జీఎస్టీ దెబ్బకు వ్యాపారి బలి

  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ విధానంతో చిన్న,మధ్యతరహా పరిశ్రమలు తుడిచిపెట్టుకుపోయాయి.జీఎస్టీ కట్టకపోతే విధించే జరిమానాలు కూడా భారీగానే ఉన్నాయి.తాజాగా జీఎస్టీ కారణంగా ఓ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కృష్ణా జిల్లాలోని పెనమలూరు మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ మహ్మద్‌ సాదిక్‌ ప్రార్థన మందిరానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లినవాడు తిరిగి రాలేదు.దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఆయన మృతదేహాన్ని కరువు కాల్వలో తోట్లవల్లూరు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు మాత్రం సాధిక్ ఆత్మహత్యకు ఆదాయ పన్ను శాఖ అధికారులే కారణమని ఆరోపిస్తున్నారు. సాధిక్ 25 ఏళ్లుగా విజయవాడలోని ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీఎస్టీ అమల్లోకి రాకముందు వరకు ఈ వృత్తి చేతి వృత్తుల్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. సాధిక్ కొద్దినెలలుగా ఐటీరిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఆ శాఖ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఓ చాటెడ్ అకౌంటెంట్‌ను ఆశ్రయించారు. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేలా రిటర్న్స్ రూపొందించారు. బాడీ బిల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న ఐదారుగురు కార్మికులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు చూపించారు. ఐటీ అధికారులు ఈ ఐదుగురిని విచారించగా వారు కార్మికులే అని తేలింది. దీంతో సాధిక్‌కు ఐటీ అధికారులు రూ.50లక్షల జరిమానా విధించారు. ఐటీ అధికారులను వేడుకోగా కేసు లేకుండా చేసేందుకు తమకు కొంత డబ్బు ఇవ్వాలని అధికారులు, సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, వ్యక్తిగత సమస్యలు తోడవడంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు సాధిక్‌కు జీఎస్టీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు. తమ జాబితాలో సాధిక్ పరిశ్రమలేదని, నోటీసులతో తమకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు.

గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు

మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌ లేదా వేరే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కు టికెట్ దక్కకపోగా,కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారని ప్రచారం జరగటంతో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.దీనిపై మీడియాతో మాట్లాడిన రాములు తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఆరోపించారు.ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు,ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు.తాను గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్‌ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారా? అని నిలదీశారు.     గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.. అదేమైంది? మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. గిరిజన ఐఏఎస్‌లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్‌, కొండా సురేఖను సస్పెండ్‌ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలే కాదు పదో తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు.గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.ఒక దశలో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.  

కాదన్నా కవాతుకు కదం తొక్కిన జనసైనికులు

  ప్రజా పోరాట యాత్ర పేరుతో తన ఆలోచనలను, పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు.యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో పిచ్చుకలంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర గంటన్నర సేపు కవాతు నిర్వహించాలనుకున్నారు.కవాతు నేపధ్యంలో విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్‌ పొడవునా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు.సుమారు రెండు లక్షల మందితో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయాలని జనసేన నిర్ణయించింది.అనంతరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.     కవాతు నిర్వహణపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టంచేశారు.పవన్‌కు నోటీసులు జారీచేశారు.కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదని నోటీసుల్లో పేర్కొన్నారు.బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని, బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభకు 10వేల మంది కంటే ఎక్కువ మందికి సభా ప్రాంగణం సరిపోదని తెలిపారు.దీంతో అసలు కవాతు నిర్వహిస్తారా? లేదా? అని జనసైనికులు సందిగ్ధంలో పడ్డారు.కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కవాతు ప్రారంభించారు.     పవన్‌ కల్యాణ్‌ కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన భారీ కవాతు ఉత్సాహంగా కొనసాగుతోంది.పవన్‌ నేతృత్వంలో ధవళేశ్వరం బ్యారేజీపై భారీ సంఖ్యలో కార్యకర్తలు నినాదాలతో ముందుకు సాగుతున్నారు.ఈ కవాతు సందర్భంగా రూపొందించిన పదా.. పద.. పద సాంగ్‌ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.అభిమానులు,కార్యకర్తల కోలాహలంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఓపెన్‌టాప్‌ వాహనంలో పవన్‌ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంచారు.కవాతు అనంతరం భహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.  

కోదండరాం పోటీ చేయకుండానే డిప్యూటీ సీఎం అవుతారా?

