ఐటీ దాడులపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
posted on Sep 29, 2018 @ 2:13PM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనకు అండగా ఉన్న కార్యకర్తలందరికీ మొదట ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెడుతూ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగమే ఈ దాడులు అని వ్యాఖ్యానించారు. 2009లో నేను ప్రస్తావించిన ఆస్తులు.. 2014లో ప్రస్తావించిన ఆస్తులను పోల్చిచూడండి. 2009 తర్వాత నేను ఏ ఒక్క ఆస్తి కూడా కొనలేదు అని స్పష్టం చేశారు. ప్రజలకోసమే ఆరోపణలపై వివరణ ఇస్తున్నాన్న ఆయన.. 'నా ఇంటి అడ్రెస్ తో కంపెనీల చిరునామాలు ఉన్నాయి అంటున్నారు.. నా నాలుగంతస్తుల భవనాన్ని 23 ఏళ్లుగా అద్దెలకు ఇస్తున్నాను.. అద్దెలకు తీసుకున్న వాళ్ళు భవనం అడ్రెస్ తో కంపెనీలు పెట్టుకుంటే నాకేంటి సంబంధం?' అని ప్రశ్నించారు. నాకు విదేశాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని అంటున్నారు.. హాంగ్ కాంగ్ లోనో, మలేషియాలోనో విదేశీయులు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలంటే నిబంధనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి అన్నారు. అదేవిధంగా తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. అయితే కేసీఆర్ కుటుంసభ్యులు కూడా దీనికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ‘మన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం ప్రధాని మోదీకి లేఖ రాద్దాం. లేఖ రాసేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల్లో నా సవాల్‌కు బదులు ఇవ్వకుంటే కేసీఆర్ అవినీతి పరుడని ప్రజలకు అర్థమవుతుంది’ అని రేవంత్ అన్నారు.