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు చేతికి వస్తున్నందున రైతులందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో జగన్ రైతుల సమస్యలపై నిరాహార దీక్ష చేసుకొని కడుపు మాడ్చుకొన్నా రైతులు ఎవరూ పట్టించుకోకపోవచ్చుననే ఆలోచన కలిగినందునే, జగన్ తన దీక్షను 21,22 తేదీలకి వాయిదా వేసుకొని ఉండవచ్చును.   కానీ ఆ తరువాత తుళ్ళూరులో పంటలకు ఎవరో నిప్పు పెట్టడం, ప్రభుత్వం భూసేకరణకు పూనుకోవడంతో కొన్ని గ్రామాలలో రైతులు ఆందోళన చేస్తుండటం వంటి పరిణామాలను నిశితంగా గమనించిన వైకాపా, ఆ అంశాలను కూడా చేర్చితే తమ ధర్నా కార్యక్రమం హైలైట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే బహుశః తన కార్యక్రమాన్ని ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీలకి వాయిదా వేసుకొని ఉండవచ్చును.   వైకాపా ఈ ధర్నా కార్యక్రమాన్ని మళ్ళీ ఇక వాయిదా వేయకపోవచ్చును. ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి పండుగలు, అసెంబ్లీ సమావేశాలు గానీ లేవు. ఈసారి ధర్నా సమయానికి సంక్రాంతి పండుగ హడావుడి కూడా పూర్తపోతుంది. రైతులు కూడా కొంచెం తీరికగా ఉంటారు. కనుక వారిని ధర్నాకు ఆకర్షించడం తేలికవుతుందని వైకాపా ఆలోచన కావచ్చును. తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులను కూడా ఈ ధర్నాకి రప్పించే ప్రయత్నాలు చేయవచ్చును. తద్వారా తమది రైతు సమస్యల కోసం చేస్తున్న నిజమయిన పోరాటమని గట్టిగా చెప్పుకొనే అవకాశం ఆ పార్టీకి ఉంటుంది.   ఒకవేళ తుళ్ళూరు రైతులను కూడా ఈ ధర్నాకు రప్పించగలిగినట్లయితే, స్థానిక రైతులు కూడా ఈ ధర్నా కార్యక్రమం పట్ల అఆసక్తి చూపవచ్చును. అదే జరిగితే, ఈ ధర్నాద్వారా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని వైకాపా ఆలోచన కావచ్చును. కానీ మొన్న తనను కలిసేందుకు వచ్చిన పెనుమాక, నిడమర్రు రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వారి భూములు లాకొన్నా అదైర్యపడవద్దని, నాలుగేళ్ల తరువాత తను అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ వారి భూములు వారికి తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడం ద్వారా తను ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తపించిపోతున్నారో మరోమారు బయటపెట్టుకొన్నారు. అవి ఓదార్పు యాత్రలు కావచ్చు లేదా పరామర్శ యాత్రలు కావచ్చు లేదా సమైక్యాంధ్ర ఉద్యమాలు కావచ్చు లేదా ఇటువంటి ధర్నాలు కావచ్చును ఏమి చేసినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం తను అధికారంలోకి రావడమేనని ఆయనే స్వయంగా చాటుకొన్నట్లయింది.   పుణ్యం కోసం ప్రజలు ఉపవాసాలు చేయడం అందరికీ తెలుసు. కానీ అధికారం కోసం కూడా ఉపవాసాలు చేయవచ్చనే ఆయన ఆలోచనను మెచ్చుకోక తప్పదు. రైతు సమస్యల కోసమే కడుపు మాడ్చుకొంటున్నానని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి ధర్నా పట్ల రైతులు, ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

తెలుగు చిత్ర సీమపై ఆ దేవుడు కూడా కక్ష కట్టేడేమో

  తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టుకొన్నట్లుంది. గత ఏడాది కాలంలో తెలుగు చిత్రసీమకు తమదైన శైలిలో కొత్త సొబగులు అద్దిన అనేక మంది హేమాహేమీలనదగ్గ నటులు, దర్శకులు, రచయితలు మరణించడం చాలా విస్మయం కలిగిస్తోంది.   తెలుగు చిత్ర సీమ నిలిచి ఉన్నంత కాలం ఎవ్వర్ గ్రీన్ హీరోగా నిలిచి ఉండే అక్కినేని నాగేశ్వర రావు చనిపోయి అప్పుడే ఏడాది కావస్తోంది. సీతమ్మ అంటే ఆమెలాగే ఉంటుంది అనుకొనే అంజలీదేవి కూడా ఆయనతో బాటే వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్ని నెలలకి మన అందరినీ గడగడలాడించిన తెలంగాణా శకుంతల వెళ్లిపోయింది. అలనాటి అందాల నటి మంజుల, విలక్షణ నటుడు ముక్కు రాజు ఇరువురూ కూడా జులై నెలలోనే చనిపోయారు.   తెలుగు అక్షరానికి, బాషకి, యాసకి, సంస్కృతికి, సినిమాకి కూడా తన కుంచెతో సరికొత్త అందాలు అద్దిన బాపు ఇక శలవంటూ నిరుడే వెళ్ళిపోయారు. ఒకప్పుడు విలన్ వేషాలు వేసి తన స్వశక్తితో, ప్రతిభతో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొన్న శ్రీహరి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయినప్పుడు ఎవరూ నమ్మలేకపోయారు.   ఆయన పోయిన నెలరోజులకే అంటే నవంబరులో తన విలక్షణ నటనతో తెలుగు ప్రజలందరినీ తుత్తి పరిచిన ఏవీయస్ చనిపోయారు. సరిగ్గా మళ్ళీ నెలరోజులకే ‘కూల్ బాబు కూల్’ అంటూ ఎవరికీ చెప్పాపెట్టకుండా చాలా కూల్ గా వెళ్ళిపోయారు ధర్మవరం. ఎన్ని ఒడిదుకులు ఎదురయినా ఎప్పుడూ చిర్నవుతో కనబడే ‘లవర్ బాయ్’ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొన్న తరువాత గానీ అతను తీరని వేదన అనుభవించారనే సంగతి ఎవరూ గుర్తించలేకపోయారు.   కత్తి లాంటి సినిమాలు తీసిన నందమూరి జానకీ రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సంగీత చక్రవర్తి చక్రి తను వచ్చిన పని ఇంకా పూర్తి చేయకుండానే ఆ దైవ సన్నిధిలో స్వరార్చన చేయడానికన్నట్లు హడావుడిగా వెళ్ళిపోయారు.   తన గుప్పెడు మనసులో తెలుగు వారికి చోటు కల్పించి మరో చరిత్ర సృష్టించిన బాలచందర్ కూడా ఆ చుక్కల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఆహుతీ ప్రసాద్ కూడా అగ్నికి ఆహుతయిపోతున్నారు.   ఇవ్వన్నీ చూస్తుంటే ‘పసివాడో ఏమో..ఆ పైవాడు...తను చేసిన బొమ్మలతోనే కలబడతాడు..’ అని ఎవరో కవి పలికిన పలుకులు గుర్తుకురాక మానవు. తెలుగుచిత్ర సీమ మీద ఆదేవుడు ఎందుకు ఇంత కక్ష కట్టాడో...

అవును పాక్ ఎన్నటికీ మారదు

  మా ఇంట్లో జరిగితే పెళ్లి...మీ ఇంట్లో జరిగితే కంగాళీ...అన్నట్లుంది పాకిస్తాన్ తీరు. తన పిల్లలని తానే తినేసే పామువంటి తాలిబాన్ ఉగ్రవాదులను పెంచి పోషించినందుకు పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించింది. తాలిబన్ విషసర్పాలు అన్నెంపున్నెం తెలియని అమాయకులయిన పాక్ పిల్లలను పొట్టన పెట్టుకొన్నప్పుడు కేవలం పాకిస్తాన్ మాత్రమే ఆక్రోశించలేదు. యావత్ ప్రపంచంలో మానవత్వం ఉన్న ప్రతీ మనిషి చలించిపోయాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరి పారేస్తుంటే అందరూ మెచ్చుకొన్నారు.   ‘ఉగ్రవాదులలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ వేరే ఉండరని, ఉగ్రవాదులు ఎవరయినా నరహంతకులేనని’ తను అనుభవపూర్వకంగా కనుగొన్న గొప్ప సత్యాన్ని లోకానికి ప్రకటించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఉగ్రవాద కోర్టు ముంబై మారణఖాండకు కారకుడయిన లక్వీకి బెయిలు ఇచ్చినప్పుడు, భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత గానీ మళ్ళీ అతనిని అరెస్ట్ చేయాలనే ఆలోచన కలగలేదు. పాక్ పిల్లలను, పౌరులను పొట్టన పెట్టుకొంటున్న ఉగ్రవాదులను ఏరిపారేస్తూ, భారత్ లో పౌరులను పొట్టన పెట్టుకొనే ఉగ్రవాది లక్వీని కంటికి రెప్పలా కాపాడుకొంటూ రాచమర్యాదలు చేస్తున్నారు.   పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల అవలంభిస్తున్న ఈ ద్వంద వైఖరి ఆదేశానికే కాదు, భారత్ కు కూడా ప్రాణ సంకటంగా మారింది. పాక్ వైఖరి చూస్తుంటే భారత్ ని లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాదులు, పాక్ ని లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాదులని రెండుగా విభజించినట్లుంది. అందుకే ముంబై దాడుల తరహాలోనే మరో భారీ దాడికి ఉగ్రవాదులను పాక్ గడ్డపై నుండే రవాణా అవ్వగలిగారు. కానీ భారత నావికాదళాలు సకాలంలో అప్రమత్తమవడంతో అదృష్టవశాత్తు భారత్ ఆ ఉగ్రవాదుల దాడిని తప్పించుకోగలిగింది. ఈనెల 26న డిల్లీలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు కొంతమంది ఉగ్రవాదులు డిల్లీలో జొరబడ్డారనే వార్త చాలా కలవరం కలిగిస్తోంది.   మత ఛాందసవాదంతో కళ్ళు మూసుకుపోయున్న ఉగ్రవాదులు తమ స్వంత మతస్తులనే అందరినీ పొట్టన పెట్టుకొంటున్నారు. కానీ భాద్యత గల పాక్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను నియంత్రించలేని పరిస్థితిలో ఉందని సర్ది చెప్పుకోవచ్చు, కానీ భారత్-పాక్ సరిహద్దులలో జరుగుతున్న కాల్పులను చూస్తుంటే పాక్ ప్రభుత్వం తన సైనిక దళాలను కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉందనుకోవాలా? లేక పాక్ ప్రభుత్వమే భారతదళాలపై కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులను భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తోందనుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   తమది ఉగ్రవాద బాధిత దేశమని పదేపదే చెప్పుకొనే పాకిస్తాన్, వారిని అణచివేసేందుకు ఏటా విదేశాల నుండి లక్షల కోట్ల డాలర్లు కప్పం కట్టించుకొంటోంది. కానీ ఆ డబ్బుతోనే వారిని పెంచి పోషిస్తున్నట్లుంది. ఉగ్రవాదుల భారి నుండి తనను తాను కాపాడుకోలేని పాకిస్తాన్, వారిని ఇతర దేశాలకు కూడా రవాణా చేస్తోంది.   దాదాపు మూడు దశాబ్దాలుగా పాక్ చేస్తున్న ఈ ఆగడాలను భారత్ భరిస్తోనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తమ ప్రభుత్వం ఇకపై మెతక వైఖరి అవలంభించబోదని పాక్ ప్రభుత్వానికి, ఉగ్రమూకలకు చాలా స్పష్టంగానే చెప్పారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం భారత్ తో ఇంకా చెలగాటం ఆడుతూనే ఉంది. పాక్ అస్తిరపడితే అది తనకు ఏ మాత్రం మంచిది కాదని భారతప్రభుత్వం భావిస్తుంటే, పాక్ ప్రభుత్వం మాత్రం భారత్ ను అస్థిరపరిచేందుకు ఎందుకు అంతగా తహతహలాడుతోందో మరి? పొరుగింటికి నిప్పు పెడితే అది తన ఇంటిని కూడా దహించి వేస్తుందనే సంగతి పాక్ అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నప్పటికీ, తన బుద్ధి మార్చుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   భారత్ పట్ల పాక్ వైఖరి ఇక ఎన్నడూ మారబోదని స్పష్టమయింది కనుక, ఇక భారత్ కూడా పాక్ నుండి ఎదురయ్యే ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థలను శాశ్విత ప్రాతిపాదికన ఏర్పాటు చేసుకోక తప్పదు.

తుళ్ళూరు రైతులు ఎవరిని విశ్వసించాలి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నూతన సంవత్సర వేడుకలని రాజధాని నిర్మించబోయే తుళ్ళూరులోనే జరుపుకోవడం చాలా తెలివయిన నిర్ణయమనే చెప్పాలి. ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నేరుగా రైతులతోనే మాట్లాడటం వలన వారిలో నెలకొన్న అనుమానాలు, అపోహలు తొలగి ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడేందుకు దోహదపడింది. నిన్న జరిగిన సభలో ఐదుగురు రైతులు తమ 161 ఎకరాల పొలాల తాలూకు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి అందజేశారు. అంతే కాకుండా స్థానిక రైతులు ఆయనకి వెండి కిరీటం బహూకరించడం విశేషం.   మొదటి నుండి కూడా రాజధాని భూసేకరణకు అడ్డుపడుతున్న వైకాపా ఉద్దేశ్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు వివరించడం ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజలలో రేకెత్తించిన అనుమానాలు, భయాలను దూరం చేసే ప్రయత్నం చేసారు.   చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు రాజధానిని తన ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వ భూముల లభ్యత కూడా ఉంది గనుక ఆయనను ఎవరూ తప్పు పట్టడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పైగా రాయలసీమ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికేవారు. కానీ రాజధాని నగరం రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తుళ్ళూరును ఎంచుకొన్నారు.   ఒకవేళ తెదేపా అధికారంలోకి రాకపోయుంటే వైకాపా రాజధాని నగరాన్నితనకు బాగా పట్టున్న ఇడుపులపాయలో ఏర్పాటు చేసి ఉండేదని, కానీ అలా జరగకపోవడంతో అసూయతో ప్రజలను భయబ్రాంతులను చేసి రాజధాని భూసేకరణకు అడ్డంకులు సృష్టించేందుకే పచ్చటి పంట పోలాలకు నిప్పు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాయలసీమలో రాజకీయ కక్షలు పెంచుకొన్నవారు చెరుకు తోటలకు నిప్పుపెడుతుంటారని, జగన్మోహన్ రెడ్డి అదే విష సంస్కృతిని తుళ్ళూరులో కూడా అమలుచేసారని చంద్రబాబు ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలు చేసేవారిని సహించబోనని తీవ్రంగా హెచ్చరించారు.   