న్యాయదేవత కంట కన్నీరు
posted on Apr 25, 2016 @ 1:08PM
ఆయన సాక్షాత్తూ దేశ న్యాయవ్యవస్థను నడిపించే నాయకుడు..దేశ ప్రథమ న్యాయాధికారి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వ్యక్తి కంటతడి పెట్టాడు. మంచుపర్వతంలా మీద పడుతున్న కేసుల భారాన్ని మోయలేక, అన్నింటికి న్యాయవ్యవస్థదే తప్పు అంటుంటే తట్టుకోలేక దేశప్రధాని సహా అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో తన సహచర న్యాయమూర్తుల సమక్షంలో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కంటతడిపెట్టారు.
ఢిల్లీలో పెండింగ్ కేసులు సత్వర పరిష్కారంపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సీజేఐ ప్రసంగించారు..భారత న్యాయవ్యవస్థపై పడుతున్న పెనుభారం, జడ్జిల నియామకాల్లో జాప్యం, కనీస మౌళిక వసతులు తదితర అంశాలపై మాట్లాడుతుండగా ఆయన గొంతు మూగబోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుంటూ..గొంతు పెగలక కొద్దిసేపు సీజే మౌనం వహించారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థతో పోల్చినా భారత న్యాయమూర్తుల పనితీరు గర్వపడేలా ఉంటుందని అయినా న్యాయవ్యవస్థపైనే విమర్శలు వస్తుంటాయంటూ ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేక ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకున్నారు.
మున్సిఫ్ కోర్టు జడ్జీ నుంచి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏటా సగటున 2,600 కేసులను పరిష్కరిస్తున్నారు. అదే అమెరికాలో జడ్జీలు ఏటా సగటున పరిష్కరిస్తున్నది 81 కేసులే. మేమూ మనుషులమే మా సామర్థ్యానికి పరిమితి ఉంది. దేశంలోని 24 హైకోర్టుల్లో 1044 మంది జడ్జీలు ఉండాలి కానీ 600 మంది మాత్రమే ఉన్నారు అంటే 43 శాతం పోస్టులు ఖాళీ. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, కర్ణాటక, బొంబాయి, గౌహతి, పాట్నా, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు లేరు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే కొనసాగుతున్నారు. 1987లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 10 మందిగా ఉన్న జడ్జీల సంఖ్యను 50కి పెంచాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. 2002లో సుప్రీంకోర్టు, అనంతరం ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కాని నాటి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నేటికీ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలే ఉన్నారని సీజే వాపోయారు.
జడ్జీల నియామకాలకు సంబంధించి కొలిజీయం వ్యవస్థపై సుప్రీంకోర్టు, హైకోర్టుల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ 13 నుంచి అక్టోబర్ 16 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి 38.68 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కిందిస్థాయి కోర్టుల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా వీటికి అదనంగా ఐదు కోట్ల కేసులు కొత్తగా దాఖలవుతున్నాయి. దేశంలో జైళ్లు నిండిపోతున్నాయి ప్రస్తుతం ఖైదీలతో జైళ్లు పొంగిపోర్లుతున్నాయి. జైళ్లలో ఉన్న వారిలో మూడింట రెండొంతులు విచారణ ఖైదీలే వారికి ఎంత శిక్ష పడుతుందో అంతకంటే ఎక్కువగా విచారణ ఖైదీగానే శిక్ష అనుభవించడం న్యాయవ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం. దేశంలో ఇప్పటికీ 30 శాతం మంది పేదలు న్యాయస్థానాలను ఆశ్రయించటం ఒక కలగానే ఉంది కాబట్టి న్యాయమూర్తుల నియామకాలు పెంచాలి. అవసరమైతే రిటైర్డు న్యాయమూర్తులతో ఉదయం రాత్రిపూట న్యాయస్థానాలు తెరవాలి.
ఎఫ్‌డీఐ, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు..దాంతో పాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా అవసరం అంటూ గద్గద స్వరంతో ప్రధానిని ఉద్దేశిస్తూ సీజేఐ అన్నారు. దాంతో పాటు ప్రధాని మోడీ చర్యలను కూడా సున్నితంగా విమర్శించారు. వాణిజ్య కోర్టుల ఏర్పాటు కొత్త సీసాలో పాత సారాలా ఉందన్నారు. వాణిజ్య కోర్టులకు ప్రత్యేక భవనాలు నిర్మించకుండా, న్యాయమూర్తులను నియమించకుండా ఇప్పుడు ఉన్న కోర్టులకే బోర్డులు మార్చి ఉన్న జడ్జీలనే అటు మళ్లించారని చురకలంటించారు. కార్పోరేట్ వ్యక్తి కూడా జేబు దొంగతో భుజం భుజం రాసుకుని కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని ఉద్దేశ్యం ఇది కాదని కార్పోరేట్లకు తగిన స్థాయి మౌలిక వసతులు, వాతావరణం కోర్టుల్లో ఉండాలన్నారు లేకుంటే భారత ఆర్థిక ప్రగతి కూడా కుంటుపడుతుందన్నారు. ప్రధాని మోడీ న్యాయవాది కాదని ఆయనకు న్యాయవ్యవస్థ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు.
సీజేఐ ఠాకూర్ అవేదనపై ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం స్పందించారు. 1987 నుంచి ఎంతోకాలం గడచిపోయినందున ఈ విషయంలో సీజేఐ బాధను అర్థం చేసుకోగలను. రాజ్యాంగపరమైన అడ్డంకులు తలెత్తకుంటే మంత్రులు, సీనియర్ జడ్జీలు అంతర్గతంగా సమావేశమై ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు అంటూ ప్రధాని ప్రతిపాదించారు. మరి ప్రధాన న్యాయమూర్తి కన్నీరైనా న్యాయవ్యవస్థను ప్రక్షాళన దిశగా నడిపిస్తుందేమో వేచి చూడాలి.