రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తధ్యం
posted on Dec 9, 2014 6:03AM
పంట రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ రెండూ కూడా రైతుల మనోభావాలతో ముడిపడున్న చాలా సున్నితమయిన అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి వాటిపై కూడా తనదయిన శైలిలో రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని విశ్వప్రయత్నాలు చేసారు. చంద్రబాబు, అయన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందు నుండే పంట రుణాల మాఫీ అంశంపై వైకాపా రభస చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఆయన విజయవాడ వద్ద రాజధాని నిర్మించాలనుకొంటున్నట్లు సూచన ప్రాయంగా చెప్పినప్పటి నుండే వైకాపా దానిని వివాదాస్పదం చేసేందుకు ఏమేమి చేసిందో ప్రజలందరూ చూసారు.
అయితే ఇంతకంటే పెద్ద సవాళ్ళనే ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఈ సవాళ్ళను కూడా ధీటుగా ఎదుర్కొని చూపారు. రాజధాని, పంట రుణాల మాఫీ అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయనే సంగతిని గ్రహించిన చంద్రబాబు కూడా ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా ఉండేందుకు, ఈ రెండు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి, అన్ని వివరాలు సేకరించి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగడం వలన మబ్బులు విడిపోయినట్లు ఈ రెండు సమస్యలు కూడా క్రమంగా పరిష్కారింపబడుతున్నాయి.
పంట రుణాల మాఫీపై వైకాపా నానాయాగీ చేసింది. కానీ దానికి ఒక్క వైజాగులో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కూడా వైకాపా చేసిన ధర్నాలకు రైతులు, ప్రజల నుండి పెద్దగా స్పందన కనబడకపోవడం గమనిస్తే ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టం అవుతోంది. కానీ అదే సమయంలో రుణ మాఫీ చేసినందుకు రైతుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై అల్లరిచేసి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీద్దామనుకొన్న వైకాపా తనే ప్రజలలో మరింత చులకన అయ్యింది.
రాజధాని భూముల విషయంలో కూడా మళ్ళీ అదే జరిగింది. ఏదోవిధంగా రైతులను రెచ్చగొట్టి రాజధాని నిర్మాణానికి వారు తమ భూములు ఇవ్వకుండా అడ్డుపడి వారితో కలిసి ఉద్యమించి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని దురాలోచన చేసిన వైకాపాకు అక్కడా నిరాశే ఎదురయింది. ఆపార్టీ చేస్తున్న రాజకీయాలు గమనించగానే చంద్రబాబు నాయుడు కూడా ఒకవైపు దానిని రాజకీయంగా ఎదుర్కొంటూనే, మరోవైపు రైతులు తృప్తి పడేవిధంగా భూసేకరణ విధి విధానాలను రూపొందించి దానిని వారి ముందుంచి ఆయనే నేరుగా వారితో మాట్లాడి ఒప్పించడంతో ఈ సమస్య కూడా క్రమంగా పరిష్కారమవుతోంది. మొదట తూళ్ళూరు మండలంలో రైతులు చాలా ఆందోళన చెందినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాలను చూసిన తరువాత ఇప్పుడు వారు కూడా రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటమే చంద్రబాబు నాయుడి కార్యదీక్షకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
ఊహించని ఈ పరిణామాలు వైకాపాకు చెంపపెట్టువంటివేనని చెప్పక తప్పదు. నిజానికి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న రాజధాని నిర్మాణం, పంట రుణాల మాఫీలకు అడ్డుపడగలిగినట్లయితే, ఆయనను, తద్వారా ఆయన పార్టీని రాజకీయంగా చావు దెబ్బ తీయవచ్చని వైకాపా ఆలోచన అయ్యి ఉండవచ్చును. అందుకే అది అంత యాగీ చేసింది. ఇంకా చేస్తుంది కూడా. బహుశః అందువల్లనేనేమో, ఈ రెండు అంశాలు పరిష్కారం కావడం వైకాపాకు ఇష్టం లేనట్లుందని మంత్రులు కూడా అంటున్నారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగబోతున్నాయి కనుక అక్కడ కూడా వైకాపా ఇదే అంశాలను లేవనెత్తి రాద్దాంతం చేసే ప్రయత్నం చేయవచ్చును.
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేయబోయి వైకాపా తనే పదేపదే అప్రదిష్ట పాలవుతోంది. త్వరలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ అయ్యి, రాజధాని నిర్మాణం కూడా మొదలయితే అప్పుడు వైకాపా తను చేసిన అల్లరికి తలదించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. పంట రుణాల మాఫీ, రాజధాని నిర్మాణం వలన ప్రభుత్వానికి, చంద్రబాబుకి, తెదేపాకు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడితే, దానికి అడ్డంకులు సృష్టించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఆయన పార్టీ పేరు కూడా చరిత్రపుటలలోకి ఎక్కుతాయి.