ఆశావహులను జో కొడుతున్న సిఎం?

  రాష్ట్రంలో మంత్రి పదవుల నియామకం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ నియామకం గురించి ఏ మాత్రం కంగారు పడటం లేదు. దీంతో ఇప్పటికే ఆరునెలలుగా ఎక్కువశాఖలు సిఎం చేతిలోనే నలిగిపోతున్నాయి. ప్రత్యేకించి సిఎం సంతకాలు చేసేందుకు కూడా ఖాళీ ఉండక కొన్ని పనులు ఆగిపోతున్నాయని పలువురు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో మంత్రి పదవి పొందవచ్చని ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఢల్లీ నుంచి వచ్చే సమాచారం కీలకం అన్న విషయం తెలిసిపోయింది. దీంతో ఢల్లీ కాంగ్రెస్‌ నేతలతో ఆశావహులు ఫోన్లు మాట్లాడుతున్నారు. తమపై ఒత్తిడి పెరుగుతున్నా అధిష్టానాన్ని ఒప్పించుకునేందుకు సిఎం ప్రయత్నించటం లేదని ఢల్లీ నేతలు కిరణ్‌పై కస్సుబుస్సులాడుతున్నారు. కిరణ్‌ పెద్దగా ఒత్తిడి చేయకపోవటం వల్లే అధిష్టానం అంతగా స్పందించలేదని కూడా ఢల్లీ నేతలు సిఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఈపాటికి రాష్ట్ర మంత్రిపదవుల భర్తీ ఎప్పుడో పూర్తయి ఉండేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతీదానికీ చూద్దామని చెప్పే సిఎం ఢల్లీ నేతల ప్రచారం గురించి తెలుసుకుని నివ్వెరపోతున్నారు. కేంద్ర మంత్రి పదవులు పూర్తయ్యాయి కాబట్టి రాష్ట్ర మంత్రుల భర్తీ త్వరలోనే పూర్తి చేస్తామని మరోసారి ఆశావహులను ఆయన జో కొడుతున్నారు.

సర్దుబాటు వడ్డన

  రాష్ట్రంలో విద్యుత్ రంగం గాడిన పడే అవకాశాలు కనిపించటం లేదు. ఒకవైపు శీతాకాలంలోనూ విద్యుత్ కోతలతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు డిస్కాంలు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు 980 కోట్లమేర ప్రతిపాదనలను సమర్పించారు. విద్యుత్ యూనిట్ చార్జి అదనంగా 82 పైసలు వడ్డించేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కాంలు కోరాయి. నవంబర్ నెలలో బహిరంగ విచారణ తర్వాత ఈ అంశంపై ఏపిఇఆర్‌సి నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇప్పటికే ఏపిఇఆర్‌సి వద్ద 2165 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జిల వడ్డన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి ఏ క్షణమైనా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇంధన సర్దుబాటు చార్జీలతో వినియోగదారులు కుదేలవుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో వర్షాకాలం, శీతాకాలం అనే తేడా లేకుండా విద్యుత్ సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట డిస్కాంలు సొమ్మును వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ‘ఆ ముగ్గురు’

  రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తెలంగాణపై దృష్టి సారించారు. కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతలు సోమవారం తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొన్నారు. ఆయన మరో రెండురోజులు జిల్లాలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం వాయిదా పడటంతో మెదక్ జిల్లాకు వెళ్ళారు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 2న అనంతపురం జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి, కర్నూలు జిల్లా మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో బాబు యాత్ర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. విజయమ్మ సమక్షంలో జిట్టా పార్టీలో చేరారు.

అందరూ కలిస్తేనే…

  రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తనతో అందరూ కలిస్తేనే తనకూ, పార్టీకి పట్టుగా ఉం టుందని, అప్పుడే పార్టీకి విలువ, గౌరవమని, లేకపోతే ఒక్కరే మిగులుతామని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. నాయకులనే వారు ఒకరే ఉంటారని, సున్నాలు లేకపోతే అంకెకు విలువ ఉండదని, తనకు మరొకరు కలి స్తేనే తనకు విలువని, లేకపోతే ఒక్కడిగా మిగిలిపోతానని బొత్స నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా పార్టీకి బలం, అందం వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎంపీ కావూరి సాంబశివరావును తాను కలిసానని, 5 సార్లు ఎంపీగా గెలిచిన కావూరి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదన్నారు. కావూరి సేవలను పార్టీ మరోవిధంగా వినియో గించుకుంటుందని తాను భావిస్తున్నానన్నారు. కావూరి రాజీనామా ఉపసంహరించుకుంటారా అన్న ప్రశ్నకు తాను కోరానని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని బొత్స ఆశాభావం వ్యక్తంచేశారు. సీనియర్‌ మంత్రి జైపాల్‌ రెడ్డికి ప్రమోషనా డిమోషనా అని విలేకరులు బొత్సతో ప్రస్తావించగా ఆయనకు శాఖలో సంబంధం లేదని, ఆయ న అనుభవజ్ఞుడని, ఏ శాఖ ఉన్నా అయనకు ఉన్న విలువ ఆయనకు ఉంటుందని బొత్స స్పష్టంచేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులపై అవసరమ నుకుంటే, అవసరమైతే..అన్న బొత్స, పార్టీలో అంతర్గ తంగా చర్చించుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటా మన్నారు.