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీకి ఆయనే నేతృత్వం వహించారు. అంతేకాదు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాంకు మంచి హోదా లభిస్తుందని అంతా భావించారు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల తరువాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్, కోదండరాంల మధ్య దూరం పెరిగింది. చివరకు కోదండరాం టీజేఎస్ పేరుతో కొత్త రాజకీయపార్టీకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు టీజేఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించడం. ఇప్పటికే కేసీఆర్ ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. త్వరలో ముందస్తు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమితో టీజేఎస్ చేతులు కలిపింది. ప్రస్తుతం మహాకూటమిలో సీట్ల కేటాయింపు గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో మహాకూటమి కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కోదండరాం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కోదండరాంకు రాష్ట్ర వ్యాప్త ఆదరణ ఉంది.. కాబట్టి ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దించి ఒకే నియోజకవర్గానికి పరిమితం చేస్తే కూటమికి నష్టం కలిగే అవకాశముందని ఈ భేటీలో నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోటీకి దూరంగా ఉంచి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో ప్రచారం చేయించాలని వారు భావిస్తున్నారట. పోటీకి దూరంగా ఉన్నంత మాత్రాన కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్నికల్లో కూటమి విజయం సాధించాక ఆయనకు డిప్యూటీ సీఎం లేదా ఆ హోదాతో సమానమైన పదవి ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టీజేఎస్ అభ్యర్థులను కూడా హస్తం గుర్తుపైనే పోటీ చేయించాలని కోర్ కమిటీ భావిస్తోందని సమాచారం. కొత్త గుర్తుతో జనం అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందన్నది కోర్ కమిటీ నేతల అభిప్రాయం. తాను పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అవ్వడం.. అలాగే తమ పార్టీ అభ్యర్థులను హస్తం గుర్తుపై పోటీ చేయించడం.. వీటిపై కోదండరాం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

టికెట్ రాలేదంటే పార్టీ సభ్యత్వమే పోయింది

  పార్టీ టికెట్ రాలేదని అసంతృప్తి చెందుతుంటే ఏకంగా సభ్యత్వమే పోతే ఆ నేత పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడం, 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌ లేదా వేరే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కొన్నాళ్లుగా భావిస్తున్నారు.దీనికి సంబంధించి పార్టీ అధిష్ఠానంతో ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుపుతున్నారు.కానీ ఆ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మరోసారి అవకాశం ఇచ్చింది.దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.మరోవైపు నారాయణఖేడ్‌ నుంచి రాములు నాయక్‌కు అవకాశం కల్పించాలని పలు గిరిజన సంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.దీనికితోడు రాములు కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలను ఆయన కలిసినట్లు జోరుగా ప్రచారం జరిగింది.దీన్ని ఆయన ఖండించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో తన భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానని రాములు తెలపడంతో తెరాస అధిష్ఠానం స్పందించింది.ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

గిరిజనులను మావోయిస్టులుగా మార్చేస్తున్న పోలీసులు

  ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అండ్రాపల్లి పంచాయతీ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు.ఈ నేపథ్యంలో పోలీసులు,మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.కాల్పుల్లో మహిళా మావోయిస్టు మీనా మృతి చెందింది.మీనా మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు.ఈమె కిడారి,సోమల హత్య కేసులో నిందితురాలు.అయితే మావోయిస్టు నేతలు మీనా ఎన్‌కౌంటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీనా ఎన్‌కౌంటర్ బూటకమంటూ మావోయిస్టు నేత కైలాసం పేరుతో ఆడియోను విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా చంపేశారని అన్నారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు.ఏవోబీలో గల ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఓజీ బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని, వారిపై మావోయిస్టు ముద్ర వేస్తున్నాయని కైలాసం ఆరోపించారు.కటాఫ్‌ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దారుణాలు కొనసాగుతున్నాయన్నారు. బంధువుల ఇంటికి వచ్చిన వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. పోలీసుల అరాచకాలను అడ్డుకున్న గిరిజనులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారన్నారు.పెదబయలులో అరెస్టు చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని ఆడియో టేపులో కైలాసం డిమాండ్ చేశారు.