ఇంతవరకు అనేకమంది మంత్రులు ఈ అంశంపై వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పటికీ దానిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జగన్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలను కూడా ఆలోచింపజేస్తోంది. ఎందువలన అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిరాధారమయిన ఆరోపణలు చేస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి.   చట్టబద్దంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలున్నప్పటికీ, రైతులకు గరిష్టంగా ప్రయోజనం కలగాలనే ఉద్దేశ్యంతోనే చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాత ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలుచేస్తున్నామని ఆయన రైతులకు తెలిపారు. ఇంతవరకు మీడియాలో వస్తున్న వార్తలు, వివరాల ద్వారానే ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వబోయే పరిహారం గురించి తెలుసుకొంటున్న రైతులకు, ముఖ్యమంత్రి స్వయంగా వారికి నిన్న అన్నీ వివరించి వారికి తన ప్రభుత్వం పట్ల నమ్మకం కల్పించేందుకు ప్రయత్నించారు. రైతులు అందరూ ప్రభుత్వానికి సహకరించి తమ భూములు అప్పగించినట్లయితే, వీలయినంత తొందరగా రాజధాని నిర్మాణం చేసి వారికి గరిష్టంగా ప్రయోజనం కలిగేలా చేస్తానని తెలిపారు.   వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయపరిణామాలు చోటు చేసుకొంటాయో ఎవరికీ తెలియదు. కనుక రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులు అందరూ కూడా ఈ ఐదేళ్ళలోనే పూర్తి ప్రయోజనం పొందడం చాలా అవసరం. వచ్చే ఎన్నికల నాటికి కనీసం రాజధాని నగర పరిధిలో నిర్మాణాలు పూర్తయితేనే అక్కడ భూములు ఇచ్చినవారికి పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడే మిగిలిన ప్రాంతాలలో భూములు ఇచ్చిన వారికి కూడా ఎటువంటి ప్రయోజనం పొందబోతున్నారనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. కనుక రైతులు కూడా వాస్తవిక దృక్పధంతో ఆలోచించి సరయిన నిర్ణయం తీసుకోవాలి.   ఎన్నికలలో గెలిచేందుకే ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను నమ్మడమా లేక రాజధాని నిర్మించి తమ భూముల విలువలను పదిరెట్లు పెంచి ఇస్తామని చట్టబద్దంగా హామీ ఇస్తున్న ప్రభుత్వాన్ని నమ్మడమా? ఏది మంచిదో రైతులే ఆలోచించుకోవాలి.

రాజకీయపార్టీల అదృష్టాలను తారుమారు చేసిన 2014

ఈ 2014సం.లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఊహించని అనేక మార్పులు జరిగాయి. పదేళ్ళపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాదం వల్లనే రెండు చోట్ల కూడా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయినా అది పశ్చాత్తాపపడలేదు. తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నమూ చేయలేదు. బహుశః అందువలననేమో ఈ ఆరు నెలలలో జరిగిన అన్ని ఎన్నికలలో ఘోరపరాజయాలు మూటగట్టుకట్టుకొంటూ క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది.   ఇక సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీలో సీనియర్ నేతలయిన అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటివారినందరినీ కాదని మోడీకి పార్టీ పగ్గాలు అప్పగించడం వలననే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. క్రమంగా దేశమంతా విస్తరిస్తోంది కూడా.   గత ఆరు దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తయితే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో గత పదేళ్ళుగా సాగిన ఉద్యమాలు మరొక ఎత్తని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ తనే తెలంగాణా ఇచ్చిందని చెప్పుకొంటున్నప్పటికీ, కేసీఆర్ అనుసరించిన అనేక రకాల వ్యూహాల కారణంగానే తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితి కల్పించారు. కనుక ఆ ఖ్యాతి ఆయనకు, ఆయన వెంట నిలిచి పోరాడిన కోట్లాది తెలంగాణా ప్రజలకు, రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్నా విద్యార్థులకే దక్కుతుంది. అందుకే ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన కూడా ప్రజలు తనపై పెట్టుకొన్న ఆశలు వమ్ముచేయకుండా ముందుకు సాగుతున్నట్లే ఉన్నారు. ఐదేళ్ళ తరువాత తెలంగాణాలో జరిగిన అభివృద్దే ఆయన పాలనకు గీటురాయిగా నిలుస్తుంది.   ఇక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్న తెదేపా అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరిస్తూ ఒంటి చేత్తో తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రాగలిగారు. కానీ రాష్ట్ర విభజన తరువాత అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి రావడం, వాటిని ఆయన అదే నిబ్బరంతో ఎదుర్కొంటూ, ఈ ఆరునెలల కాలంలోనే క్రమంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చాలా అభినందనీయం. ఆయన రాష్ట్రం కోసం చాలా భారీ కలలే కంటున్నారు. వచ్చే ఎన్నికలలోగా వాటిని నెరవేర్చి చూపి, ప్రజలను మెప్పించి అధికారం నిలబెట్టుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు.   ఇక 2014 సం. వైకాపాకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బెయిలు సంపాదించుకొని చంచల్ గూడా జైలు నుండి బయటపడగలిగినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలలో మాత్రం గెలువలేకపోయారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలని తపించిపోతున్న ఆయన తనకు బాగా పట్టు ఉన్న ఆంధ్రలో గెలిచేందుకు తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర శంఖారావం పూరించినప్పటికీ, ఆయన ఉద్దేశ్యం గ్రహించిన ప్రజలు ఎన్నికలలో వైకాపాను తిరస్కరించారు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చును. కానీ 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని బలమయిన ప్రతిపక్షంగా నిలబడగలిగారు. కానీ ఎన్నికల కోసం మరో నాలుగున్నరేళ్లు వేచి చూడక తప్పదు. అప్పటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.   ఇక కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. అందుకు అది తగిన శిక్ష ఎలాగూ అనుభవించింది. కానీ అది చేసిన పొరపాటుకు, రెండు ప్రభుత్వాలు, ఇరు రాష్ట్ర ప్రజలు నేటికీ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. రాష్ట్ర విభజన ఒకరికి మోధం మరొకరికి ఖేదం మిగిల్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర విభజన చేసినప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది కనుక వారు చాలా ఆనందించారు. కానీ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించిన ఆంద్రప్రదేశ్ పరిస్థితి చూసి ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడ్డారు. అసలు ఈ దుస్థితి నుండి ఎప్పటికయినా బయటపడగలమా? అని బెంగపెట్టుకొన్నారు కూడా.   రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేటికీ గొడవలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం చాలా త్వరగానే ఆ విభజన ప్రభావం నుండి బయటపడటం విశేషం. అందుకు కారణం వారికి నచ్చినట్లుగా సుస్థిరమయిన ప్రభుత్వాలు వారు ఏర్పాటుచేసుకోవడమేనని చెప్పవచ్చును. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీలు పడుతున్నాయి. ఇంతవరకు దేశంలో అతిపెద్ద బలమయిన రాష్ట్రంగా ఉంటూ వచ్చిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంరెండు ముక్కలయినందుకు బాధపడాలో లేకపోతే విడిపోయిన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి. కానీ అంతా మన మంచికేనని సరిపెట్టుకొని ముందుకు సాగడమే మేలు.