స్కూలుబస్సులు కండీషన్‌ మళ్లీ మామూలే!

  షిర్డీలో ప్రైవేటుట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదం జరిగినప్పుడు రవాణాశాఖాధికారులకు ఉన్న స్పీడు మళ్లీ తగ్గింది. ఎందుకంటే ఆ సంఘటనను ప్రజలు మరిచిపోయి ఉంటారని వారికి నమ్మకం కుదిరింది. అందుకని గత రెండు నెలలుగా దాడులు తగ్గించేశారు. దీంతో ట్రావెల్స్‌ ఏజెన్సీలూ రెచ్చిపోతున్నాయి. అప్పట్లోనే స్కూలు బస్సుల కండీషనుపై దృష్టిసారించిన రవాణాశాఖాధికారులు మళ్లీ పాతబస్సులు తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. నడవలేక నడుస్తున్నట్లుండే బస్సులను స్కూలు యాజమాన్యాలు ఎంపిక చేసినా రవాణాశాఖాధికారులు ఎటువంటి అభ్యంతరాలు చెప్పటం లేదు. పైగా కండీషనులో లేని బస్సులను బాగా కండీషనులో ఉన్నట్లు చూపుతున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు గుప్పుమన్నాయి. మొన్నటిదాకా సీజ్‌ చేసిన స్కూలు బస్సులను కూడా వదిలేశారని తెలుస్తోంది. రవాణాశాఖ కార్యాలయానికి ఎవరు వెళ్లినా అన్నీ కంప్యూటరైజ్‌ చేశాం ఎటువంటి లోపమూ లేదని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి ఆమ్యామ్యాలను వదలకుండా రవాణాశాఖాధికారులు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు స్కూలు యాజమానులు ‘తెలుగువన్‌.కామ్‌’కు స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సంఘటన చూస్తే కండీషను లేని వాహనాల వల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో అర్ధమవుతోంది. గుంటూరుజిల్లా రేపల్లెలో అడవిపొలం వద్ద స్కూలు బస్సు అదుపుతప్పి పొలాల్లో దూసుకువెళ్లింది. ఈ ప్రమాదం ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

కిరణ్‌ను దోషిగా నిలబెడుతున్న స్థానికఎన్నికలు?

  కిందిస్థాయి నుంచి కేడర్‌ను నియమించాలంటే కార్యకర్తలు ద్వితీయశ్రేణికి ఎదగాలి. ద్వితీయశ్రేణి నాయకులు ప్రథమశ్రేణివారితో పోటీపడాలి.  ఏ రాజకీయపార్టీ రాణించాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుంది. అటువంటిది కాంగ్రెస్‌ పార్టీ ఈ సూత్రాన్ని తప్పించింది. తన కార్యకర్త మనస్సును గెలుచుకునే స్థానిక ఎన్నికలను గాలికి వదిలేసింది. దీనికి కారణమేమిటని పరిశీలిస్తే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి అంటూ కాంగ్రెస్‌లోని సీనియర్లు నుంచి కార్యకర్తల వరకూ అందరూ వేలెత్తి చూపుతున్నారు. నిన్నటిదాకా కేంద్ర మంత్రి పదవుల పంపకం గురించి అధిష్టానం అనుమతి ఇవ్వలేదని సిఎం దాటవేశారు. అయితే ప్రతీ చోట మాత్రం ఒక్కనెలలో స్థానికఎన్నికలు వచ్చేస్తాయని ఊరించారు. అలా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎవరైనా ప్రశ్నిస్తే ఒక్కనెలలోనే బ్రదర్‌ అని సిఎం సమాధానమిస్తారట. ఎంతకాలం ఈ ఒక్కనెల అన్న మాట వినాలని కాంగ్రెస్‌ కేడర్‌ నిరాశను వ్యక్తం చేస్తోంది. తనపై నిరసన వ్యక్తమవుతోందని తెలిసినా సిఎం అధిష్టానాన్ని ఎందుకు స్థానిక ఎన్నికల గురించి నిలదీయలేకపోయారు? పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్పొరేషను, పంచాయతీల ఎన్నికలు జరగక అభివృద్థికి దూరమయ్యామని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి 11ఫైనాన్స్‌ నిధులు ఆపేస్తున్నామని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ ప్రకటించినా సిఎం ఒక ప్రేక్షకునిలా చూస్తుండిపోయారని ఆందోళనల మాటేమిటీ? ఎక్కడ సిఎం పర్యటన జరిగినా పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికల గురించే అడుగుతున్నా కేంద్రాన్ని ఒప్పించుకోలేని అసమర్ధతను సిఎం ఎందుకు ప్రదర్శిస్తున్నారు. ఏమైనా సిఎం కిరణ్‌ తన వైఖరి మార్చుకోకపోతే దోషిగా స్థానిక ఎన్నికలు నిలబెడుతున్నాయన్నది అక్షరసత్యమవుతోంది. ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నా తన నెమ్మదైన వైఖరిని సిఎం కొనసాగిస్తే ఇదొక్కటిచాలు ఆయన పదవికి ఎసరు పెట్టడానికి అని రాజకీయవిశ్లేషకులు తేల్చేస్తున్నారు.

రైతులకు ఆకర్షణగా మారుతున్న చంద్రబాబు?

  ఇప్పటి దాకా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్రలో చేసిన అన్ని ప్రసంగాల్లో ఒక్కోసారి ఒక్కొక్క వర్గాన్ని ఆకర్షించేలా ఉన్నాయని తేలింది. అయితే ఆయన తాజాగా చేసిన ప్రసంగం మాత్రం రైతుల మనస్సు గెలుచుకునేలా ఉందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు చంద్రబాబు రైతుల కోసం తాను చేసే తొలిసంతకం రుణమాఫీ అని ప్రకటించారు. ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే ఈ రుణమాఫీ వల్లే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుబాంధవునిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన తరువాత రైతుల గురించి మాట్లాడిన నేతగా చంద్రబాబును గుర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మామూలు వరాలు గుప్పించటం సహజమే. కానీ, ప్రతిపక్షనేతగా ఉంటూ రైతులకు అవసరమైన రుణమాఫీ గురించి చంద్రబాబు ప్రస్తావించటం చెప్పుకోదగిన అంశమైంది. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వం ఇటీవల కౌలుదారులకు రుణాలు ఇప్పిస్తామని ప్రకటించి బ్యాంకర్లు సహకరించకపోవటంతో కంగుతింటోంది. ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు లేదు. ఇటువంటి దశలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే తొలిసంతకం రైతుల బ్యాంకు రుణాల మాఫీపైనే ఉంటుందన్నారు. దీని వల్ల పెట్టుబడి లేక అల్లాడుతున్న రైతులకు బాబు మాట ఊరటనిస్తోంది. పైగా, ఇప్పటి నుంచే రుణాలు కట్టొద్దని కూడా బాబు నొక్కి చెప్పారు.

హరీశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ఎవరికి లాభం?

  రంగారెడ్డి జిల్లాలో అతిచిన్న నియోజకవర్గం పరిగి. ఇక్కడ లక్షా 99వేల పైచిలుకు జనాభా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. ఇంత చిన్న నియోజకవర్గం కూడా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కారణం పరిశీలిస్తే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కె.హరీశ్వర్‌రెడ్డి ఇక్కడ గెలుపొందటమే. పైగా ఈయనకు పెద్దగా మాట్లాడటమే రాదనే విమర్శలున్నాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ గెలిచారని స్థానికులే ఈయన ఎన్నికపై ఆశ్చర్యపోతుంటారు. తనకు నచ్చిన పని మాత్రమే చేసే ఎమ్మెల్యేగా ఈయనకు పేరుంది. అందరినీ కలుపుకు పోయే తత్వం కొంచెం తక్కువ. అందు వల్ల హరీశ్వర్‌రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడపలేకపోయారు. తన లోపాన్ని సన్నిహితులు కూడా ఎత్తిచూపుతున్న దశలో తెలంగాణా ఉద్యమం ఆయన్ని ఆకర్షించింది. ఎందుకంటే తన నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కొందరు ఈ ఉద్యమం వైపు పయనిస్తున్నారు. అందువల్ల తాను తెలంగాణాలో ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యమం వైపు పయనించినట్లు నటిస్తే మరోసారి 2014 ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కొందరు మేధావులు సూచించారు. పని చేయకపోయినా ఇటువంటి జాక్‌పాట్‌ కొట్టగలిగే అవకాశం తెలంగాణాప్రాంతంలో ఒకటి టిఆర్‌ఎస్‌, రెండు బిజెపిలకు మాత్రమే ఉందని కూడా తేలింది. దీంతో ఈయన టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారు. అధికారం వదులుకోలేక పార్టీలు మార్చుకునే నేతల జాబితాలో ఈయన కూడా చేరిపోయారు. ఇటువంటి చేరికల వల్ల ఎటువంటి నష్టం తమ పార్టీకి ఉండదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కప్పతక్కెడలను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారని ఆయన హెచ్చరించారు కూడా. తమ పార్టీలో హరీశ్వరరెడ్డి చేరుతున్నారని టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ కూడా ప్రకటించారు. నవంబర్‌ 15వతేదీ ముహుర్తమని ఆయన వివరించారు. అయితే నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు చూస్తున్నారో అన్న విషయం మర్చిపోయి స్వయంగా కేసిఆర్‌ వెళ్లి హరీశ్వరరెడ్డిని ఆహ్వానించారు. అంటే ఓ పార్టీ అధినేత అభివృద్ధిపై అంతగా అవగాహన లేని ఎమ్మెల్యేకు మరోసారి విజయమాల వేద్దామని చూస్తున్నారన్న మాట. ఓటర్లలో మార్పు వచ్చి ఆదరించకపోతే జరిగే నష్టం ఎవరికి? లాభం ఎవరికి? భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనే తేలాలి. అంత వరకూ టిఆర్‌ఎస్‌ తాను లాభపడ్డానన్న ఆనందం మిగలాలి కదా! ఆ తరువాతే అసలు విషయం అర్ధం అవుతుంది మరి.

