పోలీసులా.. వైసీపీ కార్య‌క‌ర్త‌లా? .. చంద్రబాబు

అధికారంలోకి రాగానే ఏదో శ‌క్తి ఆవ‌హిస్తుందేమో చాలామంది చాలా అతిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కొంద‌రు మ‌రీ దారుణంగానూ వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ దారుణానికి అడ్డూ ఆపూ లేకుండానూ పోతుంది.  ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సి.ఎం జ‌గ‌న్ పాల‌నలో ఇది అడుగ‌డుగునా  బయ‌ట‌ప‌డుతోంది.  ఎవ‌రు రోడ్డెక్కి ప్రభుత్వ వ్య‌తిరేత‌ను చాటినా, నినాదాల‌తో హోరెత్తినా భ‌రించ‌లేక‌పోతున్నారు పాల‌కులు. ఎవ‌రు ధ‌ర్నా చేస్తున్నా,  భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నా వెంట‌నే పోలీసులు పెద్ద సంఖ్య‌లో విరుచుకుప‌డ‌టం చూస్తు న్నాం. పోలీసుల దౌర్జ‌న్యాలు మితిమీరిపోతున్నాయ‌ని తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌ను అడ్డుకోవ‌డానికి వ‌చ్చిన చిత్తూరు మాజీ మేయ‌ర్ క‌ఠారి హేమ‌ల‌త మీద‌కి పోలీసు జీపు ఎక్కించ‌డం కంటే దారుణం మ‌రోటి వుండ‌ద‌న్నారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యం? ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారు? ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అస‌లు పోలీసుల్లా కాకుండా వైసీపీ కార్య క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.  రాష్ట్రంలో ఈ ర‌క‌మైన పోలీసుల దారుణ వైఖ‌రి ఈమ‌ధ్య కాలంలో  పెచ్చుమీరుతోంద‌ని చంద్ర‌బాబు ట్విట‌ర్ లో ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల్లా మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదని అన్నారు.  జగన్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చ ర్యంగా ఉంది. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్ట డంలో అర్థం ఏమిటి? నేరస్తులను కాపాడుతున్నారా?  పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమ‌న్నారు.  వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదు. పార్టీ తరపున న్యాయపోరా టం చేస్తాం. రేపు మేము అధికారంలోకి వచ్చాక  గాడితప్పిన  ప్రతి  అధికారి పై చర్యలు తీసుకుంటామ న్నారు. 

హెర్డ్ బాపూ బొమ్మే కాదు.. గ్రీకు శిల్పం!

అందం అంటే కోటేరులాంటి ముక్కు,  కోల క‌ళ్లు,  దొండ‌ పండు లాంటి పెదాల‌తో ఆక‌ట్టునేదే అస‌లు సిస‌ల అందం. అలాగ‌ని క‌వులు, సినీ క‌వులు ప‌ద్యాలు, పాట‌ల్లో చెప్పి, వినిపించి మ‌న‌సులో ఇంకేట్టు చేసేరు. అప్పుడు, ఇప్పుడు, ఇక ముందూ యువ‌త అదే సూత్రాన్ని అమ్మాయిలను చూడ్డంలో లెక్క‌లేసుకుంటారు.  అమ్మాయి అన‌గానే బాపు బొమ్మ అనే గొప్ప సూత్రం చాలా కాలం నుంచి తెలుగు నాట సుప్ర‌సిద్ధం. కానీ ఇంగ్లీషువారి లెక్క వేరే వుంద‌ట‌! అందంతో ఆక‌ట్టుకోవ‌డం, హుందాగా ఆక‌ర్షించ‌డం విషయంలో ఈ మ‌ధ్య  లోకంలో చాలా మంది  సందిగ్ధ‌త‌కే  గుర‌వుతు న్నారు. నిజానికి ప‌ర్‌ఫెక్ట్‌నెస్ అంటూ మ‌నిషిని నిర్ధారించే సూత్రాలు అర్ధం లేనివ‌నే వాద‌నా వుంది. మ‌నిషి చ‌క్క‌గా క‌న‌ప‌డ‌టం మీద అర్ధాలు చాలామంది చాలా ర‌కాలుగా చెబుతుంటారు. మ‌నిషిలో స‌హ‌జ అందం అంటూ  ఒక‌టి వుంటుంది. దాన్నే లెక్క‌లోకి తీసుకోవాల‌నే వారి వాద‌న‌కూ బ‌లం వుంది. ఈ  రోజుల్లో అందం మీద చాలా అస‌క్తి  క‌న‌ప‌రుస్తున్నారు. యువ‌త మీద  సినీ న‌టుల ప్ర‌భావం చాలా ఎక్కువగా ఉంది.  ఎలాగూ సినీన‌టుల గురించిన మాట వ‌చ్చింది గ‌నుక  హాలీవుడ్ న‌టుడు జానీ డెప్‌, అత‌ని భార్య ఆంబ‌ర్ హెర్డ్ మ‌ధ్య ఇటీవ‌ల  ఆమె అందం విష‌యంలో వివాదం త‌లెత్తింది.  ఈ వివాదంతో అస‌లు అందానికి ప్రాచీన గ్రీకు గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ల  ఫార్ములా అంటూ ఒక‌టి వుంద‌న్న సంగ‌తి ఇప్ప‌టి వారికి  స్ప‌ష్ట‌మ‌యింది. పాత సినిమాలు చూసినా,  ప్రాచీన నాగ‌రిక‌త‌కు చెందిన‌వారిని గురించి విన్న‌పుడు గ్రీకుల కంటే అంద‌మయిన‌వారు  లోకంలో వుండ‌రన్న భావ‌న  ఇప్ప‌టికీ వుంది. ఇపుడు  ఆనాటి  లెక్క‌ల విషయం ఎందుకు వ‌చ్చింది?  హెర్డ్‌, డెప్ ల మ‌ధ్య అందం విష‌యంలో వ‌చ్చిన గొడ‌వ కోర్టు  దాకా వెళ్లింది. డెప్ త‌న‌ను అవ‌మానించినందుకు హెర్డ్ అత‌ని మీద ఏకంగా 15 మిలియ‌న్ డాల‌ర్ల  ప‌రువు న‌ష్టం దావా వేసింది! ఇది చాలా చిత్రంగా వుంద‌నుకున్నారు చాలామంది. అస‌లు నిలిచే  కేసే కాద‌న్నారు. పైగా డెప్ కి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఆమె కెరీర్ దెబ్బ‌తిన్న‌ద‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత గోల జ‌రుగుతుంటే, మ‌రోవంక  అమెరికా న‌టి  36 ఏళ్ల హెర్డ్ ముఖం ప్రాచీన గ్రీకు గ‌ణిత శాస్త్ర‌వేత్త‌లు చెప్పి న  గోల్డెన్ రేషియో సూత్రం ప్ర‌కారం చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా వుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. మ‌నిషి ముఖంలో క‌ళ్లు, ముక్కు ఏ లెక్క‌లో స‌రిగా వుండాల‌న్న‌ది తెలియ‌జేసేది గోల్డెన్ రేషియో ట‌!  బ్రిటిష్ కాస్మాటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ జూలియ‌న్ డి సిల్వా ఏమ‌న్నారంటే.. అమెరికా న‌టి హెర్డ్ ముఖం గోల్డెన్ రేషియోలో చెప్పిన‌దానికి  దాదాపు 91.85 శాతం ద‌గ్గ‌ర‌గా వుంది. అదీ ఏదో చ‌క్క‌గా, అందంగా క‌న‌ప‌డుతోం ద‌ని కాదు ఏకంగా అందుకు డిజిట‌ల్ ఫేషియ‌ల్ మ్యాపింగ్ సాంకేతికత‌ను ఉప‌యోగించి తేల్చార‌ట‌.  ముఖ్యంగా మ‌నిషి క‌ళ్లు ఎంత చ‌క్క‌గా వున్న‌దీ తేల్చిచెబుతుంది ఈ టెక్నాల‌జీ. దీన్నే పూర్వం  గ్రీక్ అక్ష‌రం  ఫి తో సూచించేవార‌ట‌! 2016లోనే  హెర్డ్ ముఖానిని  ఈ సాంకేతిక‌త‌తో  కొలిచిన‌ట్టు  డాక్ట‌ర్ సిల్వా తెలిసారు. అంటే క‌ళ్లు, ముక్కు, పెదాలు, చుబుకం మ‌ధ్య వుండాల్సిన దూరాన్ని కొలిచి చూశార‌ట‌. మొత్తం మీద ఆ కొల‌త‌ల ఫ‌లితాలు గోల్డెన్ రేషియో సూత్రానికి  92 శాతం ద‌గ్గ‌ర‌లో వున్నందున ఆమె నిజంగానే అంద‌గ‌త్తె కింద ప్ర‌క‌టించారు.  ఇలా ఖ‌చ్చిత‌మైన లెక్క‌గా అవ‌య‌వాలు  క‌లిగి వున్న మ‌హిళ‌గా  ప్ర‌పం చంలో కెల్లా అంద‌మయిన మ‌హిళ‌గానూ హెర్డ్ కితాబు  అందుకుంది. 

