తెలుగు ప్రజలతో ఆడుకొంటున్న రాజకీయ పార్టీలు

  వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలంటూ తన పార్టీ నేతలతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు గంటలసేపు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తన భర్త స్వర్గీయ రాజశేఖరరెడ్డి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్నారని, అయితే ప్రస్తుతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని, తత్ఫితంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆమె అన్నారు.   తెలుగు ప్రజల సమైక్యకృషి కారణంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను ఇప్పుడు విభజన కారణంగా ఎందుకు వదులుకోవాలని ఆమె ప్రశ్నించారు. అందరి కృషి కారణంగా అభివృద్ధి అయిన నగరాన్ని ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు.   విజయమ్మతో సహా నేడు కాంగ్రెస్, తెదేపా నేతలు సైతం అడుగుతున్నఈ ప్రశ్నలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు అడిగి ఉంటే, ఆ పార్టీల నిబద్ధతపై రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలిగి ఉండేది. కానీ, ఆవిధంగా అడిగితే అది తెలంగాణా వ్యతిరేఖతగా ప్రచారమయితే అక్కడ తమ పార్టీలు ఎక్కడ నష్టపోతాయనో భయంతో నాడు అందరూ మౌనం వహించారు తప్ప ఈ సందేహాలన్నీనాడు వారికి లేవని కాదు. నేడు రాష్ట్రం యొక్క, ప్రజల యొక్క దైన్య స్థితి గురించి బాధపడుతూ మొసలి కన్నీరు కారుస్తున్న ఈ రాజకీయ నేతలకు, నిజంగా తమ పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఉంటే ఆనాడే దైర్యంచేసి వివిధ అంశాలపై నేడు లేవనెత్తుతున్న ధర్మసందేహాలను అడిగి ఉంటే నిజంగానే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిఉండేది కాదు. అంతే కాకుండా ఈ అంశాలపై ఈపాటికి ఒక స్పష్టత కూడా వచ్చి ఉండేది.   ఆనాడు తెలంగాణా ఉద్యమాల వల్ల తమ పార్టీలపై ఏర్పడిన తీవ్ర ఒత్తిళ్ళ నుండి తాత్కాలికంగా బయటపడే ఉద్దేశ్యంతో, తాము రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణా ఇవ్వలేదని వారు బలంగా నమ్మినందునే లేఖలు ఇచ్చారు. తెలంగాణాలో తమ పార్టీలు నష్టపోకూడదనే ఆలోచనతోనే నాడు అఖిలపక్షంలో నోరు మూసుకొని కూర్చొని వచ్చారు.   తమ ఈ నిర్వాకాన్నిఅంతా నేర్పుగా కప్పిపుచ్చుకొంటూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మిగిలిన పార్టీల వైపు వేలెత్తి చూపుతూ ఇంకా ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. అందుకే నేడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజల వద్దకు సదరు నేతలు దైర్యంగా వెళ్ళలేకపొతున్నారు. వెళ్ళిన ప్రతీ ఒక్కనేతకీ భంగ పాటు తప్పడం లేదు. ప్రజలు రాజకీయ నాయకుల మాటలను నమ్మడం లేదని ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. అయినప్పటికీ నిరాహార దీక్షలు, ధర్నాలు, యాత్రలు చేయడం ద్వారా ప్రజలను సులువుగా మభ్యపెట్టవచ్చుననే భ్రమలో ఉండటం విశేషం.   ఇప్పటికయినా రాజకీయ నేతలు, పార్టీలు విజ్ఞత ప్రదర్శించి రాష్ట్రం మళ్ళీ గాడినపడేలా చేయగలిగితే ప్రజలే వారికి పట్టం కడతారు. లేకుంటే అందుకు వారు భారీ మూల్యం చెల్లించక తప్పదు.

తెలంగాణా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నరాజకీయ పార్టీలు

  దాదాపు నెల రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అంగీకారం తెలుపుతూ ప్రకటన చేసినప్పటి పరిస్థితులకి, కమిటీల గురించి మాట్లాడుతున్ననేటి పరిస్థితికి మధ్య వచ్చిన వ్యత్యాసాన్నితెలంగాణా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సీమంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, సమ్మెల వల్ల కొంత, సీమాంధ్ర నేతల రాజకీయ ఒత్తిళ్ళవల్ల మరికొంత ఈ మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.   ఇక తెలంగాణాకు అనుకూలమని లేఖ ఇచ్చిన తెదేపా, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తామని హామీ ఇచ్చిన వైకాపాలు ఇప్పుడు సమైక్య పల్లవి అందుకోగా, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతు మద్దతు లేదా అధికారంలోకి వస్తే వంద రోజుల్లోతెలంగాణా అని ఖరాఖండిగా ప్రకటించిన బీజేపీ కూడా తాజాగా ‘సమన్యాయం’ రాగం అందుకొంది. ఈవిధంగా రాజకీయ పార్టీలన్నీఒకటొకటిగా తెలంగాణా ఏర్పాటుకి యధాశక్తిగా అడ్డంకులు సృష్టిస్తుంటే, క్రమంగా తెలంగాణాలో మళ్ళీ క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణాలో మళ్ళీ ధర్నాలు, ర్యాలీలు మొదలయ్యాయి.   సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్నందున వారు అందుకు అనుగుణంగానే పావులు కదుపుతారనేది బహిరంగ రహస్యమే. ఇక, ఆఖరు నిమిషంలో తెలంగాణాను వదులుకొని సీమాంధ్రాకే పరిమితమయ్యేందుకు నిశ్చయించుకొన్న వైకాపా, సీమాంధ్ర ప్రాంతంలో తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తెలంగాణాకు వ్యతిరేఖంగా వ్యవహరించడం కూడా సహజమేనని చెప్పవచ్చును.   ఇక, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు సీమాంధ్ర నేతలని సమర్ధంగా కట్టడి చేయగలిగిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత తన నేతలపై పట్టుకోల్పోవడం వలననో లేక సీమంధ్ర ప్రాంతంలో తెదేపా తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకో మళ్ళీ తన ద్వంద వైఖరి ప్రదర్శిస్తోంది. అయితే, మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి మొగ్గు చూపుతున్నబీజేపీ అకస్మాత్తుగా ‘సమన్యాయ రాగం’ అందుకోవడం మాత్రం చాల విచిత్రంగా అనిపిస్తోంది.   తెలంగాణాలోఎంతో కొంత బలం ఉన్నబీజేపీకి సీమంధ్రలోమాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ కూడా సమన్యాయం కోరుకోవడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని తెలంగాణవాదులు బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంత హటాత్తుగా తెలంగాణా ప్రకటన చేయడంతో కంగుతిన్నకాంగ్రెస్, తెదేపా, వైకాపాలకు చెందిన సీమాంధ్రనేతలు తెలంగాణాను అడ్డుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని వారు నమ్ముతున్నారు.   పార్లమెంటులో కాంగ్రెస్ తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే, దాని ఆమోదం కొరకు బీజేపీ మద్దతుకూడా చాల అవసరం. కనుక బీజేపీ తెలంగాణా ఏర్పాటు కాకుండా బిల్లుకి అడ్డుపడితే, అందుకు ప్రతిగా సీమాంధ్రకు చెందిన ఈ మూడుపార్టీల నేతలు రానున్నఎన్నికల తరువాత బీజేపీ కేంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బేషరతుగా మద్దతు ఇస్తామని బీజేపీతో రహస్య ఒప్పందానికి వచ్చినందునే, బీజేపీ తెలంగాణపై వెనక్కి తగ్గిందని తెలంగాణావాదులు భావిస్తున్నారు.   ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరుతుంది తప్ప బీజేపీకి కాదు. ఎలాగయినా మళ్ళీ అధికారంలోకి వద్దామని తపిస్తున్నబీజేపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయకుండా అడ్డుపడగలిగితే, అప్పుడు కాంగ్రెస్ తెలంగాణాలో పరాభవం తప్పదు. అది బీజేపీకి వరంగామారే అవకాశం ఉంది. గనుక బీజేపీ కూడా తెలంగాణాకు వ్యతిరేఖంగా పావులు కదుపుతున్నట్లు అర్ధం అవుతోంది.   ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా వారు శాశ్వితంగా తెలంగాణా ప్రజల నమ్మకంకోల్పోవడం ఖాయం. అంతిమంగా ఇది తెరాసకు లాభం చేకూర్చడం కూడా అంతే ఖాయం.

