2019లో మనదైన ప్రభుత్వాన్ని నెలకొల్పుదాం..పవన్
posted on Oct 8, 2018 @ 10:37AM
పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమలోని ఓ రిసార్ట్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ 2019 లో మనదైన ప్రభుత్వాన్ని నెలకొల్పుదామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్ జనసేనలో చేరారు. వారికి పవన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ప్రజాసేవ చేసే వారే జనసేనలోకి రావాలని ఆకాంక్షించారు.రాజకీయాల్లో తనకు ఎవరూ శత్రువులు లేరని, వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా బద్ధశత్రువు కాదని తెలిపారు.
అనంతరం గిరిజన ఉపాధ్యాయులు, నిర్వాసితులు, యువకులతోనూ సమావేశమయ్యారు.ఆ సమావేశంలో గత ఎన్నికల్లో తెదేపాకు అండగా ఉన్నది ప్రజల కోసమే కానీ అవినీతి కోసం కాదని చెప్పారు.గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెదేపా ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో నిర్వీర్యం చేసిందని విమర్శించారు.నేడు పథకాల్లో 25 శాతం లబ్ధి మాత్రమే ప్రజలకు చేరుతుందని, 75 శాతం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. కాటన్ ఆనాడు ఉభయగోదావరి జిల్లాల్లో కరవును దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజీ నిర్మిస్తే, ప్రస్తుతం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఆదివాసీల సమస్యలను దగ్గరినుంచి చూశానని పవన్ చెప్పారు.గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి వైద్యం అందే విధంగా జనసేన ఎన్నికల ప్రణాళికలో చేర్చుతామని, ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి గ్రామాలకు పంపుతామని తెలిపారు. భాగస్వామ్య పింఛను పథకం విధానాన్ని రద్దు చేస్తామని పవన్ స్పష్టంచేశారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.