కాంగ్రెస్ అధిష్టానానికి స్టార్ బ్యాట్స్ మ్యాన్ గుగ్లీ
posted on Aug 9, 2013 @ 2:02PM
రాష్ట్ర విభజనను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వారం రోజుల తన మౌనవ్రతం వీడి అధిష్టాని నిర్ణయంతో తానూ ఏకీభవించట్లేదని నిన్నకుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సంకట స్థితిలో పడింది. తాను తెలంగాణకు వ్యతిరేఖం కాదంటూనే, నీటి వనరుల విభజన, రాజధాని అంశం, విద్యుత్, భౌగోళిక సరిహద్దులు, ఉద్యోగాలు, ప్రజల భద్రత తదితర అంశాలను కేంద్రం పరిష్కరించకుండా, కనీసం వివరణ ఈయకుండా రాష్ట్ర విభజనకు సిద్దపడటం మంచిది కాదని అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రమే అంతిమ నిర్ణయం తీసుకొంది గనుక, ఈ సమయాలను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్రానిదే అవుతుందని ఆయన స్పష్టం చేసారు. తానూ కేవలం రాష్ట్ర విభజన వల్ల ఏర్పడబోయే సమస్యలను ఎత్తి చూపుతున్నాను తప్ప అధిష్టాన నిర్ణయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించట్లేదని చెప్పారు.
దీనితో రాష్ట్ర విభజనపై చకచకా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డి బ్రేకులు వేసినట్లయింది. తన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ, విభజనకు అభ్యంతరం చెపుతున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించితే, ఇప్పటికే కేంద్రంపై ఆగ్రహంతో రగిలిపోతున్న సీమంద్రా ప్రజలను రెచ్చగొట్టినట్లవుతుంది. అలాగని, అయన మాటలను మన్నిస్తూ, రాష్ట్ర విభజన ప్రక్రియను ఏమాత్రం జాప్యం చేసినా తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
ఒకవేళ ఆంటోనీ కమిటీ ద్వారా ఆయన లేవనెత్తిన అన్ని సమస్యలకు జవాబు చెప్పించాలని చూసినా, స్థూలంగా విభజనను వ్యతిరేఖిస్తున్నఆయనను సమాదానపరచడం కష్టం. ఇక, ఈ పరిస్థితిలో ఆయన అభీష్టానికి వ్యతిరేఖంగా ముందుకు సాగితే, ఆయన గనుక స్వచ్చందంగా రాజీనామా చేసినట్లయితే, నామ మాత్రంగా ఉన్న ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం. అప్పుడు ఆ స్థానంలో ఎవరిని నియమించినా కూడా రెండో ప్రాంతం వారు తీవ్రంగా వ్యతిరేఖించడం, ఆ వర్గానికి చెందిన మంత్రులు శాసన సభ్యులు రాజీనామాలు చేయడం ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడటం అసంభవం గనుక, ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేయవలసి ఉంటుంది.
కానీ, ఆవిధంగా చేస్తే కేంద్రం ఎవరి మాట వినకుండా మొండిగా విభజన చేస్తోందని సీమంధ్ర ప్రజలలో వ్యతిరేఖ భావనలు కలగడం సహజమే. ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీరని నష్టం చేయవచ్చును. గనుక కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై మరింత జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటుంది. రేపు విభజన తరువాత ముఖ్యమంత్రి చెపుతున్న సమస్యలు నిజంగా ఎదురయితే అప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిందించడం ఖాయం. తెలంగాణా ఏర్పడిన సంతోషంలో అక్కడి ప్రజలు కొంత కాలం ఈ సమస్యలని పట్టించుకోకపోయినా, సీమంధ్ర ప్రాంత ప్రజలు మాత్రం ఆ సమస్యలపై మరో పోరాటం మొదలుపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే, చిరకాలం పాటు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, శత్రుత్వం ఏర్పడవచ్చును.
ఇక, ముఖ్యమంత్రే సమైక్యాంధ్ర కోరుతూ మాట్లాడిన తరువాత ఇంకా పదవులను అంటిబెట్టుకొనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులపై కూడా తీవ్రమయిన ఒత్తిడి పెరగడం ఖాయం. ముఖ్యమంత్రి తన నిర్ణయంతో వారు కూడా తన బాటలోనే నడువక తప్పని పరిస్థితి కల్పించారు. అదే జరిగితే కేంద్రం రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇంతవరకు వచ్చిన తరువాత తెలంగాణా ప్రక్రియను ఆపితే తెలంగాణా నేతలందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసీవకాశం ఉంది. అదే జరిగితే, రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలో రాజకీయ లబ్ది పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టబోయే ప్రమాదం ఉంది.
అంతే గాక తన ఎత్తులతో నిర్వీర్యం చేసామనుకొన్నతెరాసకు మళ్ళీ చేజేతులా బలం చేకూర్చినట్లవుతుంది. అందువల్ల కాంగ్రెస్ మరోసారి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. బహుశః రాష్ట్రపతి పాలన విదించి, ఆంటోనీ కమిటీని మరింత విస్తృత పరిచి ఒకవైపు సీమంధ్ర నేతలతో చర్చలు సాగిస్తూనే విభజన ప్రక్రియ కొనసాగించవచ్చును.
లగడపాటి చెపుతున్న స్టార్ బ్యాట్స్ అధిష్టానానికి వేసిన ఈ గుగ్లీని (బ్రహ్మాస్త్రాన్ని) ఏవిధంగా ఎదుర్కొంటుందో త్వరలోనే తెలిసిపోతుంది.