ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయిన ప్రతిపక్షాలు

  కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, యుపీయే ప్రభుత్వంలో బయటపడుతున్న కుంభకోణాలను, అవినీతి భాగోతాలను ఎప్పటికప్పుడు పార్లమెంటులో గట్టిగా ఎండగడుతూ అవినీతికి పాల్పడిన మంత్రులను ఇంటికి సాగనంపడంలో విజయవంతం అవుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, తెరాస, మరియు వైయస్సార్ కాంగ్రెస్ మూడు కూడా ఈవిషయంలో విఫలమవుతున్నాయి.   ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ మూడు పార్టీలు కూడా అంతర్గత కలహాలతో, వలసలతో సతమతమవుతూ, ఇంటిని చక్కదిద్దుకొనే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం వెనకేసుకువస్తున్న సీబీఐ చార్జ్ షీటుకెక్కిన మంత్రులను బయటకి పంపించడంలో ఘోరంగా విఫలమయింది.   ఇంతవరకు పాదయాత్రలు, ఇప్పుడు పార్టీలో వలసలు, అంతర్గత కలహాలపైనే ఆపార్టీ దృష్టి కేంద్రీకరించకరించడంతో ఆ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే తీరిక శ్రద్ద రెండూ లేకుండాపోయాయి.   ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్యలకి అదనంగా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలు, బెయిలు అంశాలతో తీరిక లేకుండా ఉంది.   తెరాస అధినేత కేసీఆర్ కి ఇప్పుడు పూర్తిగా ఎన్నికల మైకం కమ్మి ఉన్నందున, ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కూడా తీరికదొరకడంలేదు.   అందువల్లనే రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన మంత్రుల్ని అంత దైర్యంగా వెనకేసుకురాగలుగుతోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసినపుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులు, కేసుల గురించి భయపడలేదు. కానీ, ఈ విషయంలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలని బెంగపెట్టుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అటువంటి బెంగలేమి పెట్టుకొనవసరం లేదని ప్రతిపక్షాలు ఋజువు చేసాయి.   కానీ, కేంద్రంలో ప్రతిపక్షాల ఒత్తిడితో యుపీయే ప్రభుత్వం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికిన తరువాత తెదేపాలో మాత్రం కొంత చలనం వచ్చినట్లుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ ఒక వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్నారు. అయితే, కళంకిత మంత్రులను తొలగించేందుకు ప్రభుత్వంపై సరయిన ఒత్తిడి తేకుండా ఏదో మొక్కుబడిగా చేయడం వలన ఏ ప్రయోజనం లేదు.   రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు చార్జీల పెంపుకు ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపక్షాలన్నీ తమ పోరాటపటిమ చూపించి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కరెంటు చార్జీల పెరుగుదలలో (కేవలం 200 యూనిట్ల వరకు మాత్రమే) కొంతయినా వెనక్కి తగ్గేలా చేయగలిగారు. కానీ అదే పోరాటపటిమని ప్రభుత్వం మళ్ళీ వెంటనే వడ్డించిన సర్ చార్జీలను తగ్గించడం విషయంలో మాత్రం చూపలేకపోయాయి.   ప్రతిపక్షాలు తమలో తాము కలహించుకొంటూ, అంతర్గత విభేదాలతో సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నీడలో కళంకిత మంత్రులు హాయిగా సేద తీరుతున్నపటికీ, తన ప్రభుత్వం స్వచ్చమయిన ప్రజా సంక్షేమ ప్రభుత్వమని గట్టిగా బల్లగుద్ది మరీ చాటింపు వేసుకోగలుగుతున్నారంటే అది ప్రతిపక్షాల వైఫల్యమే. తమకే ఓటువేసి గెలిపించాలని కోరుతున్న ఈ మూడు పార్టీలు కనీసం ప్రతిపక్ష పార్టీలుగా కూడా సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తించలేన్నపుడు, ఇక ప్రజలు వారికి ఓటేసి అధికారం కట్టబెట్టాలని ఆశించడం దురాశే అవుతుంది.

చంద్రబాబు! పాదయాత్రకి ముందు తరువాత

  చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టే ముందు, కొనసాగుతున్నపుడు, పూర్తయిన తరువాత పూర్తి విభిన్నమయిన ఆలోచనా ధోరణి కనబరిచారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టే ముందు పార్టీపై తెలంగాణా ప్రభావం పట్ల చాలా ఆందోళన చెందారు. తెలంగాణా ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టే సమయానికే కేంద్రం తెలంగాణపై అఖిలపక్షం వేయడంతో ఆయన తమ పార్టీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా బయట పెట్టవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఆ ఆందోళన ఇంకా పెరిగింది.   అయితే, తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకొని, కేంద్రానికి ఆమేరకు లేఖ అందజేసిన తరువాత, సీమంద్రా ప్రాంతం నుండి దిక్కార స్వరాలూ వినిపిస్తాయని ఆందోళన చెందినప్పటికీ, ఆయన రెండు ప్రాంతాల నేతలతో ముందుగానే ఈ విషయంపై చర్చించి ఉండటంతో పార్టీలో ప్రశాంతత నెలకొంది. ఇక అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నందుకు తెలంగాణా ప్రాంతంలో ఆయన ఊహించిన దానికంటే మంచి సానుకూల స్పందన కనిపించడంతో, ఆయనలో మళ్ళీ మునుపటి ఉత్సాహం, ఆత్మ విశ్వాసం కనబడ్డాయి. పార్టీ అధినేతలో కనిపిస్తున్న ఆ మార్పుకి పార్టీ శ్రేణులు కూడా అంతే సానుకూలంగా స్పందించాయి. నిజం చెప్పాలంటే, ఆయన పాదయాత్ర ఆంధ్రా ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ప్రోత్సాహకరంగా ఉందని చెప్పవచ్చును.   పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన ఆయనకు, అక్కడ స్థానిక నేతలయిన కేశినేని, వల్లభనేని తదితర నేతల మద్య గొడవలు ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చాయి. ఆయన తాత్కాలికంగా సమస్యని సర్దుబాటు చేసినప్పటికీ అవి నివురుగప్పిన నిప్పులా మిగిలే ఉన్నాయి. ఆ తరువాత వరుసగా గుంటూరు, విశాఖ జిల్లాలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవడంతో ఆయన పార్టీ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందారు.   అదే సమయంలో వైకాపా తన ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో నందమూరి కుటుంబానికి, పార్టీకి మధ్య చిచ్చుపెట్టడంతో ఆయన ఏవిధంగా స్పందించాలో తెలియని పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. అయితే సరిగ్గా అప్పుడే బాలకృష్ణ రంగప్రవేశం చేసి వైకాపాకు, వారి వ్యుహలకు స్పందించని తన సోదరుడు హరికృష్ణకు, అతని కుమారుడు జూ.యన్టీఆర్ కు కొంచెం ఘాటుగానే జవాబు చెప్పి చంద్రబాబే తెదేపా నాయకుడని నిర్ద్వందంగా ప్రకటించి పార్టీలో నెలకొన్న అయోమయం దూరం చేసారు. ఆ తరువాతనే పార్టీ తిరిగి గాడిన పడిందని చెప్పవచ్చును.   అయితే వివిధ జిల్లా నేతల మద్య టికెట్స్ కోసం గొడవలు కొనసాగుతూనే ఉండటంతో, అసలు రాబోయే ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా లేమా? అనే అనుమానం కూడా వ్యక్తం చేసారంటే చంద్రబాబు ఎంతగా ఆందోళన చెందారో అర్ధం అవుతుంది. నేతలందరూ కుర్చీలలో కర్చీఫులు వేసి కూర్చొంటే పార్టీ టికెట్స్ దక్కవని అందరూ తమ విభేదాలు, స్వంత పనులను కూడా పక్కన బెట్టి పనిచేయకపోతే రాబోయే ఎన్నికలలో గెలవడం కష్టమని ఆయనే తేల్చి చెప్పారు.   ఆయన అంత కటువుగా చెప్పిన తరువాత నాయకులలో కూడా కొంత మార్పు కనబడింది. అంతవరకు పార్టీపై అలిగి దూరంగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి నేతలు దారిలోకి వచ్చి విశాఖలో పాదయాత్ర ముగింపు సభని అనుకొన్న దానికంటే ఘనంగా నిర్వహించారు. ఆ సభకు వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన కార్యకర్తలను, నేతలను, వేలాది ప్రజలను చూసిన తరువాత మళ్ళీ చంద్రబాబులో ఆత్మవిశ్వాసం, పార్టీ విజయం పట్ల నమ్మకం ప్రస్పుటంగా కనిపించాయి.   కొద్ది రోజుల క్రితం దాడి వీరభద్ర రావు, ఈరోజు కడియం శ్రీహరి ఇద్దరూ కూడా పార్టీని వీడినప్పటికీ, చంద్రబాబు “నేతలు పార్టీని వదిలిపోయినంత మాత్రాన్న మనమేమి భయపడనవసరం లేదు. పార్టీ కార్యకర్తలనుండి కొత్త నాయకులను మనం తయారు చేసుకొందాము. దానివల్ల పార్టీ మరింత బలపడుతుందని ధృడంగా చెప్పడం పార్టీ నేతలకు సైతం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా “పార్టీనుండి ఇంకా ఎంతమంది బయటకి పోవడానికి సిద్దంగా ఉన్నారో వారి పేర్ల లిస్టు కూడా తనవద్ద సిద్దంగా ఉందని, వారు కూడా వెళ్ళిపోతే కొత్త టీమును ఏర్పాటు చేసుకొంటానని” ఆయన చెప్పడం ఆయనలో స్పష్టమయిన మార్పు వచ్చినట్లు తెలియజేస్తోంది.

చిరంజీవి సెక్యురిటీ సిబ్బంది దుర్వినియోగం

  చిరంజీవి సెక్యురిటీ సిబ్బంది దుర్వినియోగం గత ఆదివారం టాలివుడ్ నటుడు రాం చరణ్ తేజ్ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన తండ్రి సెక్యురిటీ సిబ్బంది చేత చితక బాదించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ తానూ అసలు కారు లోంచి కాలు క్రిందకు పెట్టలేదని, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో ఎటువంటి వాగ్వాదం చేయలేదని, తన సెక్యురిటీ సిబ్బంది ఆ యువకులకు నచ్చజెప్పబోతే వారు తిరగబడినందుకే తన సిబ్బంది కూడా వారిని కొట్టారని, జరిగిన దానిలో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినప్పటికీ కూడా తానూ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేస్తే వారి ఉద్యోగాలు పోతాయని జాలితో పిర్యాదు చేయలేదని వారిపట్ల ఔదార్యం కూడా ప్రకటించాడు. ఈ విషయం మీడియాలో రాకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ తనను ఇద్దరు విలేఖరులు బ్లాక్ మెయిల్ చేసినా కూడా లొంగకపోవడంతో, వారు చివరికి ఈ విధంగా మార్ఫింగ్ చేయబడిన తన ఫోటోలు మీడియాలో ప్రచురించారని అతను ఆరోపించాడు. ఆ యువకులు క్షమాపణ కోరారని కూడా చెప్పాడు.   కళ్ళకు కట్టినట్లు వాస్తవాలన్నీ కనబడుతున్నపటికీ, రామ్ చరణ్ తేజ్ ఈ విధంగా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం చెపుతూ తన పరువే కాక తన తండ్రి పరువు కూడా తీస్తున్నాడు. ఇక ఈ సంఘటనలో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కేంద్రమంత్రి చిరంజీవికి ప్రభుత్వం కేటాయించిన ఇంటలిజన్స్ సెక్యురిటీ విభాగానికి చెందిన ఇద్దరు సెక్యురిటీ గార్డులు తమకు కేటాయించిన విధులను పక్కన పెట్టి, మంత్రిగారి కొడుకును రక్షించేందుకు పరుగున రావడమే కాకుండా, ఇద్దరు పౌరులను నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే చితక బాదారు.   ఈ విధంగా ఒక మంత్రికి కేటాయించిన సెక్యురిటీ సిబ్బందిని సదరు మంత్రి కొడుకే దుర్వినియోగ పరచడం ఒక తప్పయితే, ఉగ్రవాదులు లేదా నక్సలయిట్ల నుండి మంత్రిని రక్షించడానికి మాత్రమే నిర్దేశించబడిన సెక్యురిటీ సిబ్బంది మంత్రి గారి కొడుకు కోసం ప్రజలను చితకబాదడం మరో పెద్ద తప్పు. అయినప్పటికీ, ఈ విషయంలో ఇంతవరకు చిరంజీవి కానీ, ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గానీ, చివరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఎవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే తప్పుచేసిన వాడు అసమదీయుడు గనుక. ఈ విషయంలో పోలీసులు కూడా వారికి తగిన విధంగానే ప్రవర్తిస్తున్నారు.   ఇటీవల ముకేష్ అంభానీకి ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై వివాదం చెలరేగినప్పుడు, సుప్రీంకోర్టు కలుగజేసుకొని వీ.ఐ.పీ. వ్యక్తులందరికీ ప్రజాధనంతో సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదులు లేదా నక్సలయిట్ల నుండి ఎటువంటి ముప్పు లేని వీ.ఐ.పీ. వ్యక్తులకు ఏర్పాటు చేసిన సెక్యురిటీ సిబ్బందిని వెంటనే ఉపసంహరించాలని కోరింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు చేత పదేపదే మొట్టికాయలు తినడానికి అలవాటుపడిపోయిన ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో చిరంజీవికి ఏర్పాటు చేసిన సెక్యురిటీ సిబ్బంది, ఆయన మెప్పు పొందేందుకు తమ పరిదులు దాటి అతిగా ప్రవర్తించారు. ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి.

సామాన్యుడిపై మెగా ప్రతాపం

  చట్టం దృష్టిలో కొందరు అధిక సమానులని మన దేశంలో ఇప్పటికి చాలాసార్లే రుజువయింది. తన కారుకి దారివ్వలేదని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై ఆగ్రహించిన మగధీరుడు రామ్ చరణ్ తేజ్, తన అంగరక్షకులను రప్పించి వారిని నడిరోడ్డు మీదే అందరు చూస్తుండగానే చితక బాధించాడు. అప్పుడు ఆ యువకులిద్దరూ అతనిపై పిర్యాదు చేద్దామని పోలీసు స్టేషన్ కి వెళ్ళినప్పటికీ, సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఏమి జరుగుతుందో గ్రహించిన వారు, అతనిపై పిర్యాదు చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో చాలా ముందుచూపు కనబరుస్తూ, వారిరువురికీ రామ్ చరణ్ పట్ల ఎటువంటి పిర్యాదులు లేవని ఒక లేఖ వ్రాయించుకొని వదిలిపెట్టారు.   దానిపై రామ్ చరణ్ స్పందిస్తూ, “ఆ యువకులు నా దృష్టిని ఆకర్షించాలనే ఆ విధంగా చేసినట్లు వారు ఒప్పుకొనారు. జరిగినదానికి వారు నాకు క్షమాపణలు కూడా చెప్పారు. పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని చాలా చక్కగా నిర్వహించారు” అని మీడియాతో అన్నారు.   అయితే, రామ్ చరణ్ అంగరక్షకుల చేతిలో దెబ్బలు తిన్న అడవి ఫణీష్ మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా ఇటువంటి కేసుల్లో చివరికి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. నేనొక సామాన్య మద్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్న నాకు, డబ్బు, సమాజంలో పరపతి ఉన్న కేంద్రమంత్రి కొడుకయిన రాం చరణ్ తేజ్ వంటి వ్యక్తిని కోర్టుకు రప్పించి అతనికి శిక్షపడేలా చేయగల శక్తి, ఆర్ధిక స్తోమత నాకు లేదు. ఒకవేళ నేను అతనిపై కేసు వేసినా, నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరికి నా ఉద్యోగం పోగొట్టుకోవడం తప్ప నాకు న్యాయం జరగదని తెలుసు. పైగా ఇటువంటి కేసులు ఏవిధంగా ముగుస్తాయో అందరికీ తెలిసిందే గనుక నేను కేసు వేయలేదు. నేను రాం చరణ్ తేజ్ కి క్షమాపణ చెప్పాననడం అబద్ధం. అతను నన్ను తన అంగరక్షకులతో చితక బాధించినందుకా నేను క్షమాపణ చెప్పాలి?” అంటూ పలికిన అతను సమాజంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టాడు. అతను చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజమని ఒప్పుకోక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.   అయితే, అతను ఈ పోరాటంలో ఓటమి అంగీకరించి తప్పుకొన్నపటికీ, చిరంజీవిని వ్యతిరేఖించే కొందరు రాజకీయ నేతలు రామ్ చరణ్ తేజ్ కి వ్యతిరేఖంగా కోర్టులో కేసు వేస్తే తాము అతనికి అండగా నిలబడతామని ముందుకు వచ్చినప్పటికీ, ఆ యువకుడు మరింత పరిణతి కనబరుస్తూ వారి రాజకీయ చదరంగంలో పావుగా మారదలుచుకోలేదని నిర్ద్వందంగా చెప్పడం మెచ్చుకోవలసిన విషయం.   ఫణీష్ ఎటువంటి పిర్యాదు చేయదలచుకోనప్పటికీ, అతనికి జరిగిన అన్యాయానికి స్పందించిన హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న సలీం అనే వ్యక్తి రామ్ చరణ్ తేజ్ మరియు అతని అంగరక్షకులపై మానవ హక్కుల సంఘంలో నిన్న పిర్యాదు చేసారు. ఆయన పిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల సంఘం చైర్మన్ హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ని వచ్చేనెల 8వ తేదీలోగా ఈ ఘటనపై నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. అయినప్పటికీ, అనేక ఇతర కేసులలో లాగానే ఇది కూడా కొన్ని రోజుల తరువాత బుట్ట దాఖలవుతుందని ఫణీష్ నమ్మకం వమ్ము కాదని చెప్పవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, సినిమాలలో ఎంతో ఉద్దాతంగా కనిపించే హీరో రామ్ చరణ్ తేజ్, నిజ జీవితంలో మాత్రం విలన్ గా మిగిలిపోయాడు. కనీసం అతను ఇప్పటికయినా తన హీరో బేషజం పక్కన బెట్టి జరిగిన తప్పును నిజాయితీగా ఒప్పుకొని ఆ యువకులకు క్షమాపణలు చెపితే ఆయన ప్రతిష్టకు భంగం కాదు. పైగా పెరుగుతుంది కూడా. గతంలో డా. రాజశేఖర్ దంపతులపై తన అభిమానులు దాడి చేసినట్లు తెలియగానే చిరంజీవి స్వయంగా వారింటికి వెళ్లి క్షమాపణలు చెప్పడం గమనిస్తే రాం చరణ్ కి తాను ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం అవుతుంది.

కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం

  చాలా రోజులుగా ఎదురు దెబ్బలే తప్పసానుకూలమయిన పరిస్థితులేవీ కనుచూపుమేర కనబడక దిగాలుపడిఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాదించడం చాలా ఊరటనివ్వడమే కాకుండా కొండంత బలం కూడా ఇచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్నపుడే ప్రతిపక్షాలను పూచికపుల్లతో సమానంగా తీసిపారేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కర్ణాటకలో ఘనవిజయం సాదించిన తరువాత మరింత హీనంగా తీసిపారేస్తుంది.   కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రభుత్వ వ్యతిరేఖ ఓటువల్ల వచ్చిందే తప్ప, కాంగ్రెస్ గొప్పతనం చూసి వేసిందికాదు. ప్రజలకి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమకు ఓటు వేసి గెలిపించారని కాంగ్రెస్ పార్టీకి కూడా స్పష్టంగా తెలిసినప్పటికీ, ప్రజలు తమ సమర్ధమయిన, స్వచ్చమయిన పాలన, ప్రజాసంక్షేమ పధకాలను చూసి మెచ్చుకొని, నచ్చుకొన్నారని తనను తానూ మభ్య పెట్టుకొంటూ, ప్రజలను, అటు బీజేపీని కూడా మభ్య పెట్టాలని తప్పక ప్రయత్నిస్తుంది. బీజేపీకి కూడా ఆ సంగతి స్పష్టంగా తెలిసినప్పటికీ తేలుకుట్టిన దొంగలా కాంగ్రెస్ దెబ్బలను మౌనంగా భరించక తప్పదు.   ఇంతవరకు బీజేపీ పార్లమెంటులో కాంగ్రెస్ కి చెందిన కళంకిత మంత్రులను తొలగించాలని గట్టిగా వాదిస్తున్నపటికీ, కర్ణాటకలో ఎదురయిన పరాజయంతో ఆ పార్టీ కొంచెం జోరు తగ్గించవచ్చును. అప్పుడు విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఎదురుదాడి మొదలు పెట్టవచ్చును. ఇక, ప్రజాకోర్టులో తాము నేగ్గేము గనుక అదే తమ నీతి నిజాయితీలకి గీటు రాయని నమ్మబలుకుతూ ఇక ప్రతిపక్షాల విమర్శలను, రాజీనామా డిమాండ్ లను, సుప్రీం కోర్టు మొట్టి కాయలను కూడా కాంగ్రెస్ ఖాతరు చేయకపోవచ్చును.   ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే, వరుసగా మూడు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించి ఓటమి చవిచూసిన ఆయనకి ఈ విజయం చాలా ఊరటనిస్తుంది. ఆయన తెలివితేటలు, వ్యూహ రచనల వలననే కాంగ్రెస్ ఇంత ఘనవిజయం సాదించిందని, నేటి నుండి పార్టీలో ఆయన భజన మొదలయిపోతుంది. అయితే, ఎన్నికల గంట మ్రోగక ముందు నుండే కర్ణాటకలో పరిస్థితులు బీజేపీకి వ్యతిరేఖంగా, కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమయిన సంకేతాలున్నందున, ఈ విజయంలో రాహుల్ గాంధీ పాత్ర కేవలం నిమ్మితమాత్రమయినదని చెపితే ఆయన భజనదళ సభ్యులకు ఆగ్రహం కలుగవచ్చును. ఏమయినప్పటికీ, ఈ ఎన్నికలలో విజయం వలన రాహుల్ గాంధీలో ఆత్మస్థయిర్యం తప్పక పెరుగుతుంది.   ఇక, ఈ ఎన్నికల విజయంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త ఉత్సాహం ఏర్పడవచ్చును. అయితే, ఈ ఘనకీర్తిని తమ ఖాతాలో వేసుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి తదితరులు పోటీపడవచ్చును. ఇప్పటికే మంత్రి రామచంద్రయ్య “చిరంజీవి ముఖ్యమంత్రి పదవికి అర్హుడని చెప్పడానికి ఇంతకంటే ఏమి రుజువు కావలి?” అని అడగడం ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి మాటల యుద్ధాలు మరింత పెరగవచ్చును.

యన్టీఆర్ అందరి వాడు మరి వైయస్స్ఎవరి వాడు?

