ఇంకా ఏం కావాలి మీకు?.. మావోలను ప్రశ్నించిన బాబు
posted on Sep 29, 2018 @ 11:57AM
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు.. కిడారి, సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ ఘటనను ఖండించారు. టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ జోలికి వెళ్లదని పదే పదే చెప్పినా.. ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్ తవ్వకాలపై రెండు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఇక్కడి గిరిజనుల అంగీకారం లేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు రద్దు చేశాం. దీనిపై ఆయా కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కేంద్రం వివరణ అడుగుతోంది. ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. గిరిజనులకు ఇష్టం లేనందున బాక్సైట్ తవ్వకాలు జరపరాదని నిర్ణయించాం. బాక్సైట్ తవ్వకాలు వద్దని గతంలో కిడారి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నన్ను కోరారు. ఇదే విషయాన్ని పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో లక్ష మంది ప్రజల సమక్షంలో చెప్పానన్నారు. ముఖ్యమంత్రిగా బాక్సైట్ తవ్వకాలకు వెళ్లబోమని చెబుతున్నాను.. ఇంకా ఏం కావాలి మీకు? అని మావోలను ప్రశ్నించారు. ఇంత స్పష్టంగా మా వైఖరి తెలిపినప్పటికీ గిరిజన నేతలను మావోయిస్టులు హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకులను అకారణంగా చంపేశారని, ఇది వారికి న్యాయమేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. అసలు ఈ హత్యలకు, మైనింగ్‌కు సంబంధమే లేదని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు ఓ నెపం మాత్రమే. దీనిని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని ఆరోపించారు.