ముచ్చటగా మూడోసారి.. భట్టి వర్సెస్ కమలరాజు
posted on Oct 8, 2018 @ 11:28AM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7 వ తేదీన అని ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అంటూ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడడంతో తెరాస వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగనుంది. ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. దీంతో ఖమ్మంలో మహాకూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందునా మధిర నియోజకవర్గం మీద ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. దానికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క.. భట్టి రెండు పర్యాయాలుగా మధిరకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అసలే కేసీఆర్ కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిల్లో మధిర కూడా ఒకటనే టాక్ ఉంది. అలాంటి మధిరలో భట్టికి పోటీగా తెరాస అభ్యర్థిగా కమలరాజుని బరిలోకి దింపారు. అయితే కమలరాజు ఇప్పటికే భట్టి మీద రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2009లో మహాకూటమి నుంచి టీడీపీ, సీపీఐ, తెరాస మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు. భట్టి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు. భట్టిపై తలపడి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ భట్టికి ప్రధాన ప్రత్యర్థిగా, తెరాస పార్టీ అభ్యర్థిగా కమలరాజు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈసారి కమలరాజు విజయం సాధించి చరిత్ర తిరగరాస్తారా? లేక ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోయి భట్టికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారో చూడాలి.