వర్క్‌ఇన్స్‌పెక్టర్‌లకు నిత్య మామూళ్ల పండుగ?

  ప్రభుత్వశాఖల్లో వర్క్‌ఇన్స్‌పెక్టర్‌లు అయితే నిత్యం మామూళ్లు పండినట్లే.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా దాన్ని సద్వినియోగం చేసుకునేది వర్క్‌ఇన్స్‌పెక్టర్లు మాత్రమే.  కాంట్రాక్టర్లతో కలిసి సంబరాలు జరుపుకునే వీరిపై అసలు అవినీతినిరోధకశాఖ నిఘా తక్కువ. అందువల్ల వీరు పేట్రేగిపోతున్నారు. విధినిర్వహణలో భాగంగా ఒకవైపు ప్రాజెక్టులను సందర్శించి దానిలో లోపాలను గమనించి మరీ కాంట్రాక్టర్ల నుంచి కాసుల పండుగ చేసుకుంటారు. తమకు రెగ్యులర్‌ ఇచ్చే మామూళ్లతో పాటు కాంట్రాక్టు పూర్తయ్యాక కూడా ఎంతో కొంత ఇచ్చి మంచి చేసుకునే వెసులుబాటు వీరు కాంట్రాక్టర్లకు మిగులుస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంకుడుగుంటలు, కాంగ్రెస్‌ హయాంలో నీరు`మీరు వంటి పలు పథకాలనూ ఈ వర్క్‌ఇన్స్‌పెక్టర్లు వినియోగించుకున్నారు. కొత్తగా నిర్మించే స్టేడియంలు, అభివృద్థి పనుల్లోనూ వీరి చేతివాటం ఆగటం లేదు. పాఠశాల భవనాలు వంటి వాటి నిర్మాణంలో అయితే ఎంతివ్వాలో వీరే నిర్ణయిస్తారు. తమపై ఇంజనీర్లకు కూడా తామే పంచుతామని కాంట్రాక్టర్ల దగ్గర వారి వాటాలు కూడా వసూలు చేస్తుంటారు. ఇలా ఆమ్యామ్యాల్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ వర్క్‌ఇన్స్‌పెక్టర్ల లీలలు తాజాగా జరిగిన ఏసిబి దాడుల్లో స్పష్టంగా బయటపడిరది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని విద్య, సంక్షేమ మౌలికవసతుల కల్పనా సంస్థ కార్యాలయంలో ఎసిబి దాడులు చేస్తే గద్వాల్‌ డివిజన్‌ పరిధిలోని పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల్లో వర్క్‌ఇన్స్‌పెక్టర్‌ చంద్రశేఖరరావు 75వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ దొరికిపోయారు. ఇలానే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తే మరిన్ని కేసులు బయటపడగలవని పరిశీలకులు ఎసిబిని కోరుతున్నారు. 

జగన్‌ తరువాత గడ్కారీయేనా?

  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌జగన్మోహనరెడ్డి తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కేసు భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీదేనని న్యాయశాఖ మేథావులు అభిప్రాయపడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌కార్నర్‌ను జగన్‌ మనీలాండ్రిరగ్‌ ఉదంతం కొంత దెబ్బతీసింది. అయితే రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన గుండెఆపరేషన్లు, ఫీజురియంబర్స్‌మెంట్‌ వంటి కొన్ని పనులు జగన్‌కు ప్లస్‌ అయి 2012 ఉప ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయి. అయితే హిందుత్వ నినాదం వెనుక నిలబడే బిజెపికి దేశవ్యాప్తంగా నిజాయితీ అన్న నమ్మకం గతంలో ఉండేది. ఆ నమ్మకం ఒక్కసారి అధికారంలోకి వచ్చాక చక్కెర కుంభకోణం వంటి వాటితో తుడిచిపెట్టుకుపోయింది. బిజెపిని జాతీయపార్టీగా మాత్రమే గుర్తిస్తున్న నేటి స్థితిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకోగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగా తాజాగా ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గడ్కరీ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలకు సంబంధించిన కీలకపత్రాలను ఐటీశాఖ స్వాధీనం చేసుకుంది. దీన్ని బట్టి జగన్‌ తీరును బయటపెట్టిన సిబిఐ తరహాలోనే గడ్కరీ కేసు కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం ఈ అవినీతిపై నిజాయితీగా విచారణ చేసి వాస్తవాలను వెల్లడిరచటం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్కరీ ఒక్క కేసు చాలు బిజెపిని చిత్తు చేయటానికి అని కాంగ్రెస్‌ పెద్దలు కొందరు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు గడ్కరీని నిందితునిగా నిలబెట్టి ఆ తరువాత జగన్‌తో పోల్చేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. ఇదే కనుక జరిగితే కొంత వరకూ బిజెపి బలహీనపడి నిజాయితీ అన్న ముసుగును పూర్తిగా కోల్పోవచ్చని రాజకీయ మేథావులు అభిప్రాయపడుతున్నారు.  రాష్ట్రంలో వైకాపా, కేంద్రస్థాయిలో బిజెపి రెండిరటినీ ప్రజల్లో చులకన చేయటం ద్వారా కాంగ్రెస్‌ విజయరధం ఎక్కే ఈ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

తప్పులు తెలుసుకునే పనిలో పడ్డ కేసిఆర్‌?

