పాత మిత్రుల అండతో సిన్హా సక్సెస్ అవుతారా?
చివరాఖరుకు ఉత్కంఠకు తెర తొలిగింది. అధికార బీజేపీ / ఎన్డీఎ కూటమి, ప్రతిపక్ష పార్టీల కూటమి ఒకే రోజు, కొద్ది గంటల తేడాతో రాష్టపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల పేర్లను ప్రకటించాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా గానే ఎన్డీయే తరఫున ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్ము పోటీ చేస్తారని, బీజేపే జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా ప్రకటించారు. ఎన్డీఎ తమ అభ్యర్ధిని ప్రకటించడానికి ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా పేరును, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద పవార్ ప్రకటించారు.
ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ ఇలా అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినా, ఆ ముగ్గురూ పోటీకి సుముఖంగా లేక పోవడంతో, చివరకు యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. పవార్, అబ్దుల్లా, గాంధీ పోటీకి అంగీకరించక పోవడానికి, ఎవరి కుండే కారణాలు వారికి ఉన్నా, ఆవగింజలో అరవయ్యోవంతు అయినా, గెలిచే ఛాన్స్ లేక పోవడం వల్లనే, ఆ ముగ్గురూ పోటీకి విముఖత చూపారనే ప్రచారం బలంగా సాగింది. నిజానికి, అందులో కొంత నిజముంది.
బీజేపీ సారథ్యంలోని అధికార కూటమికి తమ అభ్యర్ధి ఎవరైనా గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలముంది.
రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజీలో హాఫ్ వే మార్కు అరంగుళం దూరంలో ఎన్డీయే వోట్ షేర్ వుంది. ఎన్డీఎకు మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్న వైసీపీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీల బలాన్ని కలుపు కుంటే ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు నల్లేరు మీద నడకే, అవుతుంది. అందుకే ప్రతిపక్ష కూటమికి పెద్ద దిక్కుగా నిలిచిన శరద్ పవార్ కూడా సున్నితంగా నో అని పోటీకి దూరంగా ఉండి పోయారు. అలా చూసినప్పుడు యశ్వంత్ సిన్హా సాహసం చేసారనే చెప్ప వచ్చును. ఒక విధంగా ఆయన, ఈ వయసులో (85) అయన తమ వ్యక్తిగత ప్రతిష్టను పక్కన పెట్టి రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ద్వారా ప్రతిపక్షాల గౌరవాన్ని కాపాడారు.
అయితే, ఇప్పడు యశ్వంత్ సిన్హా బరిలో దిగడం వలన లెక్కలు మారి పోతాయా? ఎన్డీఏ బలం తగ్గి పోతుందా ? ద్రౌపదీ ముర్మూ విజయావకాశాలు మారి పోతాయా అంటే, అలాంటిది ఏమీ ఉండక పోవచ్చును. అయినా, ఇంతవరకు కొంత నిరాసక్తంగా, స్తబ్దుగా, చప్పగా అనిపించి రాష్టపతి ఎన్నిక రాజకీయం ఇప్పుడు కొంత వేడెక్కే అవకాశం అయితే ఉందని రాజకీయ వర్గాలో వినవస్తోంది. ప్రధానంగా బీజేపీలో ఆయనకు ఉన్న సంబంధాల ప్రభావంపై కొంత చర్చ జరుగుతోంది.
సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో ఉన్న యశ్వంత్ సిన్హా, ఆ పార్టీ ఓట్లను ఎంతో మేరకు అయినా తమ వైపుకు తిప్పుకో గలరా? బీజీపే సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీతో ఉన్న సన్నిహిత సంబంధాలు యశ్వంత్ సిన్హాకు మేలు చేస్తాయా? అదే విధంగా, ప్రస్తుతం ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న, ఒకప్పుడు అద్వానీ సన్నిహితునిగా ఉన్న సురేంద్ర కులకర్ణి బీజేపీ ఓటుకు గండి కొడతారా? అలాగే, బీజీపేలో తమ కున్న ఇతర పాత పరిచయాలను ఉపయోగించుకుని యశ్వంత్ సిన్హా, టేబుల్స్ తిరగేస్తారా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం ఇవ్వడం కష్టమని కొందరంటే, అక్కడున్నది మోడీ, షా జోడీ అని, క్రాస్ వోటింగ్’ కు నో ఛాన్స్ అని ఇంకొందరు అభిప్రాయ పడుతున్నారు.
అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హాకు, ఆ తరం సీనియర్ నాయకులతో కొంత సన్నిహిత సంబంధాలున్న మాట నిజం. మోడీ, షా జోడీ తెర మీదకు వచ్చిన తర్వాతనే ఆయన పార్టీకి దూరమవుతూ వచ్చారు. అయినా, ఆయన కుమారుడు జయంత్ సిన్హా మోడీ మంత్రివర్గంలోనూ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా, ఆర్ధిక మంత్రిత్వ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే యశ్వంత్ సిన్హా, కొడుకు కొడుకే రాజకీయం రాజకీయమే అంటున్నారు.
అదలా ఉంటే, యశ్వంత్ సిన్హా అభ్యర్ధి కావడం వలన ప్రతి పక్షాలకు పెద్దగా కలిసోచ్చేది ఉండదని, కానీ, నూటికి రెండు వందల శాతం ఓటమి తధ్యం అని తెలిసి కూడా సిన్హా బరిలో దిగడం వలన ప్రతిపక్షల గౌరవం కొంత కాపాడారని అనుకోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అయితే, అటు నుంచి ఇటుకు క్రాస్ ఓటింగ్ జరిగినా జరగక పోయినా ఇటు ప్రతిపక్షం నుంచి అధికార కూటమి వైపుకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కొట్టివేయలేమని అంటున్నారు. ముఖ్యంగా, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో, నిన్న మొన్నటి మహారాష్త్ర శాసన సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకున్నా, మహారాష్ట్రలో జరుగతున పరిణామాలను గమనించినా, విపక్షాలు తమ వోటును ఎంత వరకు కాపాడుకో గలవు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి, క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించ వలసిన అవసరం బీజేపీకి లేదు, ద్రౌపదీ ముర్మూపేరు ప్రకటించగానే, బిజూ జనతాదళ్ ఆమెకు మద్దతు ప్రకటించింది.
దీంతో ఎన్డీఎ బలం 58 శాతానికి చేరింది. వైసీపీ, ఎటూ బీజేపీ స్వయంగా వద్దన్నా ఎన్డీఎకే ఓటు వేస్తుంది. సో .. ఇప్పటికే ఎన్డీఎ ఓటు 60 పర్సెంట్ క్రాస్ అయిందని అనుకోవచ్చును. ఇక మహారాష్ట్ర పరిణామాల నేపద్యంలో ఇంకొంత బలం యాడ్ అయింది . కాబట్టి, బీజేపీ ఇంకా క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. అయితే, ఇప్పడున్న బీజీపే నాయకత్వం, ఒక్క ఓటు తేడాతో ప్రభుతాన్ని త్యాగం చసిన అటల్జీ, అద్వానీజీల నాయకత్వం కాదు, చైనా పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తున్న మోడీ , షా నాయకత్వం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తమ ఓటును ఏ మేరకు కాపడుకోగలవు? ఇదే ఇప్పడు ప్రతిపక్ష ముందున్న ప్రధాన సవాలుగా భావించవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.