ఏపీ, తెలంగాణ రాజకీయాలు కవర్ చేసిన లోకేష్

  ఏపీ మంత్రి నారా లోకేష్ తాజా ఏపీ, తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ 'వైసీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం'.. ఇక తెలంగాణ విషయానికొస్తే 'కేసీఆర్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు'. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేష్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్‌, పవన్‌ కళ్యాణ్ చేతులు కలిపితే టీడీపీ ప్రభంజనం వీస్తుందని అన్నారు. ఆ ఇద్దరూ కలిస్తే టీడీపీ నెత్తిన పాలుపోసిన వారవుతారని, టీడీపీ 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపారు. ఇక జగన్‌, పవన్‌.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీ 174 సీట్లలో విజయం సాధిస్తుంది అన్నారు. ఒక్క పులివెందుల విషయంలోనే కొంచెం డౌట్‌ అని చమత్కరించారు. జగన్‌ నేతృత్వంలో ప్రతిపక్షం అనేది అర్థం కోల్పోయిందని, ఆయన మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. 'మాట్లాడితే అవినీతి ఆరోపణలు చేస్తారు. 108లో అవినీతి అన్నారు, ఐటీలో అవినీతి అన్నారు. నాపైనా అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్క కాగితమైనా చూపించగలిగారా? రుజువు చేయమని అడిగీ అడిగీ ఓపిక నశించింది’ అని చెప్పారు. కేసీఆర్ నాలుగున్నరేళ్లు ఇంట్లో గడిపి.. ఇప్పుడు బయటకు వచ్చి దిగజారిన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారంటే ఆయన నిరాశా నిస్పృహలకు గురయ్యారని అనిపిస్తోందని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే సంపద పెరిగిందని కేసీఆర్‌, హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని ఆయన కుమారుడు కేటీఆర్‌ గతంలో వ్యాఖ్యానించారన్నారు. వారే ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టి తీవ్రపదజాలంతో దూషిస్తే.. టీడీపీ చిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హుందాగా ఆ మాటల్ని తిప్పికొట్టిందని చెప్పారు. తెలంగాణలో ఉత్పాదక రంగం ఎక్కుడుందని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమైనా రాలేదన్నారు. మైక్రోమాక్స్‌ వంటి సెల్‌ఫోన్‌ సంస్థ నామమాత్రంగా ఉత్పత్తి ప్రారంభించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల విషయంలో ఏపీతో తెలంగాణకు పోటీయే లేదని.. హైదరాబాద్‌లో కూడా రోడ్లు బాగా లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడా కనపడరని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో జీవోలను కూడా పెట్టనివారు.. ఐటీ గురించి, పారదర్శక పాలన గురించి ఎలా చెప్పుకొంటారని లోకేష్ ప్రశ్నించారు.

రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదు

  తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే.తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడాన్నిసవాల్ చేస్తూ మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, న్యాయవాది శశాంక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.కేబినెట్‌ నిర్ణయంతోనే సభను రద్దు చేయడం సరికాదన్నారు.అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఎమ్మెల్యేలకు సైతం దీనిపై సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లని కొట్టివేసింది. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈనెల 31న విచారణ జరగనుంది.కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.ఈనెల 31న మరోసారి తమ వాదనలు వినిపిస్తామన్నారు.ఓటర్ లిస్ట్‌లో అధికారులు తప్పులు చేశారని, వాటిని రుజువు చేస్తామన్నారు.న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత మర్రిశశిథర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు భయపడి తాము కోర్టుకు వెళ్లామని ఓ మంత్రి అంటున్నారు.కానీ తాము తప్పులను బయటపెట్టడానికే కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆరు నెలలలోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున తాము తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది హైకోర్టుకి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాను సైతం విడుదల చేశామని, ఏమైనా అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేసే అవకాశం కల్పించడం జరిగిందని కోర్టుకు వివరించారు.దీనికి స్పందించిన హైకోర్టు ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.కాగా, ప్రభుత్వ రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేయడంతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు మార్గం సుగమం అయింది.