  ఎట్టకేలకు పార్టీ శ్రేణుల ఉత్సాహానికి తెరాస అధినేత కేసిఆర్‌ లొంగకతప్పలేదు. ఇక పార్టీని ఉద్యమాల బాట పట్టిస్తామని ఆయన ప్రకటించుకున్నారు. అయితే నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణను నిరసన దినంగా పాటించాలని తెరాస నిర్ణయించింది. దానికి కేసిఆర్‌ పెట్టిన పేరు విద్రోహదినం. ఈ విద్రోహదినాన్ని యావత్తు తెలంగాణా ప్రాంతమంతా పాటించాలని కేసిఆర్‌ పిలుపు ఇచ్చారు. అయితే లాబీయింగ్‌ పేరిట కాలం గడిపిన కేసిఆర్‌ మాటను తెలంగాణావాదులు పెద్దగా పట్టించుకోకుండా తెలంగాణాజెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దినం విజయవంతం అవ్వాలంటే కోదండరామ్‌ కూడా కలిసిరావాలని తెరాసనాయకులు కేసిఆర్‌కు సూచిస్తున్నారట. ఆయన తెరాస అధినేతగా తానిచ్చిన పిలుపును మరొకరు కూడా విజయవంతం చేయాలని కోరటం ఎందుకని నేతలను తిరిగి ప్రశ్నించారని సమాచారం. ఎందుకంటే తెలంగాణామార్చ్‌ విజయవంతం చేసినందున కోదండరామ్‌ పిలిస్తే యావత్తు తెలంగాణా స్పందిస్తుందని, ఆ తరువాత తిరిగి కేసిఆర్‌ మేమంతా ఒక్కటే అని ప్రకటించేసుకోవచ్చని నేతలు సమాధానమిచ్చారట. దీంతో ఆశ్చర్యపోయినా తాను చేయాలనుకున్నది మార్చుకోని కేసిఆర్‌ విద్రోహదినం గురించి మీడియాను పిలిచి ప్రకటించేశారు. అంతేకాకుండా యావత్తు తెలంగాణాను ఒక శక్తి మారుస్తామని తాను కూడా మేనల్లుడు హరీశ్‌రావు మాదిరిగా ఉద్యమాల బాట పడుతున్నానని పరోక్షంగా తెలియజేసుకున్నారు. మేధోమదన సదస్సులో ప్రత్యేక తెలంగాణా గురించి చర్చిస్తామని కూడా నొక్కి చెప్పారు. అంటే తన తప్పులు తాను తెలుసుకునే పనిలో కేసిఆర్‌ పడ్డారన్న మాట.

అమ్మపాలు తాగి రొమ్ము గుద్దిందెవరు? సంబరాలు కాదని విద్రోహదినమా?

  యావత్తు దేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడిరదని పాఠ్యపుస్తకాల్లో అందరూ చదువుకున్న వారమే. ఈ విభజనను తప్పుపట్టడానికి ఎటువంటి అవకాశమూ లేదు. దీన్ని మొత్తం దేశం అంగీకరించింది. దేశాన్ని పాలించిన నేతలు ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకున్న చరిత్ర మనది. ఇంతటి ఘనమైన చరిత్రకు తెలంగాణాప్రాంతంలో వక్రభాష్యం చెప్పారు. తమ స్వార్థం కోసం అమాయక తెలంగాణా బీద ప్రజలను నేతలే తప్పుదోవ పట్టించారు. పట్టిస్తున్నారు కూడా. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేసిఆర్‌ తెలుగుదేశం పార్టీ నుంచి, పదవి నుంచి బయటకు వచ్చి తాను బతికేందుకు తెలంగాణాఉద్యమం భుజాన్న మోశారు. తమ కోసమే పుట్టిన నేతగా అక్కడి వారు అమాయకంగా ఆయన్ని నమ్మి తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్‌) ఆవిర్భావానికి సహకరించారు. ఆ తరువాత అప్పటి దాకా పెద్దగా ఆస్తులు లేని కేసిఆర్‌ కోట్లకు పడగలెత్తారు. ఉద్యమం పేరిట కూలీ పనిపై ఆధారపడ్డ పేదలు కడుపులు మాడ్చుకున్నారు. రాష్ట్రాన్ని అమ్మగా అనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుతల్లికి అభివాదం చేసిన చేతులతోనే ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శలున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు కూడా తెలంగాణా ప్రాంతంలో అందరూ కూడా ఒకేరాష్ట్రంలో కలిసి ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు విడిపోవాలని కొందరి స్వార్ధప్రకటనలకు కూలీలు మాత్రమే బలవుతున్నారు. వారి రోజువారీ వేతనాలను వదులుకుని తెలంగాణాఉద్యమంలో పాల్గొంటున్నారు. వారి కడుపుకోతను మిగుల్చుకోవటమే కాకుండా కేసిఆర్‌ యావత్తు రాష్ట్రం జరుపుకునే రాష్ట్రఅవతరణ పండుగను విద్రోహదినంగా మార్చేశారు. సంబరాలు జరుపుకునే సమయంలో నల్లబాడ్జీలతో నిరసన చేయటం రొమ్ము గుద్దటం కాదా? అప్పటి పోరాటం పొట్టిశ్రీరాములు అశువులు బాస్తే తెలంగాణా శోకసంద్రంలో మునగలేదా? ఎందుకు ఆయన ఈ విద్రోహదినం జరుపుతున్నారు? తన ఉనికి కోసమే కదా! తన మాయమాటలకు లొంగలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణా అవసరమని ఆ ప్రాంతీయులను అభివృద్థిలో ఇంకా వెనక్కి నెట్టేయటం లేదా? అసలు ప్రభుత్వాలు విడుదల చేసే నిధులపై తెరాస ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉద్యమాలకే పరిమితమవటం వాస్తవం కాదా? రంగారెడ్డి జిల్లాలో అనారోగ్యం ప్రబలటానికి ఆ నిధుల వినియోగం జరగకపోవటమే కారణం కాదా? ఇలా ప్రతీ జిల్లాలోనూ ఎమ్మెల్యేలను ఉద్యమాల బాట పట్టించి తెలంగాణాలో అనారోగ్యం ప్రబలి బలహీనుల సంఖ్య పెంచేపని కేసిఆర్‌ తన భుజం మీద వేసుకున్నారా? వంటి ఎన్నో సందేహాలు నాటి పోరాట యోధులను, మేధావులను బాధిస్తున్నాయి.

