ఉత్తరాఖండ్ తీర్పు కేంద్రానికి ఓ హెచ్చరిక!
posted on Apr 22, 2016 @ 10:29AM
ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేస్తూ విధించిన రాష్ట్రపతి పాలన మీద, అక్కడి హైకోర్టు సుస్పష్టంగా తన తీర్పుని అందించింది. ఈ కేసుని స్వీకరించిన ఉత్తరాఖండ్ హైకోర్టు ఆది నుంచీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేస్తూనే రావడంతో, కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగే తీర్పు ఏదో వెలువడనుందని మొదటి నుంచీ కూడా సందేహాలు కలుగుతూ వచ్చాయి. అదే నిజమైంది!
పూర్వాపరాలు: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది సభ్యుల బలం ఉండగా, బీజేపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ బలగంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ కొన్నాళ్లుగా అసంతృప్తితో రగులుతూ వచ్చారు. రోజులు గడిచే కొద్దీ తనకు తోడుగా మరో ఎనిమిది మందిని కలుపుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు బహుగుణ. మార్చి 18 నాటికి ఈ తిరుగుబాటు తారస్థాయికి చేరుకుని, వీరంతా బీజేపీలోకి చేరేదాకా వచ్చింది. దాంతో ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందంటూ కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించింది. అయితే ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మర్నాడు బలనిరూపణ జరగాల్సి ఉండగా ఆదరాబాదరాగా మార్చి 27నే అక్కడ రాష్ట్రపతి పాలనను విధించడం దేశం యావత్తునీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయమై హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టుని ఆశ్రయించారు.
హరీశ్ రావత్ పిటీషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆది నుంచీ కూడా కేంద్రానికి మొట్టికాయలు వేస్తూనే వచ్చింది. మరొక్క రోజులో బలనిరూపణ జరగాల్సి ఉండగా ఇంత ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించారంటూ మొదట్లోనే దుయ్యబట్టింది. హైకోర్టు ముందు కేంద్రానికి చెందిన మహామహా న్యాయవాదుల వాదనలు సైతం చిన్నబోయాయి. రాష్ట్రపతి అంగీకారంతోనే ఈ నిర్ణయం జరిగిందన్న వాదననూ కోర్టు సమర్థించలేదు. రాష్ట్రపతి కూడా ఒకోసారి తీవ్రమైన తప్పిదం చేసే అవకాశం ఉందంటూ, దేశ ప్రథమ పౌరుడికి కూడా చురకలద్దింది. ఒకదాని తరువాత ఒకటిగా న్యాయస్థానం సంధిస్తున్న ప్రశ్నలకు ఒక దశలో న్యాయవాదులు బిత్తరపోయారు. స్పీకరు ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారన్నది కేంద్రం చేసిన అభియోగాలలో ఒకటి! కానీ హరీశ్ రావత్ తరఫున న్యాయవాది ఆయన నిష్పక్షపాతంగానే వ్యవహరించారంటూ తగిన కారణాలు చూపడంతో, కేంద్ర న్యాయవాదులు ఒకదశలో క్షమాపణ చెప్పవలసి వచ్చింది.
హైకోర్టు చిట్టచివరకు ఘాటైన పదజాలంతో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ తిర్పునిచ్చింది. ముందు రాష్ట్రపతి పాలనను విధించి, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం, ఆ తరువాత మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడం ఏంటని న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఇలాంటి ప్రభుత్వాలను కూల్చివేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమంటూ విరుచుకుపడ్డారు. ఇదే కనుక జరిగితే సగటు ఓటరు ప్రజాస్వామ్యం పట్ల తన నమ్మకాన్ని కోల్పోతాడంటూ హెచ్చరించారు. ఈ నెల 29న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని అక్కడి ముఖ్యమంత్రికి కల్పించింది న్యాయస్థానం. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలని కూడా న్యాయస్థానం వదిలిపెట్టలేదు. వారు చేసిన పనికి శిక్షను అనుభవించాల్సిందే అంటూ హెచ్చరించింది. వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హులా కాదా ఈ నెల 28న నిర్ణయిస్తామని తేల్చి చెప్పింది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలలో కేంద్రం వేలు పెట్టకుండా ఉండాల్సిందంటూ కోర్టు పదేపదే అభిప్రాయపడింది.
