మావోల దిగ్బంధానికి పోలీసుల వ్యూహం
posted on Oct 8, 2018 9:28AM
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు అనటానికి అరకు ఘటనే ఉదాహరణ.పోలీసులు కూడా ఆ ఘటనతో అప్రమత్తయ్యారు.మావోల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఈ నేపధ్యం లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొరాపూట్ జిల్లా చిక్కల్‌ములి అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో డిస్ట్రిక్ట్ వలంటరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఉమ్మడిగా గాలింపు నిర్వహించాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో 15 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన భద్రత బలగాలు వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 20 నిమిషాలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం భద్రత బలగాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి భారీడంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కిట్‌బ్యాగ్‌లు, ఐఈడీలు లభించినట్లు సమాచారం.
ఈ ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే, చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్ వెంకటరవి చైతన్యలు ఈ ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారని సమాచారం. వారు కాల్పుల్లో గాయపడి ఉండొచ్చని ఒడిశాలోని కొరాపూట్ ఎస్పీ కన్వర్ బిశ్వాళసింగ్ అనుమానం వ్యక్తం చేశారు.తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కువ దూరం వెళ్లేందుకు అవకాశం లేదని భావిస్తున్న భద్రత బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఏపీ, ఒడిశా పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు. మావోల దిగ్బంధానికి ఏపీ, ఒడిశా పోలీసుల వ్యూహం పన్నుతున్నారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన దళ సభ్యులు వీరే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.