బాబ్లీ కేసులో బాబుకి ఊరట

  బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొంత ఊరట లభించింది.బాబు వేసిన నాన్ బెయిలబుల్ రీకాల్ వారెంట్‌కు ధర్మాబాద్ కోర్టు అనుమతినిచ్చింది.వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది.చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్‌ పిటిషన్‌‌పై కోర్టులో వాదనలు జరిగాయి.చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూత్రా, సుబ్బారావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి కావడంతో వ్యక్తిగత హాజరు సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు.గంటన్నర పాటు సాగిన వాదనల అనంతరం ఈ నెల 15వ తేదీన వ్యక్తిగత హాజరు నుంచి సీఎం చంద్రబాబుకు మినహాయింపు ఇస్తున్నట్లు ధర్మాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.అయితే నవంబర్ 3వ తేదీన హాజరు కావాలని కోర్టు సూచించగా కేసు పూర్తి అయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది. 'బాబ్లీ కేసు వ్యవహారమై మీడియాలో వివరాలు వచ్చాకే నాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్లు తెలిసింది.రాజకీయ ప్రతీకారంతోనే ఈ కేసు వేశారు.ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎటువంటి సమన్లు, కోర్టు నోటీసులు అందలేదు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవేమీ కావు.నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఉపసంహరించడానికి ఇది తగిన కేసు.ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల నేపథ్యంలో వారెంట్‌ రీకాల్‌ సమయంలో నిందితుడు న్యాయస్థానంలో హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 2018 జులై 05న జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను రీకాల్‌ చేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిటీషన్‌లో కోరారు.

అంబటి రాంబాబుకి జగన్ వార్నింగ్.. టిక్కెట్ కష్టమేనా?

  వైసీపీ అధినేత జగన్ చర్యలు ఎవరి ఊహలకు అందట్లేదు. ఓవైపు పాదయాత్రతో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు ఇన్‌ఛార్జిల్ని మార్చేపనిలో కూడా పడిపోయారు. గుంటూరులో చిలకలూరిపేటతో మొదలు పెట్టిన ఆయన.. పెదకూరపాడు,గుంటూరు-2,తాడికొండ వరకు అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ కన్ను మరో రెండు నియోజకవర్గాల మీద పడింది. త్వరలో సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా ఉన్న అంబటి రాంబాబు, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్‌ తన వద్దకు అంబటి, బ్రహ్మనాయుడులను పిలిపించుకుని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరిద్దరి పనితీరు అసలు బాగాలేదు. మీరు నియోజకవర్గంలో దూసుకుపోవడం లేదు. ఇలా ఉంటే ఎలా?.. మరో నెల రోజులు సమయం ఇస్తాను. ఈ లోపు కనుక మీలో మార్పు రాకపోతే మిమ్మలను తొలగించి వేరే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెబుతానని హెచ్చరించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. గెలిచేవారే నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట. అంబటి.. నియోజకవర్గంలో మనకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ ఉంది. కానీ నీ వల్లే పార్టీకి మైనస్‌ అవుతోంది. ఇక నీ ఇష్టం.. నువ్వు ఎంత సన్నిహితుడివి అయినా పార్టీ నష్టపోతే చూస్తూ ఊరుకోను అని జగన్‌, అంబటిని హెచ్చరించారని సత్తెనపల్లి వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బ్రహ్మనాయుడును కూడా జగన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. డబ్బు ఖర్చు పెట్టకుండా మైలేజ్‌ రావాలంటే రాదని.. బ్రహ్మనాయుడుకి జగన్‌ చెప్పారని వినుకొండలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద త్వరలో అంబటి, బ్రహ్మనాయుడులను జగన్‌ పక్కనపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి డబ్బులు బాగా పెట్టగలిగిన కొత్తవారు ఎవరైనా వస్తే వారికే జగన్‌ టిక్కెట్‌ ఇస్తారని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతోన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌, మనోహర్‌నాయుడు వంటి నాయకులనే పక్కన పెట్టిన జగన్‌ కు బ్రహ్మనాయుడు ఎంత?.. త్వరలో ఆయనపై కూడా వేటు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గెలవలేని అభ్యర్థులను, డబ్బు ఖర్చు పెట్టని వారిని వదులుకోవా లని జగన్‌ నిర్ణయించుకున్నారని.. ఈ కోవలోనే అంబటి,బ్రహ్మనాయుడులపై వేటు వేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.

ఆసుపత్రిలో మంత్రివర్గ సమావేశం

  ముఖ్య మంత్రి పరిపాలన సచివాలయం నుచి లేదా అధికారిక నివాసం నుంచి కొనసాగిస్తారు.మంత్రివర్గ సమావేశాలు కూడా సచివాలయంలోనే జరుగుతాయి.కానీ ఓ ముఖ్య మంత్రి పరిపాలనతో పాటు మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఆసుపత్రిలోనే జరుపుతున్నారు. గత కొంతకాలంగా పాన్‌క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.అంతకుముందు కూడా పారికర్‌ పలుసార్లు అమెరికా, ముంబయిలలోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అనారోగ్య సమస్య కారణంగా ఆయన తరచూ విధులకు దూరమవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలకు దిగింది. గోవాలో భాజపా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో తమకు సంఖ్యాబలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా కోరిన విషయం తెలిసిందే.ఈ విమర్శల నడుమ పారికర్‌ ఆసుపత్రి నుంచే సీఎం బాధ్యతలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఆసుపత్రిలోనే మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భాజపా వర్గాలు వెల్లడించాయి.రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు, కూటమి నేతలతో పారికర్‌ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే శాఖల మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం

వెంకయ్య కుమారుడు ఎంట్రీ.. రాంగ్ స్టెప్ వేస్తున్నారా?

  వెంకయ్య నాయుడు ప్రాసలకి పెట్టింది పేరు. జాతీయస్థాయి బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన తన స్పీచ్ లతో ఆకట్టుకునేవారు. తెలుగుగళం కేంద్రంలో వినిపించేవారు. అయితే ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వెంకయ్య నాయుడుకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆయన కుమారుడు హర్షవర్ధన్‌నాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నారట. ఇటీవల కాలంలో హర్షవర్ధన్‌ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన తన సన్నిహితుల వద్ద మోదీని పొగుడుతూ, బీజేపీని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారట. అంతేకాదు రాష్ట్రానికి బీజేపీ చాలా చేసిందని, ఇంకా చేస్తుందని.. రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్లే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని విమర్శలు చేస్తున్నారట. దీనిబట్టి చూస్తుంటే హర్షవర్ధన్‌ మనస్సు రాజకీయాలవైపు మళ్లినట్లుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని అప్పట్లో ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు పట్టుపట్టి.. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని పోరాడి కేంద్రాన్ని ఒప్పించారు. తరువాత హోదా విషయాన్ని బీజేపీ పెద్దలు పక్కకు పెట్టినా.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న 'వెంకయ్య' వేరే విధంగానైనా రాష్ట్రానికి ప్రయోజనాల చేకూరేలా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేవారు. దీంతో మోదీ కావాలనే ఆయనచే బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన బాగా సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో రాజకీయాల్లో వెంకయ్య పాత్ర దాదాపు ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు హర్షవర్దన్‌ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారట. వాస్తవానికి వెంకయ్య కుమారుడు కానీ, కుమార్తె కానీ.. రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎప్పుడూ ప్రచారం జరగలేదు. వారిలో కుమార్తె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. కుమారుడు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటారనేది తెలిసిన విషయమే. హర్షా టయోటా ఇంకా ఇతర వ్యాపారాలు చేస్తున్న ఆయన సడన్‌గా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా బీజేపీలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా మోదీని, బీజేపీని ఆయన కీర్తిస్తున్నారట. అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని కీర్తిస్తే రాష్ట్రం నుంచి నాయకుడిగా ఎలా ఎదుగుతారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు. చూద్దాం మరి అసలు హర్షవర్ధన్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో.