ప్రత్యేక తెలంగాణ వాదం మసకబారుతోందా

  ప్రత్యేక తెలంగాణ వాదులకెవరికి మంత్రిపదవులు ఇవ్వకుండా ఉద్యమానికి దూరంగా ఉన్న వారికి అధిష్టానం మంత్రి పదవులివ్వడం ద్వారా తెలంగాణ పొంగు తగ్గించారు. ఎప్పుడూ తెలంగాణ గురించి మాట్లాడని ఈ ఇద్దరు మంత్రులు సర్వేసత్యన్నారాయణ, బలరాం నాయక్ ను ఇప్పుడు తెలంగాణ వాదులు, నాయకులు, టిజాక్ కోదండరాం ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించండని చెప్పటం ఎంత హాస్వాస్పదమో అని రాజకీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. సీమాంద్ర నాయకులు ప్రత్యేక తెలంగాణ అంశంపై  వారి అభిప్రాయం చెప్పకుండా రావద్దని హుకుం చేసిన ప్రత్యేక తెలంగాణ వాదులు ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అనే సమాధానంతోనే ముందుకు సాగుతున్నా ఎదుర్కొనలేని పరిస్దితి.....వైకాపా అధినేత్రి విజయలక్ష్మీ పార్టీలోకి వలసలను కూడా ఆపలేక పోతున్నారు. ముఖ్యమంత్రి అదే జిల్లా అయిన మెదక్ లో పర్యటిస్తున్నారు. అంతకుముందు సిరిసిల్లా చేనేత కార్మికుల కోసం వైకాపా విజయలక్ష్మిన అడ్డుకున్న తెలంగాణ వాదులు శనివారం జరిగిన కార్యక్రమాన్ని అడ్డుకోలేక పోయారు. మొత్తానికి  పైకి ఎంత పొంగుగా కనిపించినప్పటికీ 2014 నాటికి అది చాలా వరకు తగ్గుతుందనే అనుకుంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ ను వచ్చే ఎన్నికల వరకు నడిపించాలని తెలంగాణ నాయకులు, టి ఆర్ యస్ చంద్రశేఖర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో....

