పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజీనామా
posted on Nov 29, 2012 @ 2:30PM
చిత్తూరు జిల్లా పుంగనూర్ శాసన సబ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పార్టీని వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరకాల ప్రత్యర్ధి అయిన అయన కిరణ్ ముఖ్య మంత్రి అయినప్పటి నుండి పార్టీ లో అసంతృప్తితో ఉన్నారు.
నవంబర్ ౩౦ లోపు కిరణ్ ను ముఖ్య మంత్రి పదవి నుండి తప్పించక పొతే, రాజీనామా చేస్తానని అయన గతంలోనే స్పష్టం చేశారు. అయన రాజీనామా నిర్ణయం తెలిసిన వెంటనే, పార్టీ సీనియర్ నాయకులను రంగంలోకి దించింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మొదలు, రాష్ట్ర పీసిసి ఆధ్యక్షుడు బొత్సా సత్యానారాయణ, డి.శ్రీనివాస్ లు ఆయనకు ఫోన్ చేసి సముదాయించే ప్రయత్నం చేసారు.
పార్టీలోనే ఉంటానని అయన అంటునప్పటికి, మరో రెండు, మూడు నెలల్లోపు రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగక పొతే, అయన జగన్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి తో అనేక మంది పార్టీ నాయకులకు వైరం ఉంది. అయితే, అయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది బలపడింది. పెద్దిరెడ్డి విషయం అలా కాదు. వీరి వైరం కొన్ని దశాబ్దాల నాటిది. ఈ పరిణామాలన్నీ చివరకు పెద్దిరెడ్డి రాజీనామాకు దారి తీశాయి.