'ఆపరేషన్ గరుడ'..ఏపీలో ఐటీ దాడులు

  ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.కడప జిల్లాలోని ఆయన స్వగ్రామంతో పాటు హైదరాబాద్ లోని ఇళ్లు, ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఐటీ దాడులపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోదీ కక్ష గట్టారని విమర్శించారు.మొన్న బీద మస్తాన్‌రావు, నిన్న సుజనాచౌదరి, నేడు సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు చేయడం దీనిలో భాగమేనన్నారు.కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నందుకే రమేశ్‌ను లక్ష్యం చేసుకున్నారని లోకేశ్‌ ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం రమేశ్‌ దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయినా కేంద్రంలో చలనం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేయాలని దురుద్దేశంతోనే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు,పరిశ్రమలపై మోదీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా విభజన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు.  

చంద్ర బాబుపై కేసు.. విచారణ నేడే

  బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆందోళన చేశారు.బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది.తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. 40మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఐటీఐ కళాశాలలో ఉంచారు. ఆ తర్వాత బలవంతంగా విమానం ఎక్కించి చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ పంపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలందరిపై లాఠీచార్జ్ కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి.నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో ఎనిమిదేళ్ల కిందటి బాబ్లీ ప్రాజెక్టు కేసు తెరపైకి వచ్చింది.మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు 16 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం రీకాల్‌ పిటిషన్‌ వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.దీంతో చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశారు.దీనిపై నేడు విచారణ జరగనుంది.చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించనున్నారు.

కేంద్రాన్ని నిలదీస్తున్నందునే ఐటీ దాడులు

  గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు తెదేపా నేతలు విమర్శలు కూడా చేశారు.నెల్లూరు చెందిన తెదేపా నేత బీరం మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.అయితే ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది.తాజాగా తెదేపా రాజ్యసభ సభ్యుడి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు.అధికారులు ఆయన్ని బయటకు పంపి పలు ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీ లో ఉన్నారు.కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్‌ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.ఉక్కు కర్మాగారం ఏర్పాటు డిమాండ్‌తో‌ నేను దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటుపై నిలదీశాను.దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారు.కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది.సీఎం రమేశ్‌పై దాడులు జరుగుతాయని భాజపా, వైకాపా నేతలు కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వైకాపా చెప్పినట్లే భాజపా నడుచుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?వారి కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మాపై ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదు.కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు.ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.

కండువాను మార్చినంత సులభంగా పార్టీ మార్చేశారు

  తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.బీజేపీ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి యూటర్న్ తీసుకొని మళ్ళీ సొంత గూటికి చేరారు.రాజకీయాల్లోకి రావాలి అని ఆసక్తి కనబరిచిన పద్మినీ రెడ్డి మానవ అక్రమ రవాణాలో జైలుకు వెళ్లిన జగ్గారెడ్డి స్థానంలో తనకు టిక్కెట్టు వస్తుందేమోనని ఆశపడ్డారు.అయితే కాంగ్రెస్‌ మాత్రం జగ్గారెడ్డికి టిక్కెట్టు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.దీంతో, కాంగ్రెస్ లో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్న పద్మినీరెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై భాజపాలో చేరానని చెప్పారు.పద్మినిరెడ్డి చేరిక రాష్ట్ర భాజపాకు బలాన్నిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆమె అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.     పద్మినీ రెడ్డి బీజేపీలో చేరిన సమయంలో దామోదర పుల్కల్‌ మండలం శివ్వంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.భార్య పార్టీ మారిన విషయం తెలిసిన వెంటనే ఆయన ప్రచారాన్ని అక్కడితో కట్టిపెట్టి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.పద్మినీ రెడ్డి బీజేపీలో చేరినట్టు తెలుసుకున్న ఆందోల్‌ నియోజకవర్గ కార్యకర్తలందరూ సంగారెడ్డి చౌరస్తాలోని దామోదర్‌ నివాసానికి చేరుకున్నారు.ఆమెను కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకురావాలని దామోదర్‌ వద్ద పట్టుపట్టారు.పద్మినీ రెడ్డి తో మాట్లాడిన దామోదర్ కాంగ్రెస్ లోకి రాకపోతే తాను కూడా పార్టీకి రాజీనామా చేస్తానని,ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నట్లు సమాచారం.కాంగ్రెస్ లోనే సముచిత ప్రాధాన్యం లభించేలా చూస్తానని పద్మినీరెడ్డికి దామోదర్‌ భరోసా ఇవ్వడంతో ఆమె తన నిర్ణయం మార్చుకొని సొంత గూటికి చేరినట్టు తెలుస్తోంది.రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలో  విలేకరులతో ఆమె మాట్లాడుతూ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకుని తిరిగి వెనక్కు వచ్చేస్తున్నానని చెప్పారు.కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.భాజపాలో చేరిక అనుకోకుండా జరిగిందన్నారు.అనంతరం ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.దీంతో రాజకీయాల్లో ‘కండువాను మార్చినంత సులభంగా పార్టీ మార్చేశారు' అనే మాటను పద్మినీ రెడ్డి నిజం చేశారు.

