IPL Vs కోర్టులు
posted on Apr 23, 2016 @ 11:34AM
భారతదేశంలో క్రికెట్ బంతిని బీసీసీఐ శాసిస్తుందన్న విషయం రహస్యమేమీ కాదు. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ సమాఖ్యగా పేరొందిన బీసీసీఐ ఆటలకు ఎదురులేకుండా పోతోందన్న విమర్శలు తరచూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అలాంటి బీసీసీఐని భారతీయ కోర్టులు బంతిలా ఆడుకోవడమే ఇప్పటి వార్త. ఈ విషయాన్ని బీసీసీఐ జీర్ణించుకోలేకపోవడం సహజమే!
ఐపీఎల్ చరిత్ర మొదటి నుంచీ వివాదాస్పదంగానే సాగింది. ప్రపంచవ్యాప్తంగా టి-20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థ 2007లో ICL అనే టోర్నమెంటుని ఆరంభించింది. దేశంలో జరిగే ముఖ్యమైన క్రికెట్ ఘట్టాలన్నీ తన కనుసన్నలలో జరగాలని ఆశించే బీసీసీఐ, ICL మీద నానారకాల నిబంధనలూ విధించి అది మూతపడేలా చేసింది. ఆ తరువాత తానే 2008లో IPL పేరిట ఒక టి-20 టోర్నమెంటుని ప్రారంభించింది. అసలు ఐపీఎల్ కోసం ఆటగాళ్లను వేలం వేసే విధానమే తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. దానికి తోడు ఐపీఎల్ ఆటగాళ్లను గెలుపుగుర్రాలుగా వాడుకుంటూ, వారితో విపరీతంగా ఆడించడం మొదలుపెట్టింది బీసీసీఐ. దాంతో అసలైన అంతర్జాతీయ ఆటలు ఆడే సమయానికి వారు తీవ్రంగా అలసిపోవడమో, గాయాల పాలవడమో జరిగేది. ఐపీఎల్ ఫార్మాటుకి అలవాటుపడిన ఆటగాళ్లు వన్‌డే, టెస్ట్ మ్యాచ్ తదితర ఫార్మాట్లకు పనికిరాకుండా పోతున్నారన్నది అతి పెద్ద విమర్శ. వీటికి తోడు ఫ్రాంచైజీలకు సంబంధించిన గొడవలు, క్రికెట్ బెట్టింగ్ కుంభకోణాలు ఎలాగూ ఐపీఎల్‌ను వెన్నంటే ఉన్నాయి.
తనకున్న అధికార, ధనబలంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనని ధీమాగా ఉండే బీసీసీఐకి ఈసారి కోర్టులు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ లక్షలాది లీటర్ల నీటిని వృథా చేస్తోందంటూ బొంబాయి హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుని విచారిస్తూ బొంబాయి హైకోర్టు, బీసీసీఐని దులిపి పారేసింది. ఓ పక్క మహారాష్ట్ర కనీవినీ ఎరుగని కరువుతో అల్లాడిపోతుంటే మీరు మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైకోర్టు బీసీసీఐ మీద తీవ్రమైన విమర్శలు చేసింది. ఇలా నీటిని వృథా చేయడం తీవ్రమైన నేరమనీ, బీసీసీఐకి నీటి సరఫరాని నిలిపివేస్తే కానీ నీటి విలువ వారికి తెలిసిరాదంటూ దుయ్యబట్టింది. ‘మీకు ప్రజల కంటే క్రికెట్ మ్యాచ్‌లే ఎక్కువైపోయాయా’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురకలంటించింది. మే 1 తరువాత మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చింది.
