తెలంగాణా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నరాజకీయ పార్టీలు
posted on Aug 27, 2013 @ 9:30PM
దాదాపు నెల రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అంగీకారం తెలుపుతూ ప్రకటన చేసినప్పటి పరిస్థితులకి, కమిటీల గురించి మాట్లాడుతున్ననేటి పరిస్థితికి మధ్య వచ్చిన వ్యత్యాసాన్నితెలంగాణా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సీమంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, సమ్మెల వల్ల కొంత, సీమాంధ్ర నేతల రాజకీయ ఒత్తిళ్ళవల్ల మరికొంత ఈ మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
ఇక తెలంగాణాకు అనుకూలమని లేఖ ఇచ్చిన తెదేపా, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తామని హామీ ఇచ్చిన వైకాపాలు ఇప్పుడు సమైక్య పల్లవి అందుకోగా, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి బేషరతు మద్దతు లేదా అధికారంలోకి వస్తే వంద రోజుల్లోతెలంగాణా అని ఖరాఖండిగా ప్రకటించిన బీజేపీ కూడా తాజాగా ‘సమన్యాయం’ రాగం అందుకొంది. ఈవిధంగా రాజకీయ పార్టీలన్నీఒకటొకటిగా తెలంగాణా ఏర్పాటుకి యధాశక్తిగా అడ్డంకులు సృష్టిస్తుంటే, క్రమంగా తెలంగాణాలో మళ్ళీ క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణాలో మళ్ళీ ధర్నాలు, ర్యాలీలు మొదలయ్యాయి.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్నందున వారు అందుకు అనుగుణంగానే పావులు కదుపుతారనేది బహిరంగ రహస్యమే. ఇక, ఆఖరు నిమిషంలో తెలంగాణాను వదులుకొని సీమాంధ్రాకే పరిమితమయ్యేందుకు నిశ్చయించుకొన్న వైకాపా, సీమాంధ్ర ప్రాంతంలో తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తెలంగాణాకు వ్యతిరేఖంగా వ్యవహరించడం కూడా సహజమేనని చెప్పవచ్చును.
ఇక, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు సీమాంధ్ర నేతలని సమర్ధంగా కట్టడి చేయగలిగిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత తన నేతలపై పట్టుకోల్పోవడం వలననో లేక సీమంధ్ర ప్రాంతంలో తెదేపా తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకో మళ్ళీ తన ద్వంద వైఖరి ప్రదర్శిస్తోంది. అయితే, మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి మొగ్గు చూపుతున్నబీజేపీ అకస్మాత్తుగా ‘సమన్యాయ రాగం’ అందుకోవడం మాత్రం చాల విచిత్రంగా అనిపిస్తోంది.
తెలంగాణాలోఎంతో కొంత బలం ఉన్నబీజేపీకి సీమంధ్రలోమాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ కూడా సమన్యాయం కోరుకోవడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని తెలంగాణవాదులు బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంత హటాత్తుగా తెలంగాణా ప్రకటన చేయడంతో కంగుతిన్నకాంగ్రెస్, తెదేపా, వైకాపాలకు చెందిన సీమాంధ్రనేతలు తెలంగాణాను అడ్డుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని వారు నమ్ముతున్నారు.
పార్లమెంటులో కాంగ్రెస్ తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే, దాని ఆమోదం కొరకు బీజేపీ మద్దతుకూడా చాల అవసరం. కనుక బీజేపీ తెలంగాణా ఏర్పాటు కాకుండా బిల్లుకి అడ్డుపడితే, అందుకు ప్రతిగా సీమాంధ్రకు చెందిన ఈ మూడుపార్టీల నేతలు రానున్నఎన్నికల తరువాత బీజేపీ కేంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బేషరతుగా మద్దతు ఇస్తామని బీజేపీతో రహస్య ఒప్పందానికి వచ్చినందునే, బీజేపీ తెలంగాణపై వెనక్కి తగ్గిందని తెలంగాణావాదులు భావిస్తున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరుతుంది తప్ప బీజేపీకి కాదు. ఎలాగయినా మళ్ళీ అధికారంలోకి వద్దామని తపిస్తున్నబీజేపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయకుండా అడ్డుపడగలిగితే, అప్పుడు కాంగ్రెస్ తెలంగాణాలో పరాభవం తప్పదు. అది బీజేపీకి వరంగామారే అవకాశం ఉంది. గనుక బీజేపీ కూడా తెలంగాణాకు వ్యతిరేఖంగా పావులు కదుపుతున్నట్లు అర్ధం అవుతోంది.
ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా వారు శాశ్వితంగా తెలంగాణా ప్రజల నమ్మకంకోల్పోవడం ఖాయం. అంతిమంగా ఇది తెరాసకు లాభం చేకూర్చడం కూడా అంతే ఖాయం.