ఉద్యమంలో కేసీఆర్ పనిచేశారు.. ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి?

  మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న విజయశాంతి.. ముందస్తు ఎన్నికలకు తెరలేవడం, కాంగ్రెస్ పార్టీ ఆమెని స్టార్‌ క్యాంపెయినర్‌ గా ప్రకటించడంలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమం నాటి కేసీఆర్‌ వేరు, అధికారంలో ఉన్న కేసీఆర్‌ వేరని అన్నారు. గత ఎన్నికల్లో తెరాస వైపు గాలి వీచిందని, ఉద్యమంలో ఆయన పనిచేశారు గనక ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి? ఆయన పాలన చూద్దామని ఇన్నాళ్లూ ఎదురుచూస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో దోపిడీ చేశారని విమర్శించారు. ప్రజలు ఓట్లేసింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. లోపం ఎక్కడుందని నిలదీశారు. రైతులకు చేయాల్సినంత మేలు చేయలేదు కాబట్టే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎన్ని తీసుకొచ్చినా రైతుల గుండెల్లో మాత్రం కేసీఆర్‌కు చోటులేదన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కాంగ్రెస్‌ తెచ్చినప్పటికీ దాన్ని సక్రమంగా విద్యార్థులకు చెల్లించడంలేదన్నారు. ఉద్యోగం వస్తే తమ తల్లిదండ్రులను పోషించుకుంటానని ఆశతో ఎదురుచూస్తున్న యువతకు కూడా నిరాశే ఎదురవుతోందని చెప్పారు. కేజీ టు పీజీ విద్య అని చెప్పి ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయించడం ఘోరం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కూర్చొని పాలిస్తున్నారు తప్ప ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడంలేదన్నారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు ప్రగతి భవన్‌కు వెళ్దామన్నా అనుమతించడంలేదని విమర్శించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని.. కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని విజయశాంతి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి మోసపోయారని, మళ్లీ ఆయనను గెలిపించి మోసపోవద్దని విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మేనిఫెస్టో నే పార్టీ మారటానికి కారణం

  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి  బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.గత రెండు పర్యాయాలుగా ఎన్నికలకు సన్నద్ధం అయ్యే ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సంగారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కి టికెట్ కేటాయించింది.దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న పద్మినీ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే  ఎన్నికల్లో పోటీ సాధ్యం కాదని భావించి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.బీజేపీ సంగారెడ్డి లేదా మెదక్ టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దామోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దామోదర రాజనర్సింహ సతీమణి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నచ్చకే పార్టీ మారారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.దామోదర రాజనర్సింహ రూపొందించిన మేనిఫెస్టో ఆయన కుటుంబ సభ్యులకే నచ్చలేదని, ప్రజలకేం నచ్చుతుందని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆంధ్ర నాయకుల బానిసలుగా బతుకుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ మూసేస్తామంటున్నారని, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటనా? కాంగ్రెస్‌ పార్టీ స్టాండా? స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.  

