టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి బాబు మోహన్..!!

  అసెంబ్లీ రద్దు తర్వాత 105మంది అభ్యర్థులతో భారీ జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టారు. అందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ స్థానంలో జర్నలిస్టు క్రాంతి కిరణ్‌కు టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న బాబుమోహన్‌ తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అంతేకాదు బీజేపీలో చేరేందుకు బాబుమోహన్ రంగంసిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బాబుమోహన్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.

ఇంకా ఏం కావాలి మీకు?.. మావోలను ప్రశ్నించిన బాబు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు.. కిడారి, సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ ఘటనను ఖండించారు. టీడీపీ ప్రభుత్వం బాక్సైట్‌ జోలికి వెళ్లదని పదే పదే చెప్పినా.. ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు.     వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్‌ తవ్వకాలపై రెండు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఇక్కడి గిరిజనుల అంగీకారం లేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు రద్దు చేశాం. దీనిపై ఆయా కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కేంద్రం వివరణ అడుగుతోంది. ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. గిరిజనులకు ఇష్టం లేనందున బాక్సైట్‌ తవ్వకాలు జరపరాదని నిర్ణయించాం. బాక్సైట్‌ తవ్వకాలు వద్దని గతంలో కిడారి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నన్ను కోరారు. ఇదే విషయాన్ని పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో లక్ష మంది ప్రజల సమక్షంలో చెప్పానన్నారు. ముఖ్యమంత్రిగా బాక్సైట్‌ తవ్వకాలకు వెళ్లబోమని చెబుతున్నాను.. ఇంకా ఏం కావాలి మీకు? అని మావోలను ప్రశ్నించారు. ఇంత స్పష్టంగా మా వైఖరి తెలిపినప్పటికీ గిరిజన నేతలను మావోయిస్టులు హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకులను అకారణంగా చంపేశారని, ఇది వారికి న్యాయమేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. అసలు ఈ హత్యలకు, మైనింగ్‌కు సంబంధమే లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలు ఓ నెపం మాత్రమే. దీనిని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని ఆరోపించారు.

బిగ్ షాక్.. 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్..!!

  వేలు... లక్షలు కాదు... ఏకంగా 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అవడం అంటే మాములు విషయమా?.. అసలు అది సాధ్యమేనా? అనుకుంటాం. కానీ నిజంగానే సాధ్యమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని.. దాదాపు 5 కోట్ల అకౌంట్ల ‘యాక్సెస్‌ టోకెన్స్‌’ను హ్యాకర్లు చోరీ చేశారు. ఈ యాక్సెస్‌ టోకెన్‌ ద్వారా.. యూజర్స్ డేటా చూడొచ్చు. మంగళవారం ఈ లోపాన్ని గుర్తించామని.. గురువారం రాత్రికి సరిచేశామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వినియోగదారుల అకౌంట్లు ఏమైనా దుర్వినియోగమయ్యాయా అన్న సంగతి ఇంకా తెలియదని చెప్పారు. ఇది తీవ్రమైన సమస్యేనని ఆయన పేర్కొన్నారు. ఇతరులకు మన అకౌంట్ ఎలా కనిపిస్తుందన్నది అని తెలుసుకునేందుకు వీలు కల్పించే ‘వ్యూ ఆజ్‌’ ఫీచర్‌లో ఈ లోపం ఉందని.. దీన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల యూజర్ల యాక్సెస్‌ టోకెన్లను.. ముందుజాగ్రత్త చర్యగా మార్చివేశామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. హ్యాకింగ్‌ ఘటనపై సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

శబరిమల ప్రవేశం.. ఆమె ఒక్కరే వ్యతిరేకం

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏ వయసు మహిళలైనా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వారిపట్ల లింగ వివక్ష ప్రదర్శించడమేనని తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఈ తీర్పుని సమర్దిస్తుంటే.. కొందరు మాత్రం మతాలకు వారి ఆచారాలకు గౌరవం ఇవ్వాలంటూ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకించిన వారిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఉన్నారు.     శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో  జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు.  ఇందూ మల్హోత్రా మాత్రం  ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మాత్రం వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377  కేసుల్లో నిజమైన బాధితులతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్‌ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరమల ఆలయం ప్రవేశం నిషేధంపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కూడ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని చెప్పారు. వీరిలో ఎక్కువమంది శబరిమల ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. భారతదేశం వేర్వేరు మతపరమైన ఆచారాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగం కేవలం ఎవరైనా ఒక మతాన్ని గౌరవించటానికి ,పాటించటానికి అనుమతిస్తుందన్నారు.. అతను లేదా ఆమె నమ్మే ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాదన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఇందూ మల్హోత్రా వ్యతిరేకించడంతో 4-1తేడాతో ఈ తీర్పు వెలువడింది.

రేవంత్‌ రెడ్డి ఓ గంజాయి మొక్క... ఎంపీ సుమన్

రేవంత్ రెడ్డి ఇంట్లో,కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండటం అందరికి విదితమే.దీన్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ ఇదంతా తెరాస కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.అయితే తెరాస నాయకులు ఈ విమర్శలు తిప్పికొట్టే పనిలోపడ్డారు.తెరాస ఎంపీ బాల్క సుమన్ ఐటీ సోదాలు కొనసాగడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న ఆరోపణల్ని ఆయన తప్పుపట్టారు.ఐటీ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని,రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక తెరాస పై బురదచల్లే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉందని విమర్శించారు.అసలు కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదని,వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని సుమన్‌ ధీమా వ్యక్తంచేశారు.తెరాస పుట్టిందే ప్రజల కోసమని, బంగారు తెలంగాణను నిర్మించే యజ్ఞంలో తాము ఉన్నామన్నారు.తెలంగాణ అనే తులసి వనంలో రేవంత్‌ రెడ్డి ఓ గంజాయి మొక్క అని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

కిడారి కుమారునికి ఎమ్మెల్యే టికెట్..!!

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు.అనంతరం సీఎం మాట్లాడుతూ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు.కిడారి ఆశయాల సాధనకు తెదేపా కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు.  ఏజెన్సీ అభివృద్ధికి తపనపడిన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు అని కొనియాడారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం చాలా దారుణం అన్నారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని లక్ష మంది ఉన్న సభలో చెప్పానన్నారు.

దాడి చేసిన వారితో నాకు సంబంధం లేదు - చింతమనేని

  తెలుగు దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.ఇలాంటి నేత పేరు చెప్పుకొని ఇద్దరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నంబరు గల కారును కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఆపి పక్కన పెట్టాలని ఆదేశించడంతో వారు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో చేయి చేసుకున్నారు.     తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వారిద్దరూ వీరంగం సృష్టించడం నగరంలో చర్చనీయాంశమైంది.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి కారును గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.దీనిపై స్పందించిన చింతమనేని తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని,తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఇకమీదట తన పేరు వాడుకొని ఎవరైనా దాడులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభుత్వానికి సూచించారు.

రేవంత్‌కి మద్దతుగా కాంగ్రెస్... కక్ష సాధింపు

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఓ సంచలనాత్మక నిర్ణయం అయితే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడులు తెలంగాణ రాజకీయ వాతావరణాన్నిమరింత వేడెక్కిస్తున్నాయి.రేవంత్ రెడ్డి ఇంట్లో రెండవ రోజు సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖా అధికారులు రూ.కోటి నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల పైనా అధికారులు దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి భార్యను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు తెరిచారు.రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.మాజీ మంత్రి ,కాంగ్రెస్ నేత డీకే అరుణ,పలువురు కాంగ్రెస్ నేతలు రేవంత్ కి మద్దతుగా నిలిచారు.డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో గట్టిగా మాట్లాడే నేతలను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతోందని డీకే అరుణ్‌ ఆరోపించారు.అందరూ తనకు బానిసలుగా ఉండాలన్న కేసీఆర్‌ రాచరిక పాలనకు తెలంగాణ ప్రజలు త్వరలోనే తెరదించుతారన్నారు.ప్రతిపక్ష నేతలపై కుట్రలకు పాల్పడుతున్న తెరాసకు భవిష్యత్‌లో అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. భాజపాతో కుమ్మక్కైన అధికార పార్టీ.. రాష్ట్రంలో ఇతర పార్టీలు నిలదొక్కుకోకుండా కుట్రలకు పాల్పడుతోందన్నారు.టీఆర్‌ఎస్ మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా వారి ఆస్తులపై ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదని, రేవంత్ అవినీతి చేసినందు వల్లే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని చెబుతున్నారు.

ముందస్తుపై తెలంగాణ సర్కార్ కు సుప్రీం నోటీసులు..!!

  తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో సుమారు 20లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే ప్రమాదముందని శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు సైతం ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండేదని.. ముందస్తు వల్ల వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. దీనికి తోడు హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూనే.. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా ఇరు వర్గాలు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాతే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఎన్నికల బరిలో స్టార్ హీరో..!!

  తమిళ సినిమాలో విప్లవాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న నటుడు విశాల్‌ రాజకీయాల్లోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో విశాల్‌ ప్రయాణం గతేడాదిలోనే ఆరంభమైంది. 2017, డిసెంబరులో జరిగిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించి, ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి నిరాకరించడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.   ఆ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయినప్పటికీ, తరచూగా ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల అభిమాన సంఘాలను ‘మక్కల్‌ నల ఇయక్కం’గా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రతి ఇంటా సిరులు కురవాలని, భావితరం భవిత బాగుండాలని కాంక్షిచే ప్రతి ఒక్కరూ తనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తాను స్థాపించిన 'మక్కల్‌ నల ఇయక్కం' పార్టీగా మారుతుందని, ఇక నుంచి తాను క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా తిరుప్పరంకుండ్రం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు విశాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించడంతో అభిమానులను ఉత్సాహంలో నెలకొంది.

కేసీఆర్ కు షాక్..తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి

  గడువు కన్నా ముందే అసెంబ్లీని రద్దు చేస్తే రద్దయిన రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టతనిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ నిబంధనావళిని విడుదల చేయడంతో తెలంగాణలో తక్షణమే కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇదే అంశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ ధ్రువీకరించారు. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నిబంధనావళిలోని ఏడో అంశం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. కోడ్‌లోని ఏడో నిబంధన శాసనసభ రద్దయి అధికారంలో కొనసాగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి వర్తిస్తుందని వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం కొత్తగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, కొత్తగా పథకాలను ప్రకటించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రైవేటు కార్యక్రమాలను కలిపి నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆపద్ధర్మ ప్రభుత్వానికీ నిబంధనలు వర్తిస్తాయి. కేంద్రం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కోడ్‌ ఏడో నిబంధనకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సదరు రాష్ట్రంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు జారీ చేయరాదు. కొత్త ప్రాజెక్టులు ప్రకటించొద్దు. ఎన్నికల కోడ్‌లోని ఏడో నిబంధనలో నిషేధించిన కార్యకలాపాలు ఏవీ చేపట్టొద్దు. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరాదు. అనధికార కార్యక్రమాల కోసం అధికారిక వనరులు ఉపయోగించొద్దు. ఎన్నికల ప్రచార పనులను అధికారిక పర్యటనలో భాగం చేయొద్దు. ఆపధర్మ ప్రభుత్వంలో పని చేస్తున్న రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర..!!

  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరం కూడలిలో పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘కొంతమంది వేలకోట్లు ఉంటే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అలాగైతే గత ఎన్నికల్లోనే జగన్‌ సీఎం అయ్యి ఉండాలి. ముఖేష్‌ అంబానీ ప్రధాని అవ్వాలి. లేదా టాటానో, బిర్లానో అయ్యి ఉండాలి. గెలవాలంటే ప్రజాబలం కావాలి.. అది నాకుంది’ అని అన్నారు. అదే విధంగా ‘కొందరు నన్ను వచ్చే ఎన్నికల్లో చంపేద్దామనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే అంశంపై ఎవరో ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోలు నా వద్దకు వచ్చాయి. నన్ను చంపేస్తే.. అందుకు కారకులు ప్రతిపక్షమని, అధికార పక్షమని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారని, ఆపై జనమూ మరిచిపోతారని వాళ్లనుకున్నారు. వాళ్లెవరో తెలుసు. ఇలాంటివన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా? అలాంటి వాటికి భయపడను’ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

శబరిమల.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

  మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మహిళలకేం తక్కువ. మహిళలకు పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. మహిళలను పురుషులతో సమానంగా చూడాలి. ఇలా పలు సందర్భాల్లో మహిళలు తక్కువ కాదని చెప్తుంటారు. కానీ ఇంకా ఎక్కడో వెలితి. కొన్ని సందర్భాల్లో వివక్ష చూపిస్తుంటారు. అయితే ఆ వివక్ష దేవుడి దగ్గర కూడా కనిపిస్తోంది. అలాంటి వాటిల్లో ఒకటే శబరిమల. శబరిమలలో స్త్రీలకు ప్రవేశం లేదు. దీంతో స్త్రీలకు ప్రవేశం కల్పించాలని ఎప్పటినుండో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆలయ ప్రవేశం గురించి సంచలన తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆలయాల్లో లింగ వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. పురుషులకంటే మహిళలు ఏం తక్కువ కాదు.. ఓ వైపు దేవతలని పూజిస్తూ.. మరోవైపు మహిళలకు పరిమితులు విధించడం సరికాదని తెలిపింది.

ఇదే చివరి ప్రసంగం కావొచ్చు.. జైలులో ఉన్నా నామినేషన్ వేస్తా.!!

  మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి ఉద్వేగంతో ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇదే తన చివరి ప్రసంగం కావొచ్చని తెలిపారు. జైలులో ఉన్నా.. ఎక్కడ ఉన్నా కొడంగల్‌లో నామినేషన్‌ వేస్తానని స్పష్టంచేశారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని కార్యకర్తలను కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రోజు తన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎవరు ఎన్నికుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు.

బాలయ్య ఓటు.. హైదరాబాద్ టు హిందూపురం షిఫ్ట్

  హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నారు. కొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిలో తాజాగా బాలకృష్ణ ఓటు నమోదు చేసుకున్నారు. గతంలో బాలకృష్ణకి హైదరాబాద్ లో ఓటు ఉండేది. దీనిని సాకుగా చేసుకొని ప్రతిపక్షాలు చాలా సార్లు బాలకృష్ణ పై విమర్శలు చేశాయి. హిందూపురంలో ఓటు కూడా లేకుండా ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఛాన్స్ మరోసారి ఇవ్వకూడదని భావించిన బాలయ్య.. హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

అయోధ్య కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

  అయోధ్య కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారిస్తుందని.. అలాగే అయోధ్య భూయాజమాన్య హక్కులపై అక్టోబర్ 29న విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందని.. అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్యానించింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేస్తుందని తెలిపింది.

ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటన

  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఆయన.. పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు.. సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు. 1వ తేదీన ఉదయం 9గంటలకు కృష్ణాజిల్లా నందిగామ మీదుగా మధిర మండలం రాయపట్నం చేరుకొని.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా దెందుకూరు గ్రామానికి చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధిర అంబేద్కర్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం, రైల్వే గేట్‌ సెంటర్‌, జిలుగుమాడులోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. జిలుగుమాడులో కార్యకర్తలతో సమావేశమై.. అక్కడనుంచి బోనకల్‌ మండలం ఆళ్లపాడు గ్రామానికి పయనమవుతారు. ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం వైరా మీదుగా తల్లాడ చేరుకుని.. భోజనం చేసి.. ఆతర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ప్రచార బహిరంగసభకు హాజరవుతారు. ఓవైపు ముందస్తు వేడి.. మరోవైపు మహాకూటమి హడావిడి.. ఇలాంటి సమయంలో బాలకృష్ణ పర్యటన ఉండటంతో.. జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది.

వివాహేతర సంబంధం నేరం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.!!

వివాహేతర సంబంధాలు క్రిమినల్‌ నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది. వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేంద్రం చట్టాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో అంగీకరించలేదు. ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. సెక్షన్‌ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధం నేరం. కానీ వ్యభిచార నేర చట్టం ప్రకారం కేవలం మగవారిని మాత్రమే దోషిగా పరిగణిస్తారు. ఆ శిక్ష ప్రకారం మహిళలు కేవలం బాధితులు మాత్రమే. దీంతో ఈ సెక్షన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వివాహం తర్వాత మగవారు వ్యభిచారం చేస్తే అందుకు మగవారిని మాత్రమే బాధ్యులుగా చేస్తున్నారని.. మహిళలను మాత్రం వదిలేస్తున్నారని ఇలాంటి వ్యవస్థ వద్దని చెబుతూ రద్దు చేయాలని పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో పిటిషన్ విన్న సుప్రీంకోర్టు మహిళలను శిక్షించేలా కొత్త సవరణ అయితే చట్టంలో చేర్చలేమని స్పష్టం చేసింది.

ఓ పక్క సోదాలు.. మరోపక్క ప్రచారం.!!

  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు కోట్ల రూపాయలు డీల్‌ కుదిర్చారని రేవంత్‌రెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన మొత్తం బదిలీ అయిందా లేదా అనే విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఈడీకి అప్పగించారు. ఇందులో భాగంగా ఈడీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారు. రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. అయితే ఇదంతా ఏమీ పట్టని రేవంత్‌రెడ్డి.. తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లి నుంచి ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతున్నా.. ఆ ఆందోళన ఏమాత్రం కనిపించకుండా తన ప్రచారాన్ని కొనసాగించడం విశేషం.