సోనియాతో పాటు రాహుల్ రిటైర్మెంట్ కూడా తప్పదా?
posted on Dec 24, 2014 8:57AM
నిన్న వెలువడిన ఝార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీని పతాక స్థాయికి తీసుకుపోగా, 125సం.ల ఘన చరిత్ర కలిగి, నిన్న మొనటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని పూర్తి పతనావస్థకు చేర్చాయి. వరుస విజయాలతో బీజేపీ దేశమంతటా క్రమంగా విస్తరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతోంది. బీజేపీ ఇంతగా పుంజుకోవడానికి, కాంగ్రెస్ ఇంత దారుణంగా దెబ్బ తినడానికీ కారణం ఆయా పార్టీల అధినేతలు ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలలో తేడాలే. అగ్నికి వాయువు తోడయినట్లుగా నరేంద్రమోడీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తోడవడంతో వారిరువురూ తమ పార్టీని దశదిశలా వ్యాపింపజేస్తుంటే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియాగాంధీకి అసమర్ధుడు, బొత్తిగా నాయకత్వ లక్షణాలు లేనివాడు అయిన రాహుల్ గాంధీ తోడవడంతో ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ చాప చుట్టేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇరువురు ఇదే దూకుడు ఇక ముందు కూడా ప్రదర్శించినట్లయితే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా దొరకకపోవచ్చును. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడం బహుశః సోనియా, రాహుల్ గాంధీలిరువురు వల్ల కాదనే చెప్పవచ్చును. రాజకీయ పార్టీలలో సభ్యులకు ఆ పార్టీల వలననే ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందడం సహజ సూత్రమయితే, వ్యక్తులు, వారి వంశ చరిత్రల కారణంగా పార్టీలు మనుగడ సాగించడం చాలా అసహజంగా ఉంటుంది. అటువంటి పార్టీలు ఏదో ఒకనాడు ఇటువంటి పరిస్థితే ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ పార్టీ రుజువు చేస్తోంది. అందువల్ల పార్టీ మనుగడపైనే తమ రాజకీయ జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయని వారిరువురు గ్రహించినట్లయితే కాంగ్రెస్ బ్రతికి బట్ట కట్టవచ్చును.
ఒకవేళ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీని ఇంకా తన చెప్పు చేతలలోనే ఉంచుకోవాలని చూసినా లేదా రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ప్రయత్నించినా అతని రాజకీయ భవిష్యత్, అతనితోబాటు దేశంలో వేలాది కాంగ్రెస్ నేతల, కార్యకర్తల భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. తన ముద్దుల కొడుకును ప్రధానమంత్రిని చేద్దామనుకొన్న సోనియాగాంధీకి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చును. కానీ పార్టీని కాపాడుకొనేందుకు పార్టీ పగ్గాలను సమర్దుడయిన వ్యక్తి చేతిలో పెట్టడం చాలా అవసరం. పెట్టినా కూడా, మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందితే తప్ప వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం దక్కకపోవచ్చును. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఇకనయినా మేల్కొని ఆత్మవంచన చేసుకోకుండా వాస్తవ పరిస్థితులను సమీక్షించుకొని అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాకాదని పార్టీ ప్రక్షాళన పేరిట కొంతమంది నేతలను అటు వారిని ఇటు, ఇటువారిని అటు మార్చినంత మాత్రాన్న ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.