ఆటపాటలతోనే విద్యా వికాసం
posted on Jun 22, 2022 @ 5:23PM
పిల్లలు బడికి వెళ్లడం, చదువుతో పాటు, ఆటపాటలతో స్నేహితులతో తరగతి బయట కూడా కొంత సమయం గడపడం పరిపాటి. టీచర్లు ఎప్పుడూ చాలా సీరియస్‌గానే పిల్లలతో వ్యవహరించడం చాలా స్కూళ్లలో చూసే దృశ్యమే. పాఠం చెప్పడం, హోమ్‌వర్క్ భారీగా ఇచ్చి వాళ్లకి కాస్తంత సరదాగా గడిపే సమయం కూడా లేకుండా చేయడం చాలామంది టీచర్లకు ఓ సరదా!
కానీ చాలా తక్కువ మంది టీచర్లే పిల్లలకు పాఠాలు చెప్పడంలోనూ వాళ్లకి మరీ సీరియస్‌గా కాకుండా వాళ్ల మనసు తెలుసుకుని చిన్నచిన్న కథలు చెబుతూ, జోక్స్ వేస్తూ కూడా పాఠాలు చెప్పేవారున్నారు. చక్కగా పలకరించి మరీ ఎలా చదువుతున్నారో తెలుసుకునేవారూ వున్నారు. ఈ పోటోలో కనిపిస్తున్న ఒక స్కూలునే తీసుకుంటే ఆ స్కూలు టీచర్ తన విద్యార్ధులను ఎంత చక్కగా ఆడిస్తూ క్లాసులోకి ఆహ్వానిస్తున్నారో అర్థమౌతుంది!
ఇది పిల్లల్లో విద్య పట్ల ఎంతో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచుతుంది. తద్వారా వారి మానసిక స్థితి అద్భుతగా వుంటుంది, పాఠం వినడం, చదవడం, రాయడం మీదా దృష్టి బాగా కేంద్రీకరిస్తారు కూడా! అయితే అలాగని వారిని మరీ ఆటపాటలతో క్లాసు సమయం వృధా చేయరు. కేవలం అయిదు పది నిమిషాలే! అంత సమయం చాలు వారిని తరగతి గది పట్ల ఆసక్తిగా వుంచ డానికి. ఈ విధమయిన టీచర్ ప్రవర్తన, బోధనలే విద్యార్ధులను ముఖ్యంగా విద్యలో అంతగా రాణించలేని వారు కూడా విద్యపట్ల శ్రద్ధ చూపడానికి వుపయోగపడుతుందని విద్యావేత్తలు, పరిశోధకులు అంటున్నారు.
మరీ ముఖ్యంగా చిన్న తరగతి పిల్లలు ఆట పాటలతోనే ఎంతో నేర్చుకుంటారు. వారికి ఆ విధమైన బోధనే సరయిన బోధనా మార్గంగా విద్యారంగ శాస్త్రవేత్తలు, పరిశీలకులు పేర్కొన్నారు. భారత దేశంలో ఇటీవలి కాలంలో చిన్న తరగతుల్లో విద్యాబోధన విషయంలో అనేక మార్పులూ వచ్చాయి. పోతే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం, చూస్తున్న ఫోటో, ఏ స్కూలుదో , ఎక్కడదో అన్న వివరాలు అంతగా తెలి యవు కానీ టీచర్ ఆ విధంగా పిల్లల్ని ఆడిస్తూ చదువుపట్ల ఉత్సాహపర్చడం మాత్రం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టీచర్, విద్యార్ధుల మధ్య సత్సంబంధాలే విద్యార్ధులకు ఎంతో అవసరం. విద్య, ఆటపాటల పట్ల పిల్లలు ఎక్కువ మొగ్గు చూపగల్గు తారు. ఇందుకు ఇదో గొప్ప వుదాహరణ. ఈ వివరాలను ట్విటర్‌లో పోస్టు చేసిన మనూ గులాటీ కూడా స్వయంగా టీచర్. ఈమె ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.