ఒక ఐడియా వైకాపా రాజకీయ భవిష్యత్తుని మార్చేస్తుందా

  ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని వచ్చిన ఒక వ్యాపార ప్రకటన వైకాపాకు అక్షరాల వర్తిస్తుందనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టి, సమైక్యాంధ్ర కోసం మొదలుపెట్టిన పోరాటం చాలా సాహసోపేతమయిన నిర్ణయమని చెప్పక తప్పదు. దానివల్ల ఆ పార్టీ ఇక తెలంగాణాలో అడుగుపెట్టే అవకాశం పూర్తిగా కోల్పోయినా, సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం ఊహించిన దానికంటే చాలా మంచి ఫలితాలను రాబట్టగలిగింది. ఆ ఐడియా సీమంధ్రలో వైకాపా రాజకీయ రేటింగ్స్ లో చాలా మార్పు తీసుకువచ్చింది.     రాష్ట్ర విభజన ఖాయమని తెలిసి కూడా వైకాపా తన సమైక్య ఉద్యమాలను తీవ్ర స్థాయిలో కొనసాగిస్తూనే ఉంది. కేవలం సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయ్యేందుకు సిద్దపడిన వైకాపా, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో పార్టీని నిలుపుకోవాలనే తెదేపా, కాంగ్రెస్ పార్టీల బలహీనతపై ఆడుకొంటుంటే, ఆ రెండు పార్టీలు దానిని ఏవిధంగా నిలువరించాలో తెలియక అయోమయంలోపడ్డాయి. దానితో ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒక ప్రజాకర్షక నిర్ణయంతో ముందుకు సాగుతున్న వైకాపా వైపు ఆకర్షితులవుతున్నారు.   వైకాపా మొదలుపెట్టిన ఈ సమైక్య ఉద్యమ వ్యూహాన్నిఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక అవస్థ పడుతున్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలకి, ఇప్పుడు తమ నేతలు వైకాపా వైపు ఆకర్షితులవకుండా నిలుపుకోవడం కూడా మరో పెద్ద సమస్యగా మారింది.   రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, విద్యుత్ చార్జీల పెంపుపై విజయమ్మ ఆమరణ నిరాహరణ దీక్షల సందర్భంగా పూర్తిగా అడుగంటిపోయున్న వైకాపా రాజకీయ రేటింగ్, ఇప్పుడు సమైక్య ఉద్యమాలతో మళ్ళీ పతాక స్థాయికి చేరిందని చెప్పవచ్చును. సమైక్యాంధ్ర మిషతో  ఆ పార్టీలో జేరెందుకు అవకాశవాద రాజకీయ నాయకులు బారులు తీరడమే ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   తెదేపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం, కాటసాని రామిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు వైకాపా తీర్ధం పుచ్చుకొంటున్నారు. ఇక, నందమూరి హరికృష్ణ కూడా అకస్మాతుగా సమైక్య నినాదం అందుకోవడం చూస్తే, అతను కూడా నేడో రేపో వైకాపా కండువా కప్పుకొన్నాఆశ్చర్యం లేదు. వీరందరూ సమైక్యాంధ్ర కోసమే వైకాపాలో జేరుతున్నట్లు చెప్పుకొంటున్నపట్టికీ, తమ రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే జేరుతున్నారనేది కాదనలేని సత్యం. ఒకవేళ ఎన్నికల సమయానికి పరిస్థితులు తారుమారయి తెదేపా కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ బలపడినట్లయితే వారు తిరిగి స్వంత గూటికి చేరుకోవడం ఖాయం.   మరి ఇటువంటి అవకాశావాదులయిన రాజకీయ నేతలను ఆకర్షించడం ద్వారా వైకాపా తన రాజకీయ రేటింగ్స్ పెంచుకోవచ్చునేమో కానీ, అది ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో వారికే తెలియాలి. జగన్ మోహన్ రెడ్డి అరస్టయిన నాటి నుండి నాయకత్వ లోపంతో బాధపడుతున్న వైకాపా తన మనుగడ కోసం ఇటువంటి తాత్కాలిక ఉపాయాలు ఆలోచించడం సహజమే అయినప్పటికీ, పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన వ్యూహాలు అమలుచేయడం మేలు.  

సినీ పరిశ్రమకు ఉద్యమ సెగ

  రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీఅయోమయంలోపడ్డాయి. అదేవిధంగా రాజకీయాలతో పెనవేసుకుపోయిన సినీపరిశ్రమ పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయంలో పడింది. దాదాపు రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మింపబడిన నాలుగు పెద్ద సినిమాలు-పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు’, ‘తుఫాన్’ మరియు ‘జంజీర్’(హిందీ) సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయనందున సమైక్యవాదులు అడ్డుపడటంతో ఈ మెగా హీరోల సినిమాల విడుదల కాలేకపోయాయి. కనీసం ఎప్పుడు విడుదల అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.   రెండు మూడు రోజుల క్రితం చిరంజీవి తను సమైక్యాంధ్ర కోరుకొంటున్నానని ప్రకటించినప్పటికీ ఉద్యమకారుల నుండి సానుకూల ప్రతిస్పందన లేదు. అయితే, ఆయన ఆవిధంగా ప్రకటించడం వలన ఒకవేళ సీమాంధ్ర ప్రాంతంలో ఈ ఇద్దరు మెగా హీరోల సినిమాల విడుదలకు మార్గం సుగమం కావచ్చునేమో కానీ ఇప్పుడు తెలంగాణావాదులు అడ్డుపడటం ఖాయం.   రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచి పోషించినందున రేపు రాష్ట్ర విభజన జరిగిన తరువాతయినా ఈ పరిస్థితిలోసానుకూల మార్పు వస్తుందా? అనే అనుమానం సినీపరిశ్రమను కలవరపరుస్తోంది.   ఇక తెదేపా రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో, అయన కుమారుడు జూ.యన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెలంగాణాలో విడుదలకు అనుమతించమని ఓయు జేయేసీ ప్రకటించింది. ఇదే రూలు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నసినిమాకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఇక, నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్నపటికీ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా సినిమా విడుదల కాకపోవచ్చును.   పెద్ద సినిమాలు విడుదల కానందున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సినిమా థియేటర్లు ఖాళీగా ఉండటంతో చిన్న సినిమా నిర్మాతలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తమ సినిమాలను విడుదల చేసుకొంటున్నారు. అయితే అందరూ ఆ అదృష్టానికి నోచుకోవట్లేదు. కారణం కొన్ని సినిమాలు అనేక నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకొన్నపటికీ ఇంత కాలంగా థియేటర్లు దొరకని కారణంగా సదరు సినిమాల నిర్మాతలు పీకల లోతు అప్పులలో కూరుకుపోయారు. అటువంటివారు ఇప్పుడు అవకాశం ఉన్నపటికీ తమ సినిమాలను విడుదల చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు.   సినిమా నిర్మాణం పూర్తయి చాల కాలం అయినప్పటికీ విడుదల కాకపోవడంతో నిర్మాతలకు ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఈవిధంగా సినిమా విడుదల వాయిదా పడుతుండటంతో, తరువాత విడుదల కావలసిన సినిమాలు కూడా వాయిదాపడవచ్చును. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నసినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఇప్పుడప్పుడే అంతం అయ్యే సూచనలు కనబడకపోవడంతో చిన్న,పెద్ద సినీ నిర్మాతలు తమ కొత్త సినిమాల నిర్మాణం వాయిదా వేసుకొంటున్నారు.   అంతిమంగా ఇది సినీ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మంది జీవితాలను చిద్రం చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చిన్న సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా, గోడౌన్లుగా మార్చబడ్డాయి. ఇంకా చాలా థియేటర్లకి ఇదే గతి పట్టవచ్చును. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రేయనక పగలనక కష్టపడి నిర్మించిన సినిమాలు విడుదల కాని పరిస్థితులు ఉంటే ఏ నిర్మాత సినిమా నిర్మించే సాహసం చేయడు.   ప్రజలకు వినోదం పంచిపెట్టే సినీ పరిశ్రమ నేడు పెను విషాదం చవి చూస్తోంది. సినీ పరిశ్రమ ముక్కు పిండి కోట్ల రూపాయలు పన్నులు దండుకొనే ప్రభుత్వం కానీ, ఉద్యమాల కోసం బలవంతపు వసూళ్లు చేసే రాజకీయ పార్టీలు గానీ, దాని కష్టాలు పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. రాష్ట్రంలో ఇదే అనిశ్చిత పరిస్థితి మరికొంత కాలం సాగితే సినీ పరిశ్రమ మూతపడినా ఆశ్చర్యం లేదు.

ఏటికి ఎదురీదనున్న చంద్రబాబు

  రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా, వైకాపాల పరిస్థితి చాలా అయోమయంగా మారింది. అయితే, వైకాపా చాలా దైర్యంచేసి తెలంగాణాను వదులుకొని సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ ఈ అయోమయ పరిస్థితుల నుండి త్వరగానే బయట పడగలిగింది. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న తెదేపా పరిస్థితి మాత్రం ఇంకా అయోమయం పరిస్థితిలోనే ఉంది.   సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర ఉద్యమాలుచేస్తుంటే మరో వైపు చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమనే చెప్పుకొంటున్నారు. ఈ పరిస్థితుల నుండి పార్టీని బయటపడేసేందుకు చంద్రబాబు ఈ నెల 25న విజయనగరం జిల్లా కొత్తవలస నుండి తన ఆత్మగౌరవ యాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఆయన బస్సు యాత్ర చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఈ సారి ఆయన తన బులెట్ ప్రూఫ్ వాహనంలో యాత్ర చేయబోతున్నట్లు సమాచారం. బహుశః ఇంటలిజన్స్ వర్గాల సూచనల మేరకే ఆయన బస్సుకు బదులు బులెట్ ప్రూఫ్ వాహనంలో యాత్ర చేస్తున్నట్లున్నారు.   ఆయన కొద్ది నెలల క్రితమే ప్రజలతో కలిసిపోతూ పాదయాత్ర చేసి, ఈ సారి మాత్రం బులెట్ ప్రూఫ్ వాహనంలో బయలుదేరడం వలన ప్రజలలో కొంత వ్యతిరేఖత ఏర్పడవచ్చును. అదేవిధంగా, ఆయన తన యాత్ర మొదలుపెట్టకమునుపే తనను విమర్శించేందుకు కాంగ్రెస్, వైకాపాలకు ఒక మంచి ఆయుధం అందజేసినట్లయింది.   ఆయన ఆత్మగౌరవ యాత్ర మూడు విడతలలో సాగుతుంది. మొదట ఉత్తరాంధ్ర ప్రాంతంలో 7రోజులు యాత్ర చేసిన తరువాత పదిరోజుల విరామం తీసుకొని మళ్ళీ రాయలసీమ జిల్లాలలో రెండు సార్లు యాత్ర చేస్తారు. ఆయన గతంలోనే తెలంగాణా ప్రాంతంలో పాదయాత్ర చేసి ఉన్నందున ఈసారి తెలంగాణా ప్రాంతాలను పర్యటించకపోవచ్చును.   అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన యాత్ర కేవలం సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయితే, తెదేపా కూడా తెలంగాణకు వ్యతిరేఖమనే భావన వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు సమైక్యాంధ్ర కోరుతూ చురుకుగా ఉద్యమాలలో పాల్గొనడం, నిన్న రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేసి బస్సు యాత్ర చెప్పట్టబోతున్నట్లు ప్రకటించడం వంటివి ఆ పార్టీ తెలంగాణా వ్యతిరేఖమనే భావన కల్పిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణా ప్రాంతంలో పర్యటించకపోతే ఆ అనుమానాలను ఆయన నిజం చేసినట్లవుతుంది.   ఆయన ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఅగ్నిగుండంగా మార్చిన వైనాన్నిప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర విభజనకు తెదేపాయే ప్రధాన కారణమనే కాంగ్రెస్ వైకాపాల ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయవచ్చును. కానీ సీమాంధ్ర నేతలు కొందరు ఆయన యాత్రను వ్యతిరేఖిస్తున్నట్లు సమాచారం. తెదేపా రాష్ట్ర విభజనకు అనుకూలమనే లేఖ ఈయడం వలన తాము సీమాంధ్ర ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టబోతున్నయాత్ర అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని వారు భయపడుతున్నారు.   ఏమయినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్ళాలనుకోవడం గొప్ప విషయమే. తన పాదయాత్రతో పార్టీని పటిష్టపరచుకొన్నచంద్రబాబు, ఇప్పుడు చేపడుతున్నఈ యాత్రతో పార్టీని ఒడ్డున పడేస్తారా లేక మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తారా చూడాలి.

కాంగ్రెస్ స్వయంకృతాపరాధం

  రాష్ట్ర విభజన ఐడియాతో తనకు సవాలుగా నిలిచిన వైకాపా తెదేపాలను చిత్తు చేయాలనుకొన్న కాంగ్రెస్ పార్టీ చేజేతుల్లా కొత్త సమస్యలు సృష్టించుకొని ఇప్పుడు తీరికగా బాధపడుతోంది. ఇంతవరకు వచ్చిన తరువాత ఇక రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. వెనక్కి తగ్గితే టీ-కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కూడా ఖాయం. ఇక, కాంగ్రెస్ భరతం పట్టేందుకు తెరాస ఎలాగు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మలేమని చెపుతున్న తెరాస నేత కేసీఆర్ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే పేరుతో మళ్ళీ ఉద్యమానికి సంసిద్ధంఅవుతున్నారు.   ఇక, సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అంటోనీ కమిటీ ముందు వాదనలు చేస్తున్నారు. ఇక మిగిలిన సీమాంధ్ర నేతలు కూడా అధిష్టానానికి ఎదురుతిరుగుతున్నట్లుగానే కనిపిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం దైర్యంచేసి ముందుకు సాగుతుండటంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమాలు నానాటికి తీవ్ర తరమవుతున్నాయి. రాజమండ్రీ శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు అయితే మరో అడుగు ముందుకు వేసి త్వరలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి ‘ఇందిరా కాంగ్రెస్ పార్టీ’ పెట్టే అవకాశం ఉందని బాంబు పేల్చారు.   కాంగ్రెస్ తీసుకొన్ననిర్ణయన్ని వ్యతిరేఖిస్తూ ప్రభుత్వోద్యోగుల నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోయింది. ఇవే పరిస్థితులు మరికొంత కాలం కొనసాగినట్లయితే అది రాష్ట్రంపై సుదీర్గ కాలంపాటు తీవ్ర దుష్పరిణామాలు చూపడం ఖాయం. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి బోడో ల్యాండ్, గోర్ఖ ల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా జోరందుకోవడంతో కాంగ్రెస్ పార్టీ చేజేతులా మరిన్ని కొత్త ఇబ్బందులు సృష్టించుకొన్నట్లయింది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను దెబ్బతీయబోయి తాను దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో రావణకాష్టం రగిలించి దానిని ఆర్పడం చేతకాక కాలక్షేపం చేస్తున్నట్లుంది.

కేసీఆర్ కొత్త ఉద్యమం హైదరాబాద్ కోసమా, ఎన్నికల కోసమా?

  కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రకటన చేసిన నాటి నుండి తెరాస రాజకీయ నిరుద్యోగిగా మారింది. సీమంధ్రాలో సమైక్య ఉద్యమాలు ఎంత జోరుగా సాగుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గుచూపుతుండటంతో, ఇక కేంద్రాన్ని నిలదీసేందుకు తెరాసకు అవకాశంలేకుండా పోయింది. ఒకవేళ కాంగ్రెస్స్ అధిష్టానం సీమాంధ్ర ఒత్తిళ్లకు లొంగి వేరే ఏమయినా మాట్లాడి ఉండి ఉంటే, తెరాసకు ఉద్యమించే అవకాశం ఉండేది. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ఒత్తిళ్లకు లొంగ కుండా తెలంగాణా ఏర్పాటు విషయంలో ధృడ నిశ్చయంతో వ్యవహరిస్తుండటంతో, తెరాసకు పనిలేకుండా పోయింది.   అదికాక, కాంగ్రెస్ పార్టీతో విలీనం కోసం పార్టీలో అంతర్గతంగా ఒత్తిళ్ళు కూడా ఉండటంతో కేసీఆర్ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే కొత్త నినాదంతో మళ్ళీ రంగంలోకి దిగారు. ఆంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టి తద్వారా ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్ ఇప్పుడు జంట నగరాలలో ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. తద్వారా ప్రజల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.   హైదరాబాద్ అంశంపై కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెపుతున్నపటికీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో తెరాసను విలీనం చేయకాపోతే, రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీకి అవసరమయిన తెలంగాణా సెంటిమెంటు లేకపోవడంతో, కేసీఆర్ ఇప్పుడు ఈ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే ఉద్యమం మొదలుపెట్టి మరో బలమయిన సెంటిమెంటును ఏర్పరుచుకోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త పల్లవి అందుకొన్నట్లున్నారు.   తెలంగాణా సెంటిమెంటుని కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోయిన తరువాత, తెరాస మనుగడ సాగించాలంటే ఇటువంటి బలమయిన సెంటిమెంట్ చాల అవసరమని గ్రహించబట్టే కేసీఆర్ ఈ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణ ఎన్నికలకి ఇంకా 7-8 నెలల సమయం మిగిలి ఉన్నందున, ఈలోగా హైదరాబాద్ అంశంపై మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టినట్లయితే అది ఎన్నికల సమయానికి తీవ్రతరమయి పార్టీకి మేలుచేస్తుందని కేసీఆర్ ఆలోచన కావచ్చును.   హైదరాబాద్ పై సమాన హక్కుల కోసం పట్టుబడుతున్న సీమాంధ్ర నేతలు ఎటూ హైదరాబాద్ విషయంలో తగ్గరని కేసీఆర్ కు తెలుసు గనుక, ఈ అంశంతో తెలంగాణా ప్రజల భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందవచ్చునని కేసీఆర్ ఆలోచన.   కానీ, తెరాసను పూర్తిగా తుడిచిపెట్టేసి, రానున్న ఎన్నికలలో తెలంగాణాలో ఏకపక్షంగా గెలవాలనే ఆలోచనతోనే ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెరాస ఈవిధంగా పుంజుకోవడాన్ని చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కేసీఆర్ గనుక మళ్ళీ ఉద్యమ బాటపట్టి బలపడితే, కాంగ్రెస్ పార్టీ ఎంతో దైర్యంచేసి చేసిన తెలంగాణా ప్రకటన ఫలితమూ దక్కదు. గనుక, కాంగ్రెస్ పార్టీ తెరాస విలీనం కోసం ఆ పార్టీపై ఒత్తిడి పెంచుతూనే, ఒకవేళ కేసీఆర్ ఉద్యమం మొదలుపెడితే వెంటనే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి పరిస్థితిని తిరిగి తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం చేయవచ్చును.

కాంగ్రెస్ వైకాపాల సమైఖ్య చదరంగంలో తెదేపా బలి

  రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెదేపా, ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో రగులుతున్న ఉద్యమ జ్వాలల నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడటంతో తప్పని పరిస్థితులో ఆ పార్టీ నేతలు కూడా సమైక్యబాట పట్టవలసి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత తమ లేఖకే కట్టుబడి ఉన్నానని ప్రకటించినప్పటికీ, వైకాపా నేతలు ఈ సమైక్య రేసులో ముందుకు దూసుకుపోతుండటంతో, ఇక తమనేతలను కూడా చురుకుగా సమైక్య ఉద్యమాలలో పాల్గొనాలని, ప్రజల అభీష్టం మేరకు ముందుకు సాగవలసిందిగా ఆయన తన నేతలకు స్పష్టమయిన ఆదేశాలిచ్చారు.   ఇది ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలకు సమరోత్సాహం కలిగించవచ్చును, కానీ, తెలంగాణా నేతలకు మాత్రం పార్టీ అధ్యక్షుడిపై నమ్మకం కోల్పోయేలా చేయడం ఖాయం. వారికి సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నఉద్యమాల గురించి, అక్కడ తమ పార్టీని రక్షించుకోవలసిన అవసరం గురించి తెలియకపోదు. కానీ, అదే సమయంలో వారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి కూడా ఆందోళన చెందడం సహజం.   సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపాల నుండి తమ పార్టీని రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకొన్నఈ నిర్ణయంవల్ల తెదేపా కూడా తెలంగాణా వ్యతిరేఖమనే భావన వ్యాపిస్తే తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వారెవరూ ఇంతవరకు పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడకపోయినప్పటికీ, మరెంతో కాలం మౌనంగా ఉండకపోవచ్చును. అదే జరిగితే తెదేపా కూడా తన తెలంగాణా నేతలని ఒకరొకరిగా సీమాంధ్ర ఉద్యమానికి బలిచేసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.   ఇక సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపాలు కొనసాగిస్తున్నసమైక్య రేసులో వెనుకబడిపోకూడదని చంద్రబాబు నాయుడు తన నేతలకి చెప్పడం గమనిస్తే, ఇప్పటికే వారు వెనుకబడిపోయారని ఆయన భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో తేదేపాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన సరిగ్గానే అంచనా వేసినట్లు కనబడుతోంది.   తెలంగాణాను వదులుకొన్న వైకాపా, తన ఉద్యమాలతో సీమంధ్రలో ఇప్పటికే తన రేటింగ్ బాగా పెంచుకొంది. ఇక తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తిరుగులేని ఆధిక్యత పొందుతూనే, సీమంద్రాలో ఆపార్టీ నేతలు చేస్తున్నహడావుడి వలన సీమాంధ్ర ప్రాంతంలో కూడాప్రయోజనం పొందే అవకాశముంది. ఈవిధంగా కాంగ్రెస్, వైకాపాలు తమ తెలంగాణా, సమైక్య ఉద్యమాలతో పూర్తి ప్రయోజనం పొందబోతుంటే, తెదేపా మాత్రం తెలంగాణకు అనుకూలమని చెప్పిఇప్పుడు తద్విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల అటు తెలంగాణాలో, అదే కారణంతో సీమాంధ్ర ప్రాంతంలో తెదేపా నష్టపోయే అవకాశం ఉంది.   రాష్ట్రవిభజనకు అనుకూలంగా తెదేపా లేఖ ఇవ్వడం వలనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్, వైకాపాలు సీమాంధ్ర ప్రాంతంలోబాగానే ప్రచారం చేయగలిగాయి. ఆ వ్యతిరేఖ ప్రచారం నుండి బయటపడే ప్రయత్నంలో సమైక్య ఉద్యమంలోచురుకుగా పాల్గొనాలని చంద్రబాబు స్వయంగా తన నేతలకి చెప్పడం వలన ఇప్పుడు తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రచారం చేసుకొని లబ్దిపొందే ప్రయత్నం చేస్తుంది.   తెదేపా సమైక్యఉద్యమాలలో పాల్గొన్నపటికీ తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖ కారణంగా సీమాంధ్ర ప్రజల నమ్మకం పొందలేకపోవడం, సమైక్య ఉద్యమాలలో పాల్గొనడం వలననే తెలంగాణా ప్రజల నమ్మకం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బహుశ కాంగ్రెస్, వైకాపాలు ఈ పరిణామాలు ఆశించే ఆడిన ఈ సమైక్య చదరంగంలో తెదేపా నష్టపోయేది తెదేపాయేనని చూచాయగా అర్ధం అవుతోంది.

స్వాతంత్రం ఫలాలు కొందరికేనా

  భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి 67సం.లు. ఈ సుదీర్ఘ కాలంలో భారత్ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండుడడుగులు వెనక్కి అన్నరీతిలో ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రధానకారణం స్వార్ధ పరులు, అసమర్ధులు, అవినీతిపరులయిన నేతలే. అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలను కూడా నిందించక తప్పదు. ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులు, విద్యావంతులయినప్పటికీ కుల,మత,ప్రాంత, బాష వంటి అంశాల వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడు, అసమర్ధుడని తెలిసినప్పటికీ, తమకులం వాడో, మతం వాడో అయితే అతని అవినీతిని, అసమర్ధతను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిద్ధాంతానికి ప్రజలు కూడా లొంగిపోవడమేకాకుండా, సదరు నేతలను విమర్శించిన వారిని ఎదుర్కోవడం తమ నైతిక బాధ్యతగా భావించడం వలననే అటువంటి నేతల ఆటలు ఇంకా సాగుతున్నాయి.   శాస్త్ర సాంకేతిక,విద్యా, వైద్య, వ్యాపార రంగాలలో దేశం చాలా అభివృద్ధి సాధించినప్పటికీ, 67సం.ల వ్యవధిలోఇంతకు పదింతలు జరిగి ఉండాల్సి ఉండగా, నేటికీ దేశంలో జరుగవలసినంతగా అభివృద్ధి జరుగలేదనేది చేదు నిజం. జరిగిన గోరంత అభివృద్ధిని భూతద్దంలో కొండంతగా చేసి చూపిస్తూ మన దేశం త్వరలో అమెరికాను మించిపోనున్నదని రాజకీయనాయకులు చెపుతూ ప్రజలని భ్రమలో బ్రతికేలా చేస్తున్నారు. ప్రజలందరి చేతుల్లో సెల్ ఫోనులుండటం, ఏడాదికి ఒకట్రొండు శాటిలయిట్లు పైకి ఎగురవేయడమే గొప్ప అభివృద్ధి అనే వితండ వాదనచేస్తున్నారు, అయితే ఎప్పుడో 50సం.లక్రితం రష్యా వాడి పక్కన పడేసిన తుప్పు పట్టిన మిగ్ విమానాలను, సబ్మెరయిన్లను ఎందుకు అద్దెకు తెచ్చుకొనే, కొనుకోవలసి వస్తోందనే ప్రశ్నకు సరయిన సమాధానం చెప్పలేరు.   దేశంలో అంబానీ వంటివారు మరింత ధనవంతులవడమే అభివృద్ధి అనుకొంటే, దేశంలో లక్షలాది గ్రామాలలో ప్రజలు నేటికీ కూటికి గుడ్డకి నోచుకోని స్థితిలో విలవిలలాడటాన్ని ఏవిధమయిన అభివృద్ధి అనాలో మన పాలకులే చెప్పాలి. పట్టణాలలో ప్రజల ఆర్ధికస్థితి కొంతమేర మెరుగుపడిన విషయం వాస్తవమే. కానీ, నానాటికి పెరిగిపోతున్నధరల ప్రభావం వలన వారి పరిస్థితి కూడా మళ్ళీ మొదటికే వస్తోంది.   ప్రజలకి ఉపాధి మార్గాలు కల్పించి వారు ఆర్ధిక స్వావలంభన పొందేవిధంగా ఆలోచన చేయవలసిన ప్రభుత్వాలు రోజుకో కొత్త ప్రజాకర్షకపధకం ప్రకటిస్తూ ప్రజలు శాశ్వితంగా ప్రభుత్వంపైనే ఆధారపడేలా చేయడం ప్రజల దౌర్భాగ్యమనే చెప్పాలి. అధికార కేంద్రీకరణకు అలవాటుపడిన మన రాజకీయ వ్యవస్థలు అభివృద్ధిని కూడా నగరాలకు మాత్రమే పరిమితం చేస్తూపోవడం వలన, ఆర్ధిక అసమానతలు కూడా అదే నిష్పత్తిలో పెరుతున్నాయి. తత్ఫలితమే దేశంలో ఈ దుస్థితి. ఇదంతా నిరాశావాదంగా అనిపించవచ్చును. కానీ, ఇది దేశంలో నెలకొన్నప్రస్తుత అరాచక పరిస్థితుల పట్ల ఒక సగటు పౌరుడి ఆందోళన మాత్రమే.

Is TDP walked into trap laid by rivals

  Gradually, YSR Congress party is toughening its stand on Samaikyandhra and is now openly opposing Telangana state formation. YSRCP honorary president Vijayamma is going to sit for an indefinite hunger strike from 19th of August at Vijayawada protesting bifurcation of the state.   Perhaps, it makes no difference for YSRCP as it has decided to confine itself to Seemandhra region, but the TDP leaders’ agitations and protests definitely will have their impact on the party in Telangana region.   Congress is also playing a safe game at both regions. Even though, it’s Seemandhra leaders are agitating against bifurcation, the firm stand taken by the high command in favour of bifurcation, keeps it up above all its rivals TRS, TDP, BJP and other parties in Telangana region. Moreover it can bank upon the credit of granting Telangana state to seek the votes in Telangana region. At the same time, its leaders can boast themselves as the war heroes, who have sacrificed their Minister, MP and MLA posts just for the sake of Samaikyandhra and the people’s interests to seek votes in Seemandhra region.   But, TDP seems to be dragged into this trap laid by Congress and YSR Congress parties. As the TDP leaders intensify their agitations and protests in favour of Samaikyandhra, it will be the looser at the other end -Telangana region. Once, TDP is fully absorbed into this trap, and then Congress and YSRCP may swiftly withdraw from the game leaving TDP struck in the trap.   While Congress gains political mileage in both places, YSRCP will be happy to settle with Seemandhra region, where as TDP may lose the game in both regions. Although, Chandrababu could foresee these developments, perhaps he is not in a position to control his leaders so is the situation also.

