17 బ్యాంకులను ముంచిన డీహెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్లు
posted on Jun 22, 2022 @ 9:53PM
పది రూపాయలు సంపాదించడానికి బీదాబిక్కీ మధ్యతరగతి ప్రజలూ నానా యాతనా పడుతున్నారు. పైసా పైసా కూడబెట్టి ఇంటి కోసమో, బిడ్డల చదువుకోసమో బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వాటి మీద ఎంతో కొంత వడ్డీ కూడా పడి ఏ రెండు మూడేళ్ల తర్వాతనో తీసుకుంటే కాస్తంత పెద్ద మొత్తం వస్తుంది కలలు సాకారం చేసుకోవచ్చన్న ఆశతో బతికేస్తున్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా చాలా సునాయాసంగా సదరు బ్యాంకులను చిటికెలో మోసం చేసి కోట్లు కొట్టేసి పారిపోతున్న గెద్దలు ఇటీవలి కాలంలో చాలా తయారయ్యాయి. ఇక్కడ బ్యాంకులను మోసం చేసి సొమ్ముతో విదేశాలకు ఉడాయించడం అక్కడి నుంచి నేను రాను పో ఏం చేసుకుంటావో చేసుకో అని ఏకంగా అక్కడ మకాం పెట్టేస్తున్నారు చాలా దర్జాగా. వారిని పట్టుకుని ముక్కుపిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వాలు కూడా హడావుడి చేయడం, హామీలు ఇవ్వడమే తప్ప గట్టిగా చేస్తున్నదీ ఏమీ కనపడటం లేదు. ఇపుడు మళ్లీ దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది.
రూ. 34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి... డీహెచ్‌ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్, ధీరజ్ వాధవాన్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 17 బ్యాంకుల బృందాన్ని రూ. 34,615 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై డీహెచ్‌ఎఫ్ఎల్ కు చెందిన కపిల్, ధీరజ్ వాధావన్‌లపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. రూ. 34,615 కోట్లకు సంబంధించిన తాజా కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ సహా మరికొందరిపై సీబీఐ కేసు నమోదైంది.
ఇది ఏజెన్సీ దర్యాప్తుల జాబితాలో ఇదే అతిపెద్ద బ్యాంక్ మోసంగా అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు తర్వాత ఏజెన్సీకి చెందిన 50 మందికి పైగా అధికారుల బృందం ముంబైలో ఎఫ్‌ఐఆర్‌లో లిస్టెడ్ నిందితులకు చెందిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వ హించింది, ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి సహా మరో ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు. వివిధ ఏర్పాట్ల కింద కన్సార్టియం నుండి 2010-2018 కాలంలో... కంపెనీ రూ. 42,871 కోట్ల రుణ సదుపాయాన్ని పొందిందని, అయితే మే, 2019 నుండి ‘తిరిగి చెల్లించే కమిట్‌మెంట్’లను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆరోపించినట్లు అధికా రులు తెలిపారు. రుణదాతలుగా ఉన్న బ్యాంకులు వివిధ సమయాల్లో ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయని తెలిపారు.
నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్ సహా నిధులను స్వాహాచేయడం ద్వారా మోసం చేశారన్న ఆరోపణలపై మీడియా నివేదికలు వెలువడిన తర్వాత జనవరి 2019 లో డిహెచ్ఎఫ్ఎల్ విచారణకు గురైనప్పుడు, రుణదాతలు ఫిబ్రవరి 1, 2019 న సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 1, 2015 నుండి డిసెంబరు 31, 2018 వరకు డిహెచ్ఎఫ్ఎల్ కు సంబంధించి ప్రత్యేక సమీక్ష ఆడిట్ నిర్వహించడానికి సభ్యులు కెపిఎంజి ని నియమించిన విషయం తెలిసిందే. కపిల్, ధీరజ్ వాధవన్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు అక్టోబరు 18, 2019 న లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకొచ్చినట్లు వెల్లడించారు. కెపిఎంజి తన ఆడిట్‌లో రుణాలు, అడ్వాన్స్‌ల రూపంలో సంబంధిత, పరస్పరం అనుసంధానితమై ఉన్న సంస్థలు సహా వ్యక్తులకు నిధులను మళ్లించిందని బ్యాంక్ ఆరోపించింది.
డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్లు పంపిణీ చేశామని, వీటికి సంబంధించి రు.29,849 కోట్ల మేర బకాయిలున్నాయని నివేదిక పేర్కొంది. అటువంటి సంస్థలు, వ్యక్తులకు సంబంధించి పలు లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయని బ్యాంక్ ఆరోపించింది. భారీ ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, నకిలీ రికార్డులు, కపిల్ సహా ధీరజ్ వాధావన్‌లకు ఆస్తులు సృష్టించిన నిధులను రౌండ్ ట్రిప్ చేయడం వంటి అవకతవకలను ఆడిట్ నివేదించింది.