బైరెడ్డి ఎంట్రీతో వేడెక్కనున్న సీమ రాజకీయాలు
ఇంతవరకు సీమాంధ్ర ప్రాంతంలో కేవలం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు జరుగుతోంది. కానీ రానున్న ఎన్నికలలో మరో కొత్త పార్టీ- రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ కూడా బరిలోకి దిగబోతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాయలసీమలోని 52 శాసన సభ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఆయన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుకొంటున్నపటికీ, ఆయన పార్టీ ఇంకా పూర్తిగా నిలద్రొక్కుకోనందున, తన డిమాండ్ నెరవేరే అవకాశం లేదని గ్రహించిన బైరెడ్డి తన వ్యూహంమార్చుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు పట్టణంలో సుప్రసిద్ద చారిత్రిక కట్టడం కొండారెడ్డి బురుజు వద్ద శనివారం నాడు 48 గంటల నిరాహార దీక్ష కూడా చేసారు.
ఆయన పార్టీ ప్రస్తుతం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల ముందు బలహీనంగా కనిపించవచ్చును. కానీ, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజాధానిగా రాయలసీమను గాక వేరే ఏ ఇతర ప్రాంతాన్నోఎంచుకొంటే, అది ఆయన పార్టీకి కలిసివచ్చేఅంశంగా మారవచ్చును. రాయలసీమ నుండి హేమాహేమీలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పాలించినప్పటికీ, రాయలసీమ పరిస్థితిలో ఇసుమంత మార్పు రాలేదు. ఇప్పుడు కనీసం రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారానయినా సీమ అబివృద్దికి శ్రీకారం చుట్టవచ్చునని బైరెడ్డి వాదన. సీమకు న్యాయం చేయాలనే ఆయన వాదనను అక్కడి ప్రజలెవరూ కాదనరు కూడా.
అందువల్లనే ఆయన సీమకు రాజధాని అనే నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఒకవేళ రాజధానిని సీమలో గాక వేరే ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అక్కడి ప్రజలు రాజధాని కోసం పోరాడుతున్నఆయన పార్టీవైపు మొగ్గే అవకాశం ఉంది. రాజధాని రేసులో ఇంతవరకు ఒంగోలు, గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతాలు, విశాఖ నగరాల పేర్లే తప్ప రాయలసీమ జిల్లాల పేర్లు వినపడటం లేదు. రాజధానికి నిర్మాణానికి అవసరమయిన భూములు కలిగి ఉన్నందున, మరియు భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉన్నకారణంగా ఒంగోలు పేరు ఖరారు అవవచ్చునని అంచనాలున్నాయి.
గనుక, రాయలసీమకు మళ్ళీ అన్యాయం జరుగిందనే బైరెడ్డి వాదనతో సీమ ప్రజలు కూడా ఏకీభవిస్తే, ఇంతవరకు మూడు ప్రధాన పార్టీలకు వేరే ప్రత్యామ్నాయం లేక వాటి మధ్యనే మూడు స్థంబాల ఆట ఆడుకొంటున్నసీమ రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీ వైపు ఆకర్షితులవ్వవచ్చును. అయితే బైరెడ్డి తన ఉద్యమాలతో, వాదనతో ప్రజలను ఏమేరకు ఆకట్టుకొంటారనే దానిపైనే అది అఆదారపడి ఉంటుంది. అదేవిధంగా పటిష్టమయిన క్యాడర్, ఆర్ధికంగా మంచి బలమయిన మూడు ప్రధాన పార్టీలను ఎదురొడ్డి డ్డీ కొని నిలిచే శక్తి కూడా తనలో ఉందని ఆయన నిరూపించుకోవలసి ఉంటుంది.
అయితే ఇప్పటికిప్పుడు ఆయన బలీయమయిన రాజకీయ శక్తిగా ఎదగలేక పోయినప్పటికీ, రాష్ట్రవిభజన తరువాత కూడా సీమ జిల్లాలు ఇదేవిధంగా నిర్లక్ష్యానికి గురయినట్లయితే, ఆయన పార్టీ కూడా తెరాస లాగే కాలక్రమంలో బలపడవచ్చును.కానీ అంతకంటే ముందు ఆయన పార్టీ రానున్న ఎన్నికలలో ఓట్లు చీల్చి మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంతో కొంత నష్టం చేకూర్చడం మాత్రం ఖాయం.