కేసీఆర్ కు షాక్..తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి
posted on Sep 28, 2018 @ 12:13PM
గడువు కన్నా ముందే అసెంబ్లీని రద్దు చేస్తే రద్దయిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టతనిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ నిబంధనావళిని విడుదల చేయడంతో తెలంగాణలో తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదే అంశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ధ్రువీకరించారు. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నిబంధనావళిలోని ఏడో అంశం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. కోడ్‌లోని ఏడో నిబంధన శాసనసభ రద్దయి అధికారంలో కొనసాగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి వర్తిస్తుందని వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం కొత్తగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, కొత్తగా పథకాలను ప్రకటించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రైవేటు కార్యక్రమాలను కలిపి నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆపద్ధర్మ ప్రభుత్వానికీ నిబంధనలు వర్తిస్తాయి. కేంద్రం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఏడో నిబంధనకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సదరు రాష్ట్రంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు జారీ చేయరాదు. కొత్త ప్రాజెక్టులు ప్రకటించొద్దు. ఎన్నికల కోడ్‌లోని ఏడో నిబంధనలో నిషేధించిన కార్యకలాపాలు ఏవీ చేపట్టొద్దు. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరాదు. అనధికార కార్యక్రమాల కోసం అధికారిక వనరులు ఉపయోగించొద్దు. ఎన్నికల ప్రచార పనులను అధికారిక పర్యటనలో భాగం చేయొద్దు. ఆపధర్మ ప్రభుత్వంలో పని చేస్తున్న రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.