ఏపీలో నాలుగు స్థంభాలాట

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన రాజకీయపార్టీలకీ నాలుగు రకాల సమస్యలున్నాయి. అధికార తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలా ఆందోళన కలిగించడం సహజం.   ఇక తెదేపాను నొప్పించకుండా దానితో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రంలో బలపడటం బీజేపీకి కత్తిమీద సాము వంటిదే. ఎందువలన అంటే కేవలం తెదేపాతో పొత్తుల కారణంగానే రాష్ట్రంలో బీజేపీ వెలుగులోకి వచ్చింది తప్ప తన స్వశక్తితో కాదు. ఒకవేళ ఇప్పుడు తెదేపాతో తెగతెంపులు చేసుకొన్నాకూడా దానిపట్ల ప్రజలలో విముఖత ఏర్పడటం సహజం. పైగా ప్రజలు వద్దనుకొన్న కాంగ్రెస్ నేతలను ఆ పార్టీలోకి ఆకర్షించడం ద్వారా బలపడాలని చూస్తున్నందున, బీజేపీ పట్ల వ్యతిరేకత చూపే అవకాశం ఉంది.ఈ నాలున్నరేళ్ళలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏమేరకు సహాయపడుతుందనే అంశం కూడా ఆ పార్టీపై ప్రభావం చూపనుంది. అయితే బీజేపీ రాష్ట్ర నేతలు ఈ విషయం గ్రహించారో లేదో తెలియదు కానీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని అప్పుడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నందున మిత్రపక్షమయిన తెదేపాను చిన్నచూపు చూస్తున్నారు కూడా. కానీ రాష్ట్రంలో తమ పార్టీ బలపడాలంటే తెదేపాతో స్నేహం చాలా అవసరమనే విషయం బీజేపీ అధిష్టానం గ్రహించినట్లే ఉంది. అందుకే కేంద్రమంత్రులు తెదేపాతో చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు.   ఇక కాంగ్రెస్, వైకాపాల పరిస్థితి ఇంచుమించు ఒక్కలాగే ఉందని చెప్పవచ్చును. తెదేపా, బీజేపీలు రెండూ తమ పార్టీ సీనియర్ నేతలను, యం.యల్యే.లు, యంపీలను ఆకర్షిస్తుంటే వారిని కాపాడుకోవడం చాలా కష్టమయిపోతోంది వాటికి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని గుర్తుచేసేందుకు ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రమే కనబడుతున్నారు. హేమాహేమీలనదగ్గ కాంగ్రెస్ నేతలు అందరూ అధిష్టానం, ప్రజలు కలిపి కొట్టిన దెబ్బకి పత్తా లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ, రాష్ట్ర స్థాయిలో భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుండటంతో, రాష్ట్రంలో తమ అండతో బలపడాలనుకొంటున్న బీజేపీలో చేరడం ద్వారా కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవాలనుకోవడం చాలా సహజం. అయితే వారు బీజేపీలోకి తరలి వెళ్లిపోతుంటే వారిని ఆగమని కోరేవారు కూడా పార్టీలో లేకుండా పోయారు. బహుశః వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.   ఇక వైకాపా నేతలను, యం.యల్యే.లు, యంపీలను తెదేపా, బీజేపీలు తమ పార్టీలలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి చూస్తూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి  వారితో చాలా అహంభావంగా వ్యవహరిస్తూ చేజేతులా వారిని ఇతర పార్టీలలోకి సాగనంపుకొంటున్నారు.   ఈ మధ్య కాలంలో కొణతాల, దాడి, గండి బాబ్జీ, చొక్కాకుల వెంకట్రావు అదే కారణంతో పార్టీని వీడగా, త్వరలో ప్రకాశం జిల్లా అద్దంకి యం.యల్యే. గొట్టిపాటి రవి కుమార్, నెల్లూరు మరియు కర్నూలు నుండి ఒక్కో యం.యల్యే. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ముగ్గురు యం.యల్యే.లు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వారే కాక త్వరలో వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి, జమ్మలమడుగు వైకాపా యం.యల్యే. ఆదినారాయణ రెడ్డి, నెల్లూరు యంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు కూడా జగన్ విచిత్ర వైఖరి కారణంగానే పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.   గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మరో నాలుగున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉండవలసినప్పుడు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తూ పార్టీ నేతలను కాపాడుకోవలసి ఉంటుంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేళ్ళపాటు తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణా అంశంతో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పార్టీని జాగ్రత్తగా కాపాడుకొచ్చిన తీరు గమనిస్తే, వైకాపా ఈ విషయంలో ఎంత అలసత్వం ప్రదర్శిస్తోందో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. బహుశః జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఆ పార్టీ మాయమయిపోయినా ఆశ్చర్యంలేదు.   రాష్ట్రం నుండి కాంగ్రెస్, వైకాపాలు మాయమయిపోతే, ఇక మిగిలేవి తెదేపా, బీజేపీలే కనుక అప్పుడు వాటి మధ్య పోటీ అనివార్యం అవవచ్చును. అయితే ఈ మిగిలిన నాలుగున్నరేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి ఓట్లు కోరాలని తపిస్తున్న తెదేపాను అక్కున జేర్చుకొంటారా? లేక ప్రజలు వద్దనుకొన్న కాంగ్రెస్ నేతలందరినీ పార్టీలో జేర్చుకొని మరో కాషాయ కాంగ్రెస్ పార్టీగా అవతరించే బీజేపీని, మోడీ మొహం చూసి అక్కునచేర్చుకొంటారా? అనే సంగతి తెలుసుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది.

పంట రుణాల మాఫీ చేయడం మంచి ఆలోచనేనా?

  ఉదయ్‌పూర్‌లో నిన్న జరిగిన భారత ఆర్థిక సంఘాల వార్షిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ పంట రుణాల మాఫీ వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, పైగా దాని వలన రైతులకు సులభంగా రుణాలు అందడంలేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అసలు రైతులు రుణగ్రస్తులు కాకుండా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేప్పట్టాలి? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు? వాటిని ఏవిధంగా నివారించాలి? రైతుల రుణాల విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో చేయవలసిన మార్పులు వాటి అనేక అంశాల గురించి అందరూ ఆలోచించాలని అన్నారు.   రైతు రుణ మాఫీల పై భిన్నాభిప్రాయాలున్న మాట వాస్తవం. ఇది ప్రభుత్వాలకు ఆర్ధికంగా గుదిబండగా మారిందనే మాట కూడా అంతే వాస్తవం. తెదేపా ఎన్నికలలో గెలిచేందుకే రుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చిందని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాదన. అసలు రుణాల మాఫీ సాధ్యం కాదని ఎన్నికల సమయంలో గట్టిగా వాదించిన ఆయన ఇప్పుడు రుణాల మాఫీ చేయమని ధర్నాలు చేస్తుండటం కూడా ప్రజలు చూస్తునే ఉన్నారు. కానీ తెలంగాణాలో మాత్రం ఆయన పార్టీ నేతలు ఈవిధంగా డిమాండ్ చేయకపోవడం గమనిస్తే, ఆయన కేవలం తన రాజకీయ లబ్ది కోసమే ఈ రుణాల మాఫీ అంశంపై పోరాడుతున్నారని స్పష్టమవుతోంది.   చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు రైతుల దుస్థితి చూసి పంట రుణాలను మాఫీ చేసి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకొన్నారు తప్ప, ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు తీసుకొన్న నిర్ణయం కాదది. కానీ ఎన్నికలలో అదే హైలైట్ అయినందున, అది ఎన్నికలలో గెలిచేందుకే చేసిన హామీయేనని వైకాపా వాదన.   ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ దీని వలన రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతోంది? అని ఆలోచిస్తే రూ.50 వేలలోపు రుణాలు మాఫీ అయిన చిన్న రైతులు ప్రయోజనం పొందారని చెప్పవచ్చును. కానీ  రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది బోగస్ రుణాలు పొందారని, వారికి ఈ రుణమాఫీ పధకం వర్తింపజేయబోమని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం గమనిస్తే, ఈ రుణాల మాఫీని ఏవిధంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందో అర్ధమవుతోంది.   కానీ అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలయినా నేటికీ పంటలు పండించేందుకు ఎందుకు అప్పులు చేయవలసి వస్తోంది? ఆ పరిస్థితి నుండి రైతులను ఏవిధంగా బయటపడేయాలి? అందుకు ప్రభుత్వాలు ఏమి చేయాలి? అని ఆలోచించి ఆ దిశలో ప్రయత్నాలు చేయడం మంచిది. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆకలితో కడుపు మాడ్చుకొంటూ, పంటలు వేయడానికి అప్పులు చేసుకొంటూ, వాటిని తీర్చలేక పురుగులమందులు త్రాగి చనిపోతుంటే, అందుకు ఏ ప్రభుత్వమయినా సిగ్గుతో తలదించుకోవలసి ఉంటుంది. కానీ రైతులు అప్పులు చేసుకొంటే వాటిని తాము చాలా ఉదారంగా మాఫీ చేసామని, చేస్తామని చెప్పుకోవడం ఎవరికీ గర్వకారణం కాబోదు. ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇరువురు రుణమాఫీకి హామీ ఇచ్చినందున దానిని అమలుచేస్తున్నప్పటికీ, ఈ సమస్యకు తమదయినా శైలిలో శాశ్విత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.   ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారారాయలసీమకు సాగు, త్రాగు నీరు అందజేయడం, భూసార పరీక్షల నిర్వహణ, జపాన్ దేశ సహకారంతో సేద్యంలో ఆధునిక పద్దతులను అమలుచేయడం, రైతులు తమ ఉత్పత్తులను నిలువచేసేందుకు గిడ్డంగులు నిర్మించి, వాటిని దేశ విదేశాలలో మార్కెటింగ్ చేసుకొనేందుకు సహకారం అందించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.   తెలంగాణా వ్యాప్తంగా ఉన్న 49,000 సాగునీటి గొలుసు కట్టు చెరువుల పునరుద్దరణ, మారు మూల గ్రామాలకు మంచి రోడ్లు నిర్మించి వాటిని పట్టణాలతో అనుసంధానించడం, విద్యుత్ సంక్షోభ నివారణ వంటి చర్యల ద్వారా తెలంగాణా రైతన్నల పరిస్థితిని మెరుగుపరచాలని కేసీఆర్ భావిస్తున్నారు.   వారిరువురి ప్రయత్నాలు సఫలమయితే బహుశః ఇరు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. కానీ వారి ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే భారీగా నిధులు కావాలి. వారి ప్రణాళికలను అధికారులు, నేతలు అంతే నిబద్దతోతో గ్రామ స్థాయి వరకు అమలుచేయాలి. అప్పుడే రైతులు ఈ రుణ విషవలయం నుండి బయటపడగలరు. ఏ ప్రభుత్వమయినా ఎప్పుడు గర్వపడవచ్చంటే రైతుల రుణాలను మాఫీ చేసినప్పుడు కాదు. రైతులే ప్రభుత్వానికి రుణాలు ఇవ్వగలిగే స్థాయికి తీసుకురాగలిగినప్పుడు.

మళ్ళీ పట్టాలు తప్పుతున్న హైదరాబాద్ మెట్రో

  తెలంగాణా రాష్ట్ర ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న తరుణంలో కూడా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రధమ దశ శర వేగంగా సాగింది. కానీ తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో రైలు మాటిమాటికీ పట్టాలు తప్పిపోతోంది. అందుకు రెండు కారణాలు కనబడుతున్నాయి. 1 రెండవ దశ మెట్రో మార్గంలో మార్పులు చేర్పులు చేయడం. 2 రాజకీయ ప్రమేయం.   తెరాస అధికారంలోకి రాక మునుపే మెట్రో లైన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు చోట్ల మార్పులు సూచించింది. కొన్ని ప్రాచీన కట్టడాలను కాపాడుకొనేందుకే మార్పులు అవసరమయ్యాయని తెరాస వాదన. అందుకు అయ్యే అదనపు ఖర్చు మొత్తాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత మెట్రోని సకాలంలో పూర్తి చేసి అందిస్తామని దానిని నిర్మిస్తున్న యల్.యండ్.టి.సంస్థ ప్రతినిధులు కూడా చెప్పారు.   అయితే ప్రతిపక్షాల వాదన మరోలా ఉంది. త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస ప్రభుత్వం మజ్లిస్ నేతలు చెప్పినట్లు ప్రాజెక్టు మార్గాన్ని ఇష్టం వచ్చినట్లు తిప్పుకొంటూపోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టక ముందు సాంకేతిక నిపుణుల బృందం క్షుణంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తరువాతనే ప్రాజెక్టును రూపొందించారని, అటువంటి దానిని ఇప్పుడు తెరాస ఎందుకు మార్పు చేయాలనుకొంటోంది? అని ప్రశ్నిస్తున్నారు.   తెరాస తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. కాంగ్రెస్ తో బాటు తెదేపా, బీజేపీలు కూడా ప్రాజెక్టు మార్గంలో ఎటువంటి మార్పులు చేసినా అడ్డుకొంటామని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మళ్ళీ మరో రెండున్నర కిమీ దూరం రైలు మార్గాన్ని పెంచాలని తెరాస సూచించడంతో యల్.యండ్.టి.సంస్థ తలపట్టుకొంది.   ఇప్పటికే గత ఆరు నెలలుగా కేసీఆర్ మార్పులు సూచించిన ప్రాంతాలలో ప్రాజెక్టు నిర్మాణం దాదాపు నిలిచిపోయింది. దానివల్ల క్రమేపీ ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఆ సంస్థ రూ.4000 కోట్లు ఖర్చు చేసింది. ఇది వరకు ప్రభుత్వం సూచించిన మార్పులకు మరో రూ.1500 కోట్లు అవసరం ఉండగా, ఇప్పుడు ఈ పొడిగింపుకి మరో రూ. 1500 కోట్లు అవసరం ఉంటుంది. తెలంగాణా ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దమని చెపుతున్నప్పటికీ, అంత మొత్తం అది చెల్లించగలదా లేదా? ఇస్తే ఎప్పుడు ఇస్తుంది? అనే అనుమానాలు, అసలు ఈ ప్రాజెక్టును ముందుకు కదలనీయమని రాజకీయ పార్టీలు చేస్తున్న హెచ్చరికలు యల్.యండ్.టి. సంస్థను అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. నానాటికీ దీనిలో రాజకీయ ప్రమేయం ఎక్కువయిపోతుండటంతో ఈ సమస్యల పరిష్కారానికి ఇక కేంద్రాన్ని ఆశ్రయించడమే మేలనే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.   హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ యన్.వి.యస్.రెడ్డి మెట్రో మార్గంలో మార్పులకు అధ్యయనం చేయమని ప్రభుత్వం యల్.యండ్.టి.సంస్థను ఆదేశించిందని, ప్రస్తుతం ఆ సంస్థ అదే పనిలో ఉందని ప్రకటిస్తే, యల్.యండ్.టి. సంస్థ ప్రధాన కార్యనిర్వాహకుడు గాడ్గిల్ “అసలు మాతో ప్రభుత్వం ఏమీ మాట్లాడనే లేదు. అటువంటప్పుడు దేని గురించి అధ్యయనం చేస్తాము? ఎందుకు చేస్తాము?” అని ప్రశ్నించడం గమనిస్తే ఈ ప్రాజెక్టు ఎంత గొప్పగా ముందుకు సాగుతోందో అర్ధమవుతుంది.