తెరాస నేతపై శ్రీ రెడ్డి లైంగిక ఆరోపణలు

  కాస్టింగ్ కౌచ్‌పై ఆరోణలతో వార్తల్లోకి ఎక్కిన శ్రీ రెడ్డి టాలీవుడ్ లో పెను దుమారం రేపింది.పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసింది.తనకు అన్యాయం జరిగిందంటూ నడి రోడ్డుపై  అర్ధ నగ్నంగా నిరసన కూడా తెలిపింది.గత కొన్ని రోజులుగా కనపడని శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నై లో ఉంటుంది.తాజాగా భారత్ లో మీ టూ ఉదయం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మళ్ళీ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తెరాస నేత,ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.జీవన్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శ్రీ రెడ్డి ఆరోపించింది.అంతేకాక నిర్మాత బెల్లంకొండపై కూడా శ్రీ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించింది. ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ రెడ్డి.. 'జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో నాపై వేధింపులకు పాల్పడ్డాడు.అతడికి అమ్మాయిలంటే పిచ్చి.అతడు పెద్ద మోసగాడు.అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తమ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులకు దిగేవాడ’ని పేర్కొంది.కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న జీవన్ రెడ్డిపై శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలతో తెరాస పార్టీ సందిగ్ధంలో పడింది.తెరాస పార్టీ తరుపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, ఆర్మూర్ ప్రజల్లో అంశం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతి పక్ష పార్టీలకు శ్రీ రెడ్డి వ్యాఖ్యలు ఊతంగా నిలుస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలపై జీవన్ రెడ్డి గాని,తెరాస పార్టీ గాని ఇంతవరకు స్పందించలేదు.  

కంటతడి పెట్టిన టీఆర్‌ఎస్‌ నేత..వీడియో హల్చల్

సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి పిడమర్తి రవి, దయానంద్‌ పోటీ పడగా అధిష్టానం పిడమర్తి రవికి టికెట్‌ కేటాయించింది.దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన దయానంద్‌ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజుల పాటు ప్రదర్శనలు,ఇంటింటి ప్రచారంతో తనను బలపరచాలని స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రజల్లో తిరిగారు.ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి పిడమర్తి రవికి ఇబ్బంది కలుగుతుందన్న సమాచారంతో మంత్రులు కేటీఆర్‌, తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల దయానంద్‌ను హైదరాబాద్‌ పిలిపించి మాట్లాడారు.పార్టీలో సముచిత  స్థానం కల్పిస్తామని చెప్పటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా హామీ ఇప్పించారు.దీంతో టీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేసేందుకు దయానంద్‌ అంగీకరించారు. కానీ ఈ రాజీ వెనుక దయానంద్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని కొందరు చేసిన వ్యాఖ్యలు దయానంద్‌ను ఆవేదనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతున్న సెల్ఫీ వీడియో ఒకటి విడుదలైంది.దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.      ‘నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు.. ప్లీజ్‌ నన్ను అర్థం చేసుకోండి’.. అని వీడియోలో దయానంద్‌ పేర్కొన్నారు. 'సీటు రాకపోవడం దురదృష్టకరమని, పార్టీ కోసం కట్టుబడి పని చేయాలని, అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ పొంగులేటి చెప్పారు. కేటీఆర్‌ మాటపై పిడమర్తి రవికి మద్దతు ఇవ్వడం జరిగింది’ అని పేర్కొన్నారు. అయితే.. తాను కేటీఆర్‌  నుంచి రూ.7 కోట్లు తీసుకున్నానంటూ వదంతులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వేల కుటుంబాలకు తమ ఆసుపత్రి నుంచి ఉచితంగా వైద్యం అందించామని, విద్యార్థుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్య సేవలందించే తనపై ఇంత నిందవేసినందుకు నిజంగా తనకు బాధగా ఉందని, తానలాంటి వ్యక్తిని కాదని కన్నీరు పెట్టుకున్నారు.సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవ్వటంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయన అనుచరులు కంగుతిన్నారు.పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్‌, టీడీపీ కావాలనే అసత్య ప్రచారంచేస్తూ.. పార్టీలో కలకలం రేపాలని చూస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రణయ్ ఆత్మ మాట్లాడుతుంది

  మూఢనమ్మకాలను నమ్మినంత కాలం మనం మోసపోతూనే ఉంటాం.అందరు విద్యావంతులే ఈ కాలంలో, కొత్త పరిజ్ఞానంతో దేశ దేశాలు పోటీపడుతుంటే మనం మాత్రం మూఢనమ్మకాలను వీడట్లేదు.ఇటీవల మిర్యాలగూడలో కూతురు అమృత తక్కువ కులంవాన్ని చేసుకుందని తండ్రి మారుతీ రావు అల్లుడిని (ప్రణయ్) హతమార్చిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని చెప్తున్నారు హైదరాబాద్ కి చెందిన దంపతులు. పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ వెళ్లారు. మొదట ప్రణయ్‌ తల్లిదండ్రులతో మాట్లాడారు. అమృతతో మాట్లాడాలని ఆమెను పిలిచారు.‘ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోంది. మీతో కూడా మాట్లాడిస్తాం. నీ కోసం ఆయన ఆత్మ ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోంది. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలో శత్రువులు. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడే తప్ప నిజమైన పగలేదు. ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దు. విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుంది’ అంటూ అమృతకు వారు చెప్పారు. దంపతుల ప్రవర్తనపై అనుమానం కలిగిన  ప్రణయ్‌ కుటుంబ సభ్యులు డీఎస్పీ పి.శ్రీనివాస్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఒకటో పట్టణ సీఐ సదా నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ప్రణయ్‌ నివాసానికి వచ్చి నాగారావు, సత్యప్రియ దంపతులను పోలీసు స్టేషన్‌కు తరలించారు.దెయ్యాలు, ఆత్మలు అంటూ అభూత కల్పనలు అల్లినందుకు వారిపైన ఐపీసీ 420 కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు డీఎస్పీ పి.శ్రీనివాస్‌ తెలిపారు.

టీడీపీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ..పెర్ఫార్మన్స్ తక్కువ!

  టీడీపీ ప్రభుత్వం,నేతలపై కయ్యానికి కాలు దువ్వుతుంటారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.గత రెండు రోజులుగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసాల్లో,కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.కడప ఉక్కు కర్మాగారంపై నిలదీసినందుకే కక్ష సాధింపు చర్యగా కేంద్రం తనపై ఐటీ దాడులు చేయిస్తుందని సీఎం రమేష్ ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని టీడీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ విమర్శలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన సీఎం రమేష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. " టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ. అవగాహన తక్కువ. స్టీల్ మినిస్టర్ బిరేంధేర్ సింగ్ గారిని కలిసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీఎస్ఐ ద్వారా సబ్మిట్ చేయవలసిన రిపోర్ట్ ఆలస్యం అయ్యిందో తెలుసుకుంటే బాగుండేది. డ్రామాలపైనా, అవినీతి పైన ఉన్న శ్రద్ధ అభివృద్ధిపైన ఉండుంటే రాష్ట్రం బాగుపడేది" అని ట్వీట్ చేశారు. సీఎం రమేష్ జీవీఎల్‌ను ఒక ఆంబోతులా రాష్ట్రంపైకి వదిలేశారని మండిపడ్డారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం దొంగ దీక్షలు చేశామంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్‌ పచ్చి అబద్దాలకోరని విమర్శించారు.దీనికి సవాల్ గా " రమేష్.. రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు. మీలాగే ఛాలెంజ్ చేసి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గతంలో తోక ముడిచారు. మీరూ అంతేనా? మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ. పెర్ఫార్మన్స్ తక్కువ! నేను చర్చకు రెడీ. ఎప్పుడైనా, ఎక్కడైనా! మీరు సిద్ధమా!" అని మరో ట్వీట్ చేశారు.అంతేకాదు సీఎం రమేశ్‌కు తనకు చేసిన ఛాలెంజ్‌ వీడియోను కూడా తన ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు.

తెరాసతో నాకు ప్రాణహాని ఉంది: రేవంత్ రెడ్డి

  ముషీరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాయిని నర్సింహా రెడ్డి గత ఎన్నికల్లో తనకు కేసీఆర్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానన్నారని తెలిపారు.దీంతో నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌ రెడ్డి కోరారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ తనకు రూ.10 కోట్లు ఇస్తానన్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని.. లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరానన్నారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. తన సెక్యూరిటీపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డిపై నమ్మకం లేదని, నాగార్జునసాగర్‌లో జరిగిన తెరాస నేతల శిక్షణకు మహేందర్‌రెడ్డి వెళ్లారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ తనను బెదిరించారని,ఇటీవల మంత్రి జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని.. తెరాస సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఫిర్యాదు చేశానన్నారు. తనకు కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు.

రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయం

  గత ఎన్నికల్లో కేసీఆర్‌ తనకు రూ.10 కోట్లు ఇస్తా అన్నారని నాయిని నర్సింహా రెడ్డి మీడియాతో అన్నారు.దీంతో నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌ రెడ్డి కోరారు.ఆ రూ.10 కోట్లు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిల్లరగాడని, ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున గత ఎన్నికల సందర్భంగా రూ.5, 10 లక్షలో కేసీఆర్‌ ఇస్తానన్నారు అనటానికి బదులు రూ.10 కోట్లు అన్నానని వివరణ ఇచ్చారు. గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టమని నాయిని తెలిపారు.

కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ

  కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్ష చేసింది తెలిసిందే.తాజాగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యారు.రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఎంపీలు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎంపీలు కోరారు.కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.ఉక్కు కర్మాగారంపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని.. ఏపీకి ఏమీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారా? అని కేంద్ర మంత్రిని నిలదీసినట్లు ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు.తమ డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ఎంపీలు చెప్పారు. ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. వారం రోజుల్లో కేంద్రం తరఫున లేఖ విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇచ్చామని ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. భూమి, విద్యుత్‌, నీరు, మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంపై పగబట్టినట్లుగా వ్యవహరించవద్దని కోరినట్లు చెప్పారు. టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు: *కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి. *కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి. *కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి. *కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా? *కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.

జయ తల్లి..మరి శోభన్ బాబు తండ్రి కాదా?

  బ్రతికుండగా లేని బంధాలు చనిపోయాక పేరు కోసమో,ఆస్తికోసమో వచ్చి వాలిపోతాయి.తమిళనాడు ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్న జయలలిత మరణమే కాదు,జీవితం కూడా ఊహకందని మర్మము.జయలలిత మరణాంతరం బెంగళూరుకి చెందిన అమృత జయ తనకు జన్మనిచ్చిన తల్లి అని, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, ఆమె భౌతికకాయానికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించింది.తను జయ, దివంగత నటుడు శోభన్‌బాబుకు జన్మించినట్లు తన కుటుంబీకులు చెప్పారని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్‌ శోభన్‌బాబును తన తండ్రిగా ప్రకటించాలని ఎందుకు కోరడం లేదని, కేవలం జయలలిత తన తల్లి అని ప్రకటించాలనే ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు.దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని వైద్యనాథన్ ఆదేశించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది అమృత జయ కుమార్తె కాదని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను న్యాయస్థానం ముందుంచారు.ఇరువాదనలు విన్న వైద్యనాథన్‌ జయ జీవితమంతా ఓ మిస్టరీగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.అమృత వేసిన పిటిషన్ ను కొట్టివేశారు.

ఆగిన మెట్రో సేవలు

  హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వెళ్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణాలతో కూకట్‌పల్లి బాలానగర్‌ మెట్రోస్టేషన్‌లో నిలిచిపోయింది.రైలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో నిలిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు.అర్థాంతరంగా ట్రైను నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురయ్యారు.మెట్రో అధికారులపై మండిపడ్డారు.రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.దీంతో ప్రయాణికులు మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరమ్మతు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.మరమ్మతులు పూర్తయ్యేవరకూ మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వరకూ మెట్రోరైలు సేవలను అధికారులు నిలిపివేశారు. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకూ రైళ్లు నడవనున్నట్లు తెలిపారు.

తెరాస అధినేత వ్యూహం ఫలించేనా?

  అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్‌ మళ్ళీ అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.కానీ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు నిరసన గళం వినిపించటంతో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.ఓ పక్క మహాకూటమి,మరో పక్క అభ్యర్థులపై అసంతృప్తి నేపథ్యంలో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు.ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం చేసేవిధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు.దాదాపుగా 56 నియోజకవర్గాలకు ప్రచార తేదీలు ఖరారయ్యాయి. మిగిలిన వాటి గురించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్‌ స్వయంగా నియోజకవర్గ నేతలతో ఫోన్‌లో మాట్లాడి ప్రచారానికి అనువైన తేదీ గురించి వారితో చర్చించి ఖరారు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీ ప్రచార సభల సందర్భంగా స్థానిక నేతలతో భేటీ కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను నేరుగా తెలుసుకోవడంతో పాటు సమస్యలుంటే పరిష్కరించడం, సమర్థంగా ప్రచార నిర్వహణ వంటి వాటిపై దిశా నిర్దేశం చేస్తారు.సమావేశాలకు పిలిచే నాయకుల పేర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సీఎం ఆదేశించారు.నియోజకవర్గ స్థాయి ప్రచార, సమన్వయ బాధ్యతలను తమ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు తెరాస అప్పగించనుంది. ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి 20 నుంచి 30 మంది సూక్ష్మ పరిశీలకులను పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించుతోంది. గ్రామాల్లో గడప గడపకూ వెళ్లి స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయటమే వీరి పని.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు.అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లనూ సూక్ష్మ పరిశీలకులు గుర్తించి, ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి నివేదికలు చేరవేస్తారు.తొలుత పార్టీ అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సూక్ష్మ పరిశీలకులను పంపించాలని నిర్ణయించారు.