బొంబాయి హైకోర్టు దుయ్యపట్టి వదిలిపెట్టినా, బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందా అంటే అదీ లేదు! కరువు విషయంలో మహారాష్ట్రకంటే దారుణమైన స్థితిలో ఉన్న రాజస్థాన్‌కు సదరు మ్యాచ్‌లను తరలించింది. దీంతో ఒళ్లుమండిన రాజస్థాన్ వాసులు కూడా నీటి వృథాకు సంబంధించి హైకోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసుని స్వీకరిస్తూ రాజస్థాన్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే అక్కడ కూడా బీసీసీఐ పప్పులు ఉడికేట్లు కనిపించడం లేదు. తమకు ఎదురులేదని బోరవిరుచుకు తిరిగే బీసీసీఐకి, కోర్టు తీర్పులు సయించడం లేదు. అందుకే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. ప్రజాహితవ్యాజ్యాలకు బీసీసీఐ లక్ష్యంగా మారిపోయిందనీ, వీటివల్ల బోర్డుకి అపారమైన నష్టం చేకూరుతోందని అన్నారు. మ్యాచ్‌లను మాటిమాటికీ తరలించడం వల్ల ఆటగాల్ల దగ్గర నుంచి, ప్రసార సాధనాల వరకు అన్నింటినీ రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆగ్రహించారు. అందుకే ఇక నుంచి విదేశాలలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని పెర్కొన్నారు. పనిలో పనిగా అనురాగ్ ఠాకూర్ ఈ నష్టాలు మాజీ ఆటగాళ్లకు అందించే పెన్షన్ల మీద ప్రభావం చూపుతాయని కూడా అన్నారు.
అనురాగ్ ఠాకూర్ మాటలలో ఆవేదన కంటే బెదిరింపే ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా బీసీసీఐ ప్రవర్తన ఇలాగే ఉంటుంది! నిజంగా బీసీసీఐ కోపంలో న్యాయం ఉందా? మహారాష్ట్రలో కరువుకి అనేక కారణాలు ఉన్నాయి. విచక్షణా రహితంగా చెరకుని పండించడం, ఎడాపెడా బోర్లను తవ్వేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయకపోవడం... వంటి మానవ తప్పిదాలకు తోడు మూడేళ్లుగా విఫలమవుతున్నా వర్షపాతం కూడా అక్కడి కరువుకి కారణం అయ్యింది. అయితే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 80 లక్షల లీటర్ల నీటిని ఉపయోగించి బీసీసీఐ, మ్యాచ్‌లను ఎందుకు నిర్వహిస్తోంది అన్నదే అసలు ప్రశ్న. పోనీ అక్కడి నుంచి మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడన్నా, కొత్త వేదికలలో నీటి లభ్యత గురించి ఆలోచించిందా అంటే అదీ లేదు! పోయి పోయి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మ్యాచ్‌ను నిర్వహిస్తానంటే అక్కడి ప్రజలకు ఒళ్లు మండదా!
ఇంతా చేసి ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌ను సాగదీసి, వాటి గురించి అతిగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఐపీఎల్ అంటే విరక్తి పుట్టిందన్న వాదనలు వినవస్తున్నాయి. వీటికి తోడు ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు మండిపోవడంతో స్టేడియంలు వెలవెలబోతున్న దృశ్యాల టీవీల్లో కనిపిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా బీసీసీఐ తన ధోరణిని మార్చుకుంటుందని ఆశించలేం. తన తప్పుని సరిదిద్దుకుంటుందని ఊహించలేం! ఎందుకంటే బీసీసీఐ ఏ పని చేసినా దాని వెనుక నూటికి నూరు శాతం ఆర్థిక కోణం ఉంటుందనే అపవాదు ఉండనే ఉంది కదా!
మండు వేసవిలో మ్యాచ్‌లను నిర్వహించినా, ఆ మ్యాచ్‌లకు ముంబైను వేదికగా చేసినా... ఇలా ఏ పని చేసినా దాని వెనుక ప్రజాకర్షణ, ప్రసార హక్కులే బీసీసీఐ నిర్ణయాలను నియంత్రిస్తాయి. వేసవిలో ఆడటం వల్ల ఆటగాళ్లు నీరసించిపోతారని హెచ్చరించినా, సదరు రాష్ట్రాల్లో కరువు తాండవిస్తోందని తెలిసినా బీసీసీఐ పెద్దగా పట్టించుకోదు. కావాలంటే డబ్బు పడేస్తాం అని కూడా అంటుంది. కానీ ఈసారి డబ్బుతోనో అధికారంతోనో పని జరిగేట్లు కనిపించడం లేదు. మహారాష్ట్ర కరువు నిధికి 5 కోట్లు అందిస్తామంటూ బీసీసీఐ చేసిన సూచనను బొంబాయి హైకోర్టు అంతగా పట్టించుకోలేదు. బొంబాయి హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఇప్పుడు బీసీసీఐ సుప్రీం కోర్టు తలుపులు తడుతోంది. మరి అక్కడి నుంచి ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి!