రాజ్యసభలో కనిపించని పెద్దలు
posted on Apr 27, 2016 @ 10:59AM
పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల అభిమతాలను, దేశంలోని మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం రాజ్యసభ వల్లే దక్కుతుంది. బహుశా అందుకేనేమో ఈ సభకు పెద్దల సభ అన్న పేరు కూడా వచ్చింది. కానీ ఈ పెద్దల సభను కొన్ని పార్టీలు, ఆ పార్టీల ద్వారా ఎన్నుకోబడిన కొందరు నేతలు దుర్వినియోగం చేసే తీరు చూస్తే బాధ కలుగక మానదు. వారి ప్రవర్తన కేవలం రాజ్యసభకే కాదు, ప్రజాస్వామ్యానికే అవమానంగా తోస్తుంది.
అధికారాల విషయంలో రాజ్యసభ లోక్‌సభకు ఏమాత్రం తీసిపోదు. ద్రవ్య బిల్లు మీద తప్ప మిగతా బిల్లుల మీద రాజ్యసభ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియచేసి, వాటిని తిరస్కరించవచ్చు. కీలక సమస్యల మీద చర్చలు జరపి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయవచ్చు. ఇక సదుపాయాల విషయంలోనూ రాజ్యసభ సభ్యులకు ఏమాత్రం లోటు లేదు. ఒకో రాజ్యసభ సభ్యుని మీదా ప్రభుత్వం నెలకు 2.7 లక్షలకు పైగానే ఖర్చు చేస్తుందని ఓ అంచనా! దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిన్న రాజ్యసభలో రేగిన ఓ వివాదం సభ మీద ఉన్నా ఆరోపణలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ నిన్న ఏం జరిగిందంటే...
రాజ్యసభ ఉపసభాపతి పీ.జే.కురియన్ మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఒక ఉత్తరాన్ని చదివి వినిపించారు. తనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా సభ ప్రస్తుత సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. కానీ మిథున్ ప్రతి సమావేశానికీ ఇలాంటి ఉత్తరాన్ని ఒకదాన్ని పంపి చేతులు దులిపేసుకోవడమే ఆశ్చర్యం. నిజానికి మిథున్ చక్రవర్తి శుభ్రంగానే ఉన్నారని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అటు బెంగాలీ టీవీ కార్యక్రమాలలోనూ, ఇటు బాలీవుడ్ సినిమా షూటింగులలోనూ మిథున్ నిరభ్యంతరంగా పాల్గొంటున్నారు. కానీ పాపం రాజ్యసభకు రావాలంటే ఆయనకు అనారోగ్యం వస్తోంది. గత రెండు సంవత్సరాలలో మిథున్ కేవలం మూడంటే మూడు రోజులు రాజ్యసభకు వచ్చారంటే, సభ పట్ల ఆయన నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
మిథున్ తీరుకు సహజంగానే తోటి సభ్యులకు ఒళ్లుమండిపోయింది. ఏళ్లతరబడి ఎన్నో త్యాగాలు చేసి, ప్రజల కోసం పోరాడి, లాఠీ దెబ్బలు సైతం చవిచూసి... కొందరు ఈ స్థాయికి వస్తారనీ, అలాంటి పదవిని ఇలా కించపరచడం సబబు కాదని జనతాదళ్‌కు చెందిన త్యాగీ విరుచుకుపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలు తమ తరఫున ఎవరినన్నా రాజ్యసభకు పంపేటప్పుడు, వాళ్లు ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటూ చురకలంటించారు. అనారోగ్య కారణాలతో మాటిమాటికీ సభకు గైర్హాజరు కావడం, తన సదుపాయాలను దుర్వినియోగం చేయడమే అంటూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అగర్వాల్ కూడా మండిపడ్డారు. మిథున్‌ని రాజ్యసభకు ఎన్నుకొన్న తృణమూల్ కూడా అతణ్ని గట్టిగా సమర్థించలేకపోయింది.
నిజానికి ఈ సమస్య కేవలం మిథున్ చక్రవర్తిది మాత్రమే కాదు. ఇలాంటి చక్రవర్తులెందరో రాజ్యాంగం అందించిన సుఖాలను అనుభవిస్తేనే, తమ మీద ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్న సాధారణ ప్రజలను వెక్కిరిస్తున్నారు. అందుకు తొలుత బాధ్యత వహించాల్సింది సదరు రాజకీయ పార్టీలు. ఒక నేతను రాజ్యసభకు పంపితే అతను ప్రజల పక్షాన గొంతు వినిపించగలుగుతాడా లేదా అన్న విషయాన్ని చాలా పార్టీలు గమనిస్తున్నట్లే కనిపించదు. పైగా అలాంటి ఆరోపణలు వచ్చినా కూడా చూసీచూడనట్లు మళ్లీ అదే మనిషిని రాజ్యసభకు పంపిన సందర్భాలు కోకొల్లలు. అసంతృప్తితో రగిలేవారు, పారిశ్రామికవేత్తలు, వృద్ధతరం నేతలు, పలుకుబడి ఉన్నావారు, ఎన్నికలలో గెలుపొందలేనివారు... ఇలా రాజ్యసభకు ఎన్నుకునేందుకు రకరకాల వ్యక్తులను వివిధ పార్టీలు పరిశీలిస్తుంటాయి.
ఇక రాష్ట్రపతి నేరుగా నామినేట్ చేసే సభ్యులది కూడా ఇదే పరిస్థితి. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన 12 మందిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపుతారు. ఈ 12 మంది విషయంలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. కేవలం ప్రతిభావంతుడనే కాకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికే అవి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి. అదీ కాకుంటే ఏదో ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. సభలో కూడా వారు తమకు అనుకూలంగా ప్రవర్తించాలని ఆశిస్తూ ఉంటాయి. అంతేకానీ వాళ్లు ప్రజల గొంతుకను బలంగా వినిపించగలరా, చర్చల్లో నిష్పక్షమైన వాదనను వినిపించగలరా అని ఆలోచించవు. అందుకనే అలా నామినేట్ అయిన సభ్యులు కూడా తరచూ విమర్శల పాలవుతూ ఉంటారు. రేఖ, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ వంటి వ్యక్తులు సమాజానికి వన్నె తెచ్చారేమో కానీ... రాజ్యసభ పరువు మాత్రం తీశారన్నది కొందరి వాదన.
సభకు హాజరు కాకపోవడం; హాజరైనా ప్రశ్నలు వేయడం కానీ, చర్చల్లో నోరు మెదపడం కానీ చేయకపోవడం నిజంగా ఆ పదవికే అవమానకరం. అంత మాత్రాన రాజ్యసభ సభ్యులందరూ ఇలాగే ఉన్నారని ఆవేదన చెందనక్కర్లేదు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరి వంటి ఉద్దండులెందరో ఇప్పటికీ రాజ్యసభకు వన్నె తెస్తూనే ఉన్నారు. అదే సమయంలో మిథున్ చక్రవర్తి మొదలు విజయ్ మాల్యా వరకు రాజ్యసభ పరువు తీసేందుకు వెనుకాడనివారూ ఉన్నారు. అందుకే మిథున్ చక్రవర్తి మీద నిన్న జరిగిన చర్చ సందర్భంగా... రాజ్యసభకు సభ్యులను ఎన్నుకొనేటప్పుడు, వివిధ పార్టీలు తమకంటూ ఓ ప్రవర్తనా నియమావళిని ఏర్పరుచుకోవాలని సభ్యులు సూచించారు. తాము సభకు ఎన్నుకొనే మనిషి సమర్థుడేనా? అతను సభకు తరచూ హాజరు కాగలడా? హజరై ప్రజల గొంతుని వినిపించగలడా?... వంటి అంశాలను సదరు నియమావళి ద్వారా పరిశీలించాలని ఆశించారు. మరి ఆ సూచన పార్టీల చెవికెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే!