చంద్రబాబు ఆరు నెలల పాలన ఎలా సాగిందంటే...
posted on Dec 10, 2014 @ 8:33PM
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల పాలనలో ఆయన నేతృత్వంలో ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేసిందని చెప్పవచ్చును. అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ సంక్షోభ సమస్యను పరిష్కరించగలిగారు. మున్ముందు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు అవసరమయిన అనేక ఒప్పందాలు చేసుకొన్నారు. హీరో మోటార్స్, కృషబ్ కో వంటి భారీ పరిశ్రమలను, అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టేందుకు ఒప్పించగలిగారు. అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని కార్యకలాపాలు మొదలుపెడితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమయిన మార్పు కనబడుతుంది.
కానీ చంద్రబాబు నాయుడు అధికారం చేప్పట్టగానే మొట్ట మొదటగా ఐటీ సంస్థలే రాష్ట్రానికి పరుగులు పెడుతూ వస్తాయని అందరూ ఊహించినప్పటికీ ఇంతవరకు ఐటీ సంస్థలేవీ పెద్దగా రాష్ట్రానికి తరలిరాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధానాన్ని ఒకసారి సమీక్షించుకోవడం మంచిదేమో? బంగారు బాతులవంటి ఐటీ సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు, కేవలం ముఖ్యమంత్రే కాకుండా రాష్ట్రంలో మంత్రులు, యంపీలు, యం.యల్.ఏలు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు అందరూ కూడా పార్టీలకతీతంగా తమ తమ పరిధిలో కృషి చేస్తే బాగుంటుంది.
ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న రాజధాని నిర్మాణం విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినప్పటికీ, నిరాశ చెందకుండా చాలా చురుకుగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని ప్రజలందరూ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేప్పట్టబోతోందో చర్చించుకొంటున్నారు తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాత్రం కాదు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నందునేనని చెప్పవచ్చును.
చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్ పెంచారు. అదేవిధంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ పంట రుణాల మాఫీ హామీని కూడా అమలు చేస్తున్నారు. తీవ్ర ఆర్ధిక సమస్యల మధ్య అధికారం చేప్పట్టిన చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయం కానీ, రిజర్వు బ్యాంక్ సహాయం గానీ అందకపోయినా, హూద్ హూద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ యధావిధిగా పెంచిన పెన్షన్లను అందజేస్తుండటం, ప్రభుత్వోద్యోగులకు ఈనెలకానెల టంచనుగా జీతాలు చెల్లిస్తుండటం, వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తుండటం గమనిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊహించిన దానికంటే త్వరగానే మెరుగయినట్లు అర్ధమవుతోంది.
రాష్ట్ర విభజనకు ముందు, ఆ తరువాత పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఒకసారి బేరీజు వేసి చూసుకొంటే చాలా స్పష్టమయిన తేడా కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంత సానుకూల మార్పు కనబడటానికి కారణం ప్రభుత్వ సమర్ధత దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్య దక్షతలేనని చెప్పక తప్పదు. అయితే, సమస్యలను అధిగమించేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం కొంత అశ్రద్ధ కనబరుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు గనుక పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా, ప్రభుత్వ సమర్ధత పట్ల పూర్తి నమ్మకంతోనే ఉన్నారు.
ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి ఒక్కరే అన్నట్లు కాకుండా మిగిలిన మంత్రులు అందరూ కూడా తమ సమర్ధతను నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మరింత ప్రజాధారణ దక్కేది. ఒకవేళ పొరుగు రాష్ట్రమయిన తెలంగాణా సహకారం, కేంద్ర సహకారం కూడా దక్కి ఉండి ఉంటే పరిస్థితి మరింకా ఏవిధంగా ఉండేదో?
ఇదివరకు కేంద్రం అధికారంలో ఉన్న యూపీఏ కూటమి రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కూడా ఆ హామీలన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తానంది. కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. రాష్ట్రానికి ఏమి చేసినా చేయకపోయినా కనీసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కొంత సహాయ సహకారాలు అందిస్తే వాటి ద్వారా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడే చక్కబెట్టేయగల సమర్ధుడు.
ఆయన వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలవాలని తపిస్తున్నారు కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి తన సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు నిరూపించి చూపేందుకు ఎంతయినా కష్టపడతారని నమ్మవచ్చును. ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగిలిన మంత్రులు అందరూ కూడా చురుకుగా, గట్టిగా సమిష్టి కృషి చేసినట్లయితే అది వారికి, పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు రాష్ట్రానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది.