వీసా కోసం... చైనా ముందు ఓడిన భారత్
posted on Apr 26, 2016 @ 10:43AM
మౌలానా మసూద్ అజార్! ఈ మనిషి గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశం మీద నరనరానా విషాన్ని నింపుకుని దాన్ని వెళ్లగక్కేందుకు కాచుకు కూర్చున్న తీవ్రవాది. అతనికి సకల సౌకర్యాలూ కల్పించే పాకిస్తాన్ వ్యూహం గురించి వేరే తిట్టుకోవాల్సిన పని లేదు. కానీ అలాంటి తీవ్రవాదిని చైనా కూడా వెనకేసుకు రావడం... అదీ ఐక్యరాజ్య సమితిలాంటి చోట అతణ్ని సమర్థించేందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగించడం, మనకి శరాఘాతం. ఈ దెబ్బతో చైనా మంత్ర, తంత్రాల వెనుక ఉన్న దురుద్దేశాలు మనకి స్పష్టంగా తెలిసిపోయాయి. ఇలాంటి సమయంలో చైనాను దెబ్బకి దెబ్బ తీసేందుకు మన దేశానికి ఒక మంచి రాజకీయ అస్త్రం దొరికింది. దాని పేరే డోల్కన్ ఈసా! కానీ చైనా ఒత్తిడి మేరకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకుని నవ్వులపాలైపోయింది.
డోల్కన్ ఈసా! విగర్ అనే ఓ జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు. డోల్కన్ గురించి చెప్పుకునే ముందు విగర్ జాతి గురించి చెప్పుకోవాలి. టర్కీ ప్రాంతానికి చెందిన ఈ ముస్లింలు ఒకప్పుడు చైనాకి వాయువ్య దిశలో ‘ఈస్ట్ తుర్కిస్తాన్’ పేరుతో హాయిగా ఉండేవారు. వారికి తమదైన భాష, సంస్కృతి, జీవనశైలి ఉండేవి. అలాంటి ఈస్ట్ తుర్కిస్తాన్ మీద 1876లో చైనాని పాలకులు దాడి చేశారు. ఎనిమిదేళ్లపాటు రక్తాన్ని ఏరులై పారించిన ఈ పోరాటం తరువాత చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతానికి ‘షిన్‌జాంగ్’ అన్న పేరుని పెట్టింది చైనా. షిన్‌జాంగ్ అంటే కొత్త ప్రాంతం అని అర్థం. ఈ కొత్త ప్రాంతాన్ని నిదానంగా తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది చైనా. ఇక 1912లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం జరిగిన తరువాత, విగర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.
షిన్‌జాంగ్‌లో విగర్ల సంఖ్య ఇప్పటికీ చాలా గణనీయంగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే వీరి సంఖ్య కోటికి పైగా ఉంటుంది. ఇక అనధికారికంగా వీళ్ల జనాభా అక్కడ కోటిన్నరకు పైగానే ఉంటుందని అంచనా. ఇక్కడ నివసించే విగర్లు తమ సంస్కృతిని కాపాడుకునే అవకాశం ఇవ్వాలనీ, స్థానిక పాలనలో తమకి తగిని ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ విగర్ల కోరిక వినిపించిన ప్రతిసారీ చైనా చాలా తీవ్రంగా విరుచుకుపడుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే అక్కడ విగర్ల పరిస్థితి చాలా దయనీయం. ఒకప్పుడు తమ రాజ్యం అనుకున్న చోటే వాళ్లు అధికారిక బానిసలుగా బతుకుతున్నారు. షిన్‌జాంగ్ ప్రాంతంలో ఏవైనా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టాలంటే వాటికి విగర్లు ఉచితంగా శ్రమదానం చేయాల్సి ఉంటుంది. స్థానిక విద్యాలయలలో నుంచి వారి మాతృభాషను ఎప్పుడోనే నిషేధించి పారేశారు. ఇస్లాం సంప్రదాయాన్ని అనుసరించే విగర్లు దేముడికి కూడా తమ గోడు చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వారి మసీదులని సైతం మూయించి పారేసింది. ఇదేమని అడిగిన వాడు మర్నాటికి కనిపించడు. అదృష్టం బాగుంటే జైళ్లలో తేల్తారు. అదీ లేదంటే ఉరికంబాన్ని ఎక్కేస్తారు. ఒకోసారి ఎప్పటికీ కనిపించకుండా పోతారు! ఒకవైపు విగర్లను అణగతొక్కుతూనే మరోవైపు నిదానంగా స్థానిక జనాభాలో వారి ప్రాబల్యం తగ్గేలా చర్యలు తీసుకుంది చైనా. అందుకే ఒకప్పుడు పదిశాతంలోపు ఉన్న హాన్ వర్గం సంఖ్య ఇప్పుడు 40 శాతానికి పైగా పెరిగిపోయింది. ఇలా విగర్ల బలాన్ని, బలగాన్ని, సంస్కృతిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వచ్చింది చైనా!
ఇప్పుడు డోల్కన్ ఈసా విషయానికి వద్దాము. షిన్‌జాంగ్‌లోనే పుట్టి పెరిగిన డోల్కన్ 90వ దశకంలో తన వర్గం తరఫున గట్టిగా గొంతుకను వినిపించడం మొదలుపెట్టాడు. విగర్లందరినీ ఏకం చేసి వారి నిరసనల సెగను ప్రభుత్వానికి తగిలేలా కృష్టి చేశాడు. అందువల్ల సహజంగానే అతను చైనా ప్రభుత్వ కోపానికి గురైయ్యాడు. ప్రభుత్వాధికారులు డోల్కన్ వెంటపడటంతో, అతను యూరప్‌కు పారిపోయాడు. యూరప్‌లో శరణార్థిగా తిరుగుతున్న డోల్కన్‌కి జర్మనీ దేశం 2006లో పౌరసత్వాన్ని అందించింది. ప్రస్తుతం డోల్కన్ జర్మనీ నుంచే విగర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. ‘వరల్డ్ విగర్ కాంగ్రెస్’కు కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. డోల్కన్‌వంటి వారే లేకపోతే అసలు విగర్లు అనే జాతివారు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచం మర్చిపోయే అవకాశం ఉంది. చైనా కర్కశ రక్కసి నిబంధనల కింద వారి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతానికి డోల్కన్ ఈసా గురించీ, విగర్ల గురించీ చెప్పుకోవాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. డోల్కన్ తమ దేశం నుంచి పారిపోయిన తరువాత చైనా అతని మీద తీవ్రవాదిగా ముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్‌కార్నర్ నోటీసుని జారీ చేసింది. కానీ ఆ నోటీసుని తోసిరాజని ఇండియా డోల్కన్‌కు గతవారం వీసాను మంజూరు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డోల్కన్ ఈ వీసాను ఉపయోగించుకోనున్నాడు. ఈ చర్య సమజంగానే చైనా ఆగ్రహానికి కారణమైంది. కానీ మసూద్ అజార్‌ను చైనా వెనకేసుకు వచ్చినందుకు, ఇండియా మంచి గుణపాఠం చెప్పిందంటూ భారతీయులు సంతోషించారు. నెత్తిన మొట్టికాయ వేసినా కూడా అతి సాత్వికంగా స్పందించే ఇండియా, కాలాన్ని బట్టి లౌక్యాన్ని నేర్చుకుంటోందని మురిసిపోయారు. కానీ ఇంతలో మన దేశం తీసుకున్న ఓ నిర్ణయం పౌరులని నిశ్చేష్టుల్ని చేసింది. డోల్కన్ వీసాను వారం తిరక్కుండానే రద్దు చేసి పారేసింది ప్రభుత్వం. ఇండియా ఇలా ప్రవర్తిస్తుందని తాను ఊహించనే లేదంటూ డోల్కన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇటు తమకు భయపడి ఇండియా వీసాను రద్దు చేసిందనుకుంటూ చైనా నవ్వుకుంది. దేశ ప్రజల దృష్టిలో కూడా మన విదేశాంగ శాఖ వెన్ను లేనిదిగా మిగిలిపోయింది.
మసూద్ అజార్‌ను మీరెందుకు వెనకేసుకు వచ్చారని అడిగితే, చైనా నుంచి ఒక్క జవాబుని కూడా రాబట్టలేని మన ప్రభుత్వం.... చైనా ఆగ్రహానికి భయపడి ఇలాంటి చర్య తీసుకోవడం దురదృష్టకరం. ఇంతగా వణికిపోయే విదేశాంగం మొదట్లోనే ఆచితూచి స్పందిస్తే సరిపోయేది. కానీ తన చర్యను తనే వెనక్కి తీసుకుని ఇప్పుడు అందరి ముందూ నవ్వులపాలైపోయింది. అయినా ఇలాంటి తప్పటడుగులు మనకేమీ కొత్త కాదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ ఇలాంటి పొరపాట్లు చాలానే చేస్తూ వచ్చాము. అందుకు ప్రతిఫలంగా చావుదెబ్బలు తింటూనే వచ్చాము. కశ్మీర్ మీద మనం వేసిన కుప్పిగంతుల కారణంగానే ఇప్పటికీ అక్కడ కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. కాకపోతే గత ప్రభుత్వాలకంటే భిన్నంగా ప్రవర్తిస్తామంటూ బోర విరుచునే ప్రస్తుత నేతలు ఇలాంటి చేతలకు పాల్పడటం చాలా చిత్రంగా ఉంది. ఏది ఏమైనా ఈ దౌత్య యుద్ధంలో చైనానే గెలిచింది! భారత్ బిక్కమొగం వేసుకుని ఉండిపోయింది.