పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడోఆయనకే తెలియదు: జగన్
పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో తనకంటే ఒకరోజు ముందే పర్యటించబోతున్నారనే సంగతి తెలిసి కంగారుపడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనపై తన మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. కానీ తన పర్యటన తరువాతే పవన్ కళ్యాణ్ తుళ్ళూరుకి బయలుదేరుతారని తెలిసి ఆయన చల్లబడ్డారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో ఒకలాగ, హైదరాబాద్ చేరుకోగానే మరొకలాగా మాట్లాడి అభాసుపాలవడంతో అందరి కంటే ఎక్కువగా వైకాపాయే చాలా సంతోషించి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అదే అభిప్రాయం జగన్ మాటలలో ప్రతిఫలించింది.
నిన్న శాసనసభ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఒక ప్రశ్నకు బదులిస్తూ, “ఆయన (పవన్ కళ్యాణ్) ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన తుళ్ళూరులో ఏమి మాట్లాడారో, హైదరాబాద్ కి తిరిగి వచ్చి ఏమి మాట్లాడారో అందరూ విన్నారు. మరి రేపు ఏమి మాట్లాడబోతాడో ప్రజలే ఆయనని అడగాలి,” అని సమాధానం ఇచ్చేరు. కానీ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూ కుంభకోణాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా, “ఆయన చనిపోయి ఏడేళ్లయింది. చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇపుడు జరుగుతున్న అక్రమాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని నేర్పుగా సమాధానం దాటవేసారు.
ఏడేళ్ళ క్రితం చనిపోయిన తన తండ్రి పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి చెప్పుకొంటూ రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు. పైగా తనకు ప్రజలు అవకాశమిస్తే మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తానని గొప్పగా చెప్పుకొంటున్నారు కూడా! నేటికీ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? డిల్లీలో ఉండే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంస్థ జగన్ కి చెందిన వందల కోట్లు ఆస్తులను ఎందుకు జప్తు చేసుకొంటోంది? అయినా దానిపై జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీడియా గానీ ఎప్పుడు ఎందుకు స్పందించవు? అని ప్రశ్నించుకొంటే వచ్చే సమాధానం ఆయన నీతి నిజాయితీల గురించి తెలియజేస్తుంది.
నిజమే! పవన్ కళ్యాణ్ బొత్తిగా రాజకీయ అనుభవం లేక తప్పటడుగులు వేస్తూ అభాసుపాలవుతున్నారు. అందుకు ఆయనే నష్టపోతారు. కానీ బొత్తిగా రాజకీయ అనుభవం లేని ఆయన తుళ్ళూరు పర్యటిస్తారనగానే వైకాపా ఎందుకు ఉలికిపడింది? ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? అని ప్రశ్నించుకొంటే ఎవరు ఎంత నీతిమంతులో, ఎవరి పోరాటంలో ఎంత నిజాయితీ ఉందో అందరికీ అర్ధమవుతుంది.
ఒకవేళ ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయవచ్చును. ఇంకా అవసరమనుకొంటే కోర్టుకు కూడా వెళ్లి ఆ అక్రమాలను అడ్డుకోవచ్చును. ఆయనను ఎవరూ అడ్డుకోవడం లేదు. కానీ, ఆయన ఈ అంశాలను కూడా తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు, రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు కావవి.
ఇక కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో విఫలమయినప్పటికీ ఇంకా తెదేపా, బీజేపీతో ఎన్డీయేతో అంటకాగుతూ డ్రామాలు ఆడుతోందని ఆక్షేపించారు. అంటే కేంద్రం నిధులు ఇవ్వకపోతే తక్షణమే తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారన్న మాట. అయితే అలా చేస్తే కేంద్రం నుండి భారీగా నిధులు వచ్చిపడిపోతాయా? లేక రాష్ట్రం ఇంకా నష్టపోతుందా? అని ఆలోచిస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఎటువంటి రాజకీయ జ్ఞానం లేని వారు కూడా చెప్పగలరు. కానీ తనను తాను గొప్ప రాజకీయ మేధావిగా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపించిపోయే గొప్ప వ్యక్తిగా భావించుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని సలహా ఇస్తున్నారు! దేనికి? అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి లేదా వైకాపా నేతలెవరూ సమాధానం చెప్పకపోవచ్చును. కానీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఎన్డీయే కూటమిలో చేరాలని కొందరు ఆరాటపడుతున్నట్లు కనబడుతోంది. ఒకవేళ తెదేపా మా కూటమి నుండి బయటకు వచ్చేస్తే వాళ్ళు లోపలకి ప్రవేశించాలని చూస్తున్నట్లుంది. కానీ అది అసంభవం. తెదేపా, బీజేపీల మధ్య మంచి బలమయిన స్నేహ సంబంధాలున్నాయి. రెండూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి కలిసి పనిచేస్తాయి,” అని చెప్పారు.
కేంద్రం నిధులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకు? అంటే దానికీ వెంకయ్య నాయుడు సమాధానమే వర్తిస్తుంది. తను బీజేపీతో, కేంద్రంతో చాలా జాగ్రత్తగా, లౌక్యంగా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూనే బీజేపీతో ఎన్డీయే ప్రభుత్వంతో తెదేపా కలిసిపనిచేయడాన్ని ఏదో పెద్ద నేరం అన్నట్లుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన మాటలు వింటుంటే తను చేస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని, గమనించినా వారికి అర్ధం చేసుకొనే శక్తి లేదని భావిస్తున్నట్లుంది. వారికి ఆ శక్తి ఉందో లేదో ఎన్నికలలో చూపారు. ఇంకా గ్రహించలేకపోతే ఎవరు మాత్రం వైకాపాను ఆయన భారి నుండి కాపాడగలరు?