మోదీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా?
posted on Oct 8, 2018 @ 11:58AM
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, తెరాస మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీ నేతలు ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెరాస మీద, కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ముస్లిం మైనార్టీల సభలో రేవంత్ మాట్లాడారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. పోలీసులు ఇక స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీలో ఉండే ప్రధాని మోదీ జీతగాడు కేసీఆర్ అని విమర్శించారు. రాబోయే కాలంలో మోదీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నెరవరుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు కరెంట్ షాక్ తప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. కనీసం అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అంతం కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు.