దాడి చేసిన వారితో నాకు సంబంధం లేదు - చింతమనేని
posted on Sep 28, 2018 @ 4:00PM
తెలుగు దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.ఇలాంటి నేత పేరు చెప్పుకొని ఇద్దరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నంబరు గల కారును కానిస్టేబుల్ అనిల్‌కుమార్ ఆపి పక్కన పెట్టాలని ఆదేశించడంతో వారు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో చేయి చేసుకున్నారు.
తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వారిద్దరూ వీరంగం సృష్టించడం నగరంలో చర్చనీయాంశమైంది.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి కారును గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.దీనిపై స్పందించిన చింతమనేని తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని,తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఇకమీదట తన పేరు వాడుకొని ఎవరైనా దాడులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభుత్వానికి సూచించారు.