  నేడు డిల్లీలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణతో యావత్ తెలుగుజాతి చాలా సంతోషించింది.ఈ రోజు పార్లమెంటులో ఆయన విగ్రహావిష్కరణకు హాజరయిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరవడం ఆయన పట్ల వారికి ఉన్న గౌరవానికి అద్దం పడుతోంది. అంతకు ముందువరకు ఒకవైపు నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పురందేశ్వరి ఆయనను మా వాడంటే మావాడని యుద్ధం చేశారు. మద్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రంగ ప్రవేశం చేసి ఆ పార్టీ ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ “ఆయన అందరి వాడు, యావత్ తెలుగు ప్రజలకి చెందినవాడని” పెద్ద యుద్ధమే చేసింది.   ఇక నందమూరి అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనను సాక్షాత్ దివి నుండి భువికి దిగివచ్చిన శ్రీకృష్ణ భగవానుడని నమ్మి పూజలు కూడా చేస్తుంటారు. తెలుగు భాషాభిమానులకు ఆయనను ఒకందుకు ఇష్టపడితే, కళాకారులు, సినీ రంగంవారు ఆయనను మరో కారణంతో ఇష్టపడతారు. ఆయనను వేర్వేరు అంశాల ఆధారంగా అందరూ కూడా ఆయనను అభిమానిస్తుంటారు. ఇక నందమూరి కుటుంబ కధా నాయకులకు, ముఖ్యంగా బాలకృష్ణ, జూ.యన్టీఆర్, తారక్, కళ్యాణ్ తదితరులకు ఆయన పేరు తలవందే పొద్దు గడవదు.   ఇక తెలుగుదేశం పార్టీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటోంది. చివరికి ఆయన తీవ్రంగా వ్యతిరేఖించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన అభిమానులే అంటే అతిశయోక్తి కాదు.   ఇక మాజీ ముఖ్య మంత్రి డా. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయనను, ఆయన కీర్తి ప్రతిష్టలను, చివరికి ఆయన ప్రవేశ పెట్టిన పధకాలను కూడా స్వంతం చేసుకోవడానికి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చాలా పోటీ పడ్డాయి. కానీ కాలక్రమంగా, ఆయన జమానాలో జరిగిన అవినీతి భాగోతాలు ఒకటొకటిగా బయటపడుతుండటంతో మెల్లిగా కాంగ్రెస్ పార్టీ ఆయనను, ఆయనకు సంబందించిన ప్రతీ జ్ఞాపకాన్ని వదిలించుకొని బయటపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.   ఇక, అదేవిధంగా ఒకనాడు ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని భజన చేసిన మంత్రులు ఆనం రామినారాయణ రెడ్డి వంటి వారు ఆయనను నేడు ఒక పెద్ద దగాకోరుగా అభివర్ణిస్తున్నారు. ఆయన వలననే తామంతా ఈ రోజు సీబీఐ ఉచ్చులో చిక్కుకొన్నామని సబితా ఇంద్రారెడ్డి, గీత రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, మోపిదేవి వెంకట రమణ తదితర మంత్రులు, శ్రీలక్ష్మి తదితర ఐఏయస్ అధికారులు ఆయనను నిందిస్తున్నారు.   తెలంగాణా మంత్రులు, తెరాస నేతలు ఆయన తమ ప్రాంత ప్రజల పొట్టకొట్టి, నీళ్ళు దోచుకొన్న దొంగ అని నిందిస్తున్నారు. ఇక మీడియాలో కేవలం సాక్షి తప్ప, మిగిలినవన్నీ కూడా ఆయన అవినీతి భాగోతాలను కధలు కధలుగా వర్ణిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్క జగన్ పార్టీకి తప్ప ఎవరికీ అక్కరలేకుండా పోయారు.   కానీ, యన్టీఆర్ ను స్వంతం చేసుకోవడానికి జగన్ పార్టీ కూడా పోటీ పడటం ఆయన గొప్పదనాన్ని చాటి చెపుతోంది. ఇద్దరూ నేతలు కూడా రాష్ట్రంపై, దేశంపై పెను ప్రభావం చూపినవారే. ఒకరు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ప్రజల మనసులు గెలుచు కొంటే, మరొకరు అవినీతికి మారు రూపంగా మిగిలిపోయారు.   స్వర్గీయ యన్టీఆర్ అందరి వాడుగా నిలిచిపోతే, స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డి కేవలం కొందరివాడుగా మిగిలిపోయారు. ఒకరిని స్వంతం చేసుకోవడానికి అందరూ పోటీ పడుతుంటే, మరొకరి నీడ తమ మీద పడితే ఉలికికులికి పడుతున్నారు. ఒకరు అందరి హృదయాలు కొల్లగొట్టిన గజదొంగ. అయినా ఆయన అంటే అందరికీ ఇష్టమే! కానీ మరొకరు..?

నేడే డిల్లీలో నందమూరి విగ్రహావిష్కరణ

  ఎట్టకేలకు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరింపబడనుంది. 17ఏళ్ల క్రితం ఆయన చనిపోయిన తరువాత వచ్చిన ఈ ఆలోచన, ఇన్నేళ పోరాటం తరువాత నేటికి సాకారం అవుతోంది. విచారకరమయిన విషయం ఏమిటంటే దీనికి పైవారెవరూ అభ్యంతరాలు చెప్పనప్పటికీ, ఆయన స్వంత మనుషులే దీనికి అడ్డుతగులుతూ ఎప్పుడో జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ఇంతకాలం సాగదీసుకువచ్చారు.   ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఖరారు అయినప్పటికీ, దీనిపై నిన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూనే ఉండటం చాలా విచారకరం. తమకు ఆహ్వానం అందలేదంటూ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కు పిర్యాదు చేసి మరీ ఆమె చేత ఫోన్ చేయించుకొన్నాకనే చంద్రబాబు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించడం, ఆ పార్టీ తీరు ఎంత మాత్రం మారలేదని తెలియజెపుతోంది. విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదని అబద్దమాడి, స్పీకర్ నుండి అధికారికంగా ఆహ్వానింపజేసుకోవడం కోసం ఆ పార్టీ వెంపర్లాడిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది.   నిన్నఆపార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ‘తమ పార్టీ వ్యవస్థాపకుడయిన యన్టీఆర్ ను తమ నుండి ఎవరూ వేరు చేయలేరని’ ఆ పార్టీ నేతలు చెప్పడం గమనిస్తే, తెదేపా ఆడిన ఈ రాజకీయ నాటకం వెనుక అసలు ఉద్దేశ్యం అర్ధం అవుతుంది. యన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం కృషి చేసిన పురందేశ్వరికి ఆ ఖ్యాతి దక్కకూడదనే దుగ్ధ తెదేపా స్పష్టంగా బయట పెట్టుకొంది. తాము కాంగ్రెస్ నేత పురందేశ్వరి ఆహ్వానించినందువలన కాక, కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమంలో పాల్గొంటునట్లు గొప్పలు పోవడం వారి ఆలోచన తీరుకి అద్దం పడుతోంది.   తెలుగుజాతి యావత్తు గర్వించదగ్గ ఆ మహానుభావుడిని తెలుగుదేశం పార్టీ తమ సొత్తు అనుకోవడం చాలా అవివేకం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవిషయంలో తేదేపాకు బాగానే గడ్డి పెట్టిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ, యన్టీఆర్ మీద తమకే పేటెంట్ హక్కులున్నట్లు భావించడం ఆ పార్టీనేతల అహంభావానికి అద్దం పడుతోంది. ఈ విధంగా ఆఖరి నిమిషం వరకు కూడా విగ్రహావిష్కరణ అంశాన్ని రాజకీయం చేయడం వలన, ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారని స్వయంగా అంగీకరించినట్లే అవుతుంది. దాని వలన పోయేది వారి పరువే తప్ప వేరొకరిది కాదు.   ఇప్పటికయినా విజ్ఞత చూపి చంద్రబాబు విగ్రాహవిష్కరణ సభలో పాల్గొనడం ఆయనకు, ఆయన పార్టీకి మేలు చేస్తుంది. కానీ, మళ్ళీ ఆఖరు నిమిషంలో కొత్త ఆలోచనలు, రాజకీయాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి గౌరవం దక్కుతుంది. సినీరంగంలో, రాష్ట్ర రాజకీయాలలో తనదయిన ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం డిల్లీలో నెలకొల్పబడటం యావత్ తెలుగు జాతికి గర్వకారణం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇకనైనా సజావుగా సాగేందుకు నందమూరి కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు అందరూ కూడా సహకరించి, తెలుగు జాతి పరువు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆ మహానుభావుడు విగ్రహం సాక్షిగా తెలుగువారి పరువు డిల్లీ వీధినపడటం ఖాయం.

రైల్వే బోర్డు సభ్యుడి పదవికి 10 కోట్లు లంచం మరీ తక్కువేమో

  రైల్వేమంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లీ రూ.90 లక్షలు లంచం తీసుకొంటుండగా సీబీఐకి పట్టుబడటం, మంత్రి గారి రాజినామాకి పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్, దానిని కాంగ్రెస్ యధావిదిగా తిరస్కరించడం అన్నీ నిత్యపారాయణం అయిపోయాయి. కానీ, రైల్వే బోర్డు విద్యుత్ విభాగంలో సభ్యుడి పదవి కోసం, మహేష్ కుమార్ అనే ఉన్నతాధికారి ఏకంగా రూ.10 కోట్లు లంచం ఇచ్చేందుకు మంత్రిగారి మేనల్లుడితో బేరం ఆడుకోవడం చూస్తే ఆ పదవి ఎంత ప్రాముఖ్యమయినదో అర్ధం అవుతోంది. అసలు ఆ పదవి ప్రాముఖ్యత ఏమిటి? అంత ప్రాముఖ్యత ఉన్న పదవిని సాక్షాత్ మంత్రి గారి మేనల్లుడే స్వయంగా ‘హ్యాండిల్’ చేస్తున్నాడని తెలిసినపటికీ మద్యలో సీబీఐ ఎందుకు దూరింది? దూరి ఈ డొంక ఎందుకు లాగింది? దీనికి సమాధానం కావాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకోవాలి.   ప్రస్తుతం సీబీఐ డైరెక్టరుగా ఉన్న రంజిత్ సిన్హా గతంలో అంటే 2008-11సం.ల మద్య రైల్వేలో ‘రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్’కి డైరెక్టరు జనరల్ గా పని చేసారు. ప్రస్తుతం రైల్వేబోర్డు విద్యుత్ విభాగంలోసభ్యుడి పదవి కోసం, రూ.10 కోట్లు లంచం ఇవ్వజూపిన మహేష్ కుమార్ కూడా అదే సమయంలో రైల్వేలోనే చేస్తున్నారు. కానీ, క్రమంగా వీరిరువురికి ఒకరితో మరొకరికి పడక పోవడంతో ఒకరిపై మరొకరు. నాటి రైల్వేమంత్రి మమతా బెనర్జీకి పిర్యాదులు చేసుకొనేవారు. మమత కూడా మహేష్ వైపే మొగ్గు చూపడంతో, రంజిత్ సిన్హాకి ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు’ విభాగంలోకి బదిలీ చేయబడ్డారు.   మహేష్ కుమార్ వలన అనేక ఇబ్బందులు పడి, చివరికి అవమానకర పరిస్థితిలో బదిలీ చేయబడటంతో రంజిత్ సిన్హా దీనికి అంతటి కారకుడయిన మహేష్ కుమార్ పై కోపంతో రగిలిపోతున్నారు. అదృష్టవశాత్తు గత ఏడాదే రంజిత్ సిన్హా సీబీఐలో వచ్చిపడ్డారు. ఇక, నాటి నుండి మహేష్ కుమార్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు తగిన సమయం కోసం ఓపికగా నిరీక్షించారు. ఈ లోగా ఆయనపై, ఆయన ఫోన్ కాల్స్ పై ప్రత్యేక నిఘా కూడా పెట్టి ఉంచారు. చివరికి ఆయన ఊహించినట్లే, మహేష్ కుమార్ మంత్రి గారి మేనల్లుడితో బోర్డు పదవికోసం బేరం ఆడుకోవడం ముందే కనిపెట్టిన సీబీఐ బృందం సింగ్లీ ఇంటి వద్ద, ముంబై విమానాశ్రయం వద్ద వలపన్ని కూర్చొని ఉంటే, చండీగడ్ లో సింగ్లీ, ముంబై లో మహేష్ ఇద్దరూ తమంతట తామే నేరుగా వచ్చి వలలోచిక్కుకొన్నారు. చివరికి రంజిత్ సిన్హా తన పగ తీర్చుకోగలిగాడు.   ఇక ఒక బోర్డు సభ్యుడి పదవికి ఏకంగా రూ.10 కోట్ల లంచం ఎందుకంటే, ఆ సభ్యుడి చేతిలో ఒకటి కాదు, వందాకదు ఏకంగా రూ.2500 కోట్ల విలువయిన విద్యుత్ కాంట్రాక్టు వ్యవహారాలు ఉంటాయి గనుక! దీనికి అధనంగా కోలకతలో మెట్రో రెయిల్ పనులు, త్వరలో ప్రవేశ పెట్టనున్న స్పీడ్ ట్రైన్స్ ప్రోజక్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ఒక కిలో మీటర్ విద్యుత్ రైల్వే లయిన్ వేయడానికి రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేయగా, ఆ స్పీడ్ ట్రైన్స్ కి అవసరమయిన ఒక్కో పెట్టె తయారికీ భారీ గానే ఖర్చుఉంటుందని అంచనాలున్నాయి.   ఈ వ్యవహారలనీ కలిపి కనీసం రూ.5000-6000 కోట్లు ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీకూడా రైల్వే బోర్డు విద్యుత్ విభాగంలో సభ్యుడి పర్యవేక్షణలో జరుగుతాయి. ఆ సభ్యుడి సంతకం, ఆమోదం లేనిదే ఏపని జరుగదు. అటువంటప్పుడు వివిధ కాంట్రాక్టు లు చెప్పట్టే కాంట్రాక్టర్ లు కూడా అదే స్థాయిలో మామూళ్ళు ముట్ట జెప్పడం ఖాయం. వేలకోట్ల లోంచి కనీసం వందల కోట్లయినా గిల్లుకోవచ్చును. అటువంటి కీలకమయిన పదవికి ఒక 10కోట్లు పెద్ద ఎక్కువేమి కాదని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడు. ఇక ఎన్నో ఏళ్లతరబడి రైల్వేలలో పాతుకుపోయిన మహేష్ కుమార్ రిటైర్ అయ్యేలోగా ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకొందామని ఆలోచిస్తే, సినిమాలో విలన్ లాగా రంజిత్ సిన్హా ప్రవేశించి కధ మొత్తం రసబాస చేసాడు.

నిత్య కుంభకోణ వ్రతం ఆచరిస్తున్న కాంగ్రెస్ పార్టీ

  మొగుడు కొట్టి నందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకే నేను బాధపడుతున్నానందిట వెనకటికి ఓ మహా ఇల్లాలు. కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది. న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ తయారుచేసిన రిపోర్టులో మార్పులు చేసినప్పుడు బాధపడలేదు. కానీ, ఆయనకి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినప్పడు మాత్రం చాలా బాధపడింది. అది కూడా ఆయనకి చివాట్లు పెట్టినందుకు కాదు. అవి కర్ణాటక ఎన్నికలలో ప్రతిద్వనిస్తున్నాయనే బాధపడింది.   కాంగ్రెస్ పార్టీ ఉసురుపోసుకొని ఈ ప్రతిపక్షాలు ఏమి బావుకొంటాయో తెలియదు కానీ, (అ)న్యాయశాఖా మంత్రి రాజీనామా చేసితీరల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీని పాపం! కాకులు పొడిచినట్లు నిర్దయగా పొడుచుకు తింటున్నాయి. కానీ, మహామహా కుంభ కోణాలలో ఎంతో సహనంగా ప్రతిపక్షాల గోల భరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే సహనం ప్రదర్శించి తన ఔదార్యం చాటుకొంది.   రోజుకొక కొత్త కుంభకోణం అనే వ్రతం చేప్పటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి నిరాటంకంగా నాలుగేళ్ల వ్రతం పూర్తిచేసుకొంది. తమ పార్టీ చెప్పటిన బృహుత్ వ్రతానికి భంగం కలగకూడదనే మహదాశయంతో ఈ రోజు రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కూడా ఏదో ఉడతా భక్తిగా తన తరపున ఓ రెండుకోట్ల లంచం కేసును పార్టీకి నివేదించుకొన్నారు. అది తమ పార్టీ స్థాయికి తగదని తెలిసి బాధపడినప్పటికీ, ప్రస్తుతానికి కాంగ్రెస్ వ్రతభంగం కలగకూడదనే ఏకైక ఆలోచనతో ఓ మినీ కుంభకోణాన్ని పార్టీకి నివేదించుకొన్నారు.   ఈ రోజు వ్రతకధ: రైల్వేబోర్డులో సభ్యుడి చేరిన మహేష్ కుమార్ అనే పెద్దాయన, నాలుగు రాళ్ళూ వెనకేసుకొనే అవకాశం ఉన్న రైల్వే విద్యుత్ బోర్డులోకి సభ్యుడిగా మారాలనుకొన్నారు. అందుకు చండీఘడ్ లో అటువంటి వ్యవహారాలను అవలీలగా మూడోకంటికి తెలియకుండా చక్కబెట్టేయగల సమర్డుడయిన రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లీని కలిసి మాట్లాడుకొన్నారు. ఎవరయినా సాయం అడిగితే కాదనలేని బలహీనతగల సింగ్లీగారు కేవలం రెండంటే రెండే కోట్లు పుచ్చుకొని ఆయన బదిలీకి రంగం సిద్దం చేసారు.   స్విస్ బ్యాoకులో జమా చేసేంత పెద్ద మొత్తం కాదు గాబట్టి, మొదటి విడతగా రూ.90 లక్షలు, మిగిలినది పని పూర్తయిన తరువాత పూర్తిగా క్యాష్ రూపంలోనే స్వీకరించాలనుకొన్నారు. కానీ, అమ్మ అన్నం పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్లు వారి వ్యవహారంలోఎవరో గిట్టని వాళ్ళు వేలుపెట్టి వారి మీదకు సీబీఐని ఉసిగొల్పారు. మహేష్ కుమార్ పంపిన రూ.90 లక్షలను మంజూనాద్ అనే ఒక వ్యక్తీ బన్సాల్ గారి మేనల్లుడి చేతిలో పెడుతుంటే సీబీఐ వాళ్ళు అచ్చం మన పాత సినిమాలలో క్లైమాక్స్ సీనులో పోలీసులు ప్రత్యక్షంయినట్లుగానే హట్టాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయి ‘యువ్వార్ అండర్ అరెస్ట్’ అంటూ వారిని పట్టుకోవడంతో అంతవరకు మూడో కంటికి తెలియకుండా సాగుతున్న కధ కాస్తా న్యూస్ చానల్స్ హెడ్ లైన్స్ లోకి వచ్చిపడింది.   ఇంకేముంది, షరా మామూలే ఇంతవరకు అశ్వినీ కుమార్ కేసుని పట్టుకొని ఊగుతున్న టీవీ చానళ్ళవారు, ప్రతిపక్షాల వారు ఆయనని వదిలి పెట్టి బన్సాల్ ని పట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోవడం మొదలుపెట్టారు. అశ్వినీ కుమార్ బ్రతికేనురా  జీవుడా! అని తేలికగా నిట్టూర్పు విడిస్తే, బన్సాల్ మంత్రిగారు హడావుడిగా వెళ్లి సోనియమ్మ కాళ్ళ మీద పడ్డారు. ఆమె ఆయనను వెంటబెట్టుకొని నిత్యం ఏదో కోరే ‘కోరు కమిటీ’ తో కలిసి గదిలోకి వెళ్లి కాసేపు తలుపులు మూసుకొని కొంచెం చాయ్ పానీ స్వీకరించి కబుర్లు చెప్పుకొన్నాక, (గంభీర వదనాలతో) ఎవరి మానాన్న వారు ఇళ్ళకి వెళ్ళిపోయారు.   అంతిమంగా కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ "మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతీ చిన్నదానికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేయడం ప్రతిపక్షాలకి ఒక పెద్ద జబ్బుగా మారిపోయింది,” అని ఈ రోజు వ్రతానికి మంగళ హారతి పాడేసారు.   తలుపులు నమిలేసే వాడికి అప్పడాలు తినడం ఒక లెక్కా అన్నట్లు లక్షల కోట్ల 2జీ స్కాములు, బొగ్గు స్కాములు, వందల కోట్ల యఫ్.డీ.ఐ ముడుపులు, అగస్టా హెలికాప్టర్ ముడుపులనే అవలీలగా ఉఫ్ మని ఊదిపారేసిన కాంగ్రెస్ పార్టీకి తన స్థాయికి ఎంత మాత్రం తగని ఇటువంటి చిన్నచిన్న లంచాలకు, స్కాములకు ప్రతిస్పందించవలసి రావడం నామోషీగానే ఉంది. కానీ తప్పడం లేదు.   సమయం కానీ సమయంలోఇటువంటి పిల్ల (స్కా)పాములు కూడా బయటపడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది తప్ప అవి చేసినందుకు బాధ పడటం లేదు.   అయినా, ఇంత పెద్ద దేశాన్నిఒంటి హస్తంతో పాలిస్తున్నతమ ప్రభుత్వంలోఆమాత్రం చిన్నచిన్న కుంభకోణాలు బయటపడటం పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేకపోయినా, ఒక బాధ్యతగల ప్రభుత్వంగా సంజాయిషీ ఇస్తున్నా కూడా ప్రతిపక్షాలు తమ ‘రాజీనామా డిమాండ్ జబ్బు’ ను వదులుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. అందుకే వారిని అదుపులో ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు మరొక స్కాము వారి ముందు పడేస్తుంది. దానితో వారు కూడా పాత స్కామును వదిలి పెట్టి కొత్త స్కాముకి అలవాటుపడతారు. ఈవిధంగా  మరొక ఆరేడు నెలలు వారిని ‘మేనేజ్’ చేయగలిగితే అప్పటికి ఎలాగు ఎన్నికలు వస్తాయి. ఇక అప్పుడు అందరికీ ఎన్నికలు, పార్టీ టికెట్స్ గొడవే తప్ప స్కాముల గురించి అడిగే తీరిక, శ్రద్ధా ఉండవని కాంగ్రెస్ ఆలోచన. అయితే ప్రతిపక్షాల వారు మాత్రం ‘వంద గొడ్లు తిన్న రాంబందు ఒక్క గాలివానతో చచ్చినట్లు’ లక్షల కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే ఎన్నికలలో కొట్టుకుపోతుందని పిల్లి శాపాలు పెడుతున్నాయి.

రాజకీయ పార్టీల చేతిలో ప్రజల ఓటమి

  కర్ణాటకలో జరగనున్న ఎన్నికలపై ఈ సారి కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకొంది. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. కేంద్రంలో తాను సాదించిన ఘన విజయాలేవీ చెప్పుకోవడానికి లేకపోవడంతో, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ తవ్విపోసిన అవినీతి గనులే తమకు అధికారం సాధించి పెడతాయని కాంగ్రెస్ ధృడంగా నమ్ముతోంది. గమ్మతయిన విషయం ఏమిటంటే, కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా నిలిచిన బీజేపీ కూడా, దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి భాగోతాలనే ఆధారంగా చేసుకొని ఈ ఎన్నికల గండం గట్టెక్కాలని భావిస్తోంది.   కాంగ్రెస్ పార్టీ ఎడ్యురప్ప, గాలి సోదరులు, వారి అవినీతి గనుల గురించి కధలు కధలుగా ఓటర్లకు వర్ణించి చెప్పి, అటువంటి వారి నుండి రాష్ట్రానికి విముక్తం కలిగించి స్వచ్చమయిన పరిపాలన అందిస్తామని వాగ్దానాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకత్వంలో యుపీయే ప్రభుత్వంలో బయటపడిన కుంభకోణాలన్నిటినీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ జాడ్యం రాష్ట్రానికి కూడా పాకుతుందని అందువల్ల తమకే ఓటేయమని బీజేపీ కోరుతోంది.   ఇక, రాష్ట్రంలో అవినీతికి పెద్దన్నవంటి ఎడ్యురప్ప బీజేపీ తనను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసినందుకు అలిగి ఆ పార్టీ నుండి వీడిపోయి కర్ణాటక జనతా పార్టీ అనే వేరు కుంపటి పెట్టుకొన్నారు. చివరికి ఆయన కూడా బీజేపీ, కాంగ్రెస్ అవినీతినే తన ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం సాగించడం విశేషం. రెండు నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయినా కూడా ఈ ఎన్నికలలో తన గెలుపు తధ్యమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.     అవినీతి కూపంలో ఈదులాడుతున్న ఈ మూడు పార్టీలను ప్రజలు అసహ్యించుకొంటున్నారనే సంగతి గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తన జేడీయస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్, బీజేపీల అవినీతి భాగోతాల గురించి ప్రస్తావిస్తూనే, తను అధికారంలో ఉన్నపుడు సాదించిన ఘన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి ఓటర్లకి వివరిస్తూ ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయమయిన తన పార్టీకే ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కానీ, గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కాంగ్రెస్, బీజేపీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన కోటీశ్వరులయిన అభ్యర్ధులు డబ్బుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నందున, జేడీయస్ కి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అదే విధంగా రాష్ట్రంలో బలమయిన లింగాయాత్, ఒకలిగ కులాల ప్రభావం కూడా అభ్యర్దుల జాతకాలను నిర్ణయిస్తుంది.   అందువల్ల కుమార స్వామి ఎన్నికలలో గెలిచేందుకు తన ప్రయత్నాలు తను చేస్తూనే, తెర వెనుక నుండి బీజేపీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని అందుకొన్నారు. రాష్ట్రంలో ఈసారి తన ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ, జేడీయస్ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ తరువాత ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని గ్రహించడంతో, కుమార్ స్వామితో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వమయిన ఏర్పరచాలనే ఆలోచనతో ఆయనను దువ్వుతూ తెర వెనుక సంప్రదింపులు మొదలుపెట్టింది.   అంటే, ఇప్పుడు కర్ణాటక ప్రజలు ఏ పార్టీని తిరస్కరించి మరే పార్టీని ఎన్నుకొన్నా కూడా వారికి మళ్ళీ ఆ అవినీతి ప్రభుత్వాలే ఏర్పడటం ఖాయమన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ఎన్నికలలో రాజకీయపార్టీలు గెలిస్తే, వారికి ఓటేసి గెలిపించిన ప్రజలు ఓడిపోతారన్నమాట. అయితే వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు కూడా.

జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్

  జగన్ మోహన్ రెడ్డి గత 11నెలలుగా జైలులో ఉన్నపటికీ, ఆయన పార్టీ ఇంకా పటిష్టంగా కనబడటానికి ప్రధాన కారణం ఆయన అనుసరిస్తున్న ప్రత్యేక వ్యూహమే కారణమని చెప్పవచ్చును. ఆయన జైలులోకి వెళ్లినప్పటినుండి నేటి వరకు కూడా, ఆయన ఎంచుకొన్న మార్గం ఏమయితేనేమి ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణీత వ్యవదుల మద్య వివిధ పార్టీలలో ఉన్నముఖ్య నేతలను తన పార్టీలో చేరేలా చేసుకోవడం ద్వారా పార్టీపై అందరి అంచనాలు ఉన్నతంగా ఉండేలా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక తెలివయిన వ్యాపారి (బిజినెస్ మ్యాన్) లక్షణాలు కనబరుస్తూ, తన సంస్థను అసలు కంటే పదింతలు బలమయినదని సమర్ధంగా చూపగలుగుతున్నారు.   బహుశః ఈ కారణం చేతనే ఆయనపై ఒకపక్క కోర్టులో తీవ్ర నేరాభియోగాలు మోపబడి కేసులు నడుస్తున్నపటికీ, ఆయన పార్టీకి ఉజ్వలమయిన భవిష్యత్ ఉందని ప్రజలను, విపక్ష నేతలను కూడా గట్టిగా నమ్మించగలుగుతున్నారు. తద్వారా ఇతర పార్టీల నుండి వలసలు కూడా నిత్యం కొనసాగేలా చేసుకోగలుగుతున్నారు. వ్యాపారంలో కొంత మేర డబ్బు సంపాదించిన తరువాత ఆ డబ్బే మళ్ళీ డబ్బును సృష్టించినట్లు వలసలు కొత్త వలసదారులను ప్రోత్సహిస్తున్నాయి.   అందుకు ఆయన చేతిలో ఉన్న మూడు బలమయిన ఆయుధాలను చాల తెలివిగా వాడుకొంటున్నారు. అవి 1.సాక్షి మీడియా, 2.తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రతిష్టలు,3.సానుభూతి.   రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయిపోయినప్పటికీ నేటికీ ఆయన పట్ల ప్రజలలో సానుభూతిని అదే స్థాయిలో నిలిపేందుకు గతంలో జగన్ తన ‘ఓదార్పుయాత్ర’ చేయగా, ప్రస్తుతం ఆ బాధ్యతను షర్మిల తన ‘మరో ప్రస్థానం’ పాదయాత్రతో, విజయమ్మ తన బహిరంగ సభలు, ఇటీవల ‘రచ్చబండ’ వంటి కార్యక్రమాలతో సమర్ధంగా నిలుపుకొస్తున్నారని చెప్పవచ్చును. వారిరువురూ నిత్యం ప్రజల ముందు ‘రాజన్న రాజ్యం వస్తుందని’ జపించడం అందుకేనని చెప్పవచ్చును.   తెరాస తన ఉనికిని కాపాడుకోవడానికి, లేదా ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ‘తెలంగాణా సెంటిమెంటు’ను ఏవిధంగా సమర్ధంగా వాడుకొంటోందో, అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ‘సానుభూతి’ సెంటిమెంటుని నిలుపుకొస్తోందని చెప్పవచ్చును.   నిజాయితీగా చెప్పుకోవాలంటే ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అవినీతి, అసమర్ధత వంటి సమస్యలకంటే సానుభూతి అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది బహిరంగ రహస్యం. దీనిని సరిగ్గా గ్రహించిన ఏ రాజకీయనాయకుడయినా, రాజకీయ పార్టీ అయినా దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకొనే ప్రయత్నం తప్పక చేస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదేపని చేస్తున్నారు. అందుకు ఆయన చేతిలో ఉన్న మరో బలమయిన ఆయుధం సాక్షి మీడియాను కూడా ఆయన చాలా సమర్ధంగా ఉపయోగించుకొంటున్నారు.   ఆయనే గనుక సాక్షి మీడియాను ఏర్పాటు చేసుకొని ఉండకపోయి ఉంటే, నేడు ఆయన పార్టీ పట్ల ప్రజలలో ఇంత అవగాహన, ఆదరణ ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. నేడు జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ ఆయన ముందుగానే ఊహించి సాక్షిని ఏర్పాటుచేసుకొన్నాడని చెప్పడం అవివేకమే అవుతుంది, కానీ ఆనాడు ఆయన ఏ కారణాలతో, ఉద్దేశ్యంతో దానిని స్థాపించినప్పటికీ నేడు అదే ఆయనకి శ్రీ రామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చును.   ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరే ఇతర రాజకీయ నాయకుడికయినా ఎదురయి ఉంటే ఖచ్చితంగా  అతను రాజకీయాల్లోంచి ఎపుడో కనుమరుగయిపోయి ఉండేవాడు. కానీ జగన్ మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి రాకుండా కాపాడుతున్నది ఆయన సాక్షి పత్రిక మాత్రమేనని చెప్పక తప్పదు. ఆ ఒక్క పత్రిక తప్ప రాష్ట్రంలో, దేశంలో ఆయనకు, ఆయన పార్టీకి అనుకూలంగా వాదిస్తున్న పత్రిక లేదా న్యూస్ చానల్ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అది కూడా లేకపోయుంటే, నేడు ఆయనపై కత్తిగట్టిన యావత్ మీడియా ప్రభావంతో ప్రజలు ఆయనని, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని ఎన్నడో మరిచిపోయుండేవారేమో కూడా.   ఏమయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నపటికీ, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, ఆయన తన పార్టీపై ప్రజలలో, తన శత్రు పార్టీలలో అంచనాలు పెంచడంలో కృతకృత్యులయ్యారని చెప్పక తప్పదు. ఆయన తన చేతిలో ఉన్న ఈ మూడు ఆయుదాలను అత్యంత సమర్ధంగా వాడుకొంటు తెలివయిన వ్యూహాలతో దూసుకుపోవడమే ఆయన విజయ రహస్యం అనుకొంటే, వైరి పక్షాలలో ఉండే సమస్యలు, ముటాలు, వాటి మద్య తగాదాలు వంటి బలహీనతలు ఆయనకు మరో చక్కటి ఆయుధంగా మారాయని చెప్పవచ్చును.   జైలులో ఉంటూ, అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రచిస్తున్నవ్యూహాలను, బయట ప్రజల మద్య ఉంటూ మీడియా యొక్క అండదండలు కలిగి ఉన్న ఆయన ప్రత్యర్ధులు ఎదుర్కోలేక బెంబేలెత్తిపోవడమే కాకుండా, ఆయన దెబ్బకి తరచూ బోర్లాపడిపోతుండటం సామాన్య ప్రజలకి కూడా నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన జైలు నుండి విడుదల అయితే ఆయన ధాటికి వారు తట్టుకోగలరా? అనే ఆలోచన కూడా ప్రజలలో తలెత్తడం సహజమే.   కాంగ్రెస్, తెదేపాలు రెండూకలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించాయని, షర్మిల, విజయమ్మలు బహుశః అందుకే పదేపదే ఆరోపిస్తున్నారేమో కూడా. ఇక ఇదంతా గమనిస్తే జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని అందరు ఒప్పుకోవలసిందే.

కేసీఆర్, చంద్రబాబుల ఏకాభిప్రాయం?

                            చంద్రబాబు పాదయాత్ర ముగిసిన రోజునే (ఏప్రిల్ 27), తెరాస తన 12వ వార్షికోత్సవం కూడా ఆర్మూరులో జరుపుకొంది. అందువల్ల ఆ రెండు పార్టీల చరిత్రలో అవి ముఖ్య అధ్యాయాలుగా నిలవడమే కాకుండా వాటి రాజకీయ భవిష్యత్తును కూడా అవి నిర్దేశించనున్నాయి. 9సం.లు ప్రతిపక్ష బెంచీలకే అంకితమయిపోయినా పార్టీని ఏకత్రాటిపై నిలిపి ఉంచిన ఘనత చంద్రబాబుదయితే, ఇంతవరకు పూర్తీ స్థాయిలో అధికారం చెప్పట్టకపోయినా కూడా 12సం.ల పాటు పార్టీని కేవలం ఉద్యమాల ఆధారంగానే నిలబెట్టిన ఘనుడు కేసీఆర్. వీరిద్దరు కూడా రాబోయే ఎన్నికలలో తమ సత్తాచాటి చూపాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సందర్భంగా వీరివురు వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇంచు మించు ఒకే రకమయిన అభిప్రాయలు వ్యక్తం చేయడం విశేషం.   కేసీఆర్: రాబోయే ఎన్నికలలో తెరాస పూర్తీ మెజార్టీ సాదించి తీరుతుంది. గనుక కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమవుతుంది. ఈసారి 3వ ఫ్రంట్ ఉద్భవించి కేంద్రంలో అధికారం చెప్పట్టినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ యుపీయే లేదా ఎన్డీయే గానీ అధికారంలోకి వచ్చినా మావంటి ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడక తప్పదు.   చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో మా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో యుపీయే, ఎన్డీయే కూటములు రెండు కూడా వాటంతట అవి పూర్తి మెజార్టీ సాదించే పరిస్థితిలో లేవు. గనుక, ఈ సారి కేంద్రంలో ప్రాంతీయపార్టీలదే పైచేయి అవుతుంది. నేను స్వయంగా పూనుకొని వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని 3వ ఫ్రంట్ నిర్మాణం చేసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకి కృషి చేస్తాను.   కేసీఆర్: రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎందుకంటే, బీజేపీతో లేదా లెఫ్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వారికి తెలంగాణాలో సీట్లు పంచి ఇవ్వడం వలన, తెలంగాణాలో వారు బలపడతారే తప్ప, కేంద్రంలో అధికారంలోకి రాలేరు. అందువల్ల వారితో పొత్తుల వలన వారికే ప్రయోజనం ఉంటుంది తప్ప మాకేమి లాభం ఉండదు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొంటే, ఒకవేళ అవసరమయితే వారు మాతో కలిసి ఎన్డీయేకి మద్దతు ఈయరు. అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొంటే, కేంద్రంలో యుపీఏ అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు బీజేపీతో మాపొత్తు వల్ల వారికే తప్ప మాకేమి లాభం ఉండదు.   చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో మేము ఒంటరిగా పోటీ చేయలనుకొంటున్నాము. మిత్ర పక్షాలయిన లెఫ్ట్ పార్టీల గురించి సమయం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకొంటాము. 3వ ఫ్రంట్ నిర్మాణానికి ఏ మాత్రం ఉపయోగపడని ఈపొత్తులవల్ల ప్రయోజనం లేదు.   కేసీఆర్: రాబోయే ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతంలో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతోంది. కానీ తెలంగాణా ప్రాంతంలో మాకు గట్టి పోటినిచ్చేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని భావిస్తున్నాము. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఈసారి తన ఉనికిని కోల్పోవచ్చును. ఇక, తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది.   చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతంలో తెదేపా, తల్లిపిల్ల కాంగ్రెస్ పార్టీలతో, తెలంగాణా ప్రాంతంలో తెరాసతో పోటీ పడవలసి ఉంటుంది.   కేసీఆర్: బీజేపీ నరేంద్ర మోడీపై ఆశలు పెట్టుకోవడం సహజమే. కానీ, ఆయన ప్రభావం గుజరాత్ వెలుపల అంతగా ఉండకపోవచ్చును. వివిధ రాష్ట్రాలలో స్థానిక పార్టీలదే పైచేయిగా ఉండబోతోంది. ఒకవేళ దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రజలు ఆయనకు ఓటువేద్దామని భావించినా కూడా, చాలా రాష్ట్రాలలో ఆపార్టీకి సరయిన వ్యవస్థాగత ఏర్పాట్లే లేవు. ఒకవేళ ఏ రాష్ట్రంలో ప్రజలయినా మోడీకి పట్టం కట్టాలని భావించినా కూడా, వారికి స్థానికంగా ఓటు వేసేందుకు బలమయిన బీజేపీ అభ్యర్ధులు లేరు. ఒకవేళ ఉన్నాకూడా ప్రాంతీయ పార్టీలకి దీటుగా గట్టి పోటీ ఇవ్వగల తగిన వ్యవస్థ బీజేపీకి లేదు. అందువల్ల మోడీ ప్రభావం కేవలం బీజేపీ బలంగా ఉన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కావచ్చును.   చంద్రబాబు: ఉత్తరాదిన మూడు నాలుగు రాష్ట్రాలలో తప్ప నరేంద్రమోడీ ప్రభావం దేశంలో ఇతర ప్రాంతాలలో ఉండదు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, వంటి ప్రాంతాలలో ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేరు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉనికే లేదు. మిగిలిన చాలా రాష్ట్రాలలో ఆపార్టీ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. బీఎపీకి వివిధ రాష్ట్రాలలో వ్యవస్థాగతంగా బలం లేనప్పుడు ఆయన మాత్రం ఏమిచేయగలరు? బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీ ఉంటుంది. గనుక, రాబోయే ఎన్నికలలో దేశం మొత్తం మీద ఆయన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చును.

