ఇకనయినా కేసీఆర్ ధోరణి మారేనా
posted on Aug 5, 2013 @ 11:03AM
మూడు రోజుల క్రితం ‘ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవలసిందే’నంటూ హుకుం జారీ చేసిన కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ తో సహా అన్ని రాజకీయపార్టీల నేతలు, ఆంధ్ర ఉద్యోగులు, సీమంధ్ర ప్రజలు తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. నిన్నహైదరాబదులో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎవరిని వెళ్లిపోమ్మనలేదని కేవలం పద్ధతుల గురించి మాత్రమే మాట్లాడానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు.
గతంలో కూడా ఆయన సోనియాను దేవత అంటూ పొగిడేరు. మళ్ళీ అదే నోటితో ఆమెను, ఆమె వంశాన్ని నోటికొచ్చినట్లు దూషించారు. మళ్ళీ ఇప్పుడు అదే నోటితో ఆమెను దేవత అని పొగుడుతున్నారు. ఈవిధంగా తరచు అభిప్రాయలు మార్చుకొంటూ మాట్లాడటం వలన ఆయన ప్రతీసారి సంజాయిషీలు ఇచ్చుకోక తప్పని పరిస్థితి చాలాసార్లు ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెప్పవచ్చును.
ఈ సమావేశంలో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా తీవ్ర సమస్యలలో చిక్కుకోక తప్పదని హెచ్చరిస్తున్నవారికి తగిన జవాబు చెపుదామని ఆయన అన్నారు. ఆ తరువాత విద్య ఉపాధి అవకాశాల గురించి, వాటిలో వివిధ వర్గాలకి చెందిన ప్రజలకు అమలు చేయనున్న రిజర్వేషన్స్ గురించి ఆయన వివరించారు. ఆయన మీడియా సమావేశంలో ఎక్కడా అదుపుతప్పకుండా మాట్లాడి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకొన్నారు.
ఆయన తన ప్రసంగంతో తెలంగాణాలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ప్రయత్నం గట్టిగా చేసారు. అయితే, ఆయన ఏ అధికారిక హోదా లేకపోయిన్నపటికీ ఇన్ని వాగ్దానాలు చేయడం ఎందుకంటే, క్రమంగా మళ్ళీ తెలంగాణలో తన పునర్వైభవం సాధించడానికేనని చెప్పవచ్చును.
తెరాస ఉంటుందో లేక కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందో కూడా ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో ఉన్న ఆయన ఇటువంటి ఒక రంగుల కలని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ, అన్ని వర్గాల వారికి వరాలు గుప్పిస్తూ, ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీటిలో ఆచరణ సాధ్యమయినవెన్ని? ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలవకుండా పోటీ చేసి అధికారంలోకి రాగలదా? కలిస్తే కాంగ్రెస్ పార్టీ చేత తన ప్రణాళికలన్నిటినీ ఆయన అమలు చేయించగలడా? లేదా? ఒక వేళ ఆయన పార్టీ కాంగ్రెస్ లో కలువకుండా అధికారంలోకి రాలేకపోతే ఆయన వీటినన్నిటినీ ఏవిధంగా అమలు చేస్తారు? వంటి అనేక ధర్మ సందేహాలను పక్కన బెడితే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే కంటే ఈవిధంగా మాట్లడటమే అందరికీ ఆనందం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.
తెలంగాణా రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన మాట్లాడితే అది సకారాత్మక ఆలోచనా ధోరణి అవుతుంది. దానిని అందరూ స్వాగతిస్తారు. తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలనే ఎవరయినా కోరుకొంటారు. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా కూడా అది దేశాభివృద్దే అవుతుంది. మరటువంటప్పుడు ఇంత కాలం ఒక్కతిగా ఉన్నఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఎవరయినా కోరుకొంటారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది తెలుగు జాతికి గర్వకారణమే అవుతుంది.
ఇంత కాలం తెలంగాణా సాధనకోసం కేసీఆర్ ఏవిధంగా మాట్లాడినా, కనీసం ఇప్పుడయినా ఆంధ్ర ప్రజల పట్ల తనకున్న ఏహ్య భావాన్నివిడిచిపెట్టి రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధిలోమాత్రమే పోటీతత్వం ప్రదర్శిస్తే తన తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మహోపకారం చేసినవారవుతారు.