దుర్గగుడి ఇవో గా రావాలంటే 25 లక్షలు

  అవును మీరు చదివింది కరెక్టే విజయవాడ కనక దుర్గఅమ్మవారి దేవస్ధానం ఇవోగా రావాలంటే ప్రస్తుతం అయితే 25 లక్షలు  సదరు ప్రజాప్రతినిదికి ఇవ్వవలసేందేనని అధికారులు చెబుతున్నారు. దసరాకు ముందు  ఈ  కుర్చీఖరీదు 40 లక్షల పై మాటే. ఎందుకంటే ఈ పండగకు 5 కోట్లవరకు ఖర్చు చేస్తుంది. దాంతో కాంట్రాక్టర్లు అధికారుల మద్య పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి  ఆరేటు ఫిక్స్ చేశారని చెబుతున్నారు. దుర్గగుడిని ఒక ప్రజాప్రతినిధి అనధికారికంగా శాసిస్తున్నారు. గుడిమీద ఏ చిన్న విషయమైనా ఆయన కనుసన్నలలో జరగాల్సిందే. ప్రస్తుత పరిస్దితుల్లో కొండ మీద ఏ అధికారి పనిచేయాలన్నా సదరు ప్రజాప్రతినిధి అడుగులకు మడుగులొత్తాల్సిందేర. అందుకే కార్యనిర్వాహణాధికారిగా ఎవరైనా రావాలనుకునే అధికారులు ఆయనద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. తనొక్కడికే డీల్ చాలదని మరో ప్రజాప్రతినిధిని కూడా ఆయన కలుపుకున్నారని ప్రచారం జరుగుతుంది.  ఈ శాఖామంత్రి కూడా ఆయన సన్నిహితులవడం వల్ల  ఈ పదవి కోసం వీరి చుట్టూ తిరగవలసి వస్తుంది.దసరా ఉత్సవాలు ముగియంగానే ఇవో రఘునాద్ బదిలీ ఖాయమని అనుకున్నారు. వారి ప్రచారానికి తగ్గట్లుగానే ప్రొటోకాల్ పేరుతో వేటు పడిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. 2007 దసరా ఉత్సవాలలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భవానీ భక్తులు చనిపోయారు. అయినప్పటికీ ఇవో మీద చర్యలేమీ లేవు. కానీ ఇంచ్చార్జ్ మంత్రితోట నర్శింహం కు ప్రోటోకాల్ ప్రకారం ఆలయంపై స్వాగతం పలగక పోవడంతో వివాస్పదం అయి ఇవో రఘునాధ్ సస్పెండ్ కావాల్సి వచ్చింది.

బడిలో ఉండాల్సిన పిల్లలు ఇటుకల బట్టీల్లో

  అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు మట్టి పెళ్లలను పెకిలిస్తున్నాయి. పలకలు పట్టాల్సిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. నిరుపేదలుగా పుట్టటమే వారికి శాపమయ్యింది. విద్యా హక్కును అమలు చేయవలసిని అధికారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యావారోత్సవాలకే పరిమిత మవుతున్నారు. దాంతో సరస్వతీ దేవి ఇటుకల బట్టీల్లో కాలం వెళ్లదీస్తుంది. ఇటుక బట్టీల అక్రమార్కులు ప్రజా ప్రతినిధులతో  కుమ్మక్కై బట్టీలను నిర్వహించడంతో అధికారులు వారి వైపు చూడటానికి భయపడుతున్నారు. పంటలు పండించాల్సిన భూముల్లో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ బట్టీలకు వ్యవసాయానికి వాడే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి  ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. ఈ ఇటుక బట్టీలలో వలస కార్మికులు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. వారితో వారి పిల్లలే కాకుండా బాలకార్మికులు కూడా ఇదే బట్టీల్లో పనులుచేస్తున్నారు. బట్టీ యజమానులు అక్రమంగా మట్టిన త్రవ్వి వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బాల కార్మికులతో ఇటుకలు పేర్చటం,మట్లిపోయడం, ఇటుకలు ఆరబెట్టడం,వంటి పనులు చేయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బాలకార్మికలతో పని చేయించే ఇటుక బట్టీల్లో క్రిమినల్ కేసులు పెట్టి బడుల్లో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు.

హాస్టల్ విద్యార్దులకు మెస్ చార్జీలు పెంచాలి

  ప్రభుత్వం హాస్టల్ లో ఉండే విద్యార్దులకు మెస్ చార్జీలు పెంచాలని విద్యార్ది సంఘాలు కోరుతున్నారు. ఉన్నత చదువులు చదవకుండా కుట్రపన్నిన ప్రభుత్వం వెంటవెంటనే కాలేజీ ఫీజులను పెంచుకుంటూ పోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో అన్ని రేట్లనూ పెంచిన ప్రభుత్వం మెస్ చార్జీలను మాత్రం రూపాయికూడా  పెంచడం లేదని దానితో పేద విద్యార్దుల చదువుకు సర్కార్ కావాలనే ముందుకు సాగకుండా చూస్తుందని వారు చెబుతున్నారు. గవర్నమెంటు స్కూళ్లు పెంపునకు ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు సరికదా ఉన్నవి కూడా మూసేసే పద్దతులను అవలంభిస్తున్నారని  వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరచి విద్యను ప్రయివేటీకరణను అడ్డుకోవాలని, విద్యావ్యాప్తికోసం, శ్రద్ద చూపాలని  కోరుతున్నారు. కాదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

మెరుగైన సేవల కోసమే రైల్యే చార్జీల పెంపు

  మెరుగైన సేవల  కోసం ప్రయాణీకులకు చార్జీలను హెచ్చించే అవకాశం ఉంటుందని కొత్తగా పదవి నలంకరించిన బన్సల్ చెప్పారు. రైల్యేశాఖ ఆర్దికవనరుల లోటులో ఉన్నందున చేపట్టిన ప్రాజెక్టులలో నిధులకోత పెట్టవలసి వస్తుందని చెబుతున్నారు. రైల్యే వసతి మౌలిక యంత్రాంగం కుప్పకూలిపోకుండా, పని నిలిచి పోకుండా చార్జీల పెంపును చూడవలసి వుందని ఆయన చెబుతున్నారు. ప్రతిరంగంలోనూ ధరలూ పెరిగాయి. కనుక రైల్యేలో ఎందుకు పెరగకూడదంటున్నారు. అయినా సరిగ్గా సేవలు ఉన్నట్లయితే సామాన్యజనం చార్జీల హెచ్చింపును వ్యతిరేకించరని వారు చెబుతున్నారు. రైల్యే సేవలు గత కొన్ని సంవత్సరాలుగా పడిపోయాయని, సేవల విషయమై పిర్యాదులు అంతకంతకు పెరుగుతున్నాయని వివరించారు. రైల్యేలకు రక్షణకు, భద్రతకు ఆవశ్వకత కు మా శాయశక్తులా కషి చేయవలస్తామని ఆయన చెబుతున్నారు. రైల్యేలో పరిశుబ్రత కూడా ప్రాధాన్యత నివ్వవలసిందేని బన్సల్ చెబుతున్నారు.

