రాష్ట్ర విభజన సమస్యకి పరిష్కారం లేదా
posted on Aug 2, 2013 @ 4:15PM
ఊహిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన ప్రకటన అయితే వచ్చేసింది. ఇది కాంగ్రెస్ చరిత్రలో తీసుకొన్న అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమని కూడా చెప్పవచ్చును. దానికి వ్యతిరేఖత ఉంటుందని ముందే ఊహించినప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఉండటంతో, ఇంతగా ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ భావించి ఉండదు. దానికి మరో కారణం ఏమిటంటే, వైకాపా ఎదురుతిరిగినప్పటికీ, తెదేపా మాత్రం చివరి వరకు మౌనంగా ఉండటంతో ఆ పార్టీ తన లేఖకు కట్టుబడి ఉందని బహుశః కాంగ్రెస్ భావించి ఉండవచ్చును. కానీ, వైకాపా వ్యూహాత్మకంగా చేసిన రాజీనామాలతో అనంతపురంలో సమైక్యాగ్ని రగిలింది. దానితో తెదేపా నేతలు కూడా మళ్ళీ ఉద్యమం బాట పట్టక తప్పలేదు. దానికి తోడూ రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి అక్కడి ప్రజలను కాంగ్రేసే స్వయంగా రెచ్చగొట్టి పెద్ద తప్పు చేసింది.
అయితే, రాజీనామాలు చేసి ఉద్యమాలు చేస్తున్న సీమాంధ్ర నేతలెవరూ కూడా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడకపోవడం గమనార్హం. వారందరూ విభజన ప్రక్రియలో సీమంద్రా ప్రాంతానికి న్యాయం జరగాలని, హైదరాబాద్ రాజధానిపై హక్కులు కావాలని మాత్రమే కోరుతున్నారు. వారి మొదటి డిమాండ్ పై తెలంగాణా నేతలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, హైదరాబాద్ పై హక్కుల విషయంలో మాత్రం ఎంత మాత్రం రాజీకి సిద్దపడటం లేదు. ఈ అంశం మొదటి నుండి ఇరుప్రాంతల నేతలు భీష్మించుకొని కూర్చొన్నసంగతి తెలిసిందే. అయితే పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత కూడా ఆ సమస్యను ఇప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకోకపోతే రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఈ ఆవేశకావేశాలు ఎన్నటికీ చల్లారే అవకాశం ఉండదు. రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.
రాష్ట్ర విభజన చేసే హక్కు ఉత్తరాదివారికీ ఎవరిచ్చారని ప్రశించిన మన రాష్ట్ర నేతలు కనీసం ఈ సారయినా అటువంటి అవకాశం వారికి ఈయకూదదని నిజంగా భావిస్తే రాజకీయాలకి అతీతంగా రెండు ప్రాంతాలకు చెందిన మేధావులను సమావేశపరచి ఈ చిక్కు ముడులు ఏవిధంగా విప్పగలరో ఆలోచనలు చేయాలి. హైదరాబాద్ పై ఇటు సీమంధ్ర నేతలకి, ప్రజలకి ఎన్ని అనుమానాలున్నాయో, అవతలివైపు వారికి అన్నేఉన్నాయి. అందువల్ల ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఒకరిపై మరొకరికి అనుమానాలున్న తరుణంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలం ఉంచి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడేలోగా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్దిష్ట గడువుతో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలుంటాయి.
అయితే, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే స్థానిక నేతలు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండదు. గనుకనే వారు ఆ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తున్నట్లు భావించవచ్చును. అయితే ఎప్పుడు ప్రజలనే త్యాగాలు, ఉద్యమాలు చేయమని అడిగే నేతలు ఇటువంటి సమయంలో అవసరమయితే రాష్ట్ర హితాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర నేతలకి ఇద్దరికీ కూడా దానిపై ఎటువంటి అధికారం, హక్కులు ఉండవు. చర్చలకు శాంతి యుత వాతావరణం ఏర్పరచడం చాల అవసరం. గనుక హైదరాబాద్ ను కేంద్రం అధీనంలో ఉంచి సానుకూల వాతావరణంలో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణా నేతలు వారుకోరుకొన్న విధంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నారు గనుక, రెండు రాష్ట్రాల పునర్నిమాణం చకచకా జరగాలంటే, ఇరు ప్రాంతాల నేతలు కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అవసరముంది. లేకుంటే వారికి రాష్ట్రం ఏర్పడిందనే ముచ్చట ఉండదు. సీమంధ్ర ప్రజలకు సుఖశాంతులుండవు.