చంద్రబాబుకి మమతా లేఖ
posted on Oct 8, 2018 @ 11:22AM
నాలుగేళ్లు ఎన్డీయే తో కలిసి పని చేసిన టీడీపీ కేంద్ర వైఖరికి నిరసనగా పొత్తు నుంచి బయటకి వచ్చి విమర్శలు సంధిస్తున్నది అందరికి తెలిసిందే.ఎన్డీయే ప్రభుత్వంపై నిరసన గళం వినిపించే వారిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒకరు.ఈ నేపధ్యం లో తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఏడాది జనవరి 19 న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ప్రదర్శన చేపట్టనుంది.2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని,ఈ భారీ ప్రదర్శనకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ రాశారు.
‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు.