చంద్రబాబు, కేసీఆర్ దారులు వేరు గానీ లక్ష్యం ఒక్కటే
posted on Dec 12, 2014 @ 10:47AM
ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకు చూస్తుండగానే అప్పుడే ఆరు నెలలు నిండాయి. రెండు రాష్ట్రాలకు వేటికవే ప్రత్యేకమయిన సమస్యలు. ఇరువురు ముఖ్యమంత్రులకు విభిన్నమయిన ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు, ప్రణాళికలు. కానీ ఇద్దరు పటించే మంత్రం మాత్రం ఒక్కటే. అభివృద్ధి. ఈ ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి ఏమి సాధించారు? ఏ రాష్ట్రం ఏ దిశలో అడుగులు వేసింది. వేస్తోంది...అని చూస్తే చాలా ఆసక్తికరమయిన విషయాలు కనబడతాయి.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రం దొరకగా, చంద్రబాబుకి కనీసం విస్తరి కూడా లేని పరిస్థితి. కేసీఆర్ అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం దక్కితే, చంద్రబాబుకి కనీసం కార్యాలయం కూడా లేని వింత పరిస్థితి. కేసీఆర్ కి మిగులు బడ్జెట్ తో రాష్ట్రం చేతికి అందివస్తే, చంద్రబాబుకి లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పగ్గాలు అందుకొన్నారు. అయితే వారు పగ్గాలు చెప్పట్టేనాటికి రెండు రాష్ట్రాలలో కూడా విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. దాని నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడగలిగింది కానీ ఇంతవరకు కూడా తెలంగాణా మాత్రం బయటపడలేకపోయింది.
గత రెండు మూడు దశాబ్దాలుగా అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది కనుక అక్కడ పరిశ్రమలు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. కానీ విభజన తరువాత చూసుకొంటే ఒక్క విశాఖలో తప్ప ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదనే చేదు నిజం బయటపడింది. కానీ తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రాలో వ్యవసాయరంగం చాలా బలంగా ఉంది. కారణం నీటి సౌకర్యం, విస్తారంగా సారవంతమయిన భూములు ఉండటమే.
అందువలన తెలంగాణాకు ఇప్పుడు వ్యవసాయం ప్రాధాన్యమయితే, ఆంధ్రాకు పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యంగా మారింది. అందుకే ముఖ్యమంత్రుల ప్రాధాన్యతలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కుదుటపరిచేందుకు గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ, వాటర్ గ్రిడ్ ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకు తెలంగాణాలో వ్యవసాయం బోరు బావుల మీదే ప్రధానంగా ఆధారపడి సాగేది. అందువలన విద్యుత్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ పూర్తి శ్రద్ద కనబరచినట్లు లేదు. బహుశః ఈ చెరువుల పునరుద్దరణ జరిగితే, వ్యవసాయం కోసం విద్యుత్ పై ఇంతగా ఆధారపడే పరిస్థితి ఉండబోదు కనుక అప్పుడు విద్యుత్ పరిస్థితి కూడా దానంతట అదే మెరుగు పడుతుందనే నమ్మకం కావచ్చును.
కేసీఆర్ ప్రధానంగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు, బాషల పునరుద్దరణపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. తద్వారా ప్రజలలో మరింత బలంగా తెలంగాణా భావన కలిగించి తన పార్టీని ప్రజలకు మరింత దగ్గిరకి చేర్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక తెలంగాణాలో అత్యధికం శాతం బీసీ, యస్సీ, యస్టీ జనాభే ఉన్నారు గనుక వారికి దగ్గరయ్యేందుకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన అంతర్యం ఏమయినప్పటికీ ఆయన ప్రకటించిన సంక్షేమ పధకాల ఫలాలు వారికి దక్కినట్లయితే తప్పకుండా తెలంగాణాలో సామాజిక విప్లవం వస్తుంది.
ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చాలా మంచి ఆలోచనే కానీ దాని చుట్టూ వంద అంతస్తుల భవనాలు ఇంత అర్జెంటుగా ఎందుకు నిర్మించాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, తను స్వయంగా ప్రకటించిన రుణాల మాఫీ, పెన్షన్లు, పలు సంక్షేమ కార్యక్రమాలు, మొదలుపెడుతున్న వివిధ ప్రాజెక్టులు వంటివాటిని పరిష్కరించకుండా హైదరాబాద్ నగరానికి మరింత గొప్ప పేరు రావాలనే కారణంతో ఇటువంటి అనవసర పనులను తలకెత్తుకోవడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధీటుగా తను కూడా నగరాన్ని అభివృద్ధి చేసానని చెప్పుకోవాలనే కాంక్షతోనే బహుశః కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారేమో?
ఇక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా తన లక్ష్యాన్ని మరువకుండా చకచకా ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు విద్యుత్ స్వయం సంవృద్ది, పరిశ్రమల స్థాపన, తద్వారా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడం, రాజధాని నిర్మాణం. వీటన్నిటిపై ఆయన ఏవిధంగా అడుగులు వేస్తున్నారో స్వయంగా ప్రజలే చూస్తున్నారు.
రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తన హామీని నిలబెట్టుకొంటూ పంట రుణాల మాఫీ చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు కూడా అందజేస్తున్నారు. వ్యవసాయం, సంక్షేమ పధకాల అమలు, ఐటీ మరియు మౌలిక వసతుల రంగాల అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. బహుశః త్వరలోనే ఆ రంగాలలో కూడా త్వరలోనే అభివృద్ధి కనబడవచ్చును. ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ ఆరోగ్యకరమయిన పోటీని ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ ఐదేళ్ళలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈవిధంగా పోటీపడుతూ తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపించగలిగితే, ప్రజలు కూడా మళ్ళీ వారికే పట్టం కడతారు.