కేసీఆర్ కుటుంబం,తెలంగాణ ప్రజల మధ్య కురుక్షేత్రం

  కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలను మాటలతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నేత అరికెల నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.రూ.లక్ష రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచారని, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారని విమర్శించారు.ఆద‌ర్శంగా ఉన్న రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌న్నారు.ప‌సుపు బోర్డు, సెజ్ హామీ ఎక్క‌డ పోయిందో చెప్పాల‌న్నారు.పసుపు బోర్డు సాధిస్తామని హామీ ఇచ్చిన కవిత మాట నిలబెట్టుకోలేక పోయారన్నారు.కేసీఆర్ కుటుంబంలోని న‌లుగురు దోపిడీదారులు ఒక‌వైపు నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోవైపుగా కుర‌క్షేత్రం జరగబోతుందన్నారు.ప్ర‌గ‌తి భ‌వన్‌లో పేద ప్ర‌జ‌ల‌కు, అమ‌ర‌వీరుల కుటంబాల‌కు కూడా ప్ర‌వేశం లేకుండా నిషేధం విధించార‌ని తెలిపారు.కాంట్రాక్టర్లు, సినీనటులు, బంధువులను మాత్రమే అనుమతిస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు.టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అర్ధాంత‌రంగా అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేసిందో  ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

ఏపీలో పంచాయితీ ఎన్నికలు.. టీడీపీకి లాభమేనా?

  పంచాయితీ ఎన్నికల చర్చ మళ్ళీ తెరమీదకు వచ్చింది. పంచాయితీ సర్పంచ్‌ల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాయి. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల నియామకం చెల్లదని, మూడు నెలలోపు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే తీర్పు ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కొందరు, అసెంబ్లీ ఎన్నికల తరువాత నిర్వహించాలని మరి కొందరు చంద్రబాబును కోరగా.. ఆయన అసెంబ్లీ ఎన్నికలు తరువాత జరిపించాలని భావించి ప్రత్యేకాధికారులను నియమించారు. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలమా..? ప్రతికూలమా..?అనేది పక్కన పెడితే..ఇదే తీర్పు ఏపీకి వర్తింప చేస్తే టీడీపీకి అనుకూలం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీకి కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా గ్రామస్థాయి నుండి అన్ని వర్గాల వారిలో సానుకూలం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతూ సామాన్యుడికి మరింత దగ్గరైంది. ఇలాంటి సమయంలో పంచాయితీ ఎన్నికలు జరిగితే టీడీపీకి ఖచ్చితంగా కలిసొస్తుంది. కానీ, ఎక్కడ తమ నెత్తిన ఆర్థిక భారం పడుతుందోనన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక పథకం ప్రకారం పంచాయితీ ఎన్నికలు జరగకుండా చంద్రబాబును తప్పుదోవపట్టించారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అదే తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని హైకోర్టు చెప్పవచ్చు. ఇదే జరిగితే పంచాయితీ ఎన్నికలకు సీఎం చంద్రబాబు ఒప్పుకోక తప్పదు.

హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుంది

  కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు అందోల్ టికెట్ ఇవ్వకపోవటంతో బాబు మోహన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.టీఆర్ఎస్ అందోల్ టికెట్ ను స్థానిక నేత క్రాంతి కిరణ్ కి కేటాయించింది.సంగారెడ్డిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన బాబు మోహన్ టీఆర్ఎస్ పార్టీ అందోల్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టిక్కెట్‌ కేటాయించి కేసీఆర్‌ తనను మోసం చేశారని కన్నీరు మున్నీరయ్యారు.సంగారెడ్డిలో భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనను కాదని స్థానికుడి పేరుతో వేరొకరికి టిక్కెట్‌ కేటాయించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.తాను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్‌ వల్లేనని,ఆయన్ని గాడ్‌ఫాదర్‌గా భావిస్తానన్నారు.అలాంటి వ్యక్తి తనను నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో ఏ రాయి ఎటునుంచి వచ్చినా హరీష్‌‌రావుకే తగులుతుందన్నారు.హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుందని చెప్పుకొచ్చారు.కాబోయే సీఎం మాత్రం కేటీఆరేనని వివరించారు.అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓ బ్రోకర్‌ అంటూ బాబుమోహన్ మండిపడ్డారు.టిక్కెట్‌ కోసం ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌ చుట్టూ తిరగలేదన్నారు.తన సేవలను గుర్తించిన భాజపా పార్టీలోకి ఆహ్వానించిందని అందుకే ఆ పార్టీలో చేరానన్నారు.భాజపా నుంచి ఆంధోల్‌లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.బీసీ,ఎస్సీలకు కేసీఆర్ ఏంలాభం చేశారని ప్రశ్నించారు.బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని,దళితున్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

భర్త కాంగ్రెస్..భార్య బీజేపీ..కారణం అదేనా?