వెనుకా ముందుగా తెలంగాణా ప్రక్రియ ఖాయం

  సీమాంధ్ర ప్రాంతం అంతా సమైక్య ఉద్యమాలతో హోరెత్తిపోతున్నతరుణంలో, నిన్నపార్లమెంటులో ఆర్ధిక మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనపై జరిగిన చర్చకు సమాధానం చెపుతూ, తాము రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత, అన్నిపార్టీలను సంప్రదించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీ సరయిన హోంవర్క్ చేయలేదని, ఎవరినీ సంప్రదించలేదనే ప్రతిపక్షాల వాదనలు అర్ధరహితమని ఆయన కొట్టిపడేసారు. తెలంగాణ ఏర్పాటులో కొంత జాప్యం జరుగవచ్చునేమో తప్ప, విభజన ప్రక్రియ ఇక ఎంత మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేసారు. వీలయినంత త్వరగా రాజ్యంగా బద్దంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణాపై ఇక ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరిగే ప్రసక్తి లేదని నిర్ద్వందంగా ఆయన ప్రకటించారు. తాను కేంద్ర మంత్రిగా ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నానని కూడా స్పష్టం చేసారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ఇక ఆరు నూరయినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తెలంగాణాపై ఏర్పాటు విషయంలో వెనకడుగు వేయబోదని స్పష్టమయింది.   అదే సమయంలో సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రశించడం కానీ, దానిపై తమ అభిప్రాయాలను ప్రజలు, మీడియా ముందు ప్రకటించరాదని స్పష్టమయిన ఆదేశాలు జారీ చేసారు. దీనితో రాష్ట్ర విభజనపై ప్రతిపక్షాలు చేస్తున్నతీవ్ర విమర్శలకు ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చిత స్థితికి తెరదించి, రాష్ట్ర విభజనకు సానుకూల వాతావరణం సృష్టించేందుకు నడుం బిగించినట్లు అర్ధం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం గనుక తన రాష్ట్ర నేతలకు ముందు ముక్కు తాడు వేయగలిగితే, పరిస్థితులు చాలా వరకు చక్కబడవచ్చును.   అసలు రాష్ట్ర విభజన ప్రకటనకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాధికారులతో, అన్ని రాజకీయ పార్టీలతో కూడిన ఒక కమిటీని వేసి అందరికీ అమోదయోగ్యమయిన విధంగా శాస్త్రీయంగా విభజన ప్రక్రియ మొదలుపెట్టి ఉండి ఉంటే, నేడు రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండేది కాదు. అదేవిధంగా విభజన ప్రక్రియ మొదలుపెట్టక మునుపే కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్రాంతాలకు చెందిన తన రాష్ట్ర నేతలను అదుపుచేసి ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో ఇంత అరాచక పరిస్థితులు తలెత్తేవి కావు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే, ముందు చేయవలసిన పనులను తరువాత చేస్తూ రాష్ట్రంలో అశాంతికి కారణమయింది.   అయినప్పటికీ తన వల్ల ఎటువంటి తప్పు జరుగలేదని, ప్రతిపక్షాలదే తప్పని బుకాయించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యేనని చాటి చెపుతోంది. ఏమయినప్పటికీ, తెలంగాణా విషయంలో నేటికీ కాంగ్రెస్ తన మాటకి కట్టుబడి ఉండటమే చాలా గొప్ప విషయం అని చెప్పుకోక తప్పదు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కు మోడీ కౌంటర్

  అందరూ ఊహించినట్లుగానే హైదరాబాద్ లో నేడు జరిగిన నవ భారత్ యువ భేరీ సభలో మోడీ అందరినీ ఆకట్టుకొనే ప్రసంగం చేసారు. మోడీకి తెలంగాణా అంశం లేకుండా చేసామని సంబరపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నివ్వెరపోయేలా మోడీ ‘జై తెలంగాణా ! జై సీమంద్రా!’ అని నినదించి ప్రేక్షకులచేత కూడా నినదింపజేసారు. రెండు ప్రాంతాలు విడిపోయినా అభివృద్ధిలో పోటీపడి గుజరాత్ ను మించిపోవాలని తానూ మనసారా కోరుకొంటున్నానని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది తెలుగు ప్రజలు, గుజరాతీలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించగలుగుతున్నపుడు, హైదరాబాద్ నగరంలో వేలాది గుజరాతీలు తెలుగువారితో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవిస్తున్నపుడు, తెలుగువారు సాటి తెలుగువారితో, అదీ హైదరాబాదులో ఎందుకు కలిసి జీవించలేరని ఆయన ప్రశ్నించారు. తద్వారా అటు తెలంగాణా ప్రజలను, హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులను సంతోషపరచగలిగారు.   రాష్ట్ర విభజనపై తమ పార్టీ నేటికి నిశ్చితాభిప్రాయం కలిగి ఉందని, ఒకవేళ కాంగ్రెస్ గనుక ఇప్పుడు తెలంగాణా ఈయని పక్షంలో తాము రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తే వందరోజుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని దృడంగా చెప్పడం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాల నేతలకు ఆయన అభయ హస్తం ఇచ్చినట్లే భావించవచ్చును. తద్వారా ఆయన దేశావ్యాప్త పర్యటన మొదలుపెట్టక మునుపే ఆయా ప్రాంతాలలో తనకనుకూల వాతావరణం సృష్టించుకొన్నారు.   కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఆ పనిని శాస్త్రీయంగా, సజావుగా చేయకుండా, రాష్ట్ర ప్రజల మధ్య ఈవిధంగా ఎందుకు చిచ్చుపెట్టిందని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్, నిజంగా రాష్ట్ర విభజన చేసే ఉద్దేశ్యమే ఉండి ఉంటే, నాటి నుండే సీమంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానికి అవసరమయిన మౌలిక వసతులు కల్పించి సిద్దం చేసి ఉండేదని, కానీ ఆవిధంగా చేయకుండా నేడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, హడావుడిగా తెలంగాణా ప్రకటించేసి, మరో 10ఏళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని చెప్పడం ఆ పార్టీకి చిత్తశుద్ది, ముందు చూపు లేదని తెలియజేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాలలో సమాన అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఆయన వాగ్దానం చేసారు. రాష్ట్ర విభజనపై రావణ కాష్టంలా రగులుతున్నక్లిష్టమయిన అంశంపై మోడీ నేర్పుగా ఇరు ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ, ఎవరినీ తక్కువచేయకుండా ప్రసంగించి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు.    రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సందిగ్దంలో పడిన కాంగ్రెస్ పార్టీకి, ఒకవేళ ఆ పార్టీ తెలంగాణాపై మాట తప్పితే బీజేపీ వంద రోజుల్లో ఇస్తుందని ప్రకటించి మోడీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణపై వెనక్కిపోలేని విదంగా బందించారు. మోడీ సభకు కొద్ది రోజుల ముందుగానే హడావుడిగా తెలంగాణా ప్రకటించేసి మోడీకి ఇక తెలంగాణ అంశంపై మాట్లాడే అవకాశం లేకుండా చేసామని సంబరపడిన కాంగ్రెస్ పార్టీని, మోడీ అదే తెలంగాణా అంశంతో బంధించడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం. 