హైకోర్టు నిర్ణయం మీద సహజంగానే అక్కడి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేయగా, కేంద్ర సుప్రీం కోర్టు తలుపులను తట్టేందుకు సిద్ధపడింది. బహుశా అక్కడ కూడా కేంద్రానికి చుక్కెదురు కావచ్చు. ఇదే కనుక జరిగితే రాష్ట్రపతి పాలనను తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోవచ్చుననే దురుద్దేశాలను న్యాయవ్యవస్థ అడ్డుకున్నట్లే. ఇప్పటికే 1994లో వెలువడిన ఎస్.ఆర్.బొమ్మై తీర్పులో రాష్ట్రపతి పాలను సంబంధించి సుప్రీం కోర్టు పలు కీలకమైన సూచనలు వెలువరించింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనీ, కేంద్రం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినాలనీ... ఇలా కొన్ని జాగ్రత్తలను అందించింది. కానీ ఉత్తరాఖండ్‌లో తగిన బలం ఉన్న బీజేపీ తన పార్టీని గద్దెనెక్కించేందుకు కేంద్రం ఇవన్నీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి యుక్తిని ప్రయోగించి అరుణాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపగలిగింది కేంద్రం. అందుకు భారీగా అపవాదుని మూటగట్టుకుంది కూడా!
అరుణాచల్ సంక్షోభం అలా ముగిసిందో లేదో ఇప్పుడు ఉత్తరాఖండ్ మీద 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన) ప్రయోగించింది. ఇక్కడ కాంగ్రెస్‌ను గద్దె దింపాక, మణిపూర్‌లో కూడా మరో సంక్షోభాన్ని సృష్టించేందుకు కొందరు పెద్దలు సిద్ధంగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీ, రాష్ట్రపతి పాలనను ఇలా తనకు అనుకూలంగా మార్చుకోవడం కొత్తేమీ కాదు. అందుకే ఉత్తరాఖండ్ సంక్షోభం మీద హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ చరిత్ర కూడా ఏమంత ఘనంగా లేదంటూ వ్యాఖ్యానించింది. స్వాతంత్రానంతరం 40 ఏళ్లలో దాదాపు 100 సార్లు రాష్ట్రపతి పాలనను విధించిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ దెప్పిపొడిచింది. కానీ కాంగ్రెస్ విధానాలకు, తత్వానికి విరుద్ధంగా గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం కూడా అదే పోకడ పోవడమే ఇప్పుడు దేశప్రజలను బాధిస్తున్న విషయం. అణచివేతలోనూ, అధికార దుర్వినియోగంలోనూ... కాంగ్రెస్, బీజేపీలకు పెద్దగా తేడా లేదని తేలితే కనుక ఇక ఓటర్లు న్యాయం కోసం ఎటు చూడాలి!
అదృష్టం ఏమిటంటే ఇప్పుడు కోర్టులు తమ తీర్పుల విషయంలో చాలా నిక్కచ్చిగా, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రపతిని సైతం తప్పుపడతామంటూ, ప్రజాస్వామ్యానికి దన్నుగా నిలుస్తున్నాయి. కాబట్టి పార్టీలు విఫలమైనా న్యాయవ్యవస్థ ఇంకా విఫలం కాలేదన్న సంతోషం మాత్రం సగటు జీవికి కలుగక తప్పదు. మరో వైపు ఈ తీర్పు తరువాతైనా కేంద్రం మరింత జాగరూకతతో వ్యవహరిస్తుందని ఆశించవచ్చు. ఇప్పటికే అసహనం, జాతీయవాదం, ఆర్థిక నేరాలు వంటి సమస్యలతో అట్టుకుతున్న దేశంలో... ప్రభుత్వం వేసే ప్రతి అడుగునీ ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారన్న విషయాన్ని బీజేపీ గ్రహించి తీరవలసి ఉంది. లేకపోతే రాక రాక వచ్చిన అధికారాన్ని చేజేతులా చేజార్చుకోవడం మాట అటుంచి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్న అపప్రధతో మోదీ తన పాలనను ముగించాల్సి వస్తుంది.