దీటుగా చైనా, బేలగా భారత్

  గత నెల 15వ తేదిన భారత భూభాగంలోకి 19కి.మీ. మేర చొచ్చుకు వచ్చిన చైనా దేశ సైనికులు ముందు నాలుగు తాత్కాలిక స్థావరాలను వేసుకొన్నారు. ఒకవైపు భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నపటికీ, వారు వెనక్కి మళ్ళకపోగా, మళ్ళీ మొన్నమరొక కొత్త స్థావరం కూడా ఏర్పాటు చేసుకొన్నారు.   భారత అభ్యంతరాలకు దీటుగా బదులిస్తూ చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి, తమ సైనికులు ఏనాడు భారత భూభాగంలో అతిక్రమణలకి పాల్పడలేదని, వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం తమ చైనా భూభాగం లోనిదేనని, అందువల్ల వారిని వెనక్కి రప్పించే ప్రశ్నే ఉత్పన్నం అవదని, అయినా భారత్ తో తాము చర్చలకు ఎల్లపుడు సిద్దమేనని తెలిపింది. భారత్ కూడా చర్చలలో జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కోరింది.   దురాక్రమణకు పాల్పడిన చైనా ఇంత గట్టిగా జవాబిస్తుంటే, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాత్రం “ఇది స్థానికమయిన ఒక చిన్న సమస్య, దీనికి అంత ప్రాదాన్యం లేదు. దీనిని స్థానిక కమాండర్ల పరిధిలోనే పరిష్కారం కనుగొంటామని” తేలికగా కొట్టిపారేశారు.   అదేవిధంగా ప్రతిపక్షాల అభ్యంతరాలను త్రోసిపుచ్చుతూ, భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ కుర్షిద్ ఈ నెల 9న తన చైనా పర్యటనను యధావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. “వారిని వెనుతిరిగి యదా స్థానాలకు వెళ్ళాలని కోరాము. అందుకు ప్రతిగా వారు మాకు కొన్ని షరతులు విదించారు. దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించగలమనే నమ్మకం మాకుంది,” అని ఆయన చెప్పడం భారత మెతక వైఖరికి అద్దం పడుతోంది.   దురాక్రమణ చేసిన చైనా తన తప్పును సరిదిద్దుకోకపోగా గట్టిగా వాదిస్తుంటే, దీటుగా జవాబు చెప్పవలసిన భారత ప్రభుత్వం చైనాను తమ సైనికులను వెనక్కి తీసుకోమని బేలగా అభ్యర్దిస్తోంది.   తాజా సమాచారం ప్రకారం, మొన్న ఇరుదేశాల కమాండర్ల మద్య జరిగిన 3వ ఫ్లాగ్ మీటింగ్ కూడా విఫలమయింది. తమను భారత్ ఏవిధమయిన డిమాండ్స్ చేయలన్నా, ముందుగా భారత్ తన సరిహద్దు భూభాగాలయిన ‘ఫుక్చీ’ మరియు ‘చుమార్’ ప్రాంతాలలో నెలకొల్పిన శాశ్విత మిలటరీ కట్టడాలను వెంటనే తొలగించాలని, అప్పుడే చైనా భారత అభ్యంతరాలను పరిశీలించగలదని చైనా నిర్ద్వందంగా చెపుతోంది. అంతే గాకుండా, ప్రస్తుతం తమ భూభాగంలో తమ స్థావరాలకు కేవలం 500 మీటర్ల దూరంలో భారత్ సైనికులు ఇటీవల కొత్తగా నెలకొల్పిన స్థావరాలను కూడా వెంటనే తొలగించాలని చైనా డిమాండ్ చేసింది.   ఫ్లాగ్ మీటింగ్ లో పాల్గొన్న చైనా మిలటరీ కమాండర్లు, తాము భారత కమాండర్ల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని వెనక్కి వెళ్ళలేమని, తమకు తమ కేంద్ర మిలటరీ కమాండ్ నుండి వెనక్కి మరలమని స్పష్టమయిన ఆదేశాలు వస్తే తప్ప తాము వెనక్కి వెళ్ళబోమని కూడా వారు స్పష్టం చేసారు.   తద్వారా ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చెప్పినట్లు ఇది స్థానిక మిలటరీ కమాండర్ల పరిధిలో పరిష్కరింపబడే ఒక చిన్న స్థానిక సమస్య ఎంతమాత్రం కాదని, చైనా వ్యుహాత్మకంగానే ఈ చొరబాటుకి దిగిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వివిధ కుంభకోణాలలో తలమునకలయున్న యుపీయే ప్రభుత్వం, చైనా దురాక్రమణ పట్ల స్పందించవలసిన రీతిలో స్పందించకపోగా, సమస్యను తక్కువ చేసి ప్రజలను, ప్రతిపక్షాలను కూడా మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం చాలా దారుణం. కనీసం చైనాకు తగ్గట్లు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా లేకపోవడం విచారకరం.

ఢిల్లీలో తెలంగాణ దీక్షల పోటీలు

  రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాల హడావుడి అకస్మాత్తుగా తగ్గడంతో తేలికగా ఊపిరి పీల్చుకొన్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ తమ దైనందిన ముటా తగాదాలలో ప్రశాంతంగా నిమగ్నమయిపోయారు. ఇటు పార్టీలోను గౌరవం లేక, అటు కేసీఆర్ చేత సన్నాసులు, దద్దమ్మలు అంటూ నిత్యం తిట్లు తినలేక సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లు కేసీఆర్ తిట్లు వినబడనంత దూరంగా వెళ్ళిపోవాలని డిల్లీలో వచ్చిపడ్డారు.   పార్లమెంటు ముందు ధర్నాలు చేస్తే కనీసం ‘సోనియమ్మ నజర్’ తమ మీద పడకపోతుందా? పడితే తమ గోడు చెప్పుకోలేకపోతామా?’ అనే ఆశతో ఆమె వచ్చే దారిలో అడ్డంగా కూర్చొని ‘జై తెలంగాణ!’ అంటూ ధర్నాలు మొదలుపెట్టారు. పాపం వారావిధంగా మెట్ల మీద కూర్చొని వారు ధర్నా చేస్తుంటే, తెలంగాణకి మద్దతు ఇచ్చేవారు, సానుభూతిగా వారితో ఓ రెండు ముక్కలు మాట్లాడేసి పోతున్నారు. అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ యంపీలకి మూడొస్తే వారికిక ఎవరితోను పనిలేదు, కనుక ఓ రెండు రోజులు అక్కడే నిద్ర, భోజనం, స్నానపానాదులుకి సిద్ధం అయిపోయి వచ్చేశారందరూ.   రెండు రోజుల్లో తమ పార్టీ అధిష్టానం మనసు మార్చేసుకొని తెలంగాణ ఇచ్చేస్తుందని కాదుగానీ, అక్కడ జంతర్ మంతర్ దగ్గిర తెలంగాణ జేయేసీ కూడా సంసద్ యాత్ర పేరిట ధర్నాలు చేస్తుంటే, తాము పార్లమెంటులోకెళ్ళి కూర్చొంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తే కేసీఆర్ కొత్త బూతులతో తమని తిట్టిపోస్తాడనే భయంతో పాపం వాళ్ళు ఆ మెట్లకే అంటుకుపోయారు.   ఇక, పూర్తిగా ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయిన కేసీఆర్ ను చూస్తే ఇప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేట్లు లేడని గ్రహించిన తెలంగాణ జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోధండరామ్, ఆయన అనుచరులు తెలంగాణాలో ఖాళీగా కూర్చొంటే మీడియా వాళ్ళు కంగాళీ చేసేస్తారనే భయంతో వారు కూడా ‘చలో డిల్లీ!’ అంటూ వచ్చి డిల్లీలో వాలిపోయారు.   వారు కూడా రెండు రోజులు దీక్షలు చేసేందుకు పూర్తి బందోబస్తుతోనే డిల్లీవచ్చేరు. వారిని కూడా జాతీయపార్టీల నేతలు (అంటే దేశం అంతటా శాఖలున్న పార్టీలని కాదు. హిందీ మాట్లాడే సింగల్ రాష్ట్ర పార్టీల వాళ్ళని కూడా ఇప్పుడు మీడియా జాతీయపార్టీలు అని సంబోదిస్తున్నాయి కదా! ఆ పార్టీలకి చెందిన నేతలన్నమాట!) ఓ సారి వచ్చి పలకరించి, వారేర్పాటు చేసిన ఆటపాట చూసి మెచ్చుకొని వెళ్తున్నారు.   అక్కడ పార్లమెంటు మెట్ల మీద తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, ఇక్కడ రోడ్ల మీద తెలంగాణ జేయేసీ నేతలు పోటా పోటీల మీద దీక్షలు చేస్తుంటే దారిన పోయే వారు వారిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ సాగిపోతున్నారు. తెలంగాణా సాధన కోసం పోరాటాలు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఈవిధమయిన దీక్షలవలన సాదించేదేముంది? అందరి ముందు నవ్వులపాలవడం తప్ప.   ఇక్కడ కేసీఆర్ “ఈసారి ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిస్తే డిల్లీకి మనం పోనక్కరలేదు వారే మనకి సలాములు పెట్టుకొంటూ మన కాళ్ళ కాడికి వస్తారు. అప్పుడు మనమే ప్రభుత్వాన్ని శాసించి తెలంగాణాను సాదించుకొందాము,” అని గొప్పగా చెపుతునపుడు, మరి తన పెరట్లో తిరిగే కోడిపెట్టల వంటి తెలంగాణా జేయేసీ నేతలని డిల్లీకి ఎందుకు పంపినట్లు?   “మా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా ఇవ్వదు” అని కుండ బ్రద్దలు కొట్టిన మందా జగన్నాధం, “సోనియా గాంధీ తప్పక తెలంగాణా ఇస్తుందనే నమ్మకం ఉందని” చెప్పిన మధు యాష్కీ,పొన్నం ప్రభాకర్లు, “అసలు ఇస్తుందో లేదో తెలియదనే” మిగిలిన వాళ్ళు కలిసి ఆ మెట్ల మీద పడి ఏమి సాదిద్దామని దీక్షలు చేస్తున్నారు?   మొత్తం మీద వీరందరూ కలిసి సాదించేదేమి లేకపోయినా,తమ ఉనికిని చాటుకోవడం కోసం తెలుగు జాతి పరువు మాత్రం తీస్తున్నారు.

