ఏటికి ఎదురీదనున్న చంద్రబాబు
posted on Aug 23, 2013 7:30AM
రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా, వైకాపాల పరిస్థితి చాలా అయోమయంగా మారింది. అయితే, వైకాపా చాలా దైర్యంచేసి తెలంగాణాను వదులుకొని సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ ఈ అయోమయ పరిస్థితుల నుండి త్వరగానే బయట పడగలిగింది. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న తెదేపా పరిస్థితి మాత్రం ఇంకా అయోమయం పరిస్థితిలోనే ఉంది.
సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర ఉద్యమాలుచేస్తుంటే మరో వైపు చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమనే చెప్పుకొంటున్నారు. ఈ పరిస్థితుల నుండి పార్టీని బయటపడేసేందుకు చంద్రబాబు ఈ నెల 25న విజయనగరం జిల్లా కొత్తవలస నుండి తన ఆత్మగౌరవ యాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఆయన బస్సు యాత్ర చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఈ సారి ఆయన తన బులెట్ ప్రూఫ్ వాహనంలో యాత్ర చేయబోతున్నట్లు సమాచారం. బహుశః ఇంటలిజన్స్ వర్గాల సూచనల మేరకే ఆయన బస్సుకు బదులు బులెట్ ప్రూఫ్ వాహనంలో యాత్ర చేస్తున్నట్లున్నారు.
ఆయన కొద్ది నెలల క్రితమే ప్రజలతో కలిసిపోతూ పాదయాత్ర చేసి, ఈ సారి మాత్రం బులెట్ ప్రూఫ్ వాహనంలో బయలుదేరడం వలన ప్రజలలో కొంత వ్యతిరేఖత ఏర్పడవచ్చును. అదేవిధంగా, ఆయన తన యాత్ర మొదలుపెట్టకమునుపే తనను విమర్శించేందుకు కాంగ్రెస్, వైకాపాలకు ఒక మంచి ఆయుధం అందజేసినట్లయింది.
ఆయన ఆత్మగౌరవ యాత్ర మూడు విడతలలో సాగుతుంది. మొదట ఉత్తరాంధ్ర ప్రాంతంలో 7రోజులు యాత్ర చేసిన తరువాత పదిరోజుల విరామం తీసుకొని మళ్ళీ రాయలసీమ జిల్లాలలో రెండు సార్లు యాత్ర చేస్తారు. ఆయన గతంలోనే తెలంగాణా ప్రాంతంలో పాదయాత్ర చేసి ఉన్నందున ఈసారి తెలంగాణా ప్రాంతాలను పర్యటించకపోవచ్చును.
అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన యాత్ర కేవలం సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయితే, తెదేపా కూడా తెలంగాణకు వ్యతిరేఖమనే భావన వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు సమైక్యాంధ్ర కోరుతూ చురుకుగా ఉద్యమాలలో పాల్గొనడం, నిన్న రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేసి బస్సు యాత్ర చెప్పట్టబోతున్నట్లు ప్రకటించడం వంటివి ఆ పార్టీ తెలంగాణా వ్యతిరేఖమనే భావన కల్పిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణా ప్రాంతంలో పర్యటించకపోతే ఆ అనుమానాలను ఆయన నిజం చేసినట్లవుతుంది.
ఆయన ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఅగ్నిగుండంగా మార్చిన వైనాన్నిప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర విభజనకు తెదేపాయే ప్రధాన కారణమనే కాంగ్రెస్ వైకాపాల ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయవచ్చును. కానీ సీమాంధ్ర నేతలు కొందరు ఆయన యాత్రను వ్యతిరేఖిస్తున్నట్లు సమాచారం. తెదేపా రాష్ట్ర విభజనకు అనుకూలమనే లేఖ ఈయడం వలన తాము సీమాంధ్ర ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టబోతున్నయాత్ర అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని వారు భయపడుతున్నారు.
ఏమయినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్ళాలనుకోవడం గొప్ప విషయమే. తన పాదయాత్రతో పార్టీని పటిష్టపరచుకొన్నచంద్రబాబు, ఇప్పుడు చేపడుతున్నఈ యాత్రతో పార్టీని ఒడ్డున పడేస్తారా లేక మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తారా చూడాలి.