ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది
posted on Dec 10, 2014 6:55AM
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఈరోజు తెల్లవారు జామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీలంకకు పెను సమస్యగా మారిన యల్.టీ.టీ.ఇ.ని దాని అధినేత అధ్యక్షుడు ప్రభాకరన్ న్ని అంతం చేసే ప్రయత్నంలో కొన్నేళ్ళ క్రితం జరిగిన మిలటరీ ఆపరేషన్ లో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది అమాయకులయిన తమిళ ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపించారని ఆయనపై తమిళ ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ కారణంగానే ఆయన మన దేశంలో అడుగుపెట్టిన ప్రతీసారి వారు నిరసనలు తెలపడం పరిపాటయింది. ఆయన మన దేశంలోనే అడుగుపెట్టడానికి ఇష్టపడని తమిళులకు, ఆయన తరచూ తిరుమల వస్తుండటం, అందుకోసం మొదట తమ రాష్ట్ర రాజధాని చెన్నై (విమానాశ్రయం) లోనే అడుగుపెడుతుండటం, అక్కడి నుండే ఆయన తిరుపతికి వెళుతుండటం, అయినప్పటికీ ఆయనను అడ్డుకోలేని తమ నిస్సహాయత కారణంగా సహజంగానే వారికి మరింత ఆవేశం, ఆగ్రహం కలిగిస్తోంది. వారి ఆ ఆవేశం, ఆవేదనను అర్ధం చేసుకోవచ్చును.
అయితే దాదాపు మూడున్నర దశాబ్దాలుగా శ్రీలంక దేశ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చివేసిన యల్.టీ.టీ.ఇ.ని దాని అధినేత అధ్యక్షుడు ప్రభాకరన్ న్ని, ఉపేక్షించాలని ఆశించడం కూడా తప్పే. పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ తీవ్రవాదులు పేట్రేగిపోయినప్పుడు భారత ప్రభుత్వం కూడా సిక్కుల పరమ పవిత్ర పుణ్య స్థలంగా పేరొందిన అమ్రిత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలోకి మిలటరీ దళాలను పంపించి వారిని నిర్దాక్షిణ్యంగా తుడిచి పెట్టేసింది. శ్రీలంక దేశ అధ్యక్షుడుగా ఉన్న రాజపక్సే కూడా యల్.టీ.టీ.ఇ. నుండి తన దేశాన్ని కాపాడుకొనేందుకు అదేవిధంగా వ్యవహరించారు. ఆయనకు అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. అయితే ఆ ప్రయత్నంలో వేలాది మహిళలు , చిన్నారులు, వృద్ధులను కూడా పొట్టన పెట్టుకోవడాన్ని భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంటంతో ఖండించాయి.
కానీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, చైనా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్, రష్యా వంటి ఏదో ఒక దేశంలో ఇటువంటి విచ్చినకర శక్తులు తలలెత్తిన ప్రతీసారి ఆయా దేశాలు ఇంచుమించు ఇదేవిధంగా ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కష్టం ఏమిటో అనుభవించిన దేశాలకే అర్ధం అవుతుంది కనుక వారు కూడా ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించడంతో సరిపెట్టేస్తూ, ఆయా దేశాలతో యధాతధంగా సంబంధాలు నెరపక తప్పనిసరి పరిస్థితి.
ఆకారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సార్లు తమ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ నియమ నిబంధనలకు, అవసరాలను ద్రష్టిలో ఉంచుకొని దేశానికి విచ్చేసే విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు సముచిత మర్యాదలు, సౌకర్యాలు కల్పించవలసి వస్తుంది. అందుకోసం ఒక్కోసారి స్వంత ప్రజల అభీష్టానికి విరుద్దంగా వ్యవహరించవలసి రావచ్చును. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
ఆయన ప్రతీ ఏట తిరుమల శ్రీవారిని దర్శించుకొంటుంటారు. అందుకే ఈరోజు తిరుమలకు చేరుకొన్నారు. ఊహించినట్లుగానే ఆయన కోసం భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వచ్చింది. తమిళ పార్టీలకు చెందిన కొందరు ఆయనను అడ్డుకొనేందుకు తిరుపతి చేరుకొన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయన రాకతో సాధారణ భక్తులకు కూడా తీవ్ర ఇబ్బంది కలగడం కూడా సహజమే. ఆ కారణంగా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమూ సహజమే.
ఆయనకు ఈ అంశం మీద భారత ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేక పోవచ్చు. కానీ తన అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా చైనా దేశానికి చెందిన అణు జలాంతర్గాములను శ్రీలంకలో ‘పార్కింగ్’ చేసుకోవడానికి అనుమతించినందున, ఆ దేశంతో కటినంగా వ్యవహరించవచ్చును. కానీ ఆవిధంగా చేస్తే శ్రీలంక చైనాకు మరింత చేరువవుతుందనే ఆలోచనతోనే భారత ప్రభుత్వం కొంత ఉదాసీనత చూపక తప్పడంలేదనుకోవలసి ఉంటుంది.
ఏది ఏమయినప్పటికీ, రాజపక్సే రాక వలన ఏర్పడుతున్న అనివార్యమయిన ఈ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఎవరూ తప్పించుకోలేరని అంగీకరించక తప్పదు.