కప్పల తక్కెడగా మారిన పెడన నియోజక వర్గం

  సాదారణంగా కాంగ్రెస్ సంస్కృతికి అలవాటు పడినవారెవరూ కూడా ఇతర పార్టీలలో ఇమడలేరు. ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ వంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్చా స్వాతంత్రాలు, ప్రైవేట్ లిమిటడ్ కంపెనీల వంటి ప్రాంతీయ పార్టీలలో ఉండకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోంచి పిల్ల కాలువలవంటి ప్రాంతీయ పార్టీలలోదూకిన వారు, మళ్ళీ ఏదో ఒకనాడు ఆ కాంగ్రెస్ సముద్రంలోకే కొట్టుకొని వచ్చి పడుతుంటారు.   చిరంజీవి మెగాపడవేసుకొని (ప్రజారాజ్యం) వచ్చేసరికి అన్ని పార్టీలలోంచి కప్పలు దూకినట్లు బిలబిలమంటూ చిన్నా పెద్దా అందరూ అందులోకి దూకేసారు. వారిలో పెడన కాంగ్రెస్ శాసన సభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ కూడా ఒకరు. ఆయన మెగా పడవలోకి జంప్ చేసేసరికి, ఆ స్థానంలోకి వైఎస్ ఆశీస్సులతో జోగి రమేష్ వచ్చిపడ్డారు. కానీ, పాపం వేదవ్యాస్ ఎక్కిన మెగా పడవ కూడా తిరిగి తిరిగి మళ్ళీ ఆయనను కాంగ్రెస్ సముద్రంలోకే తెచ్చి వదిలేసింది. దానితో భూమి గుండ్రంగా ఉంటుందని అర్ధం చేసుకొన్న వేదవ్యాస్ ఇక మళ్ళీ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పడవలోంచి వేరే పడవలోకి మారకూడదని కృత నిశ్చయం అయిపోవడమే కాకుండా, వచ్చే ఎన్నికలకోసం ఇప్పటి నుండే పెడన వద్ద లంగరు వేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇక, ఆయన స్థానంలోకి దూకిన జోగి రమేష్ మొన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గట్టిగా పట్టుకు తిరుగుతూ పెడన నియోజక వర్గాన్నిచక్కబెట్టేసుకొంటూ, ఉప్పాల రాంప్రసాద్, వాకా వాసుదేవరావు లిద్దరికీ పొగబెట్టడంతో ఉక్కిరి బిక్కిరయిపోయిన వారిరువురూ ముందూ వెనుకా ఆలోచించకుండా పక్కనే లంగరు వేసి ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పడవలోకి దూకేశారు.   కానీ, వారి దురదృష్టం వారిని జోగి రమేష్ రూపంలో ఇంకా వెన్నాడుతోనే ఉంది. నిన్న మొన్నటి వరకు (అమ్మ హస్తం పట్టుకొని, అమ్మమ్మ కలలు కంటున్న) ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం పట్టుకొని నమ్మకంగా తిరిగిన జోగి రమేష్, అకస్మాత్తుగా కిరణ్ పై అపనమ్మకం ప్రకటిస్తూ హస్తం పార్టీకి హ్యాండిచ్చేసి, ఆయన కూడా చంచల్ గూడా జైల్లోకి దూకేశారు. తీరా చూస్తే అక్కడ తన కంటే ముందే దూకినవారు చాలామందే గుంపులు గుంపులుగా కనబడసాగారు. వారిలో ఒక గుంపులో ఉప్పాల రాంప్రసాద్, మరో గుంపులో వాకా వాసుదేవరావు కనబడ్డారాయనకి. అదేవిధంగా వారిరువురూ కూడా ఆయనను చూసి ‘రామేశ్వరం వెళ్ళినా..’.అన్నట్లు ఏమిచేయాలో అర్ధం కాక తలలు పట్టుకొన్నారు.   కానీ, పక్క నున్న కాంగ్రెస్ పడవలోంచి వేదవ్యాస్ ‘స్వంత పడవలోకి అందరికీ స్వాగతం! సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీ బ్యానర్ పెట్టి పిలుస్తుంటే, జగన్ పడవలోంచి మళ్ళీ వారు కాంగ్రెస్ పడవలోకి దూకేందుకు సర్దుకొంటున్నట్లు సమాచారం. కానీ, ‘అదేమి ఆషామాషీ పడవకాదని అదొక పెద్ద టైటానిక్ షిప్పని దానిని కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి నడుపుతుంటే, బొత్ససత్యనారాయణ అనే పెద్దాయన గంట కొడుతున్నారని, అందులో ఎక్కితే ప్రమాదం’ అని వారిరువురిని వైయస్సార్ పార్టీలోవారి కో-బ్రదర్స్ హెచ్చరిస్తున్నారు. మరి వారిరువురూ టైటానిక్ షిప్ ఎక్కుతారో లేదో చూడాలి.

జయప్రద కోసం ఉండవల్లి త్యాగం ఎందుకో

  ఉత్తర ప్రదేశ్ నుండి సరాసరి ఆంధ్రా వచ్చివాలిన అందాలభామ జయప్రద, ఎన్ని గడపలెక్కి దిగినా రాజమండ్రీకి మాత్రం టికెట్ దొరక్కపోవడంతో, మళ్ళీ హుటాహుటిన డిల్లీలో సోనియమం ఇంట్లో వాలిపోయి, రాజమండ్రీ టిక్కెట్టుకి ఆమె చేత ‘మమ’ అనిపించేసుకొన్నట్లు సమాచారం. కాకపోతే, హట్టాతుగా ఎక్కడి నుంచో ఊడిపడిన ఆమెకోసం, పార్టీకి పాతకాపు వంటి ఉండవల్లిని తప్పుకోమని అడగడం సాద్యమా? అని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఆయనే స్వయంగా “జయప్రద రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటే ఆమెకు నా సహకారం ఉంటుందని’ ప్రకటించి జనాలని మరింత ఆశ్చర్య పరిచారు. కానీ, ‘పార్టీ నన్ను రాజ్యసభకు పంపినా ఆ బాధ్యతా ఆనందంగా స్వీకరిస్తానని’ మరొక మాట కూడా చల్లగా అన్నారు.   స్వంత అన్నదమ్ములే టికెట్స్ కోసం కత్తులు దూసుకొంటున్న ఈ తరుణంలో, ఎక్కడి నుంచో ఎగిరివచ్చి తన సీటుకే ఎసరు పెడుతున్న జయప్రదపై నిప్పులు కక్కవలసిన ఉండవల్లి ఆమెకే సహకరిస్తానని ఎందుకంటున్నారు? ఇది అర్ధం చేసుకోవాలంటే మనం చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడక తప్పదు. గత ఎన్నికలలో రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గాలి చాలా బలంగా వీస్తున్న తరుణంలో కూడా ఉండవల్లి తన సమీప ప్రత్యర్ధి మురళి మోహన్ పై జయభేరి మ్రోగించడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.   కానీ, ఈ సారి ఆయన లేకపోగా స్వయంగా అయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీతోనే ఉండవల్లి పోటీ పడవలసి ఉంటుంది. ఒకవైపు సర్వే రిపోర్టులన్నీజగన్ వైపు మొగ్గు చూపుతుంటే, మరో వైపు గతంలో చిన్నతేడాతో తన చేతిలో ఓడిపోయిన మురళీ మోహన్ కూడా ఈసారి ఎలాగయినా ఈ ఎన్నికలలో గెలవాలనే పట్టుదలతో పోటీలో ఉండనే ఉన్నారు. ఇక, అధికారం చెప్పటిన నాటి నుండి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేసుకొంటున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడి సంపాదించిపెట్టిన కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కూడా ఉండనే ఉంది.   ఇటువంటి సమయంలో రాజమండ్రీ మీద ఎగురుతున్న జయప్రదను చూసి అందరూ కాకిని చూసినట్లు మొహం తిప్పుకొంటుంటే, ఉండవల్లికి మాత్రం ఈ క్లిష్ట సమయంలో తనను రక్షించేందుకే అంత దూరం నుండి ఎగురుకొంటూ వచ్చి రాజమండ్రీ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ రెక్కలులేని దేవతలా జయప్రద కనిపించారు.   అందుకే ఆయన “సోనియమ్మ ఆదేశిస్తే ఎటువంటి త్యాగాలకయినా సిద్దం. ఆమె ఆదేశిస్తే ఏ బాధ్యత (పదవి) అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని” రెండు బలమయిన పంచ డైలాగులు పలికాల్సి వచ్చింది. తద్వారా  ఉండవల్లి ఆమె మనసును గెలుచుకోవడంతో బాటు, ఒంటి నుండి చమట బొట్టు చిందించకుండా లోక్ సభ నుండి ఆయన రాజ్యసభకు మారిపోవచ్చును. అదే రాజమండ్రీ పట్టుకు వ్రేలాడితే ఓటమిని ఎదుర్కోవడానికే పోరాడినట్లు ఉంటుంది తప్పవేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల రాజమండ్రీ సీటుని జయప్రద కొదిలేస్తే ఆమె తిప్పలేవో ఆమె పడుతుంది, సోనియమ్మ చల్లని చూపులు తనపై ప్రసరిస్తే రాజ్య సభలో సీటు, ఇంకా అదృష్టం బాగుంటే ఏకంగా కేంద్ర మంత్రి పదవి అన్నీ ఈ చిన్న త్యాగంతోనే దక్కే అవకాశం ఉంది.   ‘మరక మంచిదేనని, సబ్బుకి కూడా సంస్కారం ఉంటుందని’ కనిపెట్టి సబ్బుల కంపెనీలు వాళ్ళు మనకి చెప్పినట్లే, ముక్కు మొహం తెలియని జయప్రద కోసం త్యాగం చేయడం కూడా ఒకందుకు చాలా మంచిదేనని ఉండవల్లి అనుకొంటే మనం కాదనగలమా?.

పాదయాత్రా ఫలం పార్టీకే అంకితం

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా 208 రోజులయింది. 63సం.ల వయసులో ఏకధాటిగా 2,817 కి.మీ దూరం నడవడానికి కేవలం ఒంట్లో ఆరోగ్యం ఒకటే సరిపోదు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలననే ఆత్మవిశ్వాసం, పట్టుదల కూడా ఉండాలి. అవి చంద్రబాబులో పుష్కలంగా ఉండబట్టే, ఆయన ఈ రోజు తన పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయగలిగారు.   గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా, హిందూపురంలో మొదలుపెట్టిన పాదయత్రలో ఆయన 16 జిల్లాలు, 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలలోగల వివిధ కులాలు, మతాలూ, జాతులు, వృత్తులు, తరగతుల ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరియు నేతలను స్వయంగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోగలిగారు. తద్వారా అధికారంలో ఉన్నపుడు వారితో ఏర్పడిన దూరాన్ని తొలగించుకొని మళ్ళీ వారికి చేరువకాగలిగారు. అదేవిధంగా ఆయనను స్వయంగా కలుసుకొన్న ప్రజలకు ఆయనపట్ల ఒక అవగాహన ఏర్పడింది.   ఈ పాదయాత్ర ద్వారా నాలుగు ముఖ్య ప్రయోజనాలు సిద్దించాయి. 1. ప్రజలకి చేరువగా పార్టీని తీసుకువెళ్ళడం. 2.పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవడం. 3.ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితి పట్ల ఆయన స్వయంగా అవగాహన పొందడం. 4.తనపట్ల, పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఏర్పరచడం.   తన పాదయాత్రలో చంద్రబాబు మారుమూల గ్రామాలలో పార్టీకోసం పనిచేసే అనామక కార్యకర్తలు మొదలుకొని నగరాలలో, పట్టణాలలో ఉండే నేతల వరకు అందరినీ స్వయంగా కలిసి మాట్లాడి మళ్ళీ వారిలో పోరాట స్పూర్తిని నింపగలిగారు. ప్రతీ జిల్లా పర్యటనలో నియోజక వర్గాల వారిగా పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతూ ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకొంటూ, పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసుకొంటూనే, మరో వైపు అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకం అవడంవలన పార్టీ పట్ల వారిలో సానుకూల వాతావరణం సృష్టించారు.   మంచి పరిపాలన దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు తన పాదయాత్రలో వివిధ జిల్లాలో పార్టీ పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలకి తగిన ప్రణాలికలు వ్యూహాలు రచించుకోగలిగే అవకాశం కూడా ఏర్పడింది. గ్రామస్థాయి నుండి పట్టణ, నగర స్థాయి వరకు ఉండే అనేక స్థానిక సమస్యలపట్ల ఆయన స్వయంగా అవగాహన పెంచుకోవడమే కాకుండా, వాటిని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియజేసే ఒక నిర్దిష్టమయిన జిల్లా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తూ ప్రజలని ఆకట్టుకొన్నారు.   అదేవిధంగా వివిధ జిల్లాలో పార్టీ నేతల మద్యన ఉన్న విబేధాలను తొలగించే ప్రయత్నాలు చేసారు. కొన్నిసర్దుబాట్లు, మార్పులు చేర్పులతో, అలిగిన నేతలకు కొన్ని తాయిలాలు, అవసరమయిన చోట క్రమశిక్షణా చర్యలు తీసుకొంటూ, గత 9ఏళ్లుగా అధికారానికి దూరమయి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నపార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేసారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఇందుకు పూనుకోవడంతో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవిధంగా పార్టీని అంతర్గతంగా బలపరుచుకోవడం చాలా మంచి ఆలోచనే.   అయితే ఈ పాదయత్ర ప్రభావం ప్రజల మీద, పార్టీ కార్యకర్తలు, నేతల మీద రాబోయే ఎన్నికలవరకు ఉంటుందా లేదా అనే సంగతిని పక్కన పెడితే, చంద్రబాబు తన తన పాదయాత్ర ద్వారా పార్టీని పటిష్టపరుచుకొని పార్టీ ప్రభావం ప్రజల మీద ప్రసరించేలా చేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. చంద్రబాబు పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ప్రజలకు సమర్ధంగా తెలియజేయగలిగారు. రాబోయే ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాదిస్తే ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసిన ఈ పాదయాత్రకు, ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కినట్లే భావించవచ్చును. .

ఎందరో ప్రధాని అభ్యర్దులు. అందరికీ వందనాలు!

  బహుశః స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతవరకు ఎన్నడూ కూడా ప్రస్తుతం ప్రధాని పదవిపై జరుగుతున్నంత చర్చ జరగలేదు. ఇంత కాలం దేశం గాంధీ నెహ్రూ వంశీకుల చేతిలోంచి బయటపడక పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చును. గతంలో సోనియా గాంధీకి కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు ఆమె ఇటలీ మూలాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ఆమె వెనక్కు తగ్గవలసి వచ్చింది తప్ప, కాంగ్రెస్ వాదులు చెపుతున్నట్లు ఆమె ప్రధాని పదవిని త్యాగం చేయలేదని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, దేశాన్ని ఆమె పరిపాలిస్తున్నారనే సంగతి బహిరంగ రహస్యమే.   దేశానికి సుదీర్గ కాలం ఏకచత్రాదిపత్యం వహించి పరిపాలించిన ఆ కుటుంబ ప్రాభాల్యమే నేటికీ బలంగా ఉన్నపటికీ, మకుటం లేని యువరాజుగా పేర్కొనబడుతున్న రాహుల్ గాంధీ ప్రధానిపదవి పట్ల కొంచెం అకాల వైరాగ్యం ప్రదర్శించడంవలన “అయితే మరెవరూ?” అనే ప్రశ్న కాంగ్రెస్ లో ఉత్పనం అయింది.   కర్ణుడికి సహజ కవచకుండలాలు కలిగి ఉన్నట్లు, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి కూడా సమర్దుడు, ఆర్ధిక వ్యవహారాలలో నిపుణుడు, నిష్కళంక చరితుడు, వివాదరహితుడు, మేధావి, సౌమ్యుడు వగైరా వగైరా భుజకీర్తులన్నీ కలిగిఉన్నపటికీ, కాంగ్రెస్ నేతలెవరి కంటికి ఆయన ఆనకపోగా, ఆయన కుర్చీలో కూర్చోని ఉండగానే ఆయనను తప్పించడం గురించి పార్టీలో చర్చకు అనుమతి నీయడం ఇంకా దారుణం.   రాహుల్ గాంధీ ప్రధాని పదవి పట్ల అనాసక్తి చూపుతున్నపటికీ, 65 ఏళ్లుగా కాంగ్రెస్ సంస్కృతీ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారయినా ఆ కుర్చీ రాహుల్ గాంధీకే రిజర్వ్ చేయబడి ఉందని చెపుతారు. స్త్రీలకూ ప్రసూతి వైరాగ్యం, మనుషులకు శ్మశాన వైరాగ్యం అన్నట్లు, వరుస ఓటములను చవి చూసిన రాహుల్ గాంధీకి ప్రస్తుతం రాజకీయ వైరాగ్యం కలిగినా అది తాత్కాలికమేనని చెప్పవచ్చును. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్న బీజేపీ నుండి ఆయన సరిగ్గా అందుకోగలిగితే అప్పుడు ఆ రాజకీయ వైరాగ్యం కూడా మాయమయిపోవడం ఖాయం.   అయితే మోడీ ప్రభావంతో బీజేపీకి దేశంలో రాజకీయ వాతావరణం కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నపటికీ, మోడీ వ్యతిరేఖత ఆ పార్టీ పట్ల శాపంగా మారింది. అందువల్లే నేటికీ ఆయనకు కర్ణాటక ఎన్నికల బాద్యతను దైర్యంగా అప్పగించలేక, అటు కర్ణాటకను వదులుకోలేక బీజేపీ నానా అవస్థలు పడుతోంది. కర్ణాటకలో అవినీతి గనులను తవ్వి పోసిన బీజేపీ నేతలని ప్రజలు ఎంతమాత్రం నమ్మడానికి సిద్దంగా లేరని ఖచ్చితంగా చెప్పవచ్చును. అద్వానీ మొదలు సుష్మా స్వరాజ్ వరకు ఎందరు నేతలు పర్యటించి, ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, అక్కడా వారి ప్రభుత్వంపట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేఖ భావాలను తుడిచిపెట్టలేరు. ఇదే రాహుల్ గాంధీ కి ఒక గొప్పవరంగా మారనుంది. బీజేపీ మోడీ అస్త్రాన్ని వాడుకొని ఉంటే, రాహుల్ గాంధీ పని కొంచెం కష్టమయేదేమో!   ఇక ప్రధాని పదవికి ప్రధాన అర్హత రాజకీయ మద్దతే తప్ప వేరే ఏ ఇతర అర్హతలు అవసరం లేదని దృడంగా నమ్మే మాయవతి, ములాయం సింగులు, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కూడా 3వ,4వ,5వ ఫ్రంటు అంటూ అందరూ తలొక ఫ్రంటు పెట్టుకొని తమ ప్రయత్నాలు గట్టిగానే చేసుకుపోతున్నారు.   దేశానికి ఇక సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవని, నేడు కాకపోతే రేపయినా తాము ప్రధాని అవడం ఖాయమని వారు బల్లగుద్ది మరీ చెపుతుంటే ప్రజలు ఇప్పటి నుండే భయబ్రాంతులవుతున్నారు. అందువల్ల రాబోయే ఎన్నికలను అటువంటివారు అగ్నిపరీక్షగా భావిస్తే, అవి యావత్ భారతీయుల విజ్ఞతకి పరీక్షగా భావించవలసి ఉంటుంది.

కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలే

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దొందుకు దొందు దొందప్పలే అన్నట్లు ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బయ్యారం గనుల్లో చిక్కుకొని విలవిలాడుతుంటే, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు గనుల్లో చిక్కుకొని బయట పడలేక నానా తిప్పలు పడుతోంది. అయినప్పటికీ, రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు మొండివైఖరితోనే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం విశేషం.   రాష్ట్రంలో బయ్యారం గనుల వ్యవహారంలో కిరణ్ కుమార్ తెలంగాణ నేతలను పూచికపుల్లతో సమానంగా పరిగణిస్తూ తన నిర్ణయాన్నిగట్టిగా సమర్దించుకొంటుంటే, కేంద్రంలో సోనియా గాంధీ బొగ్గు గనుల వ్యవహారంలో ‘ప్రతిపక్షాలను అరుచుకోనివ్వండి మనపని మనం చేసుకు పోదామని’ అనడం గమనిస్తే ఇద్దరి వైఖరిలో తేడా ఏమి లేదని అర్ధం అవుతోంది.   బొగ్గు గనులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన నివేదికను సుప్రీం కోర్టులో సమర్పించక ముందే, న్యాయ శాఖామంత్రి తన వద్దకు తెప్పించుకొని అందులో కొన్ని సవరణలు చేయడంతో, ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. అందుకు సంజాయిషీ ఇస్తూ మంత్రిగారు కేవలం నివేదికలో భాష, వ్యాకరణ దోషాలను మాత్రమే సరిదిద్దారని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్దించుకోవడం నిజంగా సిగ్గు చేటు. న్యాయ శాఖా మంత్రి దేశానికి న్యాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటపడుతున్న అవినీతి గనులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలకు కాంగ్రెస్ వద్ద ఉన్న ఏకైక అస్త్రం ఎదురు దాడి చేయడమే. అయినా ప్రతిపక్షాలు రాజీనామాలకు పట్టుబట్టడంతో సోనియా గాంధీ “ప్రతిపక్షాలను అరవనీయండి మనం పట్టించుకోనవసరం లేదు” అని అనడం తాము ఎవరికీ జవాబు చెప్పుకోనవసరం లేదని చెప్పడమే. ఆమె ఆవిధంగా చెప్పడం ప్రభుత్వానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల, ప్రతిపక్షాల పట్ల ఎంత చిన్నచూపో తెలియజెపుతోంది.   అదేవిధంగా మొన్న సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు మరో చక్కటి ఉపదేశం కూడా చేసారు. “ప్రజలు, ముక్యంగా యువతకి మనం సాదించిన ఘనకార్యాల పట్ల బొత్తిగా సంతృప్తి లేదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదనే మనల్ని నిందిస్తున్నారు. వారికి తగిన విధంగా మనం సమాధానం చెప్పవలసి ఉంది. వారు విమర్శిస్తే దానికి మీరు కూడా దీటుగా జవాబు ఈయండి,” అని ఉద్బోధించారు.   మరి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అనే ప్రశ్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఏ విషయంలోనూ స్వపక్షాన్నే కలుపుకు పోలేని కిరణ్ కుమార్ రెడ్డి, ఇక విపక్షాలను మాత్రం ఏవిధంగా కలుపుకు పోగలరు? అందువల్ల కేంద్రాన్ని దానిని నడిపిస్తున్న తమ అధినేత్రి సోనియా గాంధీ అడుగు జాదలలోనే నడుస్తూ ఆమెనే ఆదర్శంగా భావిస్తూ, ప్రతిపక్షాలతో డ్డీ కొంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.   ఇంకా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య చాలానే దగ్గర పోలికలున్నాయి. రెండు చోట్ల ప్రభుత్వాలు బొటాబొటి మెజార్టీతో నడుస్తునాయి. అయినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో దొందుకు దొందే. అక్కడ వరుసపెట్టి 2జీ, వాద్రా భూముల కుంభకోణాలు, బొగ్గు గనులు కుంభకోణాలు, యఫ్.డీ.ఐ., అగస్టా హెలికాఫ్టర్ల అవినీతి బాగోతాలు, లంచాలు వరుసగా బయట పడుతున్నాకూడా కాంగ్రెస్ ఏలికలు ఏదో సాదించి పడేసినట్లు నిర్లజ్జగా భోర విరుచుకొని మరీ తిరుగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చాపక్రింద దాచిపెట్టి పోయిన అవినీతి భాగోతాలు, సీబీఐ చార్జ్ షీట్లు, పదవుల కోసం మంత్రుల డిల్లీ టూర్లు, పార్టీలో కుమ్ములాటలు, తెలంగాణ సమస్య, దానివల్ల మళ్ళీ కొత్త ముఠాలు, వారి అసమ్మతి, కరెంటు కోతలు, సామాన్యుడి బ్రతుకు భారం చేస్తున్న కరెంటు చార్జీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నెత్తికెత్తుకొన్న బయ్యారం గనుల వ్యవహారాలతో ప్రభుత్వానికి పరిపాలనకు సమయం చిక్కడం లేదు.   ఈవిధంగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలేనని రుజువు చేసుకొనేందుకు ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి.