మోడీ మ్యాజిక్ ఆంద్ర, తెలంగాణాలలో పనిచేస్తుందా?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకవేళ బీజేపీ దైర్యం చేసి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక పోయుంటే బహుశః నేడు ఆ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితీ కూడా వేరేలా ఉండేవేమో. కానీ ఆనాడు బీజేపీ తెగించి తీసుకొన్న నిర్ణయం వలన నేడు ఆశించిన దానికంటే మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిన మూడు నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యున్న బీజేపీ, మోడీ, అమిత్ షాల చేతికి పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత క్రమంగా యావత్ దేశమంతా పార్టీ విస్తరిస్తోంది.
ఇప్పుడు బీజేపీ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘర్, గోవా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తన అధికారాన్ని విస్తరింపజేయగలిగింది. అంతే కాదు నాగాల్యాండ్, పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో తన ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకొంటోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా అధికారం చేప్పట్టేందుకు చురుకుగా, చాల తెలివిగా పావులు కదుపుతోంది. దాని వ్యూహం ఫలిస్తే బీజేపీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావచ్చును. అదేవిధంగా ఈసారి డిల్లీలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
అంటే కేంద్రంలో అధికారం చెలాయించడమే కాకుండా, దేశంలో 29 రాష్ట్రాలుంటే అందులో ఎనిమిది రాష్ట్రాలలో స్వయంగా అధికారంలోకి రాగలిగితే, మరో 3 రాష్ట్రాలలో భాగస్వామిగా ఉంటోందన్నమాట. ఇంతవరకు దక్షిణాదిన కర్నాటక రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా ఉండేది.కానీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పుణ్యమాని ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి వదులుకోవలసి వచ్చింది. కానీ మళ్ళీ అక్కడ పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారుతుండటంతో వచ్చే ఎన్నికలలో కర్ణాటకలో కూడా బీజేపీ పాగా వేసే అవకాశాలున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన దృష్టినిప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలపైకి సారించారు. ఈవిధంగా బీజేపీ తన సామ్రాజ్యాన్ని దేశమంతటికీ విస్తరిస్తుంటే సహజంగానే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న లేదా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఆందోళన చెందడం సహజం. కానీ ప్రధాని మోడీ మిత్రధర్మం పాటిస్తూ తమ ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను కేంద్రంలో తగు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారి ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అసందర్భంగా మాట్లాడుతూ తమ మిత్ర పక్షాలలో అనవసరమయిన ఆందోళన రేకెత్తిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా, ఆంద్ర, తెలంగాణా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి బీజేపీ తన అధికారం విస్తరించాలంటే ముందుగా అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. కుల, మత, ప్రాంత సమీకరణాలు సరిచూసుకోవలసి ఉంటుంది. ఎంతో కాలంగా అక్కడ బలంగా నిలద్రోక్కుకొనున్న ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవలసి ఉంటుంది. మోడీ మ్యాజిక్, అమిత్ షా రాజకీయ వ్యూహాల వల్లనే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించిందని నిసందేహంగా చెప్పవచ్చును. కానీ ఆ మ్యాజిక్ దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తుందా లేదా అనేది ఈ ఐదేళ్ళలో ఆయన ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. ఇవ్వన్నీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మోడీ మ్యాజిక్ తోనే అన్ని రాష్ట్రాలలో పాగా వేసేయడం అసాధ్యమనే చెప్పవచ్చును.