విభజన తరువాత పార్టీల యుద్ధ వ్యూహాలు
కేంద్రం రేపు రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటించబోతున్నట్లు దిగ్విజయ్ సింగ్ ఖరారు చేసారు గనుక, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. కేంద్రం తన నిర్ణయం ప్రకటించిన వెంటనే, అన్నిరాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు అమలుచేయవచ్చును.
కాంగ్రెస్ వ్యూహం: తన తెలంగాణా నేతల చేత ఆఖరి నిమిషంలో ‘తెలంగాణా సాధన సభ’ పెట్టించి 'కేవలం వారి కృషి, పోరాటాల కారణంగానే' ఏవిధంగా తెలంగాణా మంజూరు చేసి, తెలంగాణా ఇచ్చిన ఖ్యాతిని తన ఖాతాలో వ్రాసుకొందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తన సమైక్యాంధ్ర నేతల ద్వారా మరి కొంత కాలం ఉద్యమాలు వగైరా చేయించి, రాష్ట్ర ప్రజల కొరకు పోరాడుతున్న కీర్తిని కూడా తన ఖాతాలో పడినట్లు ఖాయం చేసుకొన్నతరువాత, వారితో చర్చలు, సమావేశాలు నిర్వహించి, మళ్ళీ ‘కేవలం వారి కృషి ఫలితంగానే’ రాష్ట్రానికి కొన్నిప్రత్యేక వరాలు మంజూరు చేయవచ్చును. తద్వారా రెండు రాష్ట్రాలలో ఓట్లు కొల్లగొట్టుకోవచ్చును. అయితే, ఇంత సాహసం చేసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందున, ఆంద్ర రాష్ట్రంలో తన నేతలను అదుపు తప్పకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేకుంటే, దాని విపరీత పరిణామాలు తెలంగాణాలో ప్రతిఫలించి, తనకు దక్కవలసిన ఖ్యాతిని తెరాస తన్నుకుపోయే ప్రమాదం ఉంది.
వైకాపా వ్యూహం: అఖిలపక్షంలో వైకాపా లేఖ ఇచ్చినప్పటికీ, తెలంగాణాలో తన పార్టీని వదులుకోవడానికి సిద్దపడినందున, ఇక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి రాజకీయ లబ్ది పొందేందుకు, తన సమైక్యరాగాన్ని పూర్తి స్థాయిలో ఆలపిస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ నిర్భయంగా ఉద్యమాలు, ఆందోళనలు చేసుకోవచ్చును. తద్వారా తన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెదేపాలను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారిని తన ముగ్గులోకి లాగే ప్రయత్నం చేయడం ఖాయం. వారు గనుక ఆ ముగ్గులోకి వస్తే, తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. రాకుంటే ఆంద్ర ప్రాంతంలో వారిని ఆంధ్ర ద్రోహులుగా ముద్రవేసి పైచేయి సాధించే ప్రయత్నం చేయవచ్చును. రానున్న ఎన్నికలు అన్ని పార్టీలతో బాటు వైకాపాకు కూడా చాలా కీలకమే గనుక, రాష్ట్ర విభజనలో ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిపోతోందంటూ మరింత రెచ్చిపోవచ్చును. కానీ కాంగ్రెస్, తెదేపాలు తమ నేతలని, కార్యకర్తలని పూర్తిగా నియంత్రించుకోగలిగితే వైకాపా ఈ ఆలోచన కూడా బెడిసి కొట్టవచ్చును.
తెదేపా వ్యూహం: తెదేపా రెండు ప్రాంతాలలో తన ఉనికి నిలుపుకోవాలని కోరుకొంటున్నందున, అఖిలపక్షంలో తను ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉండవచ్చును. ఒకవేళ, వైకాపా గాలానికి చిక్కుకొని తెదేపా కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తే కాంగ్రెస్ తన వద్దనున్న లేఖను బయటపెట్టి నిలదీయవచ్చును. తద్వారా ఆ పార్టీపై తెలంగాణా వ్యతిరేఖ ముద్ర పడే అవకాశం ఉంది. కనుక తెదేపా అటువంటి ఆలోచన చేయకపోవచ్చును. కానీ, తేదేపాకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తన ఉనికిని కాపాడుకోవడం అంతే ముఖ్యం గనుక, అది నేరుగా రాష్ట్రవిభజనను వ్యతిరేఖించకపోయినప్పటికీ, విభజనలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పోటీ”లో తెదేపా కూడా పాల్గొనకతప్పదు. అయితే, తేదేపాకు రెండు ప్రాంతాలలో తన ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యం గనుక “పరిమిత పోటీ”కే ప్రాధాన్యం ఈయవచ్చును. లేకుంటే, అటు తెలంగాణాలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలంగాణా రాష్ట్రం తరపున కూడా కాంగ్రెస్, తెదేపాలు ఇదే సిద్ధాంతంతో పనిచేయవచ్చును. అందువల్ల ఒకసారి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు రెండు రాష్ట్రాలలో నదీ జలాల పంపకాలు, సరిహద్దులు, ఉద్యోగాలు, రాజధానిపై హక్కులు వంటి అనేక అంశాలపై తమతమ ప్రాంతాలకు పూర్తి న్యాయం చేకూర్చాలని కోరుతూ కొంత కాలం పాటు (బహుశః ఎన్నికల గంట మ్రోగేవరకు) ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నాలు చేయడం మాత్రం ఖాయం.