కలహం దిశగా కేసీఆర్, జగన్ స్నేహం

ఒకే కుటుంబంలా వున్న‌వారు విడిపోయారు. అందుకు కార‌ణాలు,  ల‌క్ష్యాలు ఏమ‌యినా  అలా జ‌రిగిపోయింది.  అయినా స‌హాయ‌స‌హ‌కాలు అందిపుచ్చుకుంటూ క‌ల‌కాలం స్నేహ‌భావంతోనే వుండాల‌ని అనుకున్నారు. తొలినాళ్ల‌లో కాస్తంత ఆలాగే సాగింది. క్ర‌మేపీ ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు కేసుల గుదిబండ చుట్టి కోర్టులు, కేంద్ర చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయిస్తున్నారు. మ‌రో వంక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప టికే అభివృద్ధి ప‌థంలో వున్నాం గ‌నుక ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌న్న ధీమాతో వున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ తానొక‌టి త‌లిస్తే కేంద్రం ఒక‌టి త‌ల‌చింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు  అన్యాయంగా పాల‌న అందిస్తున్నాయ‌ని, త‌మ స‌హకారాన్ని చుల‌క‌న‌గా చూస్తున్నాయ‌న్న క‌క్ష‌తో రెండు రాష్ట్రాల్లోనూ రాజ్య‌ధికారం చేజిక్కించుకోవాల‌ని అన్నింటా అడ్డుప‌డుతూ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ వేడిలో అన్న ద‌మ్మ‌ల్లాంటి తెలుగు ప్ర‌జ‌లు, నాయ‌కుల మ‌ధ్య వైరం పెరిగింది. దీనికి తోడు తాజాగా కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వానికి  మ‌ద్ద‌తునివ్వాల్సిన  ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌, అంత అవ‌స‌ర‌మే లేద‌న్న ధీమాతో కేసీఆర్  చెరో  వేపు విడిపోయారు.  కేసులు, ఇ.డి. త‌ల‌నొప్పుల భ‌యంతో జ‌గ‌న్ మోదీ స‌ర్కారు ఎదుట సాగిల‌ప‌డ‌డం త‌ప్ప రాష్ట్రానికి  ఈ మూడేళ్ల‌లో  ప్ర‌త్యేకించి వొర‌గ‌బెట్టిందేమీ లేదు. రాను రాను ఈ  ర‌హ‌స్యం ఆంధ్రాలో సామాన్యుల‌కీ తెలిసి పోయింది. అన్నీ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన వాగ్దానాలేవీ చేసి చూప‌లేని  స్థితికి దిగ‌జారాడ‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. కానీ అటువేపు ప్ర‌జ‌ల విశ్వాసం కాస్తంత స‌డ‌లినా కేంద్రం నుంచి పూచిక‌పుల్ల సాయం అంద‌లేద‌ని, పైగా ద‌బాయింపులు ఎక్కువ‌య్యాయ‌ని  రివ‌ర్స్ గేర్‌లో కేసీఆర్  త‌న మంత్రుల‌తో, ఎమ్మెల్యేల‌తో మోదీ స‌ర్కార్ మీద తిట్ల దండ‌కం దాదాపు రోజూ వినిపిస్తున్నారు. కేంద్రం త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ప‌ర్య‌ట‌న‌లు చేయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితుల మీద పాల‌నా లోపాల మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సిగ్గెగ్గులేల నాకు  అంటూ జ‌గ‌న్  బిజెపీ తిట్ల‌ను, విమ‌ర్శల‌ను దులిపేసుకుంటూ త‌న‌కు ప‌దవే ముఖ్యం..  తిట్లు ఓ లెక్కా అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ప‌రిస్థితులు జారిపోతున్నాయ‌న్న సంగ‌తి ప్ర‌జ‌ల‌కు తెలుస్తోంది. జ‌గ‌న్ వ‌ల్ల జ‌రిగేదేమీ లేద‌ని స్ప‌ష్ట‌మయింది.  ఇటు తెలంగాణాలోనూ బిజెపి నాయ‌కులు కేసీఆర్ ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల విసుర్లు విసురుతున్నారేగాని అందుకు కేటీఆర్ దీట‌యిన స‌మాధానాలు ఇస్తూ భ‌యంతో వొణుకుతున్న‌వారి ద‌గ్గ‌ర కెళ్లి ఈ తాటాకు శ‌బ్దాలు చేయ మ‌ని బిజెపి వ‌ర్గీయులకే సూచ‌న‌లు చేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వేళయింది. జ‌గ‌న్‌  త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధి ద్రౌప‌ది మూర్మికే త‌మ మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు. ఇది వీరికి త‌ప్పని స్థితి. కానీ  ఒక మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌న్న అభిప్రాయంలో వున్న‌ప్ప‌టికీ  కేసీఆర్ మాత్రం విప‌క్ష‌ కూట‌మి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిం చారు. ఇలా రాష్ట్రపతి పదవికి త్వరలో జరగనున్న ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలమధ్య రాజకీయంగా చిచ్చు రేపేటట్లు కనిపిస్తోంది.  రెండు రాష్ట్రాల మధ్య రోడ్డున పడాల్సినంత సమస్యలు ఏమీ ఇప్పటి వరకు పెద్దగా ఎదురు కాలేదు. కానీ జులై18న  జ‌రిగే  ఎన్నిక జ‌గ‌న్‌, కేసీఆర్ ల మ‌ధ్య  ముఖ్య మంత్రుల స్థాయిలో విభేదాలు సృష్టిస్తాయేమో అన్న అనుమానాన్ని పరిశీల కులు వ్యక్తపరుస్తున్నారు.  ఎందుకంటే ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ప్రధాని బాటలో నడుస్తుంటే. తెలం గాణా ముఖ్యమంత్రి  దేశంలోని  ప్రతిపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ అగ్రనేత యశ్వంతిన్హా కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  రాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతూ బరిలో దిగిన య‌శ్వంత్  నేటి రాజకీయాలలో ఎవరితో పోల్చుకున్నా ఆయన కొండ గుట్టల మధ్య శిఖరసమానుడు. ఆయనను తెలంగాణ ముఖ్య మంత్రి  కేసీఆర్ సమర్ధిస్తున్నారు.   తెలంగాణ నేతలు అప్పుడ ప్పుడూ, అక్కడక్కడా జగన్ పైనా, జగన్ ప్రభుత్వం పైనా నోళ్ళు పారేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల కేటీఆర్ కూడా ఆంధ్రాలోని రోడ్ల దుస్థితిని గురించి ఘాటు గానే విమర్శించారు. ఆ తరువాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ సదస్సులో జగన్ - కేటీఆర్ లిద్దరూ కౌగిలించుకుని మరీ ఫోటోలు దిగి తమ  సఖ్యతను ప్రదర్శించుకు న్నారు. ఇప్పుడు  మళ్ళీ తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి  ఒక  సభలో మాట్లాడుతూ ‘ఆంధ్రలో జగన్మోహన్రెడ్డి ఉన్నడు.. వాడు అడుక్కుతింటాన్డు. మనల్ని అన్నరు తెలంగాణ వస్తే మీరు అడుక్కుతింటరు అని... ఇప్పుడు ఆంధ్రోళ్ళు బిచ్చమె త్తుకుంటున్నరు, రోజు నడవాలంటే కేంద్రం నుండి లోన్ రావాల వాళ్లకు, లేదంటే నడవదారాష్ట్రం'... అంటూ ఘాటైనమాటలతో బహిరంగంగా తూల నాడడం, కేసీర్ మైండ్ సెట్‌ని తెలియ‌జేస్తున్నద‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. కేసీఆర్ - కేటీఆర్లకు ముందస్తు సమాచారం లేకుండా తెరాస రాజకీయాలలో ఓ అనామకుడు  ఆంధ్రా ముఖ్యమంత్రిని 'వాడు... వీడు....' అని సంబోధించే స్థాయికి వెళ్ళగలడా అన్నది కూడా పరిశీలకుల అనుమానం. ఈ అనుమానంలో ఏమాత్రం నిజం ఉన్నా రెండు రాష్ట్రాల నేతలు, ప్రజల మధ్య పెద్ద  అపార్ధాలకు, అన ర్ధాలకు దారితీసే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 30 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో సంఖ్యాపరంగా ఆంధ్రా ప్రజలు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య వారధులుగా ఉన్న వారి మనోభావాలు గాయపడకుండా చూసుకోవలసిన బాధ్యత తెలం గాణ నేతలు, ప్రభుత్వంపై  ఉందనడంలో సందేహం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని  తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.  మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న తెలుగువాళ్ళు కాపురాలు వేరైనా కలహాలులేకుండా ఉండాలన్నది అందరి ఆశ, ఆకాంక్ష. 

మళ్ళీ వస్తా.. మాట్లాడు కుందాం.. నల్లారి రీ ఎంట్రీ సంకేతం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజన అనంతరం రాజకీయంగా తెరమరుగై పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.2014 అసెంబ్లీ ఎన్నికలలో, చెప్పు గుర్తు, సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదంతో, రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, సమైక్యాంధ్ర నినాదం ఇచ్చి ఏమి ప్రయోజనమని ప్రజలు, ఆయన గుర్తుతోనే ఆయనకు   సమాధాన మిచ్చారు. రాజీనామా చేయవలసిన సమయంలో ముఖ్యమంత్రి పదవి పట్టుకు వేళ్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు  రాష్ట్ర విభజన  జరిగిపోయిన తర్వాత  బయటకు రావడాన్ని  జనం జీర్ణించుకోలేక పోయారు. అందుకే  ఆయన్ని పట్టిచుకోలేదు. ఆ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఘోరంగా ఓడి పోయారు.ఇక అక్కడ నుంచి  ఆయన రాజకీయాలకు దూరంగా దాదాసే అజ్ఞాతవాసంలోకి వెళ్లి పోయారు.  ఈ ఎనిమిదేళ్ళ కాలంలో  అప్పుడో సారి .. ఇప్పుడో సారి ఒకరి రెండు సందర్భాలలో ఆయన పేరు రాజకీయ చర్చల్లో వినిపించినా, ఆయన మాత్రం ఎక్కడా క్రియాశీలంగా కనిపించలేదు. అయిన బీజేపీలో చేరుతున్నారని లేదు ఇంకేదో పార్టీలో చేరుతున్నారని రాజకీయ చర్చలో వినిపించినా, అలాంటిదేమీ జరగలేదు. అందుకే ఆయన రాజకీయ జీవితానికి తెర పడినట్లేనని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. మధ్యలో 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు, అయినా ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిపించి పీసీసీ బాధ్యతలు చేపట్టమని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీ వచ్చిన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దీంతో, ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారనీ, సోనియా గాంధీ ఆయనకు కీలక బాధ్యతలు ఆఫర్ చేశారనే చర్చ మొదలైంది.  అదలా ఉంటే తాజాగా, ఆయన సొంత జిల్లా అన్నమయ్య ( చిత్తూరు) జిల్లాకు రావడంతో మళ్ళీ మరోమారు, నల్లారి వార్తల్లో కనిపించారు. నిజానికి ఆయన తమ స్వగ్రామం నగరిపల్లెలో కొన్న  భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారే కానీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు వెళ్ళలేదు. భూమి కొనుగోలువ్యవహారం కాబట్టే, ఆయన వెంట కుమారుడు, నిఖిలేశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, ఈసందర్భంగా ఆయనకు ఏపీసీసీ కార్యదర్శి అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ నేత శ్రీవర్ధన్, పలువురు నేతలు, కార్యకర్తలు అభిమానులు  స్వాగతం పలికారు. అయన వారిని పలరించారు. ఇవన్నీ సహజంగా, ఏ నాయకుడు, (మాజీ అయినా) జరిగే తంతే, అందులోనూ  మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. నల్లారి విషయంలోనూ అదే జరిగింది. అయితే,  ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో, ‘త్వరలోనే మళ్లీ వస్తా.. అందరినీ కలుస్తా.. ఇకపై అందుబాటులోనే ఉంటా.. అప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుందాం..’అంటూ ఆయన పలికిన వీడ్కోలు పలుకులు, రాజకీయ వర్గాల్లో ఉహాగానాలకు తెర తీశాయి. ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తుందని, అందుకే ఆయన మళ్ళీ వస్తా .. మాట్లాడుకుందాం  అన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే  నిజంగా, అయన రీ ఎంట్రీ ఇస్తారా ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తారా? బతికించ గలరా? అంటే, ఆయన రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఎలా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం మాత్రం, ఇప్పట్లో అయ్యేపని కాదని, అ మాట  కొస్తే, కాంగ్రెస్సే కాదు బీజేపే సహా ఏ జాతీయ పార్టీకి ఇప్పట్లో ఎపీలోకి ఎంట్రీ చిక్కదని పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ హస్తిన పర్యటన రద్దు.. కారణమిదేనా?

పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లినట్లైంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అడగకపోయినా బేషరతు మద్దతు ప్రకటించేసి వైసీపీ గిరిజన మహిళ కు మద్దతు ఇచ్చేశామంటూ సంబరపడిపోతోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయంలో రాష్ట్రానికి ఎంతో కొంత సాధించుకునేందుకు ప్రయత్నించాలన్న కనీస ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడంపై పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టుపట్టకపోయినా కనీసం అడిగే ధైర్యం కూడా చేయలేని జగన్ అసలు బీజేపీ నేతలకు కానీ, కేంద్రం కానీ ఎక్కడా బహిరంగంగా మద్దతు ఇవ్వాలని వైసీపీని అడిగిన దాఖలాలు లేవు. తనంత తానుగా మద్దతు ప్రకటించేసి ఘన కార్యం చేసినట్లు తన భుజాలను తానే తడిమేసుకుంటున్నారు జగన్. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ.. కేంద్రం నుంచి ఎవరూ జగన్ ను కోరలేదు. కనీసం ఆయన హస్తినలో పర్యటించిన సందర్భంలో  ఆయన కలిసిన మంత్రులెవరూ కూడా కనీసం ఈ ప్రస్తావన తీసుకురాలేదు. దీనిని బట్టే కేంద్రం వైసీపీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అవగతమౌతుంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా వైసీపీ తనంత తానే రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కేంద్రానికి ఎంతో కీలకమని ప్రకటనలు చేసుకున్నారు. దాంతోనే విపక్షాలు, పరిశీలకులూ కూడా జగన్ తమ కీలక మద్దతు ప్రకటించడానికి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఏమైనా సాధించుకునేందుకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ కు అంత సీన్ లేదన్న వాదనలూ చేశారు. చివరికి జగన్ స్వయంగా తనకు అంత సీన్ లేదని ముర్ము అభ్యర్థిత్వానికి ఎవరూ అడగకుండానే బేషరతు మద్దతు ప్రకటించేసి రుజువు చేసుకున్నారు.  గతతెలుగుదేశం ప్రభుత్వం అటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా… బయటకు వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో పోరాడింది. అందుకు భిన్నంగా జగన్  బలమున్నా వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా కనీసం నోరెత్తడానికే భయపడుతోంది. 

కేసీఆర్ కుటుంబ అవినీతి అక్షరాలా 9లక్షల కోట్ల రూపాయలు.. సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు

కేఏ పాల్ .. తెలుగు రాష్ట్రాలలో ఇది పరిచయం అక్కర్లేని పాల్. గత ఎన్నికలలో ఏపీలో హడావుడి చేసిన పాల్.. ఈ సారి తెలంగాణలో తన హంగామా చూపుతున్నారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. ఆయన మాటను ఎవరూ కాదనరు. ఎందుకంటే అసలు ఆయన మాటలను ఎవరూ పట్టించుకోనే  కోరు కనుక. వరుస పెట్టి అందర్నీ ఆయన కలిసేస్తూ ఉంటారు. అమిత్ షా అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా ఇలా ఎవరైనా సరే ఆయన కలుస్తానంటే వద్దని అనరు ఎందుకొచ్చిన గొడవ ఆయన చెప్పేదేదో చెప్పనిచ్చి పంపిస్తే పోలా  అనుకుంటారు.   ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భరతం పడతానంటున్నారు. అని ఊరుకోలేదు.  కేసీఆర్ కుటుంబం అవినీతిపై  సీబీఐకి  ఫిర్యాదు చేశారు.  సీబీఐ కార్యాలయానికి వెళ్లి సీబీఐ డైరెక్టర్  సుభోద్ కుమార్ జైశ్వాల్ కు కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనీ, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి, ఇంతటి అవినీతిని తాను చూడలేదనీ ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే కేఏ పాల్ ప్రపంచం చుట్టి వచ్చిన వీరుడు కదా. ఎక్కడా కనని, వినని అవినీతి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని, వెంటనే విచారణ జరిపించాలన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఇది తన ఒక్కడి మాటే కాదనీ యావత్ తెలంగాణ ప్రజ  కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిన అవినీతిపై విచారణ జరగాలని కోరుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.   రాష్ట్ర విభజనతో 60వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసీఆర్ కుటుంబ అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సహా సింగపూర్ దుబాయ్, అమెరికాలలో కూడా ఆ కుటుంబం ఆస్తులు కూడబెట్టిందని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5వేల కోట్ల రూపాయలైతే కేవలం 35 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారని, ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదాద్రి విషయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయనీ పాల్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు కనుక ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభిస్తుందా.. లేక  రాజకీయ విదూషకుడి చర్యగా నవ్వుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి. సీబీఐ ఏ దర్యాప్తునూ తనంత తానుగా చేపట్టదు కనుక పాల్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు కదులుతుందని భావించలేం. వార్తల్లో నిలవడానికి ఇదో మార్గంగా ఎంచుకుని పాల్ సీబీఐ ఫిర్యాదు అంటూ  హడావుడి చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తునకు తాను పూర్తి సహకారం అందిస్తాననీ పాల్ సీబీఐకి హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో తనపై దాడులు జరుగుతున్నాయని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు. 

శివసేన బాటలో అన్నా డిఎంకే.. శుభం కార్డ్ సిద్ధం

మహారాష్ట్రలో శివసేన నిట్టనిలువునా చీలి పోయింది. ఆ ప్రహసనం అలా సాగుతుండగానే, తమిళ నాడులో  అన్నా డిఎంకే’ లో ఫైట్ మొదలైంది. అఫ్కోర్స్ ..ఇది కొత్తగా మొదలైన కొట్లాట కాదు.  పార్టీ అధినాయకురాలు, మాజీ  ముఖ్యంత్రి  జయలలిత చనిపోయిన నాటి నుంచే, పార్టీలో పన్నీరుసెల్వం (ఓపీఎస్), పళనిస్వామి (ఈపీఎస్) వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆలా సాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నంతవరకు ఒకరు ముఖ్యమత్రి, ఇంకొకరు ఉప ముఖ్యంత్రిగ కొనసాగినా, అప్పుడు కూడా  రెండు వర్గాలు ఎవరి కుంపటి వారిదే అన్నట్ల్గు సంసారం సాగించారు . అప్పటి  నుంచి మధ్య మాటల యుద్ధం అయితే సాగుతూనే వుంది. అదే విధంగా సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓడిపోయింది. అయినా, పార్టీ పై పట్టు కోసం ఉభయ వర్గాల మధ్య ఫైట్ కొనసాగుతూనే వుంది.  ఈ  నేపధ్యంలో, ‘ఏక నాయకత్వం’ కోసం ఓపీఎస్,ఈపీఎస్ వర్గాల మధ్య  సాగుతున పోరుకు ముగింపు పలికేందుకు ఏర్పాటు చేసిన, ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో ఓపీఎస్ టార్గెట్’గా ఈపీఎస్ వర్గం ఒక విధంగా భౌతిక దాడికి దిగింది. వాటర్ బాటిల్స్ విసిరి .. గో బ్యాక్ నినాదాలతో లోపలకు రాకుండా అడ్డుకుంది. ఈసంధర్భంగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఓపీఎస్ తమ వర్గం కార్యకర్తలను వెంట పెట్టుకుని వెనుదిరిగి పోయారు. జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా, రెండు వర్గాల  మధ్య సాగుతున్న ప్రత్యక్ష పరోక్ష పోరు ఈరోజు కాకపోతే, రేపైనా పార్టీని రెండు ముక్కలు చేస్తుందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తునన్నారు. ఒక విధంగా ఒంటరి అయిపోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఓపీఎస్ తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్‌ వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్‏కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.అయితే, ఇక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు. ఇంకా వుంది. అంతే కాదు, ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా పాత్ర లున్నాయి. 2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్‏ కొద్దిరోజులకే కుర్చీ కొల్పోయారు. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి. ఆ తరువాత ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే, ఇప్పడు పళనిస్వామికి ఢిల్లీ  పెద్దల ఆశీస్సులు పెద్దగా లేవంటున్నారు. మరో వంక శశికళ  పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు, గట్టిగా పావులు కదుపుతున్నారు.  ఈ అన్నిటినీ, మించి బీజేపీ  అనూహ్యంగా జనంలోకి దూసుకు పోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సారధ్యంలో అన్నాడీఎంకేని పక్కన పెట్టే స్థాయిలో బీజేపీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తోందని అంటున్నారు. మరోవంక పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు  మురుగన్’ కు  యూపీ (?) నుంచి రాజ్య సభకు పంపి కేంద్ర మంత్రి  వర్గంలో స్థానం కల్పించారు. ఈ పరిణామాలను గమనిస్తే, మహా రాష్ట్రలో శివసేన .. తమిళ నాడులో  అన్నా డిఎంకే  ఒకే బాటలో నడుస్తున్నాయి.  బీజేపీ స్క్రిప్ట్  ప్రకారం  నడుస్తునం రెండు పార్టీల  సినిమాకు .. శుభం కార్డు పడినట్లే అంటున్నారు.

ఒక వైపు విమర్శలు.. మరో వైపు వినతులు..!

దేశంలోని రాజకీయ పార్టీలలో  టీఆర్ఎస్ శైలే భిన్నం. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రాజకీయం ఇప్పటి దాకా అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న ధోరణిలోనే సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపిన తెరాస అధినేత కేసీఆర్.. ఆ తరువాత ఎన్నికల సమయంలో ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఆ తరువాత కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా బీజేపీకి బాసటగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీపై కారాలూ, మిరియాలూ నూరుతూ ఘాటు విమర్శలు చేస్తున్న సంగతీ తెలిసిందే. ఆయన కుమారుడు.. తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ గడ్డపై బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్రానికి నిథుల కోసం వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. తెలంగాణ గడ్డపై కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది శూన్యమంటూ విమర్శలు గుప్పిస్తూ.. ఢిల్లీ వెళ్లి కేంద్రం మంత్రులతో ప్రత్యేక భేటీలు అవుతున్నారు. మోడీ హయాంలో తెలంగాణకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని ఆరోపిస్తున్న ఆయన అవకాశం దొరికితే హస్తినలో వాలిపోయి కేంద్ర మంత్రులతో సమావేశమౌతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ణప్తి చేసి వచ్చారు. వచ్చీ రాగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో బిజీ అయిపోయారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, నిధులు మంజూరు చేయకపోవడంపై దుమ్మెత్తి పోశారు. ఆ వెంటనే హుటాహుటిన హస్తినలో వాలిపోయిన ఆయన కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. హైద‌రాబాద్ డ్రైనేజీ సిస్టమ్‌, రోడ్ల నిర్మాణంకు ఆర్థిక సాయం చేయాల‌ని విజ్ణప్తి చేశారు. వినతి పత్రం సమర్పించారు. కేంద్రం ఎన్నిసార్లు కోరినా పైసా విదల్చడంలేదని ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే.. మళ్లీ మళ్లీ కోరడం ఎందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కేటీఆర్ హస్తిన పర్యటనలపై రాజకీయ పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీకి ఎదురు పడటానికి సైతం ఇష్టపడకపోగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జాతీయ పార్టీని ప్రారంభించనున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం తరచుగా హస్తిన యాత్రలు చేస్తూ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు.  ఇదేం రాజకీయం తిరుమలేశా అంటే జనం అచ్చెరువొందుతున్నారు. తండ్రీ కొడుకుల భిన్న వైఖరులపై తెరాస శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు.. నామినేషన్ కార్యక్రమానికి జగన్ దూరం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు వైఎస్సార్సీపీ ఈ ప్రకటన చేసింది. శుక్రవారం ముర్ము నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఏపీ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆయన ముర్ము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి అందులోనూ మహిళకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్న వైఎస్‌ఆర్‌సీపీ  అందుకే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు మద్దతు  ఇస్తున్నట్లు పేర్కొంది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా... ద్రౌపది ముర్మూకి మద్దతు తెలుపుతున్నామని పేర్కొంది. ఇక  ఇప్పటికే ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సైతం ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. తాజాగా వైఎస్సార్సీపీ సైతం మద్దతు ప్రకటించడంతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది.  

అద్దె ఇంట్లో ఉండే వారికి గుదిబండగా మారిన ఏసీడీ!

అద్దె ఇళ్ల‌లో వుండేవారికి, య‌జ‌మ‌నుల‌కు స‌త్సంబంధాలు వుండాలి. వున్న‌నాళ్లు అద్దె క‌డుతూండ‌టం, ఇత‌ర‌త్రా ఇబ్బందులు ఉంటే య‌జ‌మానితో మాట్లాడుకోవ‌డం ప‌రిష్క‌రించుకోవ‌డం జ‌రుగుతుంటుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, విద్యుత్ శాఖ వారి ద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌లే తెచ్చిపెడుతున్నాయి. అదే ఏసీడీ. అంటే వార్షిక విద్యుత్తు వినియోగం.  అధికంగా వాడిన కరెంటు ఆధా రంగా వసూలుచేసే అదనపు విద్యుత్తు వాడక ధరావతు(ఏసీడీ). గత ఏడాది మార్చినుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో వాడిన కరెంటును సగటుగా తీసుకుంటున్నామని డిస్కమ్‌లు చెబుతున్నాయి. యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తామ‌ని అంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లలో ఉండే వారే ఎక్కువ. వారు తరచూ వివిధ కారణాలతో ఇళ్లు మారుతూ ఉంటారు.  మామూలుగానే అద్దె విష‌యంలో ఇంత‌కు ముందున్న‌వారు ఎగ్గొట్టి పోతే దాన్ని కూడా క‌ట్టాలనే య‌జ‌మానులూ వున్నారు. అలాంటిది విద్యుత్ బిల్లుల విష‌యంలో మ‌రీ ప‌ట్టు బ‌ట్టి లాక్కుంటున్నారు. అస‌లే అద్దె ఇళ్లు త‌గినవి దొర‌క్క ఇబ్బందులు ప‌డే మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వారికి ఇలాంటి త‌ల‌నొప్పులు నిత్యం వుంటూనే వుంటాయి. ఇప్పుడు రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణ‌యంతో మ‌రింత స‌మ‌స్య‌ల్లో చిక్కుకోవ‌ల‌సి వ‌స్తుంది. అంత‌కు ముందున్న‌వారు   అత్యధిక విద్యుత్తును వినియోగిస్తే వాటికి సంబంధించి అదనపు విద్యుత్తు ధరావతుకు కొత్తగా అద్దెకు దిగినవారే బాధ్యత వహించాలి. ఈ ధరావతును అద్దె దారులే చెల్లించాలని ఇంటి యజమానులు ద‌బాయిస్తున్నారు.  రెండు నెలల కిందట అద్దెకు దిగిన తాము ఎందుకు చెల్లించా లని అద్దె దారులు నిలదీస్తున్నారు. దీంతో ఇంటి య‌జ‌మానుల‌కు, అద్దెకు వుండేవారి మ‌ధ్య గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరుతు న్నాయి. ఏప్రిల్‌లో కొత్తగా అద్దెకు దిగేవారు ఎందుకు అంతకుముందు ఉన్న వారు  కాల్చిన అధిక కరెంటుకు బాధ్యత పడాలనేది ఒక అంశమైతే, డిస్కమ్‌ చెబుతున్న ఆరు శాతం వడ్డీ లబ్ధి ఎవరికి చెందుతుందనేది మరో కీల‌క‌ ప్రశ్న.  ఏసీడీ విధానాన్ని ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. వార్షిక విద్యుత్తు సగటుపైనే ఏసీడీ ఆధారపడి ఉంటుంది. యేటా ఏసీడీ మొత్తానికి ఆరు శాతం వడ్డీని మార్చి లేదా ఏప్రిల్‌ నెల బిల్లులో చెల్లిస్తాం. నెలవారీ 500 యూనిట్లు పైబడి కరెంటు వాడేవారికే ధరావతు వర్తిస్తుంది. వినియోగదారులు బిల్లులు చెల్లించలేక కనెక్షన్‌ను నిలుపుదల చేస్తే.. డిస్కమ్‌లకు చెల్లించాల్సిన మొత్తా లను మినహాయించుకుని  ధరావతులో మిగిలిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఏసీడీపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ హించింద‌ని వివరించాయి.  అ డిస్కమ్‌ల ప్రతిస్పందనపై ఇంధన రంగ నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే వర్తించే ఏసీడీ విధానం గృహ విద్యుత్తు వినియోగదారులకు వర్తింప జేయడంపై డిస్కమ్‌లు వివరణ ఇవ్వాలంటున్నారు. ఈ విధానం ఎప్పటి నుంచి ఉన్నదో డిస్కమ్‌లు చెప్పాలంటున్నారు. విద్యుత్‌ వినియోగం 500 యూనిట్లు దాటితే ఏసీడీ వర్తిస్తుందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. కానీ, ఆ బెంచ్‌ మార్క్‌ దాటక ముందే  కుటుంబం ఏప్రిల్‌ నెలలో కొత్త ఇంట్లో  అద్దెకు దిగింది. ఆ కుటుంబానికి  విద్యుత్తు కనెక్షన్‌కు ఈ ఏడాది మే నెలలో విద్యుత్తు వినియోగం కింద 5,623గా డిస్కమ్‌ పేర్కొంది. దీనిలోంచి అడ్జస్ట్‌మెంట్‌ పోగా 3070గా బిల్లు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌వరకూ సగటున 417 యూనిట్లు వినియోగించినట్లుగా పేర్కొంది. వారి సర్వీసు నంబరుకు రూ.13,000 ఏసీడీ కింద చెల్లించాలని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. రెండు నెలల కిందట అద్దెకు దిగిన తామెందుకు ధరావత్తు కట్టాలని ఆద్దెదారు వాదిస్తుం టే తమ కేమీ తెలియదని.. ఆ పోర్షన్‌కు సంబంధించిన విద్యుత్తును తాము వాడనందున ఆ ధరవత్తును అద్దెదారులే చెల్లించా లని యజమాని అంటున్నారు. ఇదేమైనా న్యాయంగా వుందా? అని అద్దెకున్న వారు వాపోతున్నారు. 

