రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కు మోడీ కౌంటర్
posted on Aug 11, 2013 @ 10:09PM
అందరూ ఊహించినట్లుగానే హైదరాబాద్ లో నేడు జరిగిన నవ భారత్ యువ భేరీ సభలో మోడీ అందరినీ ఆకట్టుకొనే ప్రసంగం చేసారు. మోడీకి తెలంగాణా అంశం లేకుండా చేసామని సంబరపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నివ్వెరపోయేలా మోడీ ‘జై తెలంగాణా ! జై సీమంద్రా!’ అని నినదించి ప్రేక్షకులచేత కూడా నినదింపజేసారు. రెండు ప్రాంతాలు విడిపోయినా అభివృద్ధిలో పోటీపడి గుజరాత్ ను మించిపోవాలని తానూ మనసారా కోరుకొంటున్నానని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది తెలుగు ప్రజలు, గుజరాతీలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించగలుగుతున్నపుడు, హైదరాబాద్ నగరంలో వేలాది గుజరాతీలు తెలుగువారితో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవిస్తున్నపుడు, తెలుగువారు సాటి తెలుగువారితో, అదీ హైదరాబాదులో ఎందుకు కలిసి జీవించలేరని ఆయన ప్రశ్నించారు. తద్వారా అటు తెలంగాణా ప్రజలను, హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులను సంతోషపరచగలిగారు.
రాష్ట్ర విభజనపై తమ పార్టీ నేటికి నిశ్చితాభిప్రాయం కలిగి ఉందని, ఒకవేళ కాంగ్రెస్ గనుక ఇప్పుడు తెలంగాణా ఈయని పక్షంలో తాము రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తే వందరోజుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని దృడంగా చెప్పడం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాల నేతలకు ఆయన అభయ హస్తం ఇచ్చినట్లే భావించవచ్చును. తద్వారా ఆయన దేశావ్యాప్త పర్యటన మొదలుపెట్టక మునుపే ఆయా ప్రాంతాలలో తనకనుకూల వాతావరణం సృష్టించుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఆ పనిని శాస్త్రీయంగా, సజావుగా చేయకుండా, రాష్ట్ర ప్రజల మధ్య ఈవిధంగా ఎందుకు చిచ్చుపెట్టిందని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్, నిజంగా రాష్ట్ర విభజన చేసే ఉద్దేశ్యమే ఉండి ఉంటే, నాటి నుండే సీమంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానికి అవసరమయిన మౌలిక వసతులు కల్పించి సిద్దం చేసి ఉండేదని, కానీ ఆవిధంగా చేయకుండా నేడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, హడావుడిగా తెలంగాణా ప్రకటించేసి, మరో 10ఏళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని చెప్పడం ఆ పార్టీకి చిత్తశుద్ది, ముందు చూపు లేదని తెలియజేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాలలో సమాన అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఆయన వాగ్దానం చేసారు. రాష్ట్ర విభజనపై రావణ కాష్టంలా రగులుతున్నక్లిష్టమయిన అంశంపై మోడీ నేర్పుగా ఇరు ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ, ఎవరినీ తక్కువచేయకుండా ప్రసంగించి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు.
రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సందిగ్దంలో పడిన కాంగ్రెస్ పార్టీకి, ఒకవేళ ఆ పార్టీ తెలంగాణాపై మాట తప్పితే బీజేపీ వంద రోజుల్లో ఇస్తుందని ప్రకటించి మోడీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణపై వెనక్కిపోలేని విదంగా బందించారు. మోడీ సభకు కొద్ది రోజుల ముందుగానే హడావుడిగా తెలంగాణా ప్రకటించేసి మోడీకి ఇక తెలంగాణ అంశంపై మాట్లాడే అవకాశం లేకుండా చేసామని సంబరపడిన కాంగ్రెస్ పార్టీని, మోడీ అదే తెలంగాణా అంశంతో బంధించడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం.