ఆత్మకూరు ఉప ఎన్నిక.. పోలింగ్ కు సర్వం సిద్ధం
posted on Jun 22, 2022 @ 5:35PM
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం పక్షం రోజుల పాటు హోరెత్తి, మంగళవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనాయకుల ప్రచారాలతో నియోజకవర్గం మొత్తం హోరెత్తించారు. ఈ నెల 23 గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ మూడేళ్ల పాలనపై ప్రజాభిప్రాయానికి సంకేతంగా రాజకీయ పక్షాలు విశ్లేషించే అవకాశం ఉందనే ఉద్దేశంతో బల నిరూపణకు ఆ పార్టీ అధిష్టానం అగ్ర నాయకులను రంగంలోకి దింపింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి భారీ మెజారిటీ కట్టబెట్టాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని, ఎమ్మెల్యేని ఇన్చార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించింది.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పది రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక ఫలితం ఏ విధంగానూ జగన్ మూడేళ్ల పాలనపై ప్రజా భిప్రాయానికి ప్రతిబింబం కాదు.. కాబోదు. ఎందుకంటే ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీకి నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రంలోనే ఓటు బ్యాంకు లేదు.
ఇక రంగంలో ఉన్న చిన్నా చితకా అభ్యర్థులు నామ మాత్రమే. బీజేపీ పోటీలో ఉన్నా ఈ ఎన్నిక వాస్తవంగా ఏకపక్షమేనని పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలు చేశారు. ఇక ఉప ఎన్నిక పోలింగ్ కు నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పోలింగ్ సజావుగా జరిగేందుకు 1032 మంది పోలీస్ సెంట్రల్ ఆన్ ఫోర్సుతో పాటు 1132 మంది పోలింగ్ సిబ్బంది. 78 మంది వీడియోగ్రాఫర్లు, 148 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
పోలింగ్ ప్రక్రియ పరిశీలన కోసం వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంల చివరి ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ చక్రధరబాబు, ఎన్నికల పరిశీలకుడు సురేష్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బంది నియామకం, ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బరిలో 14 మంది ఉన్నారు.