అన్ని వర్గాలు ఆమె పక్షమే రాష్ట్రపతి అభ్యర్ధికి మోడీ ప్రసంసలు నామినేషన్ కు రంగం సిద్దం

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు  చేస్తున్నారు. ఇందు కోసం ఆమె గురువారం ఉదయమే రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్ సహా ఇతర నేతలు స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆమెకు సహాయకారిగా ఉంటారు .  కాగా,ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారు. నామినేషన్ ప్రత్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రులు సంతకాలు చేస్తారు. అదలా ఉంటే ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నివాసంలో సిద్ధం చేస్తున్నారు.  కాగా,  ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ  హోంమంత్రి అమిత్‌ షాతో  భేటీ అయ్యారు. ఆమెకు ప్రధాని పుష్పగుచ్ఛం అందజేశారు. ముర్ముతో భేటీపై ట్విట్టర్‌లో స్పందించిన మోదీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలపై ముర్ముకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల ఆమె దూరదృష్టి అద్భుతం అని మోదీ కొనియాడారు.అలాగే, కేంద్ర మంత్రి అమిత్ షాను ముర్ము కలిశారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు గర్వపడుతున్నానని షా పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ ద్రౌపది ముర్ము.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపే ఈ నెల 21న నిర్ణయం తీసుకుంది. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవి చేపట్టనున్న తొలి గిరిజన వ్యక్తిగా, రెండవ మహిళగా ఖ్యాతినార్జిస్తారు. అంతే కాక స్వతంత్ర భారత దేశంలో జన్మించిన తొలి రాష్ట్రపతిగా  ప్రత్యేక స్థానం పొందుతారు.    ఇలా ఉండగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే  అని స్పష్టం అవుతున్నది.  ఎన్‌డిఎ  ఓట్ల శాతం 50శాతం దాటడమే ఆమె విజయానికి బాటలు వేస్తోంది. తద్వారా భారతదేశానికి గిరిజన మహిళ మొదటి సారి రాష్ట్రపతి కానున్నారు.   ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపదికి సొంతరాష్ట్రం ఒడిశాకు చెందిన అధికార బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఓట్లలో(10,86,431) 52 శాతం ఆమెకే (5,67,000) లభించనున్నాయి. బిజెపితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎల ఓట్ల శాతం (3,08,000) కూడా ఇందులో కలిసివస్తుంది.   నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి ఓట్లు 32,000. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్ల శాతంలో ఆ పార్టీవి 2.9శాతం. ఒడిశాలో అధికార బిజెడికి 114 మంది శాసనసభ్యులున్నారు. బిజెపికి 22 మంది ఉన్నారు. అదే విధంగా ఇరు పార్టీలకు చెరో 12మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులున్నారు.   మరో రెండు ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, ఎఐఎడిఎంకె కూడా ఎన్‌డిఎ అభ్యర్థివైపే మొగ్గు చూపుతున్నాయి. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వం నిర్వహిస్తున్న జేఎంఎం కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం గమనార్హం.  ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువ సభ అయిన రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 92కు చేరింది. ఇక లోక్‌సభలో బీజేపీకి  సొంతంగా 301 మంది సభ్యుల బలం ఉంది.సో.. ద్రౌపది ముర్ము ఎన్నిక ఇక లాంచనమనే భావిస్తున్నారు.

పీకే సర్వే ..ట తెరాస దే గెలుప..ట

ప్రశాంత్ కిశోర్ గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. అవును, ఒకప్పడు రాజకీయ పార్టీలు  అయన వెంట పడిన మాట నిజం. కానీ, ఇప్పడు ఆయనకు అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై, ఆయన తమ పొలిటికల్ యాంబిషన్స్ బయట పెట్టుకున్నారు. అంతవరకూ ఆయన వ్యూహకర్త గానే ఉంటారని భావించిన వివిధ పార్టీల నాయకులు, ఒక్క సారిగా ఆయన  ఏకంగా కాంగ్రెస్ నే  కబ్జా చేసేందుకు స్కెచ్ గీయడం చూసి అవక్కాయ్యారు.వీడు మామూలోడు కాదు, మహా డేంజర్’ అనే విషయాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. ఇక అక్కడి నుంచి మమతా బెనర్జీ సహా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  రాజకీయ పార్టీలు ఏవీ ఆయన్ని దగ్గరకు రానీయడం లేదు. ఎటొచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆయన పేరు ఎంతో కొంత వినిపిస్తోంది. నిజానికి, రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి నిలబెట్టే ఆలోచను తెరమీదకు తెచ్చింది పీకేనే. అయితే, చివరకు ఆయన పాత్ర ప్రమేయం లేకుండానే పతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉమ్మడి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్  రాజకీయ నాయకుడు యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. అంటే .. ఒకప్పుడు పీకేకు ఎంతో కొంత విలువ ఇచ్చిన రాజకీయ పార్టీలు, నాయకులు  ఇప్పడు పీకేను తీ..తా  (తీతేసిన తహసిల్దార్ ) గానే చూస్తున్నాయని, రాజకీయ పార్టీల తీరును బట్టి తెలుస్తోంది.  అయినా జగన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరి పరిస్థితి ఒకేలా, డోలాయమానంగా ఉన్న నేపధ్యంలో  పీకే గడ్డి పోచను పట్టుకుని వేల్లాడుతున్నారు.  అయితే, ప్రశాంత్ కిశోర్ వలన అటు  జగన్ రెడ్డికి కానీ, ఇటు కేసీఆర్ కు కానీ, పెద్దగా ఒరిగేది ఏమీ లేదు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా, ఇంకెప్పుడో జరిగినా ఫలితం మాత్రం ఒకటిగానే ఉంటుంది. అక్కడా  ఇక్కడా కూడా అధికార పార్టీలు ఓటమిని తప్పించుకోలేవని, సర్వేలు కాదు, సర్వ జనులు, సకల జనులూ చెపుతూనే ఉన్నారు.  గోడమీది రాతలే చెపుతున్నాయి. అది అందరికీ తెలుసు, అయినా అప్పుడప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు, పీకే సర్వేలంటూ లీకులీయడం తెరాస చాలా  కాలంగా చేస్తూనే వుంది.   ఇప్పడు తాజాగా  లీకు చేసిన సర్వే ప్రకారం, తెరాస తిరిగి ధికారంలోకి వస్తుందని డప్పు కొట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుదందని పీకే సర్వే తెలిపింది. ఇతరులపై ఆధారాపడాల్సిన అవసరం కూడా లేదని .. సొంత మెజార్టీ వస్తుందని కూడా పీకే సర్వే తేల్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని… ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ చాలా దూరంగా మూడో స్థానంలో ఉంటుందే, తప్ప రాష్ట్రం మొత్తం పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పీకే తేల్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి.  అయితే సర్వే లీక్ అయిన సమయ సందర్భాలను గమనిస్తే, వచ్చే నెల (జూలై) 2.3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే  బీజీపీ  జాతీయ కార్యవర్గ  సమావేశాల నాటికి తెరాస  సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, కొందరు సీనియర్ నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు, బీజేపీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. అంతే కాకుండా ఆ బాధ్యతను అమిత్ షా ఇంకెవరికి కాకుండా తెరాస ఇంటి గుట్టు మొత్తంగా తెలిసిన ఈటల రాజేందర్ కు అప్పగించారు. దీంతో అప్రమత్తమైన తెరాస నాయకత్వం, పీకే పేరున వండిన సర్వేను లీక్ చేసిందని, గులాబీ కోటలో గుసగుసలు గుప్పుమంటున్నాయి.  మరోవంక ప్రజల్లో  నిజంగా ఆగ్రహం ఉందంటే అది  ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. సర్వ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఅర్ మీద వుంది. మంత్రి పదవి కోసం విలువలను వదులుకున్న మరో కీలక మంత్రి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అది టీవీ తెరల మీద, సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  కేసేఅర్  కుటుంబ పాలన మీద ప్రజలో ఆగ్రహం వుంది. అసహనం వ్యక్తమవుతోంది. అయితే, బీజేపీ కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధాన ఎజెండాగా కాంపెయిన్ కు సిద్దమవుతున్న నేపధ్యంలో, ప్రజల దృష్టి  ఆ విషయం పై నుంచి తప్పించేందుకు, ఎమ్మెల్యేలను పీకే పేరున బకరాలను చేశారని  తెరాస వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉందని పీకే నివేదిక ఇచ్చారంటూ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూలత లేదని.. ఖచ్చితంగా వారిని మార్చాల్సిందేనని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఉండవని ముందుగానే సంకేతాలు పంపేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే, అందులో కొంత నిజం ఉన్నా, మొత్తంగా ప్రభుత్వం మీదనే అసంతృప్తి ఉందని కూడా సర్వే చెప్పిందని అంటున్నారు. అయితే, ఇది కూడా జిమ్మిక్కే అంటున్నారు. నిజానికి, తెరాస ప్రభుత్వ వ్యతిరేకత , పీకే చెప్పినా చెప్పక పొయినా, పీక్ కు చేరిందనేది నిజం.అది రేషన్ కార్డులు,  కొత్త పింఛన్లు ఇస్తే పోయేది కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని సవాలు చేస్తున కుటుంబ పాలనకు, రాష్ట్రన్ని అప్పుల్లో ముంచెత్తి కూడ బెట్టిన కోట్ల కోట్ల అవినీతి, గురించి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే, పెద్ద గీత పక్కన చిన్న గీత  గీసి అసలు సమస్యల నుంచి ప్రజా దృష్టిని  దారి మళ్ళించేందుకే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే, తెరాస  పీకే పేరున సర్వే  లీక్ ను విడుదల చేసిందని, తెలంగాణ భవన్  కోడై కూస్తోంది.

మరిన్ని రాష్ట్రాల విభజనకు బీజేపీ ప్రణాళికలు!

 కాంగ్రెస్ అధికారం దిగిపోతూ తెలుగు రాష్ట్రాల‌ను విభిజించింది. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం మాట ఎలా వున్నా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య స్నేహ‌బంధాలు దెబ్బతిన్నాయి. రాజకీయ లక్ష్యం నెరవేర్చుకోవడానికి అడ్డగోలుగా తెలుగు రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ కు అటు రాజకీయ లక్ష్యం నెరవేరకపోగా   ప్ర‌జ‌లలో తీవ్ర అసంతృప్తిని మిగిల్చి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ఉనికి కోల్పోయే పరిస్థితి కొని తెచ్చుకుంది. కేంద్రం నుంచి రావ‌ల‌సిన నిధులు, ప్రాజెక్టులు ఇత‌ర‌త్రా ఆర్ధిక మ‌ద్ద‌తులు ఏవీ ల‌భించ డం లేద‌ని కేంద్రం మీద ఇప్ప‌టికీ ఇరు రాష్ట్రాలూ కారాలు మిరియాలూ నూరుతున్నాయి. ఇప్పుడు బిజెపి ఈ రెండు రాష్ట్రాల్లోనూ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి అధికారంలోకి రావాల‌న్న ఆతృ త బాగా ప్ర‌ద‌ర్శిస్తోం ది. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి  బిజెపి ల‌క్ష్యం నెర‌వేరుతుందా లేదా అన్న‌ది వేరే విష‌యం. ఇపుడు  క‌ర్ణాట‌కా లోనూ ఇదే దృశ్యం  త్వ‌ర‌లో చూడాల్సి వస్తుందని అనిపిస్తోంది. అందుకు  వుదా హ‌ర‌ణ ఆ రాష్ట్ర అట‌వీశాఖ మంత్రి ఉమేశ్ క‌త్తి చేసిన ప్ర‌క‌ట‌న‌.  ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రమేనని ఇందులో సందేహమే లేదని ఇది బీజేపీ నిర్ణయం కాదని తన వ్యక్తిగతమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేశ్‌కత్తి వెల్లడించారు. బెళగావిలో బుధవారం న్యాయవాదు లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరిన్ని రాష్ట్రాలను విభజించనున్నారన్నారు.  మహారాష్ట్రను మూడుగాను, కర్ణాటకను రెండుగాను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగుగాను మార్చాల‌నే  ఆలోచ‌న లో కేంద్రం వుందని ఆయన సెలవిచ్చారు.  తద్వారా దేశంలో త్వరలో రాష్ట్రాల సంఖ్య 50 కి పెరగనుందన్నారు. ఇప్ప టికే ఈ దిశగా చర్చలు సాగుతున్నా యన్నారు. అయితే ఈ విధంగా ముక్క‌లుగా దేశాన్ని విడ‌గొడితే  దేశంలో అనై క్య‌త వెల్లు వెత్తి  భిన్న‌త్వం లో ఏక‌త్వ సిద్ధాంతానికి అర్ధంలేకుండా పోతుంద‌నే ఆందోళ‌నా త‌లెత్త‌క పోదు. రాజ‌కీయ ల‌బ్ధికోసం త‌మకు తోచిన విధంగా విభ‌జ‌న‌లు చేస్తూపోతే  దేశంలో అశాంతి పెల్లుబికే అవ‌కాశం కూడా వుంది. రానున్న రోజుల్లో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చూస్తారన్నారు. బెంగళూరు కథ ముగిసిందని ఉమేశ్ అన్నారు.  నా నివాసం నుంచి విధాన సౌధకు వెళ్లాలంటే  ప‌ది కిలోమీటర్ల దూరం ఉందని  కానీ గంటన్న రకు  పైగా సమయం పడుతుందన్నారు. ఇది ఇక్కడి ట్రాఫిక్‌ పరిస్థితి అన్నారు. ఐటీ, బీటీ, పరిశ్రమలు పెరిగి రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చునన్నారు.  భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ కేంద్రం నిజంగానే  మ‌రిన్ని రాష్ట్రాల  ఆలోచ‌న‌లో వుంటే ప్ర‌జ‌లు హ‌ర్షిస్తారా?  రాజ‌కీయ ల‌బ్ది కోసం  రాజ కీయ పార్టీలు, ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇటీవ‌లి కాలంలో దేశంలో ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా వుండ‌డం లేదు. 

బిజెపిలో చేరితే ఓకే.. షిండే.. బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధమా?.. రౌత్‌

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం చిత్రంగా మారింది. మాడు మీద కొట్టి ఆన‌క బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసి న‌ట్టుగా మారింది. ముఖ్య‌మంత్రి  ఉద్ధ‌వ్ థాక్రేను గ‌ద్దె దించేందుకు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు లేవ‌నెత్తి 41 మంది ఎమ్మెల్యేల‌తో రెబెల్ శిబిరంతో థాక్రేను బెద‌ర‌గొట్టాడు. ఇప్పుడు త‌న రూటు మార్చి థాక్రే  అంటే కోపం లేదు గాని పార్టీని బిజెపీతో క‌లిపితే  ఆయ‌న‌కు మ‌ద్ద‌తునిస్తాన‌ని కొత్త నిబంధ‌న పెట్టి మొత్తం వ్య‌వ‌హారంలో కొత్త మెలిక‌పెట్టారు.   ఉద్ధవ్ థాక్రే  సీఎం గద్దె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితే చాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్ శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే రాజీనామాను తాము కోరుకోవడం లేదు.  ప్రభుత్వ కూటమిలోని ఇతరులపై మాకు ఆగ్రహం ఉందని బీజేపీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నా మని దీపక్ కేస్కర్ పేర్కొన్నారు. వాస్త‌వానికి  కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులన్ని కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్దనే వుండ‌డం తోనే  స‌మ‌స్య‌లు వ‌చ్చాయి.  శివసేన వద్ద కేవలం పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రమే ఉన్నా యని అసంతృప్తి త‌లెత్తింది. కాగా ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ గురువారం ఉదయమే గువహటిలో రెబల్ ఎమ్మె ల్యేల శిబిరంలో చేరారు. గత రెండు రోజులుగా ఉద్ధవ్ థాక్రే  పక్కనే కనిపించిన ఆయన  గురువారం ఉదయం అసోం వెళ్లారు. తనతో పాటు ఇద్దరు సేన ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే గువహటి వచ్చా రని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో జట్టు కట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నా రని దీపక్ కేస్కర్ చెప్పారు.  ఉద్ధవ్ స‌మావేశానికి  12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని స‌మాచారం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భావోగ్వే దంతో ఎమ్మెల్యేలకు చేసిన విజ్ఞప్తి విఫలమైంది.   ఉద్ధవ్‌తో కలిసి ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేలు అజయ్ చౌదరీ, రవీంద్ర వైకర్, రాజన్ సాల్వీ, వైభవ్ నాయక్, నితిన్ దేశ్‌ముఖ్, ఉదయ్ సామంత్, సునీల్ రౌత్, సునీల్ ప్రభు, దిలీప్ పాటిల్, రమేష్ కొర్గాన్ కర్, ప్రకాశ్ ఫతర్పెకర్ మీటింగ్‌కు హాజరయిన వారిలో ఉన్నారు. ఇదిలా వుండ‌గా ఇర‌వై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నార‌ని, శివ‌సేన ఇంకా బ‌లంగానే వుంద‌ని శివ‌సేన అగ్ర‌నేత సంజ‌య్ రౌత్  అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో చాలామంది ఒత్తిడికి గుర‌య్యార‌న్న‌ది అర్ధ‌మ‌వుతోంద‌న్నారు.  రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకి నిజమైన భక్తులు కాదని మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని  బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మె ల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిందని రౌత్ ఆరోపించారు. ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్‌థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివసేనను వీడబోమని చెప్పారు. స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష‌ ఏర్పాటు చేస్తే ఎవరికి  సాను కూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు కాంగ్రెస్సే!

ఈ సారి ఎన్నికలలో నిజమైన ముప్పు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉందని టీఆర్ఎస్ భయపడుతోంది. ఈ విషయాన్ని పీకే సర్వే పేర టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా  సెలక్టివ్ గా మీడియాకు వెల్లడించారు.  అలా వెల్లడించే క్రమంలో  తమ పార్టీకి విజయావకాశాలు భేషుగ్గా ఉన్నాయని సర్వే చెప్పిందంటూ లెక్కలు చెప్పారు.  అది వేరే సంగతి. ఇక్కడ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెల్లడించిన సర్వే ఫలితం ద్వారా   తేలిందేమిటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్సేనని. బీజేపీ తెలంగాణలో మూడో స్థానానికి పరిమితం అవుతుందని. తెలుగువన్ ఇదే విషయాన్ని చాలా ముందుగానే చెప్పింది. ఇప్పుడు సర్వే ఫలితమంటూ కేసీఆర్ అదే చెబుతున్నారు. కాంగ్రెస్ దూకుడును ఆపేందుకే బీజేపీకి తెరాస లేని ప్రాముఖ్యత ఇస్తోందనీ..తెలుగువన్ ముందుగానే విశ్లేషించింది.  ఇప్పుడు టీఆర్ఎస్ పీకే సర్వే ఫలితమని చెబుతూ అనధికారికంగా, వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన లీకు ద్వారా చెప్పిన విషయం కూడా అదే.   అయితే సర్వే ఫలితమంటూ,  వచ్చే ఎన్నికల్లో   సొంతంగానే అధికారానికి అవసరమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. నిజంగా పీకే సర్వే ఫలితమే అలా వచ్చిందా.. లేక టీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం అలా చెప్పుకుంటోందా అన్నది పక్కన పెడితే.. మరో అభిప్రాయానికి తావు లేకుండా టీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని బయట పెట్టేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అధికారానికి అవసరమైన స్థానాలను చులాగ్గా సాధించేస్తుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుంది. ఇక బీజేపీ ఎంత హడావుడి చేస్తున్నా, చేసినా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చాలా దూరంగా మూడో స్థానానికి పరిమితమైపోతుంది. ఇదీ టీఆర్ఎస్ ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిథులకు ఇచ్చిన సమాచారం.  ఇక పీకే నివేదికలో కొత్తగా ఏమీ లేదని తేలిపోయింది. పలు నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి తీవ్రంగా ఉందని, వారిని మారిస్తే ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద బండినడకేననీ పీకే సర్వే ఫలితం తేల్చిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా పార్టీ కేడర్ లో నెలకొన్న అసంతృప్తినీ, ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి టీఆర్ఎస్ అగ్రనేతే  పీకే సర్వే పేరిట ఇచ్చిన ముందస్తు సమాచారంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  ఇప్పుడు కొత్త పించన్లు, రేషన్ కార్డులు అంటూ ప్రభుత్వం హామీలు గుప్పించడం కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించే వ్యూహంలో భాగమేనంటున్నారు. ఇక్కడ పీకే సర్వే పేరిట వెల్లడైన అంశాలను గమనిస్తే ప్రస్ఫుటంగా అవగతమయ్యే విషయమేమిటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ గణనీయంగా బలం పెంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ను బలంగా డీకొనేందుకు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి, బీజేపీని ఎక్కవ చేసి చూపడానికి టీఆర్ఎస్ అధినేత ఎంతగా ప్రయత్నిస్తే అంతగా నేలకు కొట్టిన బంతిలా బలోపేతం అవుతూ వచ్చింది. విభేదాలు, గ్రూపు తగాదాలు ఉన్నా అన్నిటినీ అధిగమించి ప్రజా విశ్వాసాన్ని చూరగొంది. ఇదే విషయాన్ని కొంచం మార్చి కేసీఆర్ సర్వే పేరుతో క్యాడర్ కు సందేశం పంపారు. ఇక  బీజేపీని వదిలేసి కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టాలన్న సంకేతం ఇచ్చారు. 

పంతానికి పోవ‌ద్దు.. త‌ల‌సాని

ఇరువైపులా స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌పుడు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవడం మేలు. కానీ తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి, తెలుగు ఫిలిం ఫెడ‌రేష‌న్ మ‌ధ్య వివాదం ముదిరింది. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇరువైపుల పెద్దలతో మ‌ట్లాడి పంతాల‌కు పోయి స‌మ‌స్య‌ను మ‌రింత పెద్ద‌ది చేసుకోవ‌ద్ద‌ని న‌చ్చ‌జెప్పారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంతాలు, పట్టింపులు వద్దని చెప్పానని పేర్కొన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులకు సమస్యలు ఉన్నాయని.. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. సినీరంగంలో ప‌నిచేసే 20 వేల‌కు మించి వున్న కార్మికులు త‌మ జీత‌ భత్యాలు పెంచాల‌న్న‌డిమాండ్‌తో స‌మ్మెకు దిగారు. బుధ‌వారం అనేక‌మంది సినీ కార్మికులు హైదార‌బాద్ జూబ్లీ హిల్స్‌లోని సినీ ఫెడ‌రేష‌న్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించి త‌మ వేత‌నాల‌ను 45 శాతం పెంచాల‌ని డిమాండ్ చేస్తూభారీ నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఫెడ‌రేష‌న్‌, సినీ నిర్మాత‌ల మండ‌లి స‌మావేశంలోనే అది నిర్ణ‌యించే అవ‌కాశం వుంద‌ని, ప్ర‌స్తుతం 30 శాతం మేర‌కు పెంచ‌డానికి అవ‌కాశం వుంటుంద‌ని ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వారికి న‌చ్చ‌జెప్పారు. కానీ అది వెంట‌నే అమ‌లు అవుతుంద‌న్న‌ది  స్ప‌ష్టం చేయ‌లేదు. కోవిడ్‌-19 కార‌ణంగా సినీ కార్మికులు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నామ‌ని ఈ ప‌రిస్థితుల్లో వేత‌నాల‌ను పెంచాల్సిన అవ‌స‌రం వుంద‌ని వారు గ‌త ఆరు నెల‌లుగా డిమాండ్ చేస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల గురించి  తెలుగు ఫిలిమ్‌ఛాంబ‌ర్ తో చ‌ర్చిస్తున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  కార్మికుల సమ్మె వల్ల సుమారు 20 చిత్రాల నిర్మాణం నిలిచిపోయింది.  అయితే  కార్మికులు స‌మ్మెకు దిగ‌డం స‌మంజ‌సం కాద‌ని, స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవ‌డానికే మొగ్గు చూపాల‌ని సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కార్మికుల‌ను కోరారు.  స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించడానికి  ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి త‌ల సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం  చేయ‌డానికి ముందుకు వచ్చారు.

జర భద్రం అలా.. ప‌రిగెట్ట‌కు రా..!!

ప్రధాని,   ముఖ్య‌మంత్రికి  లేదా ఎవ‌రన్నా ప్ర‌ముఖుడికి జ‌డ్ కేట‌గిరీ సెక్యూరిటీ వుంటుంది. శత్రువుల నుంచో, ప్రత్యర్థుల నుంచో ఉన్న ప్రాణాపాయం నుంచి వారిని తప్పించడానికి. పిల్ల‌లు న‌డ‌క నేరుస్తున్న క్ర‌మంలో వారు కింద‌ప‌డ‌తారేమోన‌ని ఇంట్లో ఎవ‌రో ఒక‌రు వెన్నంటే వుంటూ రక్షణ కల్పిస్తారు.  పిల్లలను స్కూల్లో వేయగానే త‌ల్లిదండ్రులు మొద‌ట కొన్ని రోజులు పిల్ల‌ల‌తో పాటే వారికి రక్షణగా బ‌డికి  వెళ్ల‌డం చూస్తూంటాం.  కానీ లోకంలో ఏనుగుల మంద  త‌మ పిల్ల‌ల‌కు(గున్న ఏనుగులకు) ఇచ్చే ర‌క్ష‌ణ ఎవరూ ఎవ‌రికీ క‌ల్పించ‌రేర‌న్న‌ది వాటిని గమనిస్తే అవగతమౌతుంది. ఇది జ‌డ్ మూడు ప్ల‌స్‌ల సెక్యూరిటీ!!చిన్నారి ఏనుగు పిల్ల న‌డ‌క నేర్చినా స‌రే దానికి ఏకంగా మూడు నాలుగు ఏనుగులు ర‌క్ష‌ణ‌గా వుంటాయి. పిల్ల ఏనుగు మాత్రం వాటి ర‌క్ష‌ణ‌కు కాస్తంత ఇబ్బంది ప‌డుతుంటుంది. త‌న‌ని ముందు న‌డిపించ‌వ‌చ్చుగా అని తొంద‌ర‌పాటూ ప్ర‌ద‌ర్శిస్తుంది. పెద్ద ఏనుగులు మాత్రం దాన్ని తొండంతో, కాళ్ల‌తో అడ్డుకుంటాయి. ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడుతుంటాయి.జ‌డ్ ప్ల‌స్‌ల‌కు మించిన ఈ ఏనుగుల ర‌క్ష‌ణ దృశ్యాన్ని 38 సెకండ్ల మేర‌కు వీడియో తీసి ట్విట‌ర్‌లో అందిం చారు అట‌వీశాఖ అధికారి సుశాంత్ నందా.   మ‌నుషుల్లాగానే ఏనుగుల మ‌ధ్యా ఆ ప్రేమాను బంధాలు మెండుగా వుంటాయి. ఏనుగుల మంద‌లో వున్న ఏనుగుల‌న్నీ మందలోని గున్న ఏనుగును సొంత బిడ్డగానే భావిస్తాయి. 

అక్క చెళ్లెమ్మలూ ఇక దుల్హన్ మర్చిపోండి

సోదరి పెళ్లికి అన్న ఎంతో కొంత యివ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అవ‌స‌ర‌మ‌యితే బంధువులూ ఎంతో కొంత ఆర్ధిక మ‌ద్ద‌తు ఇస్తూంటారు. రాష్ట్రంలో పేద‌ వారింట పెళ్లికి ప్ర‌భుత్వాలు ఆర్ధిక మ‌ద్ద‌తు ప్ర‌క‌టిం చ‌డం ఆన‌వాయితీగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దుల్హ‌న్ ప‌థ‌కం అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.   పేద ఇంటి అమ్మాయి పెళ్లికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున యాభ‌యి వేలు  ఇవ్వ‌డం ఆ ప‌థ‌కం ల‌క్ష్యం. ఇది కొంత కాలం బాగానే న‌డిచింది. మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి  ఆ ప‌థ‌కం మ‌రింత ఆక‌ర్ష‌ణీయం చేయడానికి  ఈ ప‌థ‌కం ద్వారా వ‌ధువుకి  ల‌క్ష‌రూపాయ‌లు ఇస్తామ‌ని   బాగా ప్ర‌చారం చేసేరు.  ఇప్పుడు ఆర్ధిక ప‌రిస్థితులు త‌ల్ల‌ కిందుల‌యి అస‌లు ఆ పథ‌కానికే స్వ‌స్తి ప‌లికారు. ఇక‌ నుంచి  ఆ ప‌థ‌కం అమ‌లుకాద‌ట‌. ఈ సంగ‌తి ప్రభుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టుకి తెలిపారు.  అడ్డగోలు ఆర్థిక విధానాలతో అందినకాడకల్లా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా స్థితికి తెచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించుకున్న పథకాలను ఒకటొకటిగా వదులుకుంటోంది.   రాష్ట్రాన్ని న‌డ‌ప‌డానికి  నిధులు లేక‌పోవ‌డం, అప్పుల వూబిలోకి దిగ‌జారుతూండ‌డంతో  ఇక‌ ప‌థ‌కాలను అనుకున్న‌ట్టుగా అమ‌లు  అసాధ్య‌మ‌న్న‌ది అర్ధ‌మ‌యింది. అందుక‌నే  దుల్హన్‌ పథకం పై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది.  దుల్హన్‌ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక  ఇబ్బందులతో పథకం నిలిపివేశామని తెలిపింది. ముస్లిం యువతుల వివాహానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేది. ఆ ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని  గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు.  జగన్‌ ప్రభు త్వం ఈ హామీ విస్మరించిందని హైకోర్టులో పిటిషన్‌ దాఖ లైంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి  నేత షిబ్లి  ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప‌థ‌కం అమలు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అఫిడవిట్లపై త‌గిన స‌మాధానం దాఖలు చేయాలని పిటిషనర్‌ తరుఫు న్యాయవాదికి  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

‘మహా’ పాఠం మరో గుణ పాఠం

అది ఉద్ధవ్‌ ఠాక్రేనే కానక్కరలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కావచ్చును. కాదంటే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చును, దేశాన్ని పాలిస్తున్న ప్రధాన మంత్రి అయినా కావచ్చును. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా ప్రవర్తిస్తే, అంతా బాగుందని, అనుకుంటే, ఇదిగో ఇలాగే, ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఉరమని ఉరుములా, ‘మహా’ విపత్తు విరుచుకు పడుతుంది. అలా,  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా, ఉద్ధవ్‌ ఠాక్రే’లా లబో దిబో మన్నా ప్రయోజనం ఉండదు. అర్థరాత్రి పెట్టే బేడా సర్దుకుని, పోవడం తప మరో మార్గం ఉండదు. అయితే, పాలకుల తలలో చేరిన అజ్ఞాన, ఆహంకారానికి  అన్ని సందర్భాలో పార్టీలో అంతర్గత తిరుగుబాటే  సమాధానం కానవసరం లేదు. చివరాఖరికి ప్రజలు ఇచ్చే తీర్పు రూపంలోనూ, ప్రజలు గుణ పాఠం చెపుతారు. నేతలకు కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి ఎదురైనా కావచ్చును.  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఓడి పోయిన తర్వాత, ఎంతవరకు నిజమో ఏమో కానీ, మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ‘ఓటమి ఓకే .. కానీ, మరీ ఇంత ఘోరంగానా? మనంచేసిన తప్పేంటి .. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏమిటి? అంటూ చంద్రబాబు నాయుడు, పార్టీ  సమావేశాల్లో విస్మయం వ్యక్త పరిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్త పరిచింది నిజం అయినా కాకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను చూడలేక పోవడం ఎంత ప్రమాదకరమో చెప్పుకునేందుకు ఈ  ఉదంతం ఒక గుణపాఠంగా అయితే నిలిచింది.  ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఈ ప్రమాదం మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అధినాయకుడు నందంటే నంది, కాదంటే  కాదు..అనే అతి విధేయత జాతీయ పార్టీలలో కంటే ప్రాంతీయ పార్టీలలో కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, ఇన్ని మీటలు నొక్కాం... ఇన్ని వందల వేల కోట్లు ప్రజల ఖాతాలలో జమ చేశాము...సో .. 175 కు 175 సీట్లు మనకే వస్తాయి, ఎందుకు రావు? అంటూ పార్టీ  సమావేశంలో  విశ్వాసం  వ్యక్త పరిచారు. అది విశ్వాసం అనాలో అతి విశ్వాసం అనాలో గానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అలా ఉందా ? అని ఒక్క నిముషం ఆలోచిస్తే, అలంటి పరిస్థతి లేదని చెప్పడం కష్టం కాదు.   ప్రభుత్వ పథకాల వలన ప్రయోజనం పొందిన ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అందుకే, గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు ఎక్కడిక్కడ ఎమ్మెలను నిలదీశారు. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అబ్బే అదేమి లేదు, అంతా బాగుంది అనే భ్రమల్లోనే ఉన్నారంటే, అది ఆయనలోని అజ్ఞానానికి నిదర్శనమా,  అహంకారానికి నిదర్శనమా అనేది ఆయనే తెలుసు కోవలసి ఉంటుంది  తప్ప మరొకటి కాదని,వైసీపీ నేతలే అంటున్నారు. ప్రజలను కొనేయడం అంత పెద్ద విషయమే కాదనే దురహంకారంతోనే ఆయన అంతోటి ధీమా వ్యక్తం చేశారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదనే  వైసీపీ పెద్దలు ‘దీవెనలు ’ కూడా అందిస్తున్నారు.  ఇక  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం అయితే చెప్పనే  అక్కరలేదు. రాష్ట్రంలో ఇక చేసేందుకు ఏమీ లేదనే నిర్ణయానికి ఎలా వచ్చారో ఏమో కానీ, దేశాన్ని ఉద్దరించేందుకు  సిద్ద మయ్యారు. జాతీయ రాజకీయాల వెంట పడ్డారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రైతులకు ఎప్పుడో ఇవ్వవలసిన రైతు బంధు పైసలకు ఇంతవరకు దిక్కు లేదు. ఎక్కడన్నా, అప్పు పుడితేనే కానీ, రైతుల ఖాతాల్లో పైసలు పడవు. పోయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం అప్పుకు పోయినట్లు, తెలగాణ ప్రభుత్వం రైతు బంధు అప్పు కోసం పరుగులు తీస్తోంది. ఇదొక్కటని కాదు,  రాష్ట్రంలో కాదు, ఏ దిక్కు చుసిన అష్టమ దిక్కే కనిపిపిస్తోంది. శాంతి భద్రతలు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నాయో, వేరే చెప్పనక్కరలేదు. మరో వంక అప్పులు, అవినీతి సమాంతరంగా ఉర్ద్వ ముఖ ప్రయాణం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అయినా, జగన్ రెడ్డి కి ఏమాత్రం తీసి పోకుండా, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు మావే అంటున్నారు కేసీఆర్.  అవును నిన్న మొన్నటి దాకా , ఉద్ధవ్‌ ఠాక్రే’ కూడా ఇలాగే, అహంకారం చూపారు. జగన్, కేసీఆర్  అయినా మరొకరు అయినా అందుకు అతీతులు కాదు, కదా...