సినీ పరిశ్రమకు ఉద్యమ సెగ
posted on Aug 24, 2013 @ 10:57PM
రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీఅయోమయంలోపడ్డాయి. అదేవిధంగా రాజకీయాలతో పెనవేసుకుపోయిన సినీపరిశ్రమ పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయంలో పడింది. దాదాపు రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మింపబడిన నాలుగు పెద్ద సినిమాలు-పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు’, ‘తుఫాన్’ మరియు ‘జంజీర్’(హిందీ) సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయనందున సమైక్యవాదులు అడ్డుపడటంతో ఈ మెగా హీరోల సినిమాల విడుదల కాలేకపోయాయి. కనీసం ఎప్పుడు విడుదల అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
రెండు మూడు రోజుల క్రితం చిరంజీవి తను సమైక్యాంధ్ర కోరుకొంటున్నానని ప్రకటించినప్పటికీ ఉద్యమకారుల నుండి సానుకూల ప్రతిస్పందన లేదు. అయితే, ఆయన ఆవిధంగా ప్రకటించడం వలన ఒకవేళ సీమాంధ్ర ప్రాంతంలో ఈ ఇద్దరు మెగా హీరోల సినిమాల విడుదలకు మార్గం సుగమం కావచ్చునేమో కానీ ఇప్పుడు తెలంగాణావాదులు అడ్డుపడటం ఖాయం.
రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచి పోషించినందున రేపు రాష్ట్ర విభజన జరిగిన తరువాతయినా ఈ పరిస్థితిలోసానుకూల మార్పు వస్తుందా? అనే అనుమానం సినీపరిశ్రమను కలవరపరుస్తోంది.
ఇక తెదేపా రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో, అయన కుమారుడు జూ.యన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెలంగాణాలో విడుదలకు అనుమతించమని ఓయు జేయేసీ ప్రకటించింది. ఇదే రూలు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నసినిమాకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఇక, నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్నపటికీ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా సినిమా విడుదల కాకపోవచ్చును.
పెద్ద సినిమాలు విడుదల కానందున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సినిమా థియేటర్లు ఖాళీగా ఉండటంతో చిన్న సినిమా నిర్మాతలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తమ సినిమాలను విడుదల చేసుకొంటున్నారు. అయితే అందరూ ఆ అదృష్టానికి నోచుకోవట్లేదు. కారణం కొన్ని సినిమాలు అనేక నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకొన్నపటికీ ఇంత కాలంగా థియేటర్లు దొరకని కారణంగా సదరు సినిమాల నిర్మాతలు పీకల లోతు అప్పులలో కూరుకుపోయారు. అటువంటివారు ఇప్పుడు అవకాశం ఉన్నపటికీ తమ సినిమాలను విడుదల చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు.
సినిమా నిర్మాణం పూర్తయి చాల కాలం అయినప్పటికీ విడుదల కాకపోవడంతో నిర్మాతలకు ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఈవిధంగా సినిమా విడుదల వాయిదా పడుతుండటంతో, తరువాత విడుదల కావలసిన సినిమాలు కూడా వాయిదాపడవచ్చును. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నసినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఇప్పుడప్పుడే అంతం అయ్యే సూచనలు కనబడకపోవడంతో చిన్న,పెద్ద సినీ నిర్మాతలు తమ కొత్త సినిమాల నిర్మాణం వాయిదా వేసుకొంటున్నారు.
అంతిమంగా ఇది సినీ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మంది జీవితాలను చిద్రం చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చిన్న సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా, గోడౌన్లుగా మార్చబడ్డాయి. ఇంకా చాలా థియేటర్లకి ఇదే గతి పట్టవచ్చును. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రేయనక పగలనక కష్టపడి నిర్మించిన సినిమాలు విడుదల కాని పరిస్థితులు ఉంటే ఏ నిర్మాత సినిమా నిర్మించే సాహసం చేయడు.
ప్రజలకు వినోదం పంచిపెట్టే సినీ పరిశ్రమ నేడు పెను విషాదం చవి చూస్తోంది. సినీ పరిశ్రమ ముక్కు పిండి కోట్ల రూపాయలు పన్నులు దండుకొనే ప్రభుత్వం కానీ, ఉద్యమాల కోసం బలవంతపు వసూళ్లు చేసే రాజకీయ పార్టీలు గానీ, దాని కష్టాలు పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. రాష్ట్రంలో ఇదే అనిశ్చిత పరిస్థితి మరికొంత కాలం సాగితే సినీ పరిశ్రమ మూతపడినా ఆశ్చర్యం లేదు.