  ఎన్నికల వేళ నాయకులు పార్టీ మారటం సర్వసాధారణం.కానీ భర్త కాంగ్రెస్ పార్టీ లో ఉంటే భార్య బీజేపీ లో చేరటం ఆశ్చర్యం కలిగించే విషయమే.కాంగ్రెస్ హయాంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు.హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న తరుణంలో ఆయన సతీమణి బీజేపీలో ఎందుకు చేరిందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీ మారినట్లు సమాచారం.దామోదర రాజనర్సింహకు ఆంధోల్ టికెట్ కేటాయించడంతో రాజకీయాల్లోకి రావాలి అనుకున్నపద్మినీ రెడ్డికి సంగారెడ్డి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది.సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డి కి కట్టబెట్టడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.సంగారెడ్డి లేదా మెదక్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉండటంతో పార్టీలో చేరినట్లు సమాచారం.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి 'ఎన్టీఆర్'

  బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్.తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారనే చెప్పుకోవాలి.రెండు భాగాలుగా వస్తున్నఈ చిత్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై చిత్రీకరణ జరుగుతుంది.షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఇటీవల తెలంగాణాలో ఎన్నికలుండటంతో ఖమ్మం జిల్లాలో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు.ప్రచారానికి మంచి స్పందన రావడంతో మరికొన్ని ప్రాంతాల్లో బాలయ్యతో ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చిన టి.టీడీపీ నేతలు.హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో ఉన్న బాలయ్యతో టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి భేటీఅయ్యారు.దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్‌ పార్టీ పెట్టే సీన్‌ని చిత్రీకరిస్తుండగా ఈ నేతలు వెళ్లడంతో వారంతా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.బాలయ్యతో దాదాపు గంట పాటు చర్చలు జరిపిన నేతలు ప్రచారానికి మరింత సమయం ఇవ్వాలని కోరారు.తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వీలు కాకపోతే కనీసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రచారానికి రమ్మని కోరిన టీటీడీపీ నేతల ప్రతిపాదన పట్ల బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

ఏపీ లో కాంగ్రెస్ కి షాక్

  కాంగ్రెస్ సీనియర్ నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు.తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో మనోహర్ జనసేన పార్టీలో చేరనున్నారు.కొన్నాళ్లుగా టీడీపీ,వైసీపీ లో చేరతాడు అన్న వదంతులను ఖండిస్తూ వచ్చిన మనోహర్ చివరికి జనసేనలో చేరుతున్నారు.ఏఐసిసి పదవుల విషయంలో మనోహర్ పట్ల నిర్లక్ష్యం చూపటమే పార్టీ మారటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.రాహుల్ గాంధీ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మనోహర్ ఏఐసిసి సభ్యునిగా అవకాశం ఇస్తారని,జాతీయ రాజకీయాల్లో ద్రుష్టి పెడదామనుకున్న నేపథ్యంలో పదవి ఇవ్వకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అయితే మనోహర్ మాత్రం పార్టీ మారటానికి గల కారణాన్ని మాత్రం వ్యక్త పరచలేదు.కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.

తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

  తెలంగాణలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపకుండా తెరాస ప్రభుత్వం పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది.ఆగస్టు 1వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించటాన్ని సవాలు చేస్తూ వెంకటేష్ అనే న్యాయవాది హైకోర్టు ను ఆశ్రయించారు.ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ మూడు నెలల వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను పాలన ఉంటుందని తెలిపింది.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరని, వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదని హైకోర్టు అభిప్రాయపడింది.అనంతరం ఎన్నికల నిర్వాహణకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై న్యాయస్థానం తప్పుబట్టింది.