జట్టుకు ఎంపిక కాలేదని క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
posted on Jun 23, 2022 7:39AM
ఆటలో గెలుపు ఓటములు సహజం.. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టం వచ్చిందని, వైఫల్యం ఎదురైందని తనువు చాలించుకునే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. కింద పడ్డ చోటే లేవాలి. ఓడిపోయిన చోటే గెలిచి నిలవాలి. ముఖ్యంగా ఆటగాళ్లలో సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకునే క్రీడా స్ఫూర్తి అత్యంత అవసరం. పాకిస్థాన్ కు చెందిన ఓ క్రికెటర్ చిన్న వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేశాడు.
దక్షిణ సింధ్ ప్రావిన్స్ కు చెందిన క్రికెటర్ షోయబ్ ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, సెలక్షన్స్ లో విఫలమై లోకల్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన షోయెబ్ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న షోయెబ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాకిస్థాన్ లోనే నాలుగేళ్ల కిందట ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అండర్-19 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ జర్యాబ్ అనే యువక్రికెటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏ క్రీడలోనైనా ప్రతి ఆటగాడూ ఏదో సమయంలో వైఫల్యాలను ఎదుర్కొనే ఉంటాడు. ఇది స్థానిక స్థాయిలోనైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా ప్రతి క్రీడాకారుడూ ఎదుర్కొనే పరిస్థితి. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ టెండూల్కర్ కూడా ఒక సమయంలో ఫామ్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.
ఏ క్రీడాకారుడైన సరే.. వైఫల్యం ఎదురైనప్పుడు మనో స్థైర్యంతో దానిని అధిగమించాలే తప్ప.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడటం ఎంత మాత్రం సమంజసం కాదు. అసలు క్రీడా రంగాన్ని ఎంచుకోవడం అంటేనే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం ఉందనే లెక్క. అలా కాకుండా వైఫల్యానికి కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం.