విజయవాడలో కలకలం.. పరువు హత్య పోస్టర్లు..!!

  మిర్యాలగూడలో ఈమధ్య పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అనే వ్యక్తిని మామ మారుతీరావు దారుణంగా చంపించాడు. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇదే తరహా దాడి హైదరాబాద్ లో ఒక జంట మీద జరిగింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. ఇలా వరుస సంఘటనలతో ప్రేమికుల్లో భయం మొదలైంది. మొన్నటికి మొన్న గుంటూరులోని కొన్ని ప్రేమ జంటలు మాకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాయి. అయితే ఇప్పుడు విజయవాడలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. విజయవాడలో పరువు హత్య పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సోని రాహు ప్రియ పరువు హత్యకు గురికానున్నారంటూ ముద్రించిన పోస్టర్లు నగరంలో వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. అయితే భయపెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా చేసారని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పోస్టర్లలో పేర్కొన్న సోని రాహు ప్రియ ఎవరు? పోస్టర్లు వేసింది ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీ నటుడు..!!

  తెలంగాణ ముందస్తు వేడి కూకట్‌పల్లి మీద ఆసక్తిని రేకిస్తోంది. గత కొద్ది రోజులుగా కూకట్‌పల్లి రాజకీయం సినిమా వారి చుట్టూ తిరుగుతుంది. మొన్నటికి మొన్న కూకట్‌పల్లి నుండి టీడీపీ తరుపున నందమూరి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూకట్‌పల్లి బరిలోకి దిగుతున్నారంటూ మరో సినీ నటుడి పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో నార్మల్ గా వచ్చిన వార్త కాదు. స్వయంగా ఆ నటుడే చెప్పాడు. ఆ నటుడు ఎవరో కాదు సుధాకర్‌నాయుడు. శుక్రవారం ఆయన కేపీహెచ్‌బీలోని వినాయక మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ధర్మారెడ్డికాలనీ ఫేజ్‌-1లో విలేకరులతో మాట్లాడుతూ.. ఏదో ఒక పార్టీ లేదా, స్వతంత్య్ర అభ్యర్థిగా అయినా ఈసారి కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ తరపున నిలబడుతానని చెప్పారు. సుధాకర్‌నాయుడు పలు సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా.. 'రంగ ది దొంగ', హీరో వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

వైసీపీకి షాక్.. పార్టీ వీడిన కీలక నేత.!!

  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీకి షాక్ లు తగులుతున్నాయి. ఆనం రాంనారాయణ రెడ్డి చేరికతో నెల్లూరులో వైసీపీ బలం పెరుగుతుందని జగన్ భావిస్తే.. దానికి భిన్నంగా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పార్టీనే వీడుతున్నారు. తాజాగా నెల్లూరు జడ్పీ చైర్మన్‌, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో గతకొంత కాలంగా చురుగ్గా ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరి అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఆనంని పార్టీ అధిష్ఠానం తాజాగా వెంకటగిరి ఎన్నికల ఇన్ చార్జీగా నియమించడంతో.. అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా సందర్భంగా బొమ్మిరెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆనం రాంనారాయణ రెడ్డిని నియమించడం బాధ కలిగించిందని, ఆ విషయంలో జగన్ తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదన్నారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, వెంకటగిరిలో పోటీకి రూ.50 కోట్లు ఖర్చువుతాయని, అంత పెట్టుకోగలవా? అని జగన్ అడిగారని ఆరోపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని బొమ్మిరెడ్డి అన్నారు.

రాఫెల్ డీల్.. మరో ట్విస్ట్..!!

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే’నని అన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించాయి.. తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా రాఫెల్ డీల్ టాపిక్ రచ్చ అయింది.. అయితే ఇంతలోనే ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒక ట్విస్ట్ ఇచ్చింది.. వార్తలను ఖండించింది.. ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది.     'భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేం కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం.. రాఫెల్‌ ఒప్పందంలో మా పాత్ర కూడా ఏం లేదు.. ఒప్పందాల కోసం సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రాన్స్‌ కంపెనీలకు ఉంటుంది.. ఏ సంస్థకు సామర్థ్యం ఉందని భావిస్తే వాటినే మా కంపెనీలు ఎంచుకుంటాయి.. అప్పుడు భారత ప్రభుత్వ అనుమతిని కోరుతాయి’ అని ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది.  మరోవైపు ఈ వార్తలను డస్సాల్ట్  ఏవియేషన్‌ కూడా ఖండిస్తోంది.. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని చెబుతోంది.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నాం.. రాఫెల్‌ ఒప్పందం కోసం మేం రిలయన్స్‌ను ఎంచుకున్నాం.. ఇది మా నిర్ణయమే.. మా నిర్ణయంతోనే మేం కొనసాగుతాం అని డసో ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. ఇదంతా చూస్తుంటే రాఫెల్ గందరగోళం ఇప్పటిలో తేలేలా లేదు.. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ నిజంగానే ఇంటర్వ్యూలో అలా అన్నారా? లేక మీడియా అత్యుత్సాహం చూపిందా? తెలియాల్సి ఉంది.. చూద్దాం ఇంకా ముందు ముందు రాఫెల్ డీల్ గోల ఎటువైపు వెళ్తుందో.

టిక్కెట్ ఇవ్వకపోతే.. మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా

  తనకు తెరాస నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు హుజూర్‌నగర్‌ టిక్కెట్ దక్కకుంటే మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు రాసి ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని శంకరమ్మ చెప్పారు. హుజూర్‌నగర్‌ టిక్కెట్ తనకు కేటాయించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని.. అయితే జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్‌నగర్‌ సీటును కేటాయించాలని శంకరమ్మ కోరారు. పార్టీ అధిష్టానం తనకు కేటాయిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

రాఫెల్ గుట్టు రట్టు.. రిలయన్స్‌ ఎంపిక మోదీదే.!!

  రాఫెల్ స్కామ్.. చాలా రోజుల నుంచి కాంగ్రెస్, అధికార పార్టీ బీజేపీ మీద రాఫెల్ ఒప్పందం గురించి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తోంది.. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. కాంగ్రెస్ అర్ధంలేని ఆరోపణలు చేస్తుంది అంటూ కొట్టిపడేసింది.. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీకి ఓ అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది.. తాజాగా ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ ఇన్వెస్టిగేటివ్‌ న్యూస్‌ జర్నల్‌ ‘మీడియా పార్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీ కంపెనీని భాగస్వామిని చేయాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే’నని బాంబు పేల్చారు.. 'ఈ వ్యవహారంలో మా ప్రమేయం ఏమీ లేదు.. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు (రిలయన్స్‌) పేరు ప్రతిపాదించింది.. ఆ మేరకు అనిల్‌ అంబానీ గ్రూపుతో డసో సంప్రదింపులు జరిపింది.. ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం.. మాకు మరోఅవకాశం లేదు’ అని తెలిపారు.. హోలెన్‌ వివరణ అనంతరం ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించాయి.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేస్తూ ‘ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు.. హోలెన్‌ పుణ్యమా అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం.. అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం.. ప్రధాని దేశాన్ని మోసగించారు.. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు’ అని వ్యాఖ్యానించారు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ ఏదో చెడు జరగకపోతే ప్రభుత్వం ప్రతిరోజూ ఎందుకు అబద్ధం చెబుతుందని ప్రశ్నించారు.

సెటిలర్ల ఓట్లు తెరాసకు అవసరం లేదా హరీష్ రావు గారూ.!!

  తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే తెరాస అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? అధికారం ఎవరిని వరిస్తుంది? అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ప్రాంతాల్లో ఏపీకి చెందిన సెటిలర్లు ఉంటారు. ఈ ప్రాంతాల్లో సెటిలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. మరి ఈ సంగతి మర్చిపోయారో లేక సెటిలర్ల ఓట్లు మా గెలుపుని ఆపలేవు అనుకున్నారో తెలీదు కానీ.. తెరాస సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సెటిలర్ల ఓట్లను దూరం చేసే ప్రమాదం తెచ్చాయి. కాంగ్రెస్ కి ఓటేయొద్దు అని ప్రజలకు చెప్పాలనుకొని, సెటిలర్ల ఓట్లు దూరమయ్యే వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇబ్రహీంపూర్ వద్ద జరిగిన సభలో హారీష్ రావు మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే  ఏపీకి ప్రయోజనంగా మారుతోందని, తెలంగాణకు లాభం లేదని వ్యాఖ్యానించారు. హారీష్ రావు అనే కాదు మరికొందరు తెరాస నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తుందని.. దీనివల్ల ఏపీకి పరిశ్రమలు తరలిపోతాయి, తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెరాస నేతలు కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలని విమర్శలు చేస్తూ.. సెటిలర్ల ఓట్లను దూరం చేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి గారి కొత్త పాఠాలు.. ఆవు ఆక్సిజన్ విడుదల చేస్తుందట

  మీరు స్కూల్ కి వెళ్ళారనుకోండి.. అ అమ్మ.. ఆ ఆవు.. ఇలాంటి పాఠాలు నేర్పుతారు. అదే అసెంబ్లీ వెళ్తే 'ఆవు ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు తీసుకున్న ఆక్సిజన్‌నే మళ్లీ బయటకు విడుదల చేస్తుంది'.. ఇలాంటి కొత్త పాఠాలు నేర్చుకుంటారు. ఇంతకీ ఈ పాఠాలు చెప్పేది ఎవరో కాదు.. ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో రేఖా ఆర్య మాట్లాడుతూ ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు.. బయటకు విడుదల చేసేది కూడా ఆక్సిజనే అన్నారు. ఆమె పాఠాలు తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే విన్నారు కానీ.. జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఆమె మాటలను కొట్టిపారేస్తున్నారు. భూమిపై ఏ జీవి కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయదు.. మొక్కలు, వృక్షాలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వివరించారు. మంత్రిగారి మాటలు ఆసక్తికరంగా ఉండటంతో కొందరు జర్నలిస్టులు రేఖ ఆర్యను తను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎలా కరెక్టవుతుందో చెప్పాలని అడిగారు. అందుకు మంత్రి గారు చాలా పద్దతిగా సమాధామిచ్చారు. 'ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు.. ఆక్సిజన్‌ను విడుదల కూడా చేస్తుంది. ఆవు నుంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి, నెయ్యి తయారవుతుంది. దీంతో ఆవులో ఎలాంటి చెడు ప్రక్రియ కానీ చెడు శక్తికానీ ఉండదు. ఈ లెక్క ప్రకారము కచ్చితంగా చెప్పగలను ఆవు ఆక్సిజన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది' అని అన్నారు.. అయితే జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఆమె మాటలను ఖండిస్తున్నారు.

జేసీ వర్సెస్ సిఐ.. బస్తీ మే సవాల్

  ప్రస్తుతం అనంతపురంలో ఖద్దర్ వర్సెస్ ఖాకీ మాటల యుద్ధం నడుస్తోంది.. తెలుగు ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో, విలన్ల ఛాలెంజ్ లను తలపించేలా.. జేసీ దివాకర్ రెడ్డి, సిఐ మాధవ్ లు ఒకరిమీద ఒకరు పంచ్ డైలాగులు విసురుతున్నారు.. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడులు చేస్తోంటే పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.. దీంతో హర్ట్ అయిన ఖాకీలు అదే రేంజ్ లో జేసీకి కౌంటర్ ఇచ్చారు.. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సిఐ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు.. మేము మగాళ్లం అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు.. తలతిక్కగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.. పోలీసులను హిజ్రాలతో పోల్చడం సభ్యసమాజానికే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసారు.. అధికార అహంతో వ్యవహరిస్తే ఖబడ్దార్‌ అని అన్నారు.. జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

కాంగ్రెస్‌లో చేరిన తెరాస నేత రమేష్ రాథోడ్

  ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి.. తెరాస నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డి రమేష్ రాథోడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న రమేష్ రాథోడ్‌కు తెరాసలో టికెట్ దక్కని విషయం తెలిసిందే.. ఖానాపూర్ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు.. ఖానాపూర్ టిక్కెట్‌ను రేఖా నాయక్‌కు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న రమేష్ రాథోడ్.. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కమిటీలతో కాంగ్రెస్ లో మొదలైన లొల్లి

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కమిటీల లొల్లి తీవ్రస్ధాయికి చేరింది.. నిన్నటి వరకూ అందరూ కలిసి పనిచేస్తామని, గద్దె దించడం ఖాయమని చెప్పిన నాయకులు కమిటీల ఏర్పాటు తర్వాత సీన్ మార్చేశారు.. సీనియర్లలో కొందరిని దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వారికి పెద్ద పీట వేసింది.. దీంతో సీనియర్ నాయకులు అధిష్టానంపై గుర్రగా ఉన్నారు.. యువరక్తాన్ని ప్రోత్సహించడమంటే సీనియర్లను విస్మరించడం కాదని వారంటున్నారు.. వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్లు కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రచార కమిటీ నుంచి పక్కన పెట్టడం కంటే తనను చంచల్ గూడ జైల్లో పెడితే బాగుండేదని వీహెచ్ వ్యాఖ్యానించారు.. తమ పార్టీలోనే కొందరు కోవర్టులున్నారని, వారికి కేసీఆర్‌తో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.. తనకు పదవి వస్తే, తెరాసను ఓడిస్తాననే వాళ్ల భయమన్నారు.. త్వరలోనే వాళ్ల పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేస్తానన్నారు.. ఇక నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు.. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. మరి సీనియర్ల నుండి వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

చంద్రబాబు కోర్టుకు హాజరుకావల్సిందే..!!

  బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో విచారణను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు వాయిదా వేసింది.. ఏపీ సీఎం చంద్రబాబుకు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌పైన కోర్టులో వాదనలు జరిగాయి.. ఆయన తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ సుబ్బారావు వాయిదా కోరారు.. నోటీసులు అందుకున్న వారు ఎందుకు హాజరుకాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు.. దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది స్పందిస్తూ కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కోరారు.. దీంతో న్యాయస్థానం కేసు విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.. ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబుతో సహా 16 మంది ఆ రోజు  తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.. మరోవైపు ఇదే కేసులో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, ప్రకాష్ గౌడ్‌, రత్నంకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.. వారి ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.

మురికికూపంగా మారుతున్న ఏపీ సచివాలయం

  ఆలయంలా చూసుకోవాల్సిన సచివాలయం మురికినీరు వలయంలో చిక్కుకొని 'ఈ కంపు భరించడం నా వల్ల కాదు మహాప్రభూ' అంటూ ముక్కు మూసుకొంటోంది.. ఇది ప్రస్తుతం ఏపీ సచివాలయం పరిస్థితి.. దీనంతటికి కారణం అక్కడి క్యాంటీన్.. ఆ క్యాంటీన్ లో ఫుడ్ ఎలా ఉందో తెలీదు కానీ.. దానిలో పాత్రలు,ఇతర సామాగ్రి శుభ్రం చేసిన మురికి నీరంతా సచివాలయం పరిసరాల్లోకి వెళ్తూ అక్కడ గబ్బు కొట్టిస్తున్నాయి.. క్యాంటీన్ నుంచి సరైన పైప్ లైన్ లేకపోవడంతో మురికి నీరు ఆ చుట్టూ పరిసరాల్లో విస్తరిస్తూ దుర్గంధం వెదజల్లుతుంది.. ఇది చాలదు అన్నట్టు ఆ అపరిశుభ్ర వాతవరణంలోనే సచివాలయ క్యాంటీన్ వంటశాల ఉంది.. వింటుంటేనే ఏదోలా ఉంది కదా.. మాట్లాడితే 'స్వఛ్ భారత్' అంటూ శుభ్రంగా ఉండాలి, దేశాన్ని శుభ్రంగా ఉంచాలని నీతులు చెప్పే ప్రతినిధులు, అధికారులకు సచివాలయం పరిసరాల్లో మురికినీరు కనిపించట్లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. స్వఛ్ భారత్ తరువాత.. ముందు స్వఛ్ సచివాలయం చేపట్టి సచివాలయాన్ని ఆ కంపు నుండి కాపాడండి అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.. మరి ఇప్పటికైనా మురికినీరు పోవడానికి సరైన పైప్ లైన్ ఏర్పాటు చేసి తప్పు సరిదిద్దుకుంటారేమో చూడాలి.    

నువ్వు సీఎం అయితే ఏంటి?.. మాకు మోదీ ఉన్నారు జాగ్రత్త

  బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆపితే నేనెవరి మనిషినో తెలుసా? నా వెనుక ఎవరున్నారో తెలుసా? అనే మాటలు వింటుంటాం.. కానీ వెరైటీగా కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి సంఘటన జరిగింది.. నేను సీఎంని అనే విషయం మర్చిపోకు అని కుమార స్వామి అంటే.. మాకు పీఎం మోదీ ఉన్నారని మర్చిపోకు అంటూ ప్రతిపక్ష నేత యడ్యూరప్ప.. ఇలా ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. యడ్యూరప్ప రాత్రిపూట జేడీఎస్ శాసన సభ్యులకు ఫోన్ చేసి మా పార్టీలోకి వచ్చేయాలని, మంత్రి పదవి ఇస్తామని బేరాలు పెడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.. ఇలా ఎమ్మెల్యేలకు గాలం వేసి దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తే తాను చూస్తూ ఉండనని హెచ్చరించారు.. అంతేకాదు తన చేతిలో అధికారం ఉన్న విషయం మరిచిపోయి మాట్లాడితే ఏం చెయ్యాలో అది చేస్తానని యడ్యూరప్పను, కుమారస్వామి హెచ్చరించారు.. కర్ణాటకలో మాత్రమే కుమారస్వామికి అధికారం ఉందని, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న విషయం వారు మరిచిపోయారని యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు.. కుమారస్వామి చేస్తున్న బెదిరింపులకు బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరని యడ్యూరప్ప అన్నారు.

మోదీ కలల ప్రాజెక్ట్ కు గండి.. 1000 మంది రైతులు పిటిషన్.!!

ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ కు గండి పడేలా ఉంది.. 1000 మంది రైతులు మోదీ కలల ప్రాజెక్ట్ ను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.. మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే గతేడాది సెప్టెంబర్‌లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించారు.. డిసెంబర్,2017లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.. 2023 ఆగష్టుకల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని తొలుత భావించినా, ఇప్పుడు ఆగష్టు 2022కే పూర్తి చేసి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే కేంద్రానికి గుజరాత్ రైతుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి.     దాదాపు 1000 మంది రైతులు ఈ ప్రాజెక్టును ఆపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేందుకు సిద్దంగా లేమని కోర్టుకు తెలిపారు.. అంతేకాదు భూసేకరణ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు తమ భూములు మార్కెట్ విలువ ఆధారంగా కొనుగోలు చేయడం లేదని చెప్పారు.. ఇదిలా ఉంటే తమ భూములు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చేస్తే తమకు పరిహారం పరంగా న్యాయం జరగదని చెబుతున్నారు.. అదే కేంద్రం తీసుకుంటే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.. మరోవైపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.. మోదీ కలల ప్రాజెక్ట్, అందునా రూ.1.08 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. మరి ఈ విషయంపై మోదీ సర్కార్ ఎలాంటి తీసుకుంటుందో చూడాలి.

గుంటూరు ప్రేమికులను భయపెడుతున్న మారుతీరావు

  ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు రీల్ విలన్ అంటే రావుగోపాలరావు ఎలా గుర్తొచ్చాడో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని యువతకు రియల్ విలన్ అంటే మారుతీరావు పేరు అలా గుర్తుకొస్తుంది.. తన కూతురు అమృత, ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో.. సొంత అల్లుడిని అత్యంత కిరాతకంగా చంపించిన వ్యక్తి మారుతీరావు.. ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా సంచలమైంది.. ప్రజలు, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు.. అయితే ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘటన చోటుచేసుకుంది.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కోపంతో కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై  మనోహరాచారి కత్తితో దాడి చేసాడు.. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ వరుస సంఘటనలతో ప్రేమికుల్లో భయం మొదలైంది.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  ప్రేమ పెళ్లిళ్లు అంగీకరించని తండ్రులు, కన్న బిడ్డలను సైతం చంపేందుకు వెనకాడటం లేదు.. దీంతో ఇలాంటి మరెన్నో ప్రేమ జంటలు ఇప్పుడు పోలీసు స్టేషన్ బాటపట్టాయి.. మాకు రక్షణ కల్పించడండి అని పోలీసులను కోరుతున్నారు.. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో కొంత భయం ఉండడం సహజమే.. అయితే మిర్యాలగూడ, హైదరాబాద్ ఘటనలతో గుంటూరు జిల్లాలోని ప్రేమికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జంటల్లో ఈ ఘటనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.. వీరితో పాటు రోజుల వ్యవదిలో వివాహాలు చేసుకున్న వారు, వివాహాలకు సిద్ధమైన వారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. దీంతో పోలీసులు వారికీ ధైర్యం చెప్పే పనిలో పడిపోయారు.