భద్రతను సవాల్‌ చేస్తున్న చిన్నారుల అపహరణ?

  రాష్ట్రంలో భద్రతను చిన్నారుల అపహరణ సంఘటనలు సవాల్‌ చేస్తున్నాయి. ప్రత్యేకించి శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు ఈ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోలేకపోయారన్న విషయం పలువురిని కలిచివేస్తోంది. ఇతర అభివృద్ధి దేశాల్లో అనుసరించే పలుసాంకేతిక విలువలను పాటిస్తున్నా ఎందుకు చిన్నారుల అపహరణలు జరుగుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పేదరికం అలుసుగా తీసుకుని ఈ చిన్నారుల అపహరణకు ముఠాలుగా ఏర్పడుతున్నారని సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ ముఠాల్లో ఒకనర్సు, ఒక ఆయా స్థాయి పేదలుంటున్నారని తెలుస్తోంది. తాజాగా వీడిన అపహరణ మిష్టరీని పరిశీలిస్తే ఈ విషయం బయటపడిరది.  హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి కేంద్రంగా ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురుసభ్యులున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో పని చేసే సిస్టర్‌ శ్యామల, వంటమనిషి స్వరూప, పాత్రల క్లీనర్‌ శారద ముఠాలో ఉన్నారు. వీరితో పాటు ఇంకో ఇద్దరు సభ్యులున్నారు. డబ్బుల కోసం వీరు అప్పుడే పుట్టిన పిల్లలను కిడ్నాప్‌లు చేయటం,  పిల్లలు లేని వారికి పసివారిని విక్రయించటం వంటి కార్యకలాపాలు సాగించారు. మొత్తం 11మంది పిల్లలను ఈ ముఠా అపహరించింది. కేవలం డబ్బు కోసమే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని ముఠాసభ్యులు స్పష్టం చేశారు. భద్రతను సవాల్‌ చేసే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పలువురు కోరుతున్నారు.

ఉద్యమమా? విధేయతా? తేల్చుకోలేకపోతున్న టిఆర్‌ఎస్‌?

  తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ టిఆర్‌ఎస్‌. అయితే ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ఢల్లీలో లాబీయింగ్‌ ద్వారా ప్రత్యేక తెలంగాణా సాధించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేశారు. అవన్నీ బెడిసి కొట్టినందున ఇప్పుడు ఉద్యమదిశగా పయనించాలని పార్టీశ్రేణులు సిద్ధమయ్యాయి. దానికి ఇటీవల తెలంగాణామార్చ్‌ ద్వారా తెలంగాణాజెఎసి పాపులర్‌ అయింది. టిఆర్‌ఎస్‌ శ్రేణుల ద్వారా జెఎసి పాపులార్టీ సంపాదించిందని పరిశీలకులు తేల్చారు. దీంతో టిఆర్‌ఎస్‌ నాయకత్వ స్థానం నుంచి దిగజారకుండా ఉండాలంటే ఉద్యమాలు తప్పని సరి అని కేసిఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు అభిప్రాయపడుతున్నారు. ఆయన కేసిఆర్‌ను కూడా ఇదే విషయమై ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, కేసిఆర్‌ ఇటీవల మంత్రి పదవుల నియామకాన్ని పరిశీలించి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా విధేయతకు ఓటేశారని గుర్తించారు. దీంతో పార్టీని సైతం కలిపేస్తానని తాను చేసిన ప్రకటన సోనియాను స్పందింపజేస్తుందని కేసిఆర్‌ భావిస్తున్నారు. అది ఆలస్యమైతే ఉనికికే ప్రమాదమని టిఆర్‌ఎస్‌లోని ఇతర నాయకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్యమం వైపు మొగ్గుచూపాలో, విధేయతను కొనసాగించాలో తేల్చుకోలేని స్థితికి కేసిఆర్‌ వచ్చారు. ఒకవేళ ఉద్యమం వైపు వెళితే నిన్నటి దాకా చేసిన చర్చలు వృథా అయ్యే అవకాశమూ ఉంది. అలా అని విధేయత వైపు మొగ్గు చూపితే ఇప్పటికే ఢల్లీిలోని నాయకులు తెలంగాణా ఒక్కటే సమస్య కాదని ప్రసంగిస్తున్నారు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా కేసిఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు చర్చల్లో నలిగిపోతున్నారు. ఎటుతేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు.