అందుకే ఆంధ్రా, తెలంగాణాలకి నిధులు విడుదల కాలేదా?
posted on Nov 8, 2014 8:11AM
ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కాంగ్రెస్, వైకాపాల ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఇప్పటికి ఐదు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు నిధులు కానీ ఎటువంటి ప్రాజెక్టులు గానీ మంజూరు చేయకపోవడమే వారి వాదనలకు ఆధారం. అయితే కేంద్రం మరే ఇతర రాష్ట్రాలకు కూడా ఇంతవరకు నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసిన దాఖలాలు లేవనే సంగతి ప్రతిపక్షాలు ప్రస్తావించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అన్యాయం జరిగిపోతోందన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకొని తెలంగాణాపట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తోందని చేసిన ఆరోపణలు, ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం చాలా సానుకూలంగా ఉందని స్పష్టం అవుతోంది. ఆ కారణంగానే రేపు జరుగబోయే కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో తన పార్టీకి కాక, తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ ఖచ్చితంగా అమలుజేస్తామని, రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ కూడా పదేపదే స్పష్టం చేస్తున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వ విధి విధానాలను, వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళనం చేసి, దేశాన్నిఅభివృద్ధి పధంలో పరుగులు తీయించాలని తపిస్తున్నారు.
ఆ ప్రయత్నంలోనే అయన కొన్ని మంత్రిత్వ శాఖలను విలీనం చేయడం, అనవసరమయిన కమిటీలను రద్దు చేయడం వంటి పెనుమార్పులు చేస్తున్నారు. చివరికి దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘాన్ని కూడా ఆయన రద్దు చేసి, దాని స్థానంలో దేశావసరాలకు, అభివృద్ధికి దోహదపడే సరికొత్త ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవిధంగా కేంద్రప్రభుత్వం ఇప్పుడు సంధికాలంలో ఉందని చెప్పవచ్చును.
బహుశః ఈ మార్పులు చేర్పులు కారణంగానే, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడంలో ఆలస్యం జరుగుతోందని భావించవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు వివరించకుండా, హామీలు అమలు చేస్తామని చెపుతుండటం వలన ప్రతిపక్షాలకు ఈ అవకాశం దక్కిందని చెప్పవచ్చును. వారి ఆరోపణల కారణంగానే ప్రజలలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చును.
ప్రజలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అనుమానాలు లేవనెత్తడంలో ప్రతిపక్షాలు సఫలమయితే దాని వలన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే సంగతి ప్రభుత్వం గుర్తించి, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యానికి కారణాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మంచిది. లేకుంటే ప్రతీ అంశం నుండి రాజకీయ మైలేజీ పొందాలని చూసే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈ అంశంపై కూడా మైలేజీ పొందాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తారని చెప్పడానికి నేడు ఆయన డిల్లీ యాత్రే ఒక ఉదాహరణ.
హుడ్ హూద్ తుఫాను భాదితుల కోసం మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లు పరిహారం తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరేందుకు బయలుదేరుతున్నట్లు సమాచారం. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విఫలమయితే తానే కెన్ద్రమ్పైఒత్తిది తెచ్చి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించానని చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిధులు, ప్రాజెక్టుల మంజూరులో ఎందువలన జాప్యం జరుగుతోందో ప్రజలకి వివరించే ప్రయత్నం చేయడం మంచిది.