జనసేన గూటికి టీటీడీ మాజీ చైర్మన్..!!

  తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీలో చేరికలు మొదలవుతున్నాయి.. ముఖ్యంగా తిరుపతిలో జనసేన పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇప్పటికే తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.. అయితే అలాంటిదేం లేదంటూ సుగుణమ్మ ఆ వార్తలను ఖండించారు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.. టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. తాజాగా చదలవాడ హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ని కలిసినట్టు సమాచారం.. త్వరలోనే చదలవాడ జనసేన కండువా కప్పుకోనున్నారు.. చదలవాడ చేరికతో తిరుపతి రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ, వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు.. వెంకటరమణ మరణం అనంతరం ఆయన సతీమణి సుగుణమ్మ అదే స్థానం నుండి గెలుపొందారు.. ఇప్పుడు ఆమెనే ఎమ్మెల్యేగా ఉన్నారు.. చదలవాడ జనసేనలో చేరితే తిరుపతిలో త్రిముఖ పోటీ తప్పదు.. జనసేన ఇక్కడ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరంజీవి కూడా ఇక్కడి నుండే విజయం సాధించారు.. మరి వచ్చే ఎన్నికల్లో ఈ త్రిముఖ పోరు ఎలా ఉంటుందో చూడాలి.

సెక్రటేరియట్ ఎంప్లాయిస్ డిమాండ్స్ నెరవేరుతాయా?

  తాజాగా పీఆర్సీ చైర్మన్ అశుతోష్ మిశ్రాను, ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ కలిసింది.. ఈ సందర్భంగా వారి డిమాండ్లను కమిటీ, అశుతోష్ ముందుంచింది.. అనంతరం సెక్రటేరియట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడించారు.. కనీస వేతనం 24 వేలు, ఫిట్మెంట్ 55 శాతం ఇవ్వాలని.. అత్యధిక వేతనం 2లక్షల 44 వేలుగా ఉండాలని కోరినట్లు తెలిపారు.. అదేవిధంగా 2018, జూలై 1  నుంచి పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.. ఫిట్మెంట్ కారణంగా గత పీఆర్సీ సిఫార్సులను సాధించుకోలేకపోయాం.. గత పీఆర్సీ సిఫార్సుల్లో సగానికి పైగా ప్రభుత్వం కోత విధించింది.. ప్రస్తుత పీఆర్సీ సిపార్సు లు అన్నింటినీ సాధించి తీరుతామని స్పష్టం చేసారు.. సీపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.. అదేవిధంగా మహిళా ఉద్యోగుల కు  చైల్డ్ కేర్ కోసం 2 నెలలు కాలాన్ని పెంచాలని కోరినట్టు తెలిపారు.. మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయో లేదో చూడాలి.

కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కేసీఆర్..!!

  తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.. ముఖ్యంగా తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నాయి.. తాజాగా గులాంనబీ అజాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస పాత్ర ఏమిలేదని, తెరాస కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని విమర్శించారు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోరాడటంతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని స్పష్టం చేసారు.. తమ ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రం కోసం పోరాటం చేశారని, ఇందులో తెరాస పాత్ర శూన్యమన్నారు.. తెరాస హైదరాబాద్, ఢిల్లీలో ప్రకటనలు చేయడం తప్ప చేసేందేమీ లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ఈ నాలుగేళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే భర్తీ చేయలేకపోయారని, ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని ఎద్దేవా చేశారు.. విద్యార్థులు, యువతను కేసీఆర్ మోసం చేశారని, ముస్లింల రిజర్వేషన్ల అంశంలోనూ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి తమనూ మోసం చేశారని తెలిపారు.. పార్లమెంటులో మోదీ సర్కారుకు మద్దతిస్తున్న కేసీఆర్‌, రాష్ట్రంలో మాత్రం తిడుతూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని అజాద్ మండిపడ్డారు.