కాంగ్రెస్ అధిష్టానానికి స్టార్ బ్యాట్స్ మ్యాన్ గుగ్లీ

    రాష్ట్ర విభజనను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వారం రోజుల తన మౌనవ్రతం వీడి అధిష్టాని నిర్ణయంతో తానూ ఏకీభవించట్లేదని నిన్నకుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సంకట స్థితిలో పడింది. తాను తెలంగాణకు వ్యతిరేఖం కాదంటూనే, నీటి వనరుల విభజన, రాజధాని అంశం, విద్యుత్, భౌగోళిక సరిహద్దులు, ఉద్యోగాలు, ప్రజల భద్రత తదితర అంశాలను కేంద్రం పరిష్కరించకుండా, కనీసం వివరణ ఈయకుండా రాష్ట్ర విభజనకు సిద్దపడటం మంచిది కాదని అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రమే అంతిమ నిర్ణయం తీసుకొంది గనుక, ఈ సమయాలను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్రానిదే అవుతుందని ఆయన స్పష్టం చేసారు. తానూ కేవలం రాష్ట్ర విభజన వల్ల ఏర్పడబోయే సమస్యలను ఎత్తి చూపుతున్నాను తప్ప అధిష్టాన నిర్ణయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించట్లేదని చెప్పారు.    దీనితో రాష్ట్ర విభజనపై చకచకా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డి బ్రేకులు వేసినట్లయింది. తన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ, విభజనకు అభ్యంతరం చెపుతున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించితే, ఇప్పటికే కేంద్రంపై ఆగ్రహంతో రగిలిపోతున్న సీమంద్రా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుంది. అలాగని, అయన మాటలను మన్నిస్తూ, రాష్ట్ర విభజన ప్రక్రియను ఏమాత్రం జాప్యం చేసినా తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.    ఒకవేళ ఆంటోనీ కమిటీ ద్వారా ఆయన లేవనెత్తిన అన్ని సమస్యలకు జవాబు చెప్పించాలని చూసినా, స్థూలంగా విభజనను వ్యతిరేఖిస్తున్నఆయనను సమాదానపరచడం కష్టం. ఇక, ఈ పరిస్థితిలో ఆయన అభీష్టానికి వ్యతిరేఖంగా ముందుకు సాగితే, ఆయన గనుక స్వచ్చందంగా రాజీనామా చేసినట్లయితే, నామ మాత్రంగా ఉన్న ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం. అప్పుడు ఆ స్థానంలో ఎవరిని నియమించినా కూడా రెండో ప్రాంతం వారు తీవ్రంగా వ్యతిరేఖించడం, ఆ వర్గానికి చెందిన మంత్రులు శాసన సభ్యులు రాజీనామాలు చేయడం ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడటం అసంభవం గనుక, ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేయవలసి ఉంటుంది.   కానీ, ఆవిధంగా చేస్తే కేంద్రం ఎవరి మాట వినకుండా మొండిగా విభజన చేస్తోందని సీమంధ్ర ప్రజలలో వ్యతిరేఖ భావనలు కలగడం సహజమే. ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీరని నష్టం చేయవచ్చును. గనుక కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై మరింత జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటుంది. రేపు విభజన తరువాత ముఖ్యమంత్రి చెపుతున్న సమస్యలు నిజంగా ఎదురయితే అప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిందించడం ఖాయం. తెలంగాణా ఏర్పడిన సంతోషంలో అక్కడి ప్రజలు కొంత కాలం ఈ సమస్యలని పట్టించుకోకపోయినా, సీమంధ్ర ప్రాంత ప్రజలు మాత్రం ఆ సమస్యలపై మరో పోరాటం మొదలుపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే, చిరకాలం పాటు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, శత్రుత్వం ఏర్పడవచ్చును.     ఇక, ముఖ్యమంత్రే సమైక్యాంధ్ర కోరుతూ మాట్లాడిన తరువాత ఇంకా పదవులను అంటిబెట్టుకొనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులపై కూడా తీవ్రమయిన ఒత్తిడి పెరగడం ఖాయం. ముఖ్యమంత్రి తన నిర్ణయంతో వారు కూడా తన బాటలోనే నడువక తప్పని పరిస్థితి కల్పించారు. అదే జరిగితే కేంద్రం రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇంతవరకు వచ్చిన తరువాత తెలంగాణా ప్రక్రియను ఆపితే తెలంగాణా నేతలందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసీవకాశం ఉంది. అదే జరిగితే, రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలో రాజకీయ లబ్ది పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టబోయే ప్రమాదం ఉంది.   అంతే గాక తన ఎత్తులతో నిర్వీర్యం చేసామనుకొన్నతెరాసకు మళ్ళీ చేజేతులా బలం చేకూర్చినట్లవుతుంది. అందువల్ల కాంగ్రెస్ మరోసారి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. బహుశః రాష్ట్రపతి పాలన విదించి, ఆంటోనీ కమిటీని మరింత విస్తృత పరిచి ఒకవైపు సీమంధ్ర నేతలతో చర్చలు సాగిస్తూనే విభజన ప్రక్రియ కొనసాగించవచ్చును.   లగడపాటి చెపుతున్న స్టార్ బ్యాట్స్ అధిష్టానానికి వేసిన ఈ గుగ్లీని (బ్రహ్మాస్త్రాన్ని) ఏవిధంగా ఎదుర్కొంటుందో త్వరలోనే తెలిసిపోతుంది.

రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ ఎందుకు తొందర పడుతోంది

  తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని తెలిసినప్పటికీ, యుపీయే ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా కమిటీలతో, చర్చలతో తాపీగా కాలక్షేపం చేసింది. సాధారణ ఎన్నికలకి కేవలం 8 నెలలు ముందుగా తెలంగాణా ప్రకటన చేసి, నాటినుండి కాంగ్రెస్ సంస్కృతికి విరుద్దమయిన పద్దతిలో అనూహ్య వేగంగా దానిని అమలు చేసేందుకు చాలా చురుకుగా పని చేస్తోంది. సాదారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంత వేగంగా పనిచేయడం ఎన్నడూ చూడలేము. అయితే ఆ పార్టీ ఎందుకు ఎందుకు ఓవర్ టైం చేస్తూ రాష్ట్ర విభజనకి కష్టపడుతోంది? అని ప్రశ్నించుకొంటే ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమేనని అర్ధం అవుతుంది.   వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏర్పడబోతున్నమన రెండు రాష్ట్రాలలో స్థిరపడటం పెద్ద పనేమీ కాదు. కానీ ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపా, తెరాసాలు మాత్రం ఈ సరికొత్త వాతావరణంలో, రాజకీయ పరిస్థితుల్లో ఇమడటానికి కొంచెం సమయం పడుతుంది. అవి ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉండగానే ఎన్నికలు నిర్వహించినట్లయితే వాటిని తేలికగా ఓడించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన. అందుకే వీలయినంత వేగంగా రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేస్తానని పదేపదే చెపుతోంది.   తద్వారా తెలంగాణా తానే ఇస్తున్నాని బలమయిన సంకేతాలు పంపుతూ అక్కడి ప్రజల మనసులు గెలుచుకోవడమే కాకుండా, కేసీఆర్ ప్రాభల్యం కూడా గండి కొట్టగలదు.   ఇక, ఇటువంటి నిర్ణయం తీసుకొన్నపుడు ఇతర ప్రాంతాలలో (సీమంధ్రలో) వ్యతిరేఖత ఏర్పడటం సహజమేనని దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనిస్తే, సమైక్య ఉద్యమాలు చెలరేగుతాయని, వాటిని ఏవిధంగా సమర్ధంగా ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ వద్ద తగిన వ్యూహం కూడా సిద్దంగా ఉందని అర్ధం అవుతోంది.   బహుశః అంతా సర్దుమణిగేవరకు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేక డిల్లీ పద్దతిలోనో ప్రత్యేక హోదా ప్రకటించి సీమంధ్ర నేతలతో ఈ నాలుగు నెలలో చర్చలు జరిపి, వారికి ఒక్కో సమావేశం తరువాత ఒకటొకటిగా భారీ వరాలు ప్రకటిస్తూ వారు కూడా ఈ ఆటలో తమదే పైచేయి సాధించామనే భావన వారిలో కూడా కల్పించి సమైక్య ఉద్యమాలను కూడా చల్లార్చవచ్చునని కాంగ్రెస్ వ్యూహం అయి ఉండవచ్చును.   తద్వారా అటు తెలంగాణా ప్రజలను, ఇటు సీమంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని ఆయా ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించావచ్చునని కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. బహుశః ఈ రాజకీయ చదరంగంలో అంతా అనుకొన్నట్లు సాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాదించే అవకాశాలున్నాయి. అయితే, ప్రాంతీయ పార్టీలు ఈ వ్యూహాన్ని ఏవిధంగా ఎదుర్కొంటాయో, ఎదుర్కొని నిలబడగలవో లేదో రానున్న కాలమే చెపుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమ కూడా బయటకి పోక తప్పదా

  మొన్న కేసీఆర్ “విభజన ప్రక్రియ పూర్తికాగానే ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోక తప్పదు, వారికి వేరే ఆప్షన్స్ ఉండవని” చెప్పిన మాట కేవలం వారికే కాక ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన పారిశ్రామిక వేత్తలకు, విద్యా సంస్థల అధిపతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సినీ రంగానికి చెందిన వారికి కూడా చాలా ఆందోళన కలిగించింది. దానికి తోడూ కేసీఆర్ తాము బడా వ్యాపారవేత్తలకే వ్యతిరేఖం తప్ప పొట్టచేత్తో పట్టుకొచ్చిన వారికి కాదని పదేపదే చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొట్ట మొదటగా అందరి దృష్టి తెలుగు సినీ పరిశ్రమపైనే పడుతుంది. స్వర్గీయ యన్టీఆర్ ప్రోత్సాహంతో మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ రెండు మూడు దశాబ్దాలలో బాగానే స్థిరపడింది. తెలుగు సినిమా నిర్మాణానికి అవసరమయిన స్టూడియోలు, రికార్డింగ్ దియేటర్లు, సాంకేతిక నిపుణులు, వివిధ రకాలయిన సేవలు అన్నీ కూడా అక్కడే లభ్యమవడంతో తెలుగు సినీ పరిశ్రమ త్వరగానే నిలద్రోక్కుకొంది.   అయితే తెలంగాణా ఉద్యమాల వల్ల గత మూడు నాలుగేళ్ళుగా సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఇక హైదరాబాద్ వీడకపోతే మనుగడ కష్టమని కూడా భావించింది. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు వైజాగ్ లో రామానాయుడు సినిమా స్టూడియోని నిర్మించడంతో ఇక సినీ పరిశ్రమకి తరువాత గమ్యం వైజాగేనని అందరూ భావించారు. కానీ ఎలాగో అన్ని అవరోధాలను అధిగమించి మళ్ళీ వేగం పుంజుకొంటున్న సమయంలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. దీనితో ఇప్పుడు సినీ పరిశ్రమ హైదరాబాదులోనే ఉండాలా లేక ఆంధ్రాకి తరలిపోవాలా? అనే ప్రశ్న మరో మారు తలెత్తింది.   హైదరాబాదులో భారీ పెట్టుబడులు పెట్టి అన్ని హంగులు ఏర్పరుచుకొన్న తరువాత ఇప్పుడు చిత్ర పరిశ్రమను మరో ప్రాంతానికి తరలించడం అంటే చాల కష్టమే, గాక భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల చిత్ర పరిశ్రమకు చెందిన వారు కొంచెం కష్టమయినా, కొన్ని కొత్త ఇబ్బందులు ఎదురయినా హైదరాబాదులోనే కొనసాగడం మేలనే అభిప్రాయంలో ఉన్నారు.   అయితే, రాష్ట్రం రెండుగా విడిపోవడంతో, సినిమా షూటింగ్, ఆడియో విడుదల, సెన్సార్, పంపిణీ, రిలీజ్ వంటి సాధారణ వ్యవహారాలు కూడా మరింత క్లిష్టంగా మారడమే కాకుండా, ఖర్చులు కూడా భారీగా పెరగక తప్పదు. తెలుగు సినిమాను ఇదివరకులా రెండు ప్రాంతాలలో నిర్మించుకోవడం, విడుదల చేసుకోవడం వంటి కార్యక్రమాలకి రెండు చోట్లా విడివిడిగా అనుమతులు, సెన్సారింగ్, పన్నులు, లెక్కలు అన్నీపాటించక తప్పదు. అంతిమంగా ఈ భారమంతా ప్రేక్షకుడే మోయవలసి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   ఇప్పటికే అనేక సమస్యలతో సతమత మవుతున్న సినీ పరిశ్రమకు ఈ సవాళ్ళను స్వీకరించి ముందుకు సాగడం నిజంగా చాలా కష్టమే. అయితే మనుగడ కోసం పోరాటం తప్పదు. గతంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలద్రొక్కుకొన్న మన తెలుగు సినీ పరిశ్రమ దీనిని కూడా తప్పకుండా ఎదురొడ్డి విజయం సాధిస్తుందని ఆశిద్దాము. అయితే, అందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కూడా తమ వంతుగా పూర్తి సహకారం అందించవలసి ఉంటుంది.