మహాకూటమికి 80 స్థానాలు..తెరాసకు 20 స్థానాలు

  ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నవేళ తెరాస,కాంగ్రెస్ పార్టీలు గెలిచేది మేము అంటే మేము అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ప్రస్తుత సర్వే ప్రకారం మహాకూటమి 80కి పైగా స్థానాల్లో గెలవబోతోందని, తెరాస 20 స్థానాలకే పరిమితమవుతుందన్నారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనుచరులను పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహాకూటమిలోని మిత్రపక్షాలతో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని, పొత్తులపై ఒకటి రెండురోజుల్లో స్పష్టత వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా సిద్ధమైందన్నారు.మహాకూటమి పేరు మారుతుందని, కూటమిలోని పార్టీలు ఉమ్మడిగానే ప్రచారం చేస్తాయని తెలిపారు. గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు.12 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. రెండు సభల్లో సోనియాగాంధీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో ప్రచారం ఉంటుందని తెలిపారు. కుటుంబానికి ఒకే టికెట్‌ అనే అంశంపై చర్చిస్తున్నారని, ఏఐసీసీ నేతలు దీనిపై త్వరలో నివేదిక ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహించి 20 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని, తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు దాదాపు 10 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. నాలుగేళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం వారి కుటుంబాలను పరామర్శించి సాయం చేయని తెరాస, కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టి గోరీ కట్టాలని అన్నారు.

కేసీఆర్‌పై సూమోటో కేసు

  తెలంగాణ హోం మత్రి నాయిని నర్సింహా రెడ్డి 2014 లో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు.కానీ కేసీఆర్‌ నాయిని ని ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేయమని సూచించారట.బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనని నాయిని అనటంతో రూ.10 కోట్లు ఇస్తా పోటీ చెయ్యమని కేసీఆర్‌ అన్నారట.కానీ దానికి నాయిని సుముఖత చూపకపోవటంతో ఎమ్మెల్సీగా చేసి నా కేబినెట్‌లో పదవిస్తానని హామీ ఇచ్చారట.అన్నమాట ప్రకారమే నాయినికి హోమ్ మంత్రి పదవి కట్టబెట్టారు.కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం నాయిని తన అల్లుడుకి ముషీరాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయతిన్స్తున్నారు.శ్రీనివాస రెడ్డి కి టికెట్ విషయంపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్న నాయినికి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకట్లేదట.టికెట్ విషయం పక్కనపెడితే  కేసీఆర్‌  రూ.10 కోట్లు ఇస్తా అన్నారని నాయిని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.28 లక్షలుకాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు స్వయంగా నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని,రూ.25 వేల కోట్లు మేర అక్రమ సంపాదన ఉందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయని ద్వజమెత్తారు.నియోజక వర్గానికి రూ. 10 కోట్లు, తన నియోజక వర్గం కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు.ప్రతిపక్ష నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతిభవన్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

‘మీటూ’కి మద్దతుగా రాహుల్‌గాంధీ

  బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తనను నానాపటేకర్‌ లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమం ఊపందుకుంది. దీంతో ఎందరో నటీమణులు, పాత్రికేయులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాల్లో మహిళలు ఎదుర్కొన్న వేధింపులు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ ద్వారా బయటపెడుతున్న మహిళలకు ఎంతోమంది ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ‘మహిళలను ఎంతగా గౌరవించాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారి జీవితం ముగిసిపోతుంది. దీని పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సమాజంలో మార్పు రావాలంటే నిజాన్ని నిర్భయంగా, గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది’ అంటూ రాహుల్‌గాంధీ మీటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి ట్వీట్‌ చేశారు.