తెదేపా-బీజేపీ వ్యూహాలు వేరు లక్ష్యం ఒక్కటే
posted on Dec 24, 2014 @ 9:31PM
ఇటీవల తెదేపా చేప్పట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఆంధ్రాలో ఊహించనంతగా మంచి స్పందన వచ్చింది. ఆంధ్రాలో 20-25 లక్షల లక్ష్యం పెట్టుకొంటే ఏకంగా 43లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇక తెలంగాణాలో ఏడు లక్షలు లక్ష్యం పెట్టుకొంటే అక్కడ పది లక్షల మంది చేరారు. అంటే కేవలం ఈ 49 రోజుల్లో ఏకంగా 53 లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరారు. ఇది సరికొత్త రికార్దేనని చెప్పక తప్పదు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలుపెట్టాయి. కానీ వాటికి ఇటువంటి స్పందన రాలేదు. అంటే తెదేపాకున్న గట్టి పట్టు ఆ రెండు పార్టీలకు లేదని స్పష్టమవుతోంది.
తెదేపా పెరిగిన తన ఈ బలాన్ని చూసుకొని బీజేపీకి ఎదురు నిలవాలనుకోవడం లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం త్వరలో జరగనున్న జి.హెచ్.యం.సి.(హైదరాబాద్) జి.వి.యం.సి. (వైజాగ్) లలో తమ బలం ఓసారి పరీక్షించి చూసుకోవాలని తహతహలాడుతున్నట్లున్నారు. ఒకవేళ ఆ రెండు ఎన్నికలలో బీజేపీ తమతో కలిసి రాకపోయినట్లయితే, తెదేపా కూడా తన శక్తి ఏమిటో చూపేందుకు వెనుకాడకపోవచ్చును. కానీ బీజేపీ అధిష్టానం అప్పుడే అంత తొందరపడక పోవచ్చును. ఎందుకంటే రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదులో చొరవ చూపని స్థానిక నేతలను నమ్ముకొని మిత్రపక్షమయిన తెదేపాతో తెగతెంపులు చేసుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకే బీజేపీ అధిష్టానం గట్టిగా ప్రయత్నించవచ్చును.
ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమందిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తన శత్రువులందరినీ పోగేసుకొని తన మీద యుద్ధానికి సిద్దం అవుతుంటే తెదేపా చూస్తూ ఊరుకొంటుందని అనుకోవడం అవివేకమే.
బీజేపీ కాంగ్రెస్, వైకాపాలలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ఆయా వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెదేపా నేరుగా ఆయా వర్గాల ప్రజలనే తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. బహుశః అదే సరయిన పద్దతని చెప్పవచ్చును.
కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకొంటున్నవారి కులం వివరాలను కూడా తెదేపా సేకరించింది. అయితే ఆ వివరాలను చాల గుట్టుగా ఉంచడం గమనార్హం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 43లక్షల మంది కొత్తగా సభ్యత్వం తీసుకొంటే అందులో యస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ తదితర కులస్తులే ఎక్కువ సంఖ్యలో ఉంటారని భావించవచ్చును.
తెదేపా ఒక్కో నియోజక వర్గం నుండి కనీసం ఆరు శాతం ప్రజలను సభ్యులుగా పార్టీలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ దాదాపు పది శాతం పైనే చేరడం గమనిస్తే ఆ పార్టీ పట్ల ప్రజలు బాగానే మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకంగా ఆరు లక్షలమంది సభ్యులు చేరగా, అత్యధికంగా వినుకొండ నుండి 70,000 మంది సభ్యులు చేరారు. ఆ తరువాత వరుసగా కృష్ణా జిల్లాలో నందిగామ, చిత్తూరులో కుప్పం నుండి అత్యధికంగా సభ్యులు చేరారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే వైకాపాకు కంచుకోట అని చెప్పుకొనే పులివెందలలో తెదేపాకు ఈసారి 210 శాతం సభ్యత్వం పెరిగింది. ఆ సంగతి తెదేపా రహస్యంగా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎలాగో మీడియాకు పొక్కింది. అంటే తెదేపా చాప క్రింద నీరులా కడపలో కూడా తన బలం పెంచుకొంటున్నట్లు స్పష్టమవుతోంది.
మరి ఇవన్నీ రాష్ట్ర బీజేపీ నేతలకి, బీజేపీ అధిష్టానానికి తెలియవని భావించలేము. కనుక బీజేపీ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆచితూచి అడుగులు వేయవచ్చును.