భారీ భద్రత మధ్య ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్
posted on Jun 23, 2022 @ 10:30AM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. నియోజకవర్గంలో అధికారులు ఆరు మోడల్ పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు టౌన్, రూరల్, మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, ఏఎస్ పేట, సంగం మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,330. ఓటింగ్ కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వాటిలో 131 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 1132 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 377 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి 32 మంది పోలీసులు, మరో 1132 మంది కేంద్ర బలగాలను మోహరించారు.
పోలింగ్ తీరును చిత్రీకరించేందుకు మొత్తం 78 వీడియో గ్రాఫర్లు పనిచేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను 142 మంది మైక్రో పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప పోరులో 14 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ అనంతరం ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల వరకూ నియోజకవర్గంలో 20 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.