ఇకనయినా కేసీఆర్ ధోరణి మారేనా

  మూడు రోజుల క్రితం ‘ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవలసిందే’నంటూ హుకుం జారీ చేసిన కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ తో సహా అన్ని రాజకీయపార్టీల నేతలు, ఆంధ్ర ఉద్యోగులు, సీమంధ్ర ప్రజలు తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. నిన్నహైదరాబదులో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎవరిని వెళ్లిపోమ్మనలేదని కేవలం పద్ధతుల గురించి మాత్రమే మాట్లాడానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు.   గతంలో కూడా ఆయన సోనియాను దేవత అంటూ పొగిడేరు. మళ్ళీ అదే నోటితో ఆమెను, ఆమె వంశాన్ని నోటికొచ్చినట్లు దూషించారు. మళ్ళీ ఇప్పుడు అదే నోటితో ఆమెను దేవత అని పొగుడుతున్నారు. ఈవిధంగా తరచు అభిప్రాయలు మార్చుకొంటూ మాట్లాడటం వలన ఆయన ప్రతీసారి సంజాయిషీలు ఇచ్చుకోక తప్పని పరిస్థితి చాలాసార్లు ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెప్పవచ్చును.   ఈ సమావేశంలో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా తీవ్ర సమస్యలలో చిక్కుకోక తప్పదని హెచ్చరిస్తున్నవారికి తగిన జవాబు చెపుదామని ఆయన అన్నారు. ఆ తరువాత విద్య ఉపాధి అవకాశాల గురించి, వాటిలో వివిధ వర్గాలకి చెందిన ప్రజలకు అమలు చేయనున్న రిజర్వేషన్స్ గురించి ఆయన వివరించారు. ఆయన మీడియా సమావేశంలో ఎక్కడా అదుపుతప్పకుండా మాట్లాడి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకొన్నారు.   ఆయన తన ప్రసంగంతో తెలంగాణాలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ప్రయత్నం గట్టిగా చేసారు. అయితే, ఆయన ఏ అధికారిక హోదా లేకపోయిన్నపటికీ ఇన్ని వాగ్దానాలు చేయడం ఎందుకంటే, క్రమంగా మళ్ళీ తెలంగాణలో తన పునర్వైభవం సాధించడానికేనని చెప్పవచ్చును.   తెరాస ఉంటుందో లేక కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందో కూడా ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉన్న ఆయన ఇటువంటి ఒక రంగుల కలని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ, అన్ని వర్గాల వారికి వరాలు గుప్పిస్తూ, ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీటిలో ఆచరణ సాధ్యమయినవెన్ని? ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలవకుండా పోటీ చేసి అధికారంలోకి రాగలదా? కలిస్తే కాంగ్రెస్ పార్టీ చేత తన ప్రణాళికలన్నిటినీ ఆయన అమలు చేయించగలడా? లేదా? ఒక వేళ ఆయన పార్టీ కాంగ్రెస్ లో కలువకుండా అధికారంలోకి రాలేకపోతే ఆయన వీటినన్నిటినీ ఏవిధంగా అమలు చేస్తారు? వంటి అనేక ధర్మ సందేహాలను పక్కన బెడితే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే కంటే ఈవిధంగా మాట్లడటమే అందరికీ ఆనందం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.   తెలంగాణా రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన మాట్లాడితే అది సకారాత్మక ఆలోచనా ధోరణి అవుతుంది. దానిని అందరూ స్వాగతిస్తారు. తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలనే ఎవరయినా కోరుకొంటారు. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా కూడా అది దేశాభివృద్దే అవుతుంది. మరటువంటప్పుడు ఇంత కాలం ఒక్కతిగా ఉన్నఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఎవరయినా కోరుకొంటారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది తెలుగు జాతికి గర్వకారణమే అవుతుంది.   ఇంత కాలం తెలంగాణా సాధనకోసం కేసీఆర్ ఏవిధంగా మాట్లాడినా, కనీసం ఇప్పుడయినా ఆంధ్ర ప్రజల పట్ల తనకున్న ఏహ్య భావాన్నివిడిచిపెట్టి రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధిలోమాత్రమే పోటీతత్వం ప్రదర్శిస్తే తన తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మహోపకారం చేసినవారవుతారు.

రాష్ట్ర విభజన సమస్యకి పరిష్కారం లేదా

  ఊహిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన ప్రకటన అయితే వచ్చేసింది. ఇది కాంగ్రెస్ చరిత్రలో తీసుకొన్న అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమని కూడా చెప్పవచ్చును. దానికి వ్యతిరేఖత ఉంటుందని ముందే ఊహించినప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఉండటంతో, ఇంతగా ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ భావించి ఉండదు. దానికి మరో కారణం ఏమిటంటే, వైకాపా ఎదురుతిరిగినప్పటికీ, తెదేపా మాత్రం చివరి వరకు మౌనంగా ఉండటంతో ఆ పార్టీ తన లేఖకు కట్టుబడి ఉందని బహుశః కాంగ్రెస్ భావించి ఉండవచ్చును. కానీ, వైకాపా వ్యూహాత్మకంగా చేసిన రాజీనామాలతో అనంతపురంలో సమైక్యాగ్ని రగిలింది. దానితో తెదేపా నేతలు కూడా మళ్ళీ ఉద్యమం బాట పట్టక తప్పలేదు. దానికి తోడూ రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి అక్కడి ప్రజలను కాంగ్రేసే స్వయంగా రెచ్చగొట్టి పెద్ద తప్పు చేసింది.    అయితే, రాజీనామాలు చేసి ఉద్యమాలు చేస్తున్న సీమాంధ్ర నేతలెవరూ కూడా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడకపోవడం గమనార్హం. వారందరూ విభజన ప్రక్రియలో సీమంద్రా ప్రాంతానికి న్యాయం జరగాలని, హైదరాబాద్ రాజధానిపై హక్కులు కావాలని మాత్రమే కోరుతున్నారు. వారి మొదటి డిమాండ్ పై తెలంగాణా నేతలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, హైదరాబాద్ పై హక్కుల విషయంలో మాత్రం ఎంత మాత్రం రాజీకి సిద్దపడటం లేదు. ఈ అంశం మొదటి నుండి ఇరుప్రాంతల నేతలు భీష్మించుకొని కూర్చొన్నసంగతి తెలిసిందే. అయితే పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత కూడా ఆ సమస్యను ఇప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకోకపోతే రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఈ ఆవేశకావేశాలు ఎన్నటికీ చల్లారే అవకాశం ఉండదు. రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.   రాష్ట్ర విభజన చేసే హక్కు ఉత్తరాదివారికీ ఎవరిచ్చారని ప్రశించిన మన రాష్ట్ర నేతలు కనీసం ఈ సారయినా అటువంటి అవకాశం వారికి ఈయకూదదని నిజంగా భావిస్తే రాజకీయాలకి అతీతంగా రెండు ప్రాంతాలకు చెందిన మేధావులను సమావేశపరచి ఈ చిక్కు ముడులు ఏవిధంగా విప్పగలరో ఆలోచనలు చేయాలి. హైదరాబాద్ పై ఇటు సీమంధ్ర నేతలకి, ప్రజలకి ఎన్ని అనుమానాలున్నాయో, అవతలివైపు వారికి అన్నేఉన్నాయి. అందువల్ల  ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఒకరిపై మరొకరికి అనుమానాలున్న తరుణంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలం ఉంచి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడేలోగా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్దిష్ట గడువుతో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలుంటాయి.   అయితే, హైదరాబాదును  కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే స్థానిక నేతలు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండదు. గనుకనే వారు ఆ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తున్నట్లు భావించవచ్చును. అయితే ఎప్పుడు ప్రజలనే త్యాగాలు, ఉద్యమాలు చేయమని అడిగే నేతలు ఇటువంటి సమయంలో అవసరమయితే రాష్ట్ర హితాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది.    హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర నేతలకి ఇద్దరికీ కూడా దానిపై ఎటువంటి అధికారం, హక్కులు ఉండవు. చర్చలకు శాంతి యుత వాతావరణం ఏర్పరచడం చాల అవసరం. గనుక  హైదరాబాద్ ను కేంద్రం అధీనంలో ఉంచి సానుకూల వాతావరణంలో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.   తెలంగాణా నేతలు వారుకోరుకొన్న విధంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నారు గనుక, రెండు రాష్ట్రాల పునర్నిమాణం చకచకా జరగాలంటే, ఇరు ప్రాంతాల నేతలు కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అవసరముంది. లేకుంటే వారికి రాష్ట్రం ఏర్పడిందనే ముచ్చట ఉండదు. సీమంధ్ర ప్రజలకు సుఖశాంతులుండవు.

రాష్ట్ర విభజన ఒక సరి కొత్త ఆరంభమే

  రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమయిన ఘట్టం మొదలయింది. తెలుగు జాతి ఒక కంట ఆనందంతో చమర్చుతుంటే, మరో కంట దుఃఖంతో కన్నీరు కారుస్తోంది. ఇదొక విచిత్రమయిన అనుభూతే. కానీ, ఒకరినొకరు ద్వేషించుకొంటూ కలిసి బ్రతకడం కంటే, విడిపోయి సఖ్యతగా ఉండటమే మేలు. విడిపోవడం వలన రెండు రాష్ట్రాలకి ఎంత నష్టము ఉంటుందో, నేతలు చిత్తశుద్ది కనబరిస్తే అంతే లాభం కూడా ఉండవచ్చును.   మద్య ప్రదేశ్ నుండి విడిపోయిన ఛత్తీస్ ఘడ్, బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల వల్ల ఎటువంటి నష్టాలు, సమస్యలు ఉంటాయో సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే, మహారాష్ట్ర నుండి విడిపోయిన గుజరాత్ రాజకీయ నేతలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ద్రుడసంకల్పం, చిత్తశుద్ది ఉంటే ఏవిధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోవచ్చునో చాటి చెపుతోంది. అంటే రాష్ట్ర విభజనవల్ల లాభనష్టాలు సరిసమానంగా ఉంటాయని అర్ధం అవుతోంది. ఇప్పుడు రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా నేతలలో, ప్రజలలో ద్రుడసంకల్పం ఉంటే అభివ్రుద్ధిపదంలో దూసుకుపోవచ్చును. ఆ తెలివిడి, సంకల్పం లేకపోతే తిరోగమన పధంలోకి మరలినా ఆశ్చర్యం లేదు.   తెలంగాణా ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసిన వారిదే అవుతుంది. అదేవిధంగా ఇంతకాలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఇప్పటికయినా తాము చేసిన తప్పువల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి, మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధిలో ఒకదానితో మరొకటి పోటీ పడేవిధంగా తీర్చిదిద్దడం అత్యవసరం. మళ్ళీ రాజధానిని ఏర్పరిచిన ప్రాంతాన్నే అబివృద్ధి చేసుకుపోకుండా, అన్ని జిల్లాలలో అభివృద్ధి జరిగేలా ముందే ప్రణాళికలు రచించుకోవాలి.   ఇక రాష్ట్ర విభజన ఖాయం అయిపోయిన తరువాత కూడా దానిని వ్యతిరేఖించడం కంటే, రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా శ్రద్ధ చూపడం మంచిది. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకొన్నపటికీ, రెండు ప్రాంతాలకి చెందిన మేధావులు ఈ విషయంపైనే పూర్తి శ్రద్ధ చూపితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చును. తద్వారా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.   గతాన్ని తలుచుకొని చింతిస్తూ, ఒకరినొకరు నిందించుకొంటూ వెనకబడిపోవడం కంటే, భవిష్యత్తుపై దృష్టి లగ్నం చేసి ఆశావహకంగా ముందుకు సాగడమే విజ్ఞుల లక్షణం. అది మన రాజకీయ నేతలకి ఉందనే ఆశిద్దాము.

విభజన తరువాత పార్టీల యుద్ధ వ్యూహాలు

  కేంద్రం రేపు రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటించబోతున్నట్లు దిగ్విజయ్ సింగ్ ఖరారు చేసారు గనుక, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. కేంద్రం తన నిర్ణయం ప్రకటించిన వెంటనే, అన్నిరాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు అమలుచేయవచ్చును. కాంగ్రెస్ వ్యూహం: తన తెలంగాణా నేతల చేత ఆఖరి నిమిషంలో ‘తెలంగాణా సాధన సభ’ పెట్టించి 'కేవలం వారి కృషి, పోరాటాల కారణంగానే' ఏవిధంగా తెలంగాణా మంజూరు చేసి, తెలంగాణా ఇచ్చిన ఖ్యాతిని తన ఖాతాలో వ్రాసుకొందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తన సమైక్యాంధ్ర నేతల ద్వారా మరి కొంత కాలం ఉద్యమాలు వగైరా చేయించి, రాష్ట్ర ప్రజల కొరకు పోరాడుతున్న కీర్తిని కూడా తన ఖాతాలో పడినట్లు ఖాయం చేసుకొన్నతరువాత, వారితో చర్చలు, సమావేశాలు నిర్వహించి, మళ్ళీ ‘కేవలం వారి కృషి ఫలితంగానే’ రాష్ట్రానికి కొన్నిప్రత్యేక వరాలు మంజూరు చేయవచ్చును. తద్వారా రెండు రాష్ట్రాలలో ఓట్లు కొల్లగొట్టుకోవచ్చును. అయితే, ఇంత సాహసం చేసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందున, ఆంద్ర రాష్ట్రంలో తన నేతలను అదుపు తప్పకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకుంటే, దాని విపరీత పరిణామాలు తెలంగాణాలో ప్రతిఫలించి, తనకు దక్కవలసిన ఖ్యాతిని తెరాస తన్నుకుపోయే ప్రమాదం ఉంది.   వైకాపా వ్యూహం: అఖిలపక్షంలో వైకాపా లేఖ ఇచ్చినప్పటికీ, తెలంగాణాలో తన పార్టీని వదులుకోవడానికి సిద్దపడినందున, ఇక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి రాజకీయ లబ్ది పొందేందుకు, తన సమైక్యరాగాన్ని పూర్తి స్థాయిలో ఆలపిస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ నిర్భయంగా ఉద్యమాలు, ఆందోళనలు చేసుకోవచ్చును. తద్వారా తన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెదేపాలను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారిని తన ముగ్గులోకి లాగే ప్రయత్నం చేయడం ఖాయం. వారు గనుక ఆ ముగ్గులోకి వస్తే, తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. రాకుంటే ఆంద్ర ప్రాంతంలో వారిని ఆంధ్ర ద్రోహులుగా ముద్రవేసి పైచేయి సాధించే ప్రయత్నం చేయవచ్చును. రానున్న ఎన్నికలు అన్ని పార్టీలతో బాటు వైకాపాకు కూడా చాలా కీలకమే గనుక, రాష్ట్ర విభజనలో ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిపోతోందంటూ మరింత రెచ్చిపోవచ్చును. కానీ కాంగ్రెస్, తెదేపాలు తమ నేతలని, కార్యకర్తలని పూర్తిగా నియంత్రించుకోగలిగితే వైకాపా ఈ ఆలోచన కూడా బెడిసి కొట్టవచ్చును.   తెదేపా వ్యూహం: తెదేపా రెండు ప్రాంతాలలో తన ఉనికి నిలుపుకోవాలని కోరుకొంటున్నందున, అఖిలపక్షంలో తను ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉండవచ్చును. ఒకవేళ, వైకాపా గాలానికి చిక్కుకొని తెదేపా కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తే కాంగ్రెస్ తన వద్దనున్న లేఖను బయటపెట్టి నిలదీయవచ్చును. తద్వారా ఆ పార్టీపై తెలంగాణా వ్యతిరేఖ ముద్ర పడే అవకాశం ఉంది. కనుక తెదేపా అటువంటి ఆలోచన చేయకపోవచ్చును. కానీ, తేదేపాకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తన ఉనికిని కాపాడుకోవడం అంతే ముఖ్యం గనుక, అది నేరుగా రాష్ట్రవిభజనను వ్యతిరేఖించకపోయినప్పటికీ, విభజనలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పోటీ”లో తెదేపా కూడా పాల్గొనకతప్పదు. అయితే, తేదేపాకు రెండు ప్రాంతాలలో తన ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యం గనుక “పరిమిత పోటీ”కే ప్రాధాన్యం ఈయవచ్చును. లేకుంటే, అటు తెలంగాణాలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.   తెలంగాణా రాష్ట్రం తరపున కూడా కాంగ్రెస్, తెదేపాలు ఇదే సిద్ధాంతంతో పనిచేయవచ్చును. అందువల్ల ఒకసారి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు రెండు రాష్ట్రాలలో నదీ జలాల పంపకాలు, సరిహద్దులు, ఉద్యోగాలు, రాజధానిపై హక్కులు వంటి అనేక అంశాలపై తమతమ ప్రాంతాలకు పూర్తి న్యాయం చేకూర్చాలని కోరుతూ కొంత కాలం పాటు (బహుశః ఎన్నికల గంట మ్రోగేవరకు) ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నాలు